జీవన్మృతుడు


Sun,July 14, 2019 01:37 AM

police
- యెలిశెట్టి శంకర రావు
సెల్: 9491909903


ఆకాశం నిండా కారుమబ్బులు కమ్ముకున్నాయి. చల్లని గాలి శరీరాన్ని తాకుతూ హాయినిస్తున్నది. సన్నగా మొదలయిన వాన తుంపరగా, జడి వానగా మారింది. వరండాలో వాలు కుర్చీలో కూర్చుని వర్షాన్ని ఆస్వాదిస్తున్నాను. లేచాడా వాడు? నాన్న స్వరం గంభీరంగా వినిపించింది. ఆఁ ఆఁ తెల్లవారు ఝామునే లేచాడు. ఎంచక్కా చదువుకుంటున్నాడు కూడా. హాల్లోంచి చూస్తూ, న్ను చూసి గాబరా గాబరాగా సమాధానం ఇచ్చింది అమ్మ. వాడి మొహానికి చదువా? చట్టుబండలా? కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతూ, ఏ కలెక్టరో అయినట్లు కలలు కంటున్నాడేమో? ఉరిమాడు నాన్న. లోపల్నుంచి అమ్మ స్వరం వినిపించలేదు. నాన్నకి టిఫిన్ చేయడంలోనో, క్యారేజీ సర్దడంలోనో నిమగ్నమై ఉంటుంది. నాలో ఏదో నిర్వేదం. వర్షం తెరిపివ్వగానే, నాన్న క్యారేజీ పట్టుకుని స్కూలుకెళ్లిపోయాడు.వ్యక్తావ్యక్త సంఘర్షణలో నేను. జీవితంలో ఏదైనా ఒక సంఘటనకు లేదా కొన్ని అనుభవాల సమాహారానికి అక్షర రూపం ఇస్తే కథ.ఎందుకో ఓ కథ రాయాలనిపించింది.

వ్యవస్థలో ముందుకెళ్లడానికి ఏ దారీ లేక జీవితంలో ఆటుపోట్లని తట్టుకుంటూ, కలల తీరంలో ఆశల్ని ఆవిరి చేసుకుంటున్న ఈ దేశంలోని లక్షల నిరుద్యోగుల్లో నేనూ ఒకడ్ని.
పల్లె- పట్నం కానీ చిన్న ఊళ్లో నాన్న హైస్కూల్ టీచరు. అక్కా, నేను ఇద్దరమే సంతానం. వచ్చే జీతం చాలక, అప్పులు చేసి అక్క పెండ్లి చేశారు నాన్న. కొంచెం ఖరీదైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్నే కొన్నారు అక్కకి. వాళ్లిద్దరూ హాయిగా ముంబైయిలో కాపురం చేసుకుంటున్నారు.

ఏదో కుంటి గుర్రం నడకలా, నాలుగేండ్లకు బీఎస్సీ అయిందనిపించాను నేను. అప్పులు, కోతలూ పోగా మిగిలిన తక్కువ జీతంతోనూ, తాతలిచ్చిన మూడెకరాల మాగాణి మీదొచ్చే పంటతోనే సంసారాన్ని గుట్టుగా లాక్కొస్తున్నారు నాన్న.
వేలాది మంది సగటు మనుషుల్లాగే, ఆదాయం పెంచుకోవడానికి నాన్న మిగతా మాస్టార్లలా గవర్నమెంటు చిరుద్యోగుల్లా రకరకాల ప్రయత్నాలు చేసేవారు.
పెట్టుబడి పెట్టండి గొర్రెలని కొని పెంచుతాం మీ డబ్బు రెండేండ్లలో మూడింతలవుతుందంటే పెట్టారు.
మాదగ్గర డబ్బు పెట్టండి. టేకు, మామిడి మొక్కలు పెంచుతాం. మీ డబ్బు పదేండ్లలో పదిరెట్లవుతుందంటే పెట్టారు.

అవేకాదు. ఎవరు ఏ ఆకర్షణీయమైన ప్రకటన చేసినా, అప్పో, సప్పో చేసి పెట్టుబడి పెట్టారు నాన్న. ఈ దేశంలో చాలామంది సగటు బడుగు జీవిలానే. అన్నీ రెండు మూడేండ్లలో బోర్డు తిప్పేసిన సంస్థలే. లాభాల సంగతి అటుంచి అసలుకే మోసం వచ్చి జీతంతో, జీవితంతో రాజీ పడడం అలవాటు చేసుకున్నారు నాన్న.

డిగ్రీ అయ్యాక. బ్యాంకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాశాను. ఏ ఉద్యోగం తగల్లేదు. అంత వరకూ ఓపిక పట్టిన నాన్నకి సహనం నశించిపోయింది. చిర్రు బుర్రులాడడం మొదలు పెట్టాడు.
నేనేం చేయగలను. నేను యావరేజి స్టూడెంటుని. సాహిత్యం, జర్నలిజం అంటే అభిలాష. అవి తిండి పెట్టవని నాన్న ప్రగాఢ నమ్మకం. ఆ ఏడాది నాకు ఒక చిన్న దినపత్రికలో రిపోర్టరుగా ఉద్యోగం వచ్చింది. జీతం మూడు వేలే. నా అవసరాలకి, ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవడానికి పనికొస్తుందని, మూడు వేలకి ఆ ఉద్యోగంలో చేరిపోయా. నాన్న తిట్లు కొంత వరకూ తగ్గాయి.
రిపోర్టరుగా మొదలయిన నా జీవితం హాయిగా గడిచిపోసాగింది. రాజకీయ నాయకుల్లో, ప్రజల్లో, సాహితీకారుల్లో, పోలీసుల దగ్గర, మంచి గౌరవ మర్యాదలు దక్కేవి. ఆ ఉద్యోగంలో చేరిన రెండేండ్లకే నా జీవితంలో చిత్రంగా రెండు ముఖ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి.

పరాయి రాష్ట్రం నుండొచ్చిన వ్యాపారస్తుడు మా ఊళ్లో ఓ షాపు అద్దెకు తీసుకుని వ్యాపారం మొదలెట్టాడు. రంగు రంగు కరపత్రాలు పంచాడు. చిన్న చిన్న బహుమతులూ ఉచితంగా పంచాడు.
ఇరవై రోజుల్లో మీ డబ్బురెట్టింపు! పన్నెండు లక్షల కారు ఆరు లక్షలకే! ఆరు లక్షలు మా దగ్గర డిపాజిట్ చేసి, ఇరవై రోజుల తర్వాత పన్నెండు లక్షల కారు మీ సొంతం!
అరవై వేల టీవీ ముప్పై వేలకే!
ముప్పై వేల ఫ్రిజ్ పదిహేను వేలకే!
ఇరవై వేల వాషింగ్ మిషన్ పదివేలకే!
ఆశాజీవులైన వెర్రి జనం నోట్ల కట్టలు పట్టుకుని షాపు ముందు క్యూ కట్టారు. కేవలం నెల రోజుల్లోనే రెండు మూడు కోట్లు దండుకున్నాడు షాపువాడు. కొంతమందికి నిజంగానే సరుకులు ఇచ్చేశాడు వ్యాపారి.
ఇదేదో చాలా బాగున్నదే అనుకుంటూ జనాలు మరింత ఎగబడ్డారు.

ఇలాంటివి చాలా చూసాం! అంటూ మరికొందరు పెదవి విరిచారు.
ఏదేమైనా జనం మోసపోకుండా చూడడం నా వృత్తి ధర్మం. స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై అశోక్ నా స్నేహితుడే.
ఓ సాయంత్రం వేళ నేనూ, అశోక్ ఇంకో పాత్రికేయ మిత్రుడూ స్టేషన్‌లో టీ తాగుతుండగా ఈ విషయం కదిపాను నేను .
మన వరకూ ఫిర్యాదులు రాలేదు రానీ అప్పుడు చూద్దాం అంటూ నవ్వి ఊరుకున్నాడు అశోక్.
ఆ రోజు నాన్న రిటైర్మెంట్. నాన్నతోపాటు నాన్న కొలీగ్ మూర్తి మావయ్యది కూడా. ఇద్దరూ స్నేహితులు. పైగా దూరపు బంధువులు, మూర్తి మావయ్య కూడా నాన్నలాగనే పలు మోసపూరిత పథకాల్లో డబ్బులు పెట్టి నష్టపోయాడు. ఆయనకి ఇద్దరు కూతుళ్లు, ఉత్పలమాల, చంపకమాల. పెద్ద కూతురు ఉత్పలమాలకి తలకు మించి అప్పుచేసి ఓ ఫారిన్ డాక్టరు సంబంధం చేశాడు. ఆ అమ్మాయి అమెరికాలో సెటిలయింది. కానీ మూర్తి మావయ్య పూర్తిగా చితికిపోయాడు. చిన్నమ్మాయి చంపకమాల, అపరంజి బొమ్మే. మావయ్య గనక ఆఫీస

రు అయ్యి ఉంటే, ఎందరో కోటీశ్వరుల పిల్లలు చంపకమాల కోసం క్యూ కట్టేవారు. ఆమెని భార్యగా చేసుకోవడానికి. కానీ చంపకమాల జీవితం, పెండ్లి రెండూ ప్రశ్నార్థకంగా మారి మూర్తి మావయ్యని బాధపెడుతున్నాయి.
నాన్న మూర్తి మావయ్య ఇద్దరూ ఒకే పడవలో ప్రయాణిస్తున్న సగటు జీవులు.
రిటైర్మెంటు తర్వాత ఇద్దరికీ అప్పులు పోను మూడేసి లక్షలు మించి మిగల్లేదు.
ఇన్నాళ్లు గడిచినా సరైన ఉద్యోగం రాకపోవటంతో నాన్నకి నా మీద, ఉద్యోగం సంపాదించగలన్న నమ్మకం పోయింది. తనకు వచ్చిన మూడు లక్షలు నాపేర్న బ్యాంకులో డిపాజిట్ చేసి, తన పెన్షన్ డబ్బులతో జీవితం గడిపేయాలని నిర్ణయించుకున్నారు.
బావా! ఈ మూడు లక్షలు తప్ప నా దగ్గరేమీ మిగల్లేదు. నా రెండో కూతుర్ని నీ కొడుక్కి చేసుకుని నన్ను గట్టెక్కించు. మావయ్య కన్నీళ్లతో అడుగుతుంటే నాన్నా నేనూ కాదనలేకపోయాం.
నీ లాంటి అందగత్తె దొరకడం నా పూర్వజన్మ పుణ్యం నన్ను చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఒంటరిగా ఉన్నప్పుడు చంపకమాలని అడిగాను.
చిన్నగా నవ్వి నాలాంటి పేదమ్మాయిని చేసుకోవడం నీకిష్టమేనా బావా? అంది చంపకమాల.
నా దగ్గర సమాధానం లేదు. కొన్ని ప్రశ్నలకి జవాబులుండవు. క్షణకాలం తర్వాత తనే అంది.
మనం మధ్యతరగతి మనుషులం బావా. జీవితం చూపిన బాటలోనే నడవాలి. అంతే మాకు పెద్దలు బ్రహ్మముడి బిగించారు.
ఇరవై రోజులకే సగం ధరకి వస్తువులు ఇస్తానన్న వ్యాపారి, నెమ్మదిగా ముప్పై రోజులు, నలభై రోజులు అంటూ రోజులు పెంచుతూ జనాన్ని తిప్పటం మొదలెట్టాడు. అతను జనాన్ని మోసం చేసే రోజు దగ్గర పడిందని అర్థమైంది నాకు. నేనూ పాత్రికేయ మిత్రుడూ అశోక్‌ని కలిసాం.

అశోక్ మా సమక్షంలోనే వ్యాపారిని గట్టిగా నిలదీశాడు. బాబ్బాబు నన్ను క్షమించాలి అంటూ మా కాళ్లు పట్టుకున్నాడు.
అశోక్ కోపం మంచు ముక్కలా కరగడం ప్రారంభమయింది. నెమ్మదిగా ఇంతవరకూ ఎంత వసూలైంది? అడిగాడు.
నాలుగున్నర కోట్లు సార్, ఖర్చులు పోగా! వ్యాపారి నసిగాడు.
మన వ్యవస్థలో అవినీతి ఎంతగా వేళ్లూనుకు పోయిందో? ఆ రోజే అర్థమయింది నాకు. వారం రోజుల్లో ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
ఆ విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు, అశోక్‌కి, నా పాత్రికేయ మిత్రుడికీ చెరో పాతిక లక్షలు, నాకు ఓ ఇరవై లక్షలు బ్యాగులో సర్ది ఇచ్చాడు. వాళ్లిద్దరూ తీసుకున్నారు. నాలో ధర్మాధర్మ ఘర్షణ మొదలయింది. నేను డబ్బు తీసుకోకుండా, ఏ విషయం తర్వాత చెబుతానన్నా. వాళ్లు ముగ్గురూ నన్ను పిచ్చివాడిలా చూశారు.
ఇంటికొచ్చి విషయమంతా చంపకమాలకి చెప్పాను.

ఆ పాపిష్టి డబ్బు మనకొద్దు బావా. నీ చిన్న జీతానికితోడూ, నేను కూడా పిల్లలకు ట్యూషన్లు చెప్పి ఎంతో కొంత సంపాదిస్తాను. ఉన్నదాంతోనే సంతృప్తిగా బతుకుదాం. ఎండమావుల వెంట పరుగులొద్దు. అలసిపోతాం అని దృఢంగా చెప్పిందామె.
నేను డబ్బులు తీసుకోలేదు. వ్యాపారి వారం తర్వాత ఎవరికీ తెలియకుండా ఊరొదిలి పారిపోయాడు.
నేను రాస్తున్నకథ అయిపోయింది. కానీ మోసం బారినుంచి జనాలను కాపాడలేకపోయా. నా వృత్తి ధర్మాన్ని విస్మరించాను.
ఎందుకో, చిన్నప్పుడెప్పుడో చదివిన ఓ సామెత గుర్తొచ్చింది. దిస్ సొసైటీ నీడ్స్ ఎథికల్ సర్జరీ ఈ సమాజానికి నైతిక చికిత్స అవసరం.
police1
ఆ విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు, అశోక్‌కి, నా పాత్రికేయ మిత్రుడికీ చెరో పాతిక లక్షలు, నాకు ఓ ఇరవై లక్షలు బ్యాగులో సర్ది ఇచ్చాడు. వాళ్లిద్దరూ తీసుకున్నారు. నాలో ధర్మాధర్మ ఘర్షణ
మొదలయింది. నేను డబ్బు తీసుకోకుండా, ఏ విషయం తర్వాత చెబుతానన్నా. వాళ్లు ముగ్గురూ నన్ను పిచ్చివాడిలా చూశారు.

258
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles