తిమింగలం నుంచి సుగంధం


Sun,July 14, 2019 01:21 AM

Sperm-Wale
ఉమ్మి విలువ కోటిన్నరా..?! అంటే నమ్ముతారా? అంత సీన్‌లేదులే.. అని అనుకుంటారు కదా. అయితే మీరు అలా అనుకోవడంలో అర్థముంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మనుషుల లాలాజలం గురించి కాదు. తిమింగళాల ఉమ్మి గురించి. ప్రపంచ బ్లాక్ మార్కెట్‌లో తిమింగళాల ఉమ్మికి ఉన్నంత విలువ దేనికీ లేదు. ఇంతకీ వాటి లాలాజలానికి అంత విలువ ఎలా వచ్చిందో తెలుసా? దాని ప్రత్యేకత వింటే మీరూ ఔరా అంటారు మరి.

అది జూన్ 18. ముంబైలోనే ప్రఖ్యాతిగల మార్కెట్. ఒక రకంగా చెప్పాలంటే సరుకుల అక్రమ రవాణాకు అది కేరాఫ్. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం.
అక్కడ నాగ్‌పూర్‌కు చెందిన రాహుల్ తుపారే.. ఓ సంచిలో కేజీన్నర బరువున్న ఓ పదార్థంతో తచ్చాడుతున్నాడు. అనుకున్న పథకం ప్రకారం.. కొంచెం ముందుగానే వచ్చాడు రాహుల్. అతని కోసం రావాల్సిన వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో రాహుల్‌లో కంగారు మొదలైంది. మనసులో ఏదో కీడు శంకించిది. ఒంటినిండా చెమటలు పడుతున్నాయి.

ఏదో అనర్థం జరగబోతున్నదని గ్రహించిన రాహుల్.. అక్కడి నుంచి వెళ్లిపోదామనుకునే సమయంలోనే ఘట్కోపర్ స్టేషన్‌కు చెందిన పోలీసులు చుట్టుముట్టారు. అతన్ని సరౌండింగ్ చేసి..తన దగ్గరున్న విలువైన ఆ పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇంతకీ ఆ ఖరీదైన పదార్థం ఏంటో తెలుసా? తిమింగలం ఉమ్మి (యాంబర్ గ్రీస్). మీరు విన్నది నిజమే. అది నిజంగానే తిమింగలం లాలాజలం. దానిని గుజరాత్‌కు చెందిన లలిత్ వ్యాస్ అనే వ్యక్తి నుంచి రాహుల్ తుపారే కొనుగోలు చేశాడు. గుజరాత్ కంటే ముంబైలోనే దానికి ఎక్కువ విలువ ఉండడంతో అక్కడికి వచ్చాడు. దందాలు, స్మగ్లింగ్ బ్యాచ్‌లలో కోవర్టులు ఉన్నట్లే.. ఈ వ్యాపారానికి సంబంధించి ఎవరో ముంబై పోలీసులకు ఉప్పందించారు. పక్కా సమాచారంతో పోలీసులు నిఘా వేసి రాహుల్‌ను పట్టుకున్నారు. ఒకవేళ రాహుల్ తుపారే ప్లాన్ సక్సెస్ అయి.. ఆ ఉమ్మిగడ్డ గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉంటే.. కోట్ల రూపాయలు వచ్చేవి. ఉమ్మిని స్మగ్లింగ్ చేస్తే కోట్ల రూపాయలు ఎలా వస్తాయో మొదట పోలీసులకు కూడా అర్థం కాలేదు. తర్వాత ఆ పదార్థం ఏంటి? దాని ఉపయోగాలు ఏంటి? అని పోలీసులు ఆరా తీస్తే.. ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణకోసం గుజరాత్ వెళ్లిన పోలీసులకు అక్కడ యాంబర్ గ్రీస్ స్మగ్లింగ్ ముఠాలు చాలా ఉన్నట్లు గుర్తించారు.

ఏంటీ.. ఈ యాంబర్ గ్రీస్

అసలీ ఉమ్మేంటి..? దానిని సేకరించి, అమ్మడం ఏంటి..? దానికంత విలువేంటి..? అని తికమక పడకండి. స్పెర్మ్ వేల్ అనేది తిమింగలాల్లో ఒక జాతి. దీని ముక్కు తెడ్డులాగ, నోరు చిన్నదిగా ఉంటుంది. అయితే ఈ స్పెర్మ్‌వేల్ నోటి ద్వారా మైనం లాంటి పదార్థాన్ని వదులుతుంది. దీన్ని ఆంగ్లంలో యాంబర్ గ్రిస్ అంటారు. ఈ జీవి పేగుల్లో ఉత్పత్తి అయ్యే ఒక రకమైన ద్రవ పదార్థమే ఇది. ఇది ఉమ్మిలాగ ఉంటుంది. తిమింగలం కడుపులో ఇది కేజీ-కేజీన్నర బరువు కాగానే మైనంలాగ గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. ఆ గడ్డకట్టిన పదార్థాన్ని తిమింగలాలు విసర్జిస్తాయి. ఆ పదార్థం నీటిపై తేలియాడుతూ.. అలల తాకిడికి ఒడ్డుకు చేరుతుంది. సాధారణంగా ఈ స్పెర్మ్ వేల్స్ ఉష్ణమండల సముద్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి.
Sperm-Wale2

ఖరీదైన సుగంధ ద్రవ్యం

గడ్డకట్టిన తిమింగాల ఉమ్మికి మార్కెట్‌లో అంత ఖరీదు ఉండడానికి ముఖ్య కారణం.. అదొక సుగంధ ద్రవ్యం. దీనిని వేడి చేస్తే.. సువాసన వెదజల్లుతుంది. అందుకే దానిని కరిగించి మేలైన సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు. గల్ఫ్ దేశాల్లో వీటికి డిమాండ్ చాలా ఎక్కువ. అందుకే ఈ యాంబర్ గ్రీస్ కోసం ప్రత్యేకంగా వేటసాగిస్తుంటారు స్మగ్లర్లు. నడి సంద్రంలో ప్రాణాలకు తెగించి వెతుకులాడుతుంటారు. ఒక కిలో యాంబర్ గ్రీస్ దొరికినా లైఫ్ సెటిల్ అయినట్లే. అందుకే వీటిని అక్రమంగా తరలిస్తుంటారు. ఇదిలా ఉండగా ఈ యాంబర్‌గ్రీస్‌ను మండిస్తే ధనవంతులు అవుతారనే నమ్మకం ప్రజల్లో ఉంది. వీటికి మాంత్రిక శక్తులు ఉన్నాయని పూర్వీకులు నమ్మేవారు. ప్రస్తుతం ఈ యాంబర్ గ్రీస్‌ను ఉంగరాల్లో రాళ్లులాగా ఉపయోగిస్తున్నారు. ఇంత ఖరీదైన ఈ పదార్థాన్ని అనుమతుల్లేకుండా కలిగి ఉండడం చట్టరీత్యా నేరం. అందుకే పోలీసులు రాహుల్ తుపారేను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కోటి డ్బ్బై లక్షల విలువైన 1.3 కిలోల యాంబర్ గ్రీస్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Sperm-Wale1

ఖరీదైనవి ఇవే..

మన ప్రాచీనులు ఎన్నో ఖరీదైన సుగంధ ద్రవ్యాలను ఉపయోగించారు. వాటిల్లో ముఖ్యమైనవి అంబరము (యాంబర్ గ్రీస్), చారు శ్రీ గంధము, అగరు, కేసరి, కస్తూరి, బుక్క, పుష్పాల సారంతో తయారు చేసే అత్తరు వంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. వీటితో పాటుగా పునుగు పిల్లి నుంచి సేకరించే సుగంధద్రవ్యం కూడా చాలా ఖరీదైందే. దీనిని జవాది, జవాజి, జవ్వాజి, జవ్వాది, సంకు మదము అనే పలు పేర్లతో పిలుస్తారు. తిరుమలలో వేంకటేశ్వరునికి నిత్యం చేసే అలంకరణలలో సంకుమదం అలదడం కోసం తిరుమల కొండలమీద పునుగు పిల్లుల్ని ప్రత్యేకంగా పెంచుతారు.

193
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles