కరువు తెలియని పల్లె


Sun,July 14, 2019 01:25 AM

Patoda-village

ఈ వేసవిలో మహారాష్ట్ర నీటి కొరతతో అల్లాడింది. ఒక్కో ఊళ్లో ప్రజలు బిందెడు నీటి కోసం గంటలకు గంటలు లైన్లో నిలడ్డారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ట్యాంకర్లతో నీటిని అందించినప్పటికీ పూర్తిస్థాయిలో దప్పికను తీర్చలేకపోయారు. ప్రభుత్వాలు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ సమస్యను పరిష్కరించలేకపోయాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా భూగర్భజలాలు అడుగంటి పోవడంతో నీటి ఎద్దడి రాష్ర్టాన్ని అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ గ్రామంలో పుష్కలంగా జలసిరులు ప్రవహించాయి. కరువును జయించిన ఆ పల్లె పొలిమేర పచ్చదనానికి చిరునామాగా నిలుస్తున్నది.

ఆ పల్లె చుట్టూ పచ్చని చీర చుట్టినట్లు పొలాలు. పల్లె వాకిట్లోకి అడుగుపెడితే స్వాగతం పలికే సీసీరోడ్లు, నవ్వుతూ కనిపించే వీధి స్తంభాలు. ఎవరెవరు వస్తున్నారో నిత్యం ఓ కంట కనిపెడుతూ ఉండే సీసీ కెమెరాలు. తియ్యని నీళ్లనందించే మినరల్ వాటర్ ప్లాంటు. ఉచితంగా ఆడించే పిండి మరలు. స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచే ఇంటింటి మరుగుదొడ్లు.. ఇవి చాలవన్నట్లుగా ప్రజా మరుగుదొడ్లు ఇవన్నీ ఆ పల్లెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాలు నీటికి తల్లడిల్లుతున్నా.. పుష్కలమైన జలవనరులు ఆ పల్లెను ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పటోడా గ్రామానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆ పల్లెను దేశ చిత్రపటంలో అగ్రగామిగా నిలపడంలో ఆ గ్రామ ప్రజల కృషి ఎంతో ఉన్నది. ఇంతకీ ఆ పల్లె ముచ్చట్లేమిటంటే..

2007కు ముందు అది ఓ సాధారణ పల్లె

2007కు ముందు అన్ని పల్లెల మాదిరిగానే పటోడ ఒక వసతులు లేని గ్రామం. అప్పటికే ప్రతి ఏటా వేసవిలో కరువు వచ్చి ఊళ్లో వాళ్లంతా వలస వెళ్లేవాళ్లు. పేరుకుపోయిన చెత్త కారణంగా గ్రామంలో వ్యాధులు ప్రబలేవి. అధికారులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసినా ఫలితం మాత్రం శూన్యం. ఈ క్రమంలో అన్ని గ్రామాల్లో మాదిరిగా కరువుతో పంటలు పండక అన్నదాతలు ఆత్మహత్యల బారిన పడ్డారు. 2006లో ఒక్క సంవత్సరంలోనే గ్రామానికి చెందిన 50 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో గ్రామ పెద్దలంతా ఊరిని మార్చాలని నిర్ణయానికి వచ్చారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు తవ్వించాలని సంకల్పించుకున్నారు. నీటి వనరులు పెంపొందించేందుకు అధికారులతో కలిసి ప్రణాళికలు రచించారు. గ్రామంలో 3500 మంది జనాభా ఉండగా ప్రతి పది ఇండ్లకు ఒక సభ్యుడిగా చేసుకుని ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఒకే తాటిపైకి గ్రామం

గ్రామంలోని పెద్దలంతా కలిసి ఏర్పాటు చేసుకున్న కమిటీ నిర్ణయం ప్రకారం నడుచుకున్నారు. 2007లోనే 90 శాతం మంది ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రక్రియ జరగడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. అనంతరం గ్రామంలోని రోడ్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు, సొంత విరాళాలతో గ్రామంలో ప్రతి వీధికి సీసీ రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాతి సంవత్సరం గ్రామంలో నీటి కొరత కాస్త తగ్గడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అంతటితో ఆగకుండా గ్రామస్తులు వినియోగించిన నీటిని నిల్వ చేసి పంట పొలాలకు మళ్లించారు. ఈ క్రమంలో వారి ప్రయత్నం వంద శాతం విజయవంతమైంది. వరద నీటిని తమ పొలాలకు మళ్లించుకోవడంలోనూ సక్సెస్ అయ్యారు. అప్పటి నుంచి గ్రామంలో నీటి ఎద్దడి సమస్య పూర్తిగా తొలిగిపోయింది. అనంతరం గ్రామ కమిటీ ఇల్లిల్లు తిరిగి పరిశుభ్రతపై అవగాహన కల్పించింది. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చర్యలు తీసుకున్నారు. 2010కి మునుపే గ్రామంలో దాదాపు వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు అమలు చేసి విజయవంతమైంది. అంతే కాకుండా గ్రామంలో 6 ముఖ్య ప్రదేశాల్లో బహిరంగ మరుగుదొడ్లు నిర్మించారు.

రెండు పంటలకు నీళ్లు

ఒకప్పుడు పంటలు పండడం లేదని ఆత్మహత్య చేసుకున్నారు గ్రామ రైతులు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. పుష్కలంగా నీటి వనరులు ఉండడంతో అక్కడి రైతులు రెండు పంటల్ని పండిస్తున్నారు. గ్రామ ప్రజలకు చెందిన 1500 ఎకరాల భూమిలో దాదాపు 80 శాతం భూమికి నీటి సౌకర్యం ఉన్నది. అంతే కాకుండా మురికి కాలువల గుండా వెళ్తున్న వాడిన నీటిని గుంతలు తవ్వి ఫిల్టర్ చేస్తున్నారు. ఈ నీటిని పంట పొలాలకు మళ్లించి ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. ప్రతి ఇంటికీ నీటి మీటర్ బిగించుకుని నీటి విలువ తమకు తెలుసు అంటున్న పటోదా గ్రామస్తులు నిజంగా ఆదర్శప్రాయులు. మరో 15 ఏండ్లు గ్రామానికి నీటి కరువు రాకుండా ప్రయత్నాలు చేసుకున్నారు. అందుకే ఆదర్శ గ్రామంగా పటోదాను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో అవార్డులు అందించాయి.

దేశవ్యాప్త గుర్తింపు

2011లో పటోడ గ్రామానికి జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. వివిధ రాష్ర్టాల ప్రతినిధులు, అధికారులు గ్రామాన్ని సందర్శించడం మొదలైంది. ఈ క్రమంలో గ్రామంలో మరిన్ని వసతులు అవసరమని గ్రామ కమిటీ నిర్ణయించుకున్నది. గ్రామంలో సోలార్ పవర్ ద్వారా వీధి దీపాలు వెలిగించే ప్రయత్నం చేశారు. అనంతరం గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మినరల్ వాటర్‌ను సైతం అందిస్తున్నారు. ఇటీవలే గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్, ప్రభుత్వ పాఠశాల, అన్ని ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సోలార్ ద్వారా ఉచితంగా వేడి నీటినీ అందిస్తున్నారు. గ్రామంలోని అన్ని కుటుంబాలకు నెలలో ఎన్నిసార్లు అవసరముంటే అన్నిసార్లు ఉచితంగా పిండిమర ఆడిస్తున్నారు. ఇవన్నీ సవ్యంగా జరిగేందుకు ప్రతి ఇంటి నుంచి నెల నెలా రూ.291 గ్రామ కమిటీ వసూలు చేస్తున్నది.

620
Tags

More News

VIRAL NEWS