ఇక్కడ అన్నీ ఉచితం!


Sun,July 14, 2019 01:16 AM

Anti-Kaithara-island
చుట్టూ సముద్రం.. ఆ మధ్యలో సుందర ప్రదేశం. అక్కడ శీతాకాలపు ప్రకృతి సోయగాలు మనసును ఉల్లాసపరుస్తాయి. అలల చప్పుళ్లు.. గుండె లయతో కలిసి తాళం వేస్తాయి. అక్కడ సాయంకాలపు సంధ్యారాగం, భానుడి ఉషోదయం చూస్తే.. శరీరానికి ఎక్కడలేని ప్రశాంతత చేకూరుతుంది. అలాంటి ప్రదేశంలో నివసించడానికి స్థలం ఇస్తారు. స్థిర నివాసం ఏర్పచుకుంటానంటే ఇల్లు కూడా నిర్మిస్తారు. అంతేకాదండోయ్.. నెలకు రూ.40వేలు వారే చెల్లిస్తారు. అదికూడా ఒక నెలో, రెండు నెలలో కాదు.. మూడేండ్లు అంతా ఫ్రీ.. ఎందుకో తెలుసా?

ఆహా.. భలే ఛాన్సులే.. లలలా.. లలలా.. లక్కీ ఛాన్సులే అనుకుంటున్నారా? నిజమే నమ్మొచ్చు. కట్నం ఇచ్చి మరీ అల్లుడిని ఇల్లరికానికి తెచ్చుకున్నట్లు.. మా ద్వీపానికి వస్తే రూ.40 వేలు ఇస్తాం అంటున్నారు యాంటీకైథెరా ద్వీపానికి చెందిన మేయర్. ఎందుకో తెలుసా? అంత అందమైన ద్వీపంలో నివసించడానికి జనమే లేరట. అక్కడ ఉన్నవారు కూడా పదుల సంఖ్యలోనే ఉండడంతో యాంటీకైథెరా ద్వీప మేయర్ కొత్త పథకం ప్రవేశపెట్టారు. గ్రీస్ దేశంలోని యాంటీకైథెరా ద్వీపంలో నివసించే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతున్నది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ద్వీపం కనుమరుగైపోతుందని అక్కడివారి బాధ. ఆ ద్వీప అందాలను కాపాడుకోవాలంటే జన సంచారం ఉండాలని భావిస్తున్నది అక్కడి ప్రభుత్వం.
Anti-Kaithara-island1

ఎక్కడుందంటే?

మధ్యధరా సముద్రంలోని క్రెటా, కైథిరా దీవుల మధ్య ఉన్నది యాంటీకైథెరా ద్వీపం. ఇది కొండ ప్రాంతం. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ద్వీపంలో ఆహారం తక్కువగా దొరుకుతుంది. పైగా వ్యవసాయం చేసేందుకు సరైన వసతులు లేవు. దీంతో అక్కడున్నవాళ్లు కూడా వెళ్లిపోతుండడంతో గ్రీస్ ఆర్థడాక్స్ చర్చి, మేయర్ ఆండ్రియాస్‌తో కలిసి ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు అక్కడ కేవలం 20 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ క్రమంలో ద్వీపంలో నివసించే వారి సంఖ్యను పెంచే దిశగా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈ ద్వీపంలో నివసించడానికి ఎవరైనా ఆసక్తి చూపితే.. ఇక్కడ ఉంటున్నందుకు వారికి నెలకు 450 పౌండ్లు (రూ.40 వేలు) చెల్లిస్తామని చెబుతున్నారు. ఈ ఖర్చునంతా ఆర్థడాక్స్ చర్చి భరిస్తుంది.

యువ జంటలకు ఆహ్వానం

యాంటీకైథెరా ద్వీపంలో ఉండడానికి యువ జంటలకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నది గ్రీస్ ప్రభుత్వం. కొత్తగా వస్తున్న వారి కోసం స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి, నెలకు రూ.40వేలు చొప్పున మూడు సంవత్సరాలు అందిస్తారు. అంతేకాకుండా వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలూ సమకూర్చుతారు. ఏకాంతం, ప్రశాంతతను కోరుకునే యువ జంటలు వస్తే.. మరికొన్ని అదనపు వసతులు కూడా లభిస్తాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే.. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ద్వీపాన్ని కాపాడుకోవాలని, దీనికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే కారణంతోనే. ఇక్కడ ఒక పోలీస్‌స్టేషన్, రెండు కేఫ్‌లు, మెడికల్ షాపు, కిరాణా కొట్లు, ఆధునీకరించిన హెలీపోర్ట్ ఉన్నాయి. కొత్తగా వచ్చిన వారు.. వారికి నచ్చిన వ్యాపారం కూడా చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన అనుమతులు కూడా వెంటనే లభిస్తాయని యాంటీకైథెరా మేయర్ చెబుతున్నారు. ఇక్కడ అన్ని మొబైల్ నెట్‌వర్క్‌లూ పనిచేస్తాయి. ద్వీపం చూడడానికి అందమైన రోడ్డు మార్గం, పట్టణ ప్రాంతాలకు వెళ్లడానికి నౌక మార్గం కూడా ఉన్నాయి.

అందాల నెలవు యాంటీకైథెరా

సముద్రం మధ్యలో ఉన్న ఈ యాంటీకైథెరా ద్వీపం అందాలకు నెలవు. శీతాకాలంలో ఈ ద్వీప అందాలు పర్యాటకులను మైమరపిస్తాయి. ఎటు చూసినా పచ్చదనం పరుచుకుంటుంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం చూడడం ఓ ప్రత్యేక అనుభూతి. అయితే కేవలం వేసవి కాలంలోనే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. మామూలు రోజుల్లో జనాల సందడి కనిపించకపోవడంతో ఈ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే యాంటీకైథెరా ద్వీపాన్ని ఆధునీకరించే పనులు ప్రారంభమయ్యాయి. మొత్తానికి ఈ ప్రయత్నం అభినందనీయం అంటూ పలువురు గ్రీస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ఏదైనా కొత్త ప్రాంతానికి వెళితే అక్కడ మనం నివసించడానికి ఎంతోకొంత అద్దె కట్టాల్సి ఉంటుంది. కానీ, యాంటీకైథెరా ద్వీపంలో నివసిస్తే చాలు.. డబ్బులిచ్చి మరీ వసతులు కల్పిస్తారు. మరింకెందుకు ఆలస్యం.. ప్రశాంతతతోపాటు డబ్బులు కూడా కావాలనుకునే యువజంటలు యాంటీకైథెరాకు పయనమవ్వండి.

456
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles