పద్య రత్నాలు-11


Sun,July 14, 2019 01:07 AM

Poetry

ప్రభావం చూపే మంచి పనులు!

స్త్రీల ఎడ వాదులాడక
బాలురతో జెలిమి చేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!

- సుమతీ శతకం

తాత్పర్యం:మన వ్యక్తిత్వంపై గొప్ప ప్రభావం చూపే కొన్ని మంచి పనులను చిన్న విషయాలుగా తీసి పారేయ కూడదు. అవేమిటంటే: మహిళలతో ఎప్పుడూ గొడవ పడకూడదు. చిన్న పిల్లలతో స్నేహం చేసి మాట్లాడరాదు. మంచి గుణాలను ఎప్పుడూ విడువ వద్దు. అలాగే, భర్త (యజమాని)ను నిందలతో దూషించకూడదు. ఇలాంటివి తప్పక ఆచరించదగ్గది.
Poetry1

సహజగుణాన్ని మార్చలేం!

ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపే గాని తెలుపు రాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టిన బలుకునా
విశ్వదాభిరామ! వినురవేమ!

- వేమన శతకం

తాత్పర్యం:వ్యక్తుల సహజ గుణాలను ఎప్పటికీ మార్చలేం. ఎలుక తోలును ఏడాది పాటు ఎంత ఉతికినా అది నలుపు రంగుతోనే ఉంటుంది తప్ప, దాని స్థానంలో తెలుపు రంగుకు మారదు కదా. అలాగే, కొయ్యబొమ్మను ఎంత కొడితే మాత్రం ఏం లాభం? అది మాట్లాడుతుందా! కాబట్టి, స్వత:సిద్ధమైన లక్షణాలను మార్చాలని ప్రయత్నించకూడదు.
Poetry2

జ్ఞాన సముపార్జన కోసం..

పనులెన్ని కలిగి యున్నను
దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై
వినగోరుము సత్కథలను
కాని విబుధులు సంతసించు గతిని కుమారా!

- కుమార శతకం

తాత్పర్యం: తీరిక లేనంత బిజీగా, ఎన్ని పనుల ఒత్తిడిలో వున్నా కానీ, జ్ఞాన సముపార్జన కోసం బద్ధకానికి పోకుండా సమయం కేటాయించాలి. రోజురోజుకూ మన విద్యాబుద్ధులను పెంచుకొంటూ ఉండాలి. సత్కథలు (మంచికథలు) వినడానికి ఇష్టపడాలి. అప్పుడే మనలోని ప్రజ్ఞ ఇనుమడించి, ఉత్తములు సైతం సంతోషంతో మనల్ని ప్రశంసిస్తారు.
Poetry3

వాయిదా వేస్తే అసలుకే నష్టం

సిరిగల నాడు మైమరచి చిక్కిన నాడు దలంచి పుణ్యముల్
పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె గాలిచిచ్చుపై
గెరలిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త
త్తరమున ద్రవ్వినం గలదె దాశరథీ! కరుణాపయోనిధీ!

- దాశరథి శతకం

తాత్పర్యం:సత్కార్యాలు (మంచిపనులు) అనుకొన్న వెంటనే చెయ్యాలి. దైవభక్తి విషయంలోనూ అంతే. వృద్ధాప్యం వచ్చాక, అయ్యో ఒక్క పుణ్యకార్యమైనా చేయలేకపోయానే అని బాధపడితే ఏం ప్రయోజనం? గాలి ఎప్పుడైతే బాగా వీస్తుందో అప్పుడు దాని ప్రభావం వల్ల మంటలు పెరుగుతై. దాహం తీర్చుకోవడానికి వేసవి పూట బావి తవ్వితే దప్పిక తీరేనా!

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్ నంబర్‌లో తెలియజేయండి.

267
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles