ఉప్పు సామ్రాజ్యానికి రాణి!


Sun,July 14, 2019 01:28 AM

SALT
ఆఫ్రికా ఖండంలో అదొక సముద్రతీర దేశం. అక్కడంతా పురుషాధిక్య సమాజం. ఆ ప్రాంతంలో ఎన్డీమౌ అనే గ్రామం ఉప్పు తయారీకి కేంద్రం. నిత్యం టన్నుల కొద్దీ ఉప్పు అక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటుంది. అలాంటి దేశంలో విపరీతమైన అయోడిన్ లోపం. మహిళలు, చిన్నారులు, గర్భిణులకు అయోడిన్ అందక అనేక రుగ్మతల పాలవుతున్నారు. కారణం తెలుసుకున్న ఓ మహిళ.. పురుషాధిక్యతను ఎదిరించింది. నాయకురాలిగా పోరాడింది. వ్యాపారవేత్తగా అడుగుపెట్టి.. ఆ ఉప్పు సామ్రాజ్యానికే రాణి అయింది.

సమాజంలో ఎదురయ్యే సవాళ్లను చూసి కొందరు పారిపోతారు. మరికొందరు ఆ సవాళ్లకే ప్రతి సవాల్ విసురుతూ ముందుకు దూసుకుపోతారు. ఈ కోవకు చెందిందే మేరీ డియోఫ్. పురుషులకంటే మహిళలు ఏమాత్రం తక్కువ కాదని ఉద్యమాలు చేపట్టింది. అక్కడి స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనుక్షణం పోరాడి హక్కులను సాధించింది. ఉప్పు తయారీ పరిశ్రమ కోసం పోరాడి.. ఆ పరిశ్రమకే రాణిగా ఎదిగింది మేరీ.

అక్కడ పురుషులదే హవా..

సెనెగల్ దేశంలోని సముద్ర ప్రాంతాల్లో ఉప్పు తయారీ పరిశ్రమలో పురుషులదే పైచేయి. అయినా వారు అయోడిన్ ఉన్న ఉప్పును తయారు చేసేందుకు నిరాకరించేవారు. దీంతో గర్భిణులు, చిన్నపిల్లలపై ఆ ప్రభావం ఎక్కువగా కనిపించేది. గర్భిణులకు స్రావాలు జరిగేవి. పిల్లలు బుద్ధిమాంద్యంతో, నరాల బలహీనతతో, ఎముకలు, థైరాయిడ్ సంబంధిత సమస్యలతో పుట్టేవారు. ఈ సమస్యలపై అధ్యయనం చేసింది మేరీ. ఇలా జరగడానికి కారణం అయోడిన్ లోపమేనని తెలుసుకున్నది. రోజూ టన్నుల కొద్దీ ఉప్పు తయారు చేస్తున్న తమ దేశంలో.. అయోడిన్ లోపంపై ఉద్యమం ప్రారంభించింది. ఉప్పు కయ్యల్లో పనిచేస్తున్న మహిళలందరినీ ఏకం చేసింది. అయోడిన్ ఉప్పును తయారు చేయాలని ప్రభుత్వంపై పలు దఫాలుగా పోరాటం చేసింది. అంతేకాకుండా ఉప్పు తయారీలో మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలని నినదించింది. మేరీ డియోఫ్ ఆధ్వర్యంలో ఉద్యమానికి సెనెగల్ ప్రభుత్వం దిగివచ్చింది. నాణ్యమైన అయోడిన్ ఉప్పును తయారు చెయ్యాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మహిళలు ఉప్పు తయారీకి ముందుకొస్తే రాయితీలు ఇస్తామనీ ప్రకటించింది.

ఉప్పు పరిశ్రమలోకి అడుగు..

యునిసెఫ్ లెక్కల ప్రకారం ప్రతీ ఏటా 19 మిలియన్ల మంది చిన్నారులు అయోడిన్ లోపంతో అనారోగ్యం పాలవుతున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో ఏడాదికి నాలుగున్నర లక్షల టన్నుల ఉప్పు సెనెగల్‌లోనే తయారవుతున్నది. కానీ అందులో అయోడిన్ లేదు. అక్కడి రైతులకు అయోడిన్ ఉప్పు తయారు చేసే ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో సాధారణ ఉప్పునే ఉత్పత్తి చేస్తున్నారు. మేరీ డియోఫ్ ఉప్పు పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి కారణం.. అక్కడి యజమానులు అయోడిన్ ఉప్పును తయారు చేయకపోవడమే. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. వారు నిర్లక్ష్యం వహించారు. దీంతో భర్త సహకారంతో కొంత భూమిని అద్దెకు తీసుకొని అయోడిన్ ఉప్పును తయారు చేయడం మొదలుపెట్టింది మేరీ. తక్కువ సిబ్బందితో ఎక్కువ ఉప్పును ఉత్పత్తి చేసే విధానాలపై అధ్యయనం చేసింది. శరీరానిక సరైన మోతాదు అయోడిన్ అందే విధానం గురించి తెలుసుకొని, ఆ మేరకు ఉప్పులో అయోడిన్ శాతం ఉండేలా చర్యలు తీసుకున్నది. అనుకున్నట్లుగా ఆ దేశ ప్రజలకు అయోడిన్ ఉప్పును అందించి సమస్యను పరిష్కరించింది.

మొదటి మహిళ

సెనెగల్ దేశంలోనే ఉప్పు వ్యాపారంలోకి అడుగు పెట్టిన మొట్టమొదటి మహిళగా మేరీ డియోఫ్ ఘనత సాధించింది. తాను ప్రారంభించిన ఉప్పు పరిశ్రమలో మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఉపాధి అవకాశాలను అందిస్తున్నది. మహిళల కోసం ప్రత్యేక సౌకర్యాలను సైతం ఏర్పాటు చేసి, వారి బాగోగులు చూసుకుంటున్నది మేరీ. తమ సంక్షేమం కోసం పని చేస్తున్న యజమానురాలు మేరీ డియోఫ్‌ను వారంతా సాల్ట్ క్వీన్ అంటూ ముద్దుగా పిలుస్తున్నారు. ఇతర ఉప్పు తయారీ పరిశ్రమలతో పోలిస్తే మేరీ దగ్గర తయారయిన ఉప్పు నాణ్యతతో ఉంటుంది. దీంతో అందరూ ఆమె వద్దనే ఉప్పు కొనుగోలు చేస్తున్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఉప్పును అందిస్తున్నందుకు ఆమెను సెనెగల్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. మేరీ యజమానిగా కాకుండా అందరితోపాటు పనిచేస్తూ తన ఉప్పు పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నది. అతి తక్కువ సమయంలోనే అహర్నిశలూ శ్రమించి సెనెగల్ దేశంలోని ఉప్పు వ్యాపార సామ్రాజ్యానికి రాణి అయింది.

సమాజంలో ఎదురయ్యే సవాళ్లను చూసి కొందరు పారిపోతారు. మరికొందరు ఆ సవాళ్లకే ప్రతి సవాల్ విసురుతూ ముందుకు దూసుకుపోతారు. ఆ కోవకు చెందినదే మేరీ డియోఫ్. పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలోఫాటిక్ నగరానికి చెందిన మేరీ డియోఫ్ ఓ ధిక్కార స్వరం. మహిళలకు ప్రాధాన్యం లేని ఆ దేశంలో పోరాటాన్ని నడిపించింది. పురుషులకంటే మహిళలు ఏమాత్రం తక్కువ కాదని ఉద్యమాలు చేపట్టింది.

402
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles