నెట్టిల్లు


Sun,July 14, 2019 12:59 AM

నిడివితో సంబంధం లేకుండా గొప్ప సందేశాన్ని ఇవ్వొచ్చని నిరూపిస్తున్నారు ఈతరం లఘుచిత్ర దర్శకులు. కిందటి వారంలో యూట్యూబ్‌లో రిలీజ్ అయిన లఘుచిత్రాలు కూడా దాదాపు ఇలానే ఉన్నాయి. నిడివి చిన్నదే అయినా గొప్ప సందేశంతో ముగింపునిచ్చారు. అలాంటి లఘుచిత్ర సమీక్షలు చదవండి.. యూట్యూబ్‌లో వాటిని చూడండి..ద రైట్ వన్

దర్శకత్వం: సాయి చరణ్
నటీనటులు : నవకాంత్, జాస్మిన్

లైఫ్‌లో ఎప్పటికో ఒకప్పటికీ ప్రతీ ఒక్కరికీ ఒక తోడు దొరుకుంది. వాళ్లు పక్కనే ఉండవచ్చు, కనిపించనంత దూరమూ ఉండవచ్చు. మన చుట్టూనే ఉండవచ్చు, మనల్నీ చూస్తూనే ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని మనం కనుగొనడమే మన పని. అచ్చంగా ఇలాంటి థియరీతోనే ద రైట్ వన్ లఘు చిత్రం ఉంటుంది. కథ విషయానికొస్తే ఒక అబ్బాయి ఓ రోజు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. సైగలు చేసుకుంటారు. ఇదంతా ప్రేమే అనుకున్న అబ్బాయి తన ప్రేమను అక్షరాల రూపంలో బోర్డు మీద ప్రతిబింబిస్తాడు. ఆ అమ్మాయి కూడా అచ్చం అలాగే రిప్లయ్ ఇస్తుంది. కానీ అక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఈ అబ్బాయిని ఆ అమ్మాయి ప్రేమించట్లేదని అర్థం అవుతుంది. ఈ సీన్ అబ్బాయి విషయంలో కూడా రిపీట్ అవుతుంది. అబ్బాయికి తెలియకుండా మరో అమ్మాయి ఇతన్ని ప్రేమిస్తుంది. ఒక ట్రయాంగిల్ స్టోరీలా తిరుగుతుంది. కథకు తగ్గ స్క్రీన్‌ప్లే, మేకింగ్, డైలాగ్‌లు ఉన్నాయి. ఒక కాంఫ్లిక్టెడ్ స్టోరీని కన్ఫ్యూజన్ లేకుండా
చిత్రీకరించారు. చూడండి.

Total views 39,046+ (జూలై 6 నాటికి) Published on July 2, 2019కావ్యం

దర్శకత్వం: సతీశ్ వల్లూరీ
నటీనటులు : దినేశ్ అర్జున్, సాగర్

ఏ ప్రమాదం ఎప్పుడు , ఎలా ముంచుకొస్తుందో తెలియదు. కానీ మనతో ఉండే మనిషి ఉన్నట్టుండి దూరం అవుతాడు. జ్ఞాపకాలు మాత్రం వెంటాడుతాయి. చిన్నపాటి నిర్లక్ష్యం ఎందరి జీవితాల్లోనో పెను విషాదాన్ని నింపుతుంది. కుటుంబంలో కావొచ్చు, ఇద్దరి స్నేహితుల మధ్య కావొచ్చు దట్టమైన చీకటిని నింపి వెళ్తుంది. అప్పటి వరకూ కలిసి మెలిసి కన్న కలలూ, పెంచుకున్న ఆశలు అన్నీ ఆవిరవుతాయి. కారణం ఏంటి? ఎక్కడి నుంచో దూసుకొచ్చిన మృత్యువు ప్రాణాలను బలి తీసుకుంటుంది. జాగ్రత్తలు పాటిస్తే దాని నుంచి కొంత వరకు బయటపడొచ్చు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలూ కోల్పోవచ్చు. ఈ నిర్లక్ష్యాన్ని వీడాలి అని ఈ లఘు చిత్రం చెప్తున్నది. అవగాహన కలిగించే కథాంశాన్ని ఎంచుకొని చూడదగ్గ కథగా మలిచారు. మంచి సంభాషణ, ఆసక్తి కలిగించే వాతావరణం, ఆవేదన కలిగించే ముగింపు, ఆలోచింపజేసే స్టోరీలైన్.. ఇంతకీ స్టోరీలో ఏముంది? యూట్యూబ్‌లో చూడండి. కచ్చితంగా నచ్చుతుంది.

Total views 5,955+ (జూలై 6 నాటికి) Published on July 3, 2019మనసు పలికే మౌనగీతం

దర్శకత్వం: కొట్టె క్రిష్ణ
నటీనటులు : మహేశ్ పవన్, సాయిశ్వేత

నిశ్శబ్దంగా అమ్మాయిని ప్రేమిస్తాడు అర్జున్. రోజూ చూస్తూ చూస్తూ మరింత ప్రేమలో పడతాడు. కానీ ఆ విషయం అమ్మాయికి చెప్పడానికి ధైర్యం చేయడు. అతని చూపులను గమనించిన మధుకు అంతా అర్థం అవుతుంది. ఎవరూ, ఎవరికీ ప్రపోజ్ చేయకుండా నిశ్శబ్దంగా ఉంటారు. ఓ రోజు తేల్చుకుందామని మధు అర్జున్ వాళ్ల ఇంటికి ఫ్రెండ్‌ను పట్టుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి అర్జున్ ఇంట్లో ఎవరూ ఉండరు. కానీ ఇద్దరూ ఇంట్లోకి వెళ్తారు. అక్కడ అర్జున్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో, చెప్పకుండా మౌనంగా ఎలా ఉంటున్నాడో అర్థం అవుతుంది. అదంతా ఎలా అనేది ఈ లఘుచిత్రం చూస్తే అర్థమవుతుంది. ఇంటి నుంచి బయటకు వచ్చాక మధుకు, అర్జున్ ఎదురవుతాడు. అయినా కూడా ఎవరూ ఎవరినీ పలకరించుకోరు. కొద్ది సేపటికి మధునే అర్జున్‌కు అడ్డంపడి ప్రేమ గురించి చెప్తుంది. తన ప్రేమ గురించి పూర్తిగా అర్థం చేసుకొని పెళ్లి చోసుకోమని అడుగుతుంది. అప్పుడు అర్జున్ కాదనకుండా ఎలా ఉంటాడు? ఇదీ కథా!.. మేకింగ్, డైలాగ్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఫీల్ గుడ్ మూవీ. చూడొచ్చు.

Total views 37,039+ (జూలై 6 నాటికి) Published on July 5, 2019రైతే దేవుడు

దర్శకత్వం: దేకుమార్
నటీనటులు : గోవింద్, శివశంకర్, శ్యాం, శ్రీకాంత్

ఇంత టెక్నాలజీ పెరిగినా, ఎంత ట్రెండ్ మారినా రైతు పండించే పంట మాత్రం శ్రమించకుండా రాదు. అలాంటి ఆహారాన్ని రోజూ వృథా చేస్తుంటాం. పట్టణ ప్రాంతాల్లో మరీ అధికంగా ఉంటుంది. ఇట్లా ఆహారాన్ని వృథా చేయొద్దు, దాని వెనుక రైతు శ్రమ ఉంటుంది అని చెప్పే సందేశాత్మక చిత్రమిది. చిన్న నిడివే అయినా మంచి సందేశాన్ని ఇచ్చారు. కథ విషయానికొస్తే నలుగురు మిత్రులు అద్దె గదిలో ఉంటారు. మామూలుగానే వీళ్లు ఆహారాన్ని వృథా చేస్తారు. కానీ అందులో శివ అనే అబ్బాయి మాత్రం ఆ ఆహారాన్ని వృథా కానివ్వడు.మిగత మిత్రులు అందరూ ఎగతాలి చేస్తారు. ఓ రోజు వీళ్లకు ఎలా అయినా రైతు విలువ ను తెలియజేయాలని అందరినీ కూడ గట్టుకొని ఊర్లోకి తీసుకెళ్తాడు. అక్కడ ఓ రైతును కలిసి మాట్లాడతాడు. రైతుకు ఉండే కష్టాలు, అతను తినే అన్నం అన్నీ కండ్లకు కట్టినట్టు మిత్రులకు చూపిస్తాడు. ఇదీ కథ. రైతులకు కావాల్సింది ఇవ్వాలనీ, ఆహారాన్ని వృథా చేయొద్దని సూటిగా చెప్పగలిగారు. ప్రయత్నం బాగుంది. చూడండి.

Total views 1125+ (జూలై 6 నాటికి) Published on July 6, 2019

వినోద్ మామిడాల, సెల్: 7660066469

296
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles