రహస్య స్నేహితుడు


Sun,July 14, 2019 01:40 AM

friend
- మల్లాది వెంకట కృష్ణమూర్తి

వారి కారు హెడ్‌లైట్స్ మా ఇంటి ఆవరణలోకి వచ్చేసరికి చీకటి పడింది. నా సెడాన్ కారు వెనక దాన్ని పార్క్ చేశారు. వాళ్ళు ఇంటి తలుపు తట్టేదాకా నేను వేచి ఉన్నాను.
గుడీవినింగ్ నేను డల్‌గా చెప్పాను.
నేను రేండెల్. ఈమె మిసెస్ రేండెల్. ఓ నెలపాటు మీ ఇల్లు అద్దెకి తీసుకుంటానని మీకు ఉత్తరం రాసాను అతను నిస్సందేహంగా అడిగాడు.
నాకు నా ఇంటిని అద్దెకి ఇవ్వడం ఇష్టం లేదు. ఐతే, నాకు ఇంకో ఆదాయ వనరు లేకపోవడంతో అయిష్టంగానే ఇవ్వాల్సి వస్తున్నది. పొడుగ్గా ఉన్న రేండెల్ ఖరీదైన దుస్తుల్ని ధరించాడు.
దెయ్యం పట్టిన ఇల్లు ఇదేనా? అడిగాడు.
అవును. లోపలకి రండి ఆహ్వానించాను.
వాళ్ళు మంద్రమైన వెలుగులో నా వెంట స్టడీరూంలోకి వచ్చారు. మిసెస్ రేండెల్‌కి ఆమె భర్తకన్నా ఆ వాతావరణం ఎక్కువగా నచ్చినట్లు కనిపించింది.
క్లారా మీ ఇంటి గురించి మాకు చెప్పింది.
అవునా? ఆమె మెడుసాని (దెయ్యం) చూసిందా? అడిగాను.
ఆవిడ తలూపి చెప్పింది.

ఆమె పైన పడక గదిలో జుట్టు దువ్వుకుంటూంటే గోడలోంచి మెరిసే కళ్ళతో, మొహం మీద భయంకరమైన చిరునవ్వుతో, జుట్టులో మెలికలు తిరిగే పాములతో కనిపించిందిట. వెంటనే క్లారా అరిచి గదిలోంచి బయటకి వచ్చి మెట్లు దిగి ఇంట్లోంచి బయటికి పరిగెత్తింది. మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టలేదు. ఆమె భర్తే సామాను సర్ది తీసుకెళ్ళాడు.
అతను కొన్ని రోజుల పాటు క్లారాతో మాట్లాడలేదు. నెల అద్దె చెల్లించి ఒక్క రోజు మాత్రమే ఉన్నారని కోపం.. రేండెల్ నాతో చెప్పాడు.
అది దురదృష్టం. కాని నేను కొన్ని నియమాలని ఏర్పరిచాను. అవి లేకపోతే ప్రపంచంలో అరాచకం ప్రబలుతుందని మీకు తెలుసు.
నేను నా బల్ల దగ్గరకి వెళ్ళి ఓ ప్రింటెడ్ ఫాంని తీసిచ్చి చెప్పాను.
మీరు సంతకం చేసే ముందు దీన్ని జాగ్రత్తగా చదవండి. నెల చివరిదాకా ఉన్నా లేదా ముందు వెళ్ళిపోయినా అద్దె తిరిగి ఇవ్వబడదన్న క్లాజ్ ఉంది. అలాగే, మీకు ఈ ఇంట్లో ఉండగా కలిగే శారీరక, మానసిక లేక భావోద్వేగ గాయాలకి నా బాధ్యత లేదు.
వాళ్ళు ప్రశ్నార్థకంగా చూడటంతో నేను సన్నగా నవ్వి వాళ్ళు అడగని ప్రశ్నకి జవాబు చెప్పాను.
కొన్నేళ్ళ క్రితం విల్కిన్సన్ ఈ ఇంట్లోంచి పారిపోతూ కాలు విరగ్గొట్టుకున్నాడు. నా మీద నష్టపరిహారం దావా వేసాడు. నేనా కేసులో గెలిచాను. కానీ, అది కాలం వృధా. అందుకని మీరు దావా వేసే హక్కుని కూడా తీసేస్తున్నాను.
మీరీ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? మిసెస్ రేండెల్ అడిగింది.
అవును. నాకు ఒంటరిగా ఉండటం ఇష్టం.

కాని ఇది చాలా పెద్ద ఇల్లు.
అవును. ఇరవై రెండు గదులు.
రేండెల్ గోడలకి వేలాడే చిత్రాలని పరిశీలనగా చూడసాగాడు. వెన్నెల్లోని శిథిలకోట, హేమ్లెట్‌లోని శ్మశాన దృశ్యం. అతను మంచుమీద ట్రాయ్‌కాని వెంటాడే తోడేళ్ళ చిత్రం వంక ఎక్కువ సేపు చూశాడు.
ఈ దెయ్యం మెడుసాగా కనిపిస్తుందా? రేండెల్ అడిగాడు.
అలా అనేం లేదు. అనేక రూపాల్లో కనిపిస్తాడు. క్లారాకి అలా కనిపించాడు.
మగాడా? ఈ దెయ్యానికి పేరుందా?
అతన్ని యోరిక్ అని పిలుస్తాం.
నేను ఇంతదాకా ఎన్నడూ దెయ్యాన్ని చూడలేదు. చూడాలని కూడా అనుకోవడం లేదు రేండెల్ చెప్పాడు.
అది మీ మంచికే. మీరు ఎప్పుడైనా దెయ్యాలని చూసారా? ఎప్పుడైనా పీడకలలు వచ్చాయా? మిసెస్ రేండెల్‌ని అడిగాను.
మీరు అడగడం వింతగా ఉంది. నా చిన్నతనంలో ఓ పాలవాడు వచ్చి పాలు పోసేవాడు. రాక్షసుడిలా లావుగా, ఎత్తుగా ఉండే అతనికి ఒకే చెవి. మొహం మీద భయంకరమైన మచ్చ ఉండేది. నేను అల్లరి మానకపోతే వాడు నన్ను ఎత్తుకు పోతాడని మా అమ్మ అంటూండేది. ఈ రోజుకి కూడా నాకు వాడు నన్ను ఎత్తుకెళ్ళే పీడకలలు వస్తూంటాయి ఆమె కొద్దిగా వణుకుతూ చెప్పింది.
పై నించి అకస్మాత్తుగా ఏదో శబ్దం వినపడటంతో ఆమె ఉలిక్కిపడి అడిగింది.

పైన ఎవరున్నారు?
ఎవరూ లేరు. చెట్టు కొమ్మ కిటికీకి రాసుకుంది. గాలి వీస్తున్నట్లుంది.
ఊరి శివార్లలోని నిర్మానుశ్య ప్రాంతంలో ఉన్న ఓ పెద్ద పురాతన ఇంటిని అద్దెకి ఇవ్వడం కష్టం. మనుషులకి ఒంటరితనం ఇష్టం ఉండదు. పక్కిళ్ళల్లోని వాళ్ళు కనపడాలి. దగ్గరలో షాపింగ్ సెంటర్లు కావాలి. ఇది అర్థమయ్యాక నేను ఇల్లు అద్దెకి ఉందని ప్రకటించినప్పుడు ఇంట్లో దెయ్యం ఉందని పేర్కొన్నాను. సాధారణంగా దెయ్యపు ఇళ్ళు మనుషుల్ని వెళ్ళగొడతాయని అనుకుంటారు. కాని జరిగేది దానికి విరుద్ధం. దీపం దగ్గరకి పురుగుల్లా చాలామంది నా ఇంటికి ఆకర్షింపబడుతున్నారు. చాలాకాలం దెయ్యాలు ఉన్న ఇంట్లో ఉండటానికి కాదు. ఓ రాత్రి లేదా ఓ వారం లేదా ఓ నెల దెయ్యాన్ని చూసే అనుభవం కోసం ఎక్కువ అద్దెని కొందరు చెల్లిస్తూంటారు. అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. వీళ్ళు బంగీ జంప్ లాంటి సాహసక్రీడల్లో పాల్గొనేలాంటి వాళ్ళే.

గత నాలుగు నెలల్లో నా ఇంటిని జంటలకి లేదా కుటుంబాలకి పంతొమ్మిదిసార్లు అద్దెకి ఇచ్చాను. వారిలో ఎవరూ ఓ పూర్తి రాత్రి కూడా లేరు.
రేండెల్, అతని భార్య అగ్రిమెంట్ ఫాం మీద సంతకాలు చేశాక వారిని పైకి తీసుకెళ్ళి సిద్ధం చేసిన పెద్ద పడకగదిని చూపించాను. మేం ఆ గదిలోకి వెళ్ళగానే మిసెస్ రేండెల్ అకస్మాత్తుగా ఆగి, విని అడిగింది.
ఆ శబ్దం విన్నారా? నేను తలూపాను.
ఈ పాత ఇళ్ళల్లో శబ్దాలు వస్తూంటాయి. పాత చెక్కలు కిర్రుమంటాయి. లేదా కప్పుమీద ఉడతలు, ఎలుకలు పరిగెడుతుంటాయి. పగలు వీటిని ఎవరూ ఆలకించరు కాని రాత్రి చీకట్లో వింటారు. మీ వారు ఎప్పుడూ దెయ్యాలని చూడటం కాని, రాత్రుళ్ళు పీడకలలని కనడం కాని జరిగినట్లు లేదు చెప్పాను.
ఊహాశక్తి గలవారికే అవి జరుగుతూంటాయి రేండెల్ నిర్లక్ష్యంగా చెప్పాడు.
అది మీకు రక్షణగా ఉపయోగిస్తుంది. మీరో పెద్ద గోధుమ రంగు దెయ్యాన్ని చూడరని ఆశించండి.
నన్నేమీ భయపెట్టలేదు అతను కోపంగా చెప్పాడు.
* * *

నేను సర్ది ఉంచుకున్న ఎయిర్ బేగ్‌తో నా కారువైపు నడిచాను. ఓ పొలం లోంచి కుక్క ఏడుపు వినిపించింది. త్వరలోనే మరికొన్ని కుక్కలు కోరస్‌గా అరవసాగాయి. చక్కటి ఆహ్వానం అనుకున్నాను. నాలుగు మైళ్ళ దూరంలోని గ్రామానికి వెళ్ళి మిసెస్ మేక్‌ఫీ నడిపే బోర్డింగ్ హౌస్‌లో ఎప్పటిలా గదిని అద్దెకి తీసుకున్నాను.
మళ్ళీ మీ ఇంటిని అద్దెకి ఇచ్చారన్నమాట ఆవిడ నవ్వి చెప్పింది.
ఆ రాత్రి నేను హాయిగా నిద్ర పోయాను. మర్నాడు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తిన్నాక కారులో నా ఇంటికి చేరుకొన్నాను. నేను అనుకున్నట్లుగానే ఇంటి ముందు వారి కారు లేదు. తలుపు తెరిచే ఉంది.
నేను మెట్లెక్కి పడక గదిలోకి వెళ్ళాను. ఆ తలుపు కూడా తెరిచే ఉంది. చూస్తేవారి సూట్‌కేస్, బట్టలు లేవు. ఇలా ఎప్పుడూ జరగదు. కొందరు సామాను తీసుకోకుండా ఉన్న ఫలాన పారిపోతారు. వాళ్ళు ఏం చూసి ఉంటారో అనుకున్నాను. రాక్షసుడినా? గోధుమరంగు మిడిగుడ్లతో కూడిన ఎనిమిది అడుగుల వాడినా? దూరం నించి హేమంతపు గాలి కిటికీ రెక్కలని తడుతున్నది. బహుశా ఈ సీజన్‌లో ఈ ఇంటిని అద్దెకు తీసుకున్న ఆఖరి వాళ్ళు రేండెల్స్ అనుకున్నాను.
ఒక్క రాత్రికి నేను నా ఇంటిని వదిలి బయటకి వెళ్ళడం నాకు బాధగా ఉంటుంది. స్టడీరూంలోకి వెళ్ళి నిప్పు రాజేసుకుని నా ఈజీ చెయిర్‌లో కూర్చుని నేను చదివిన, మళ్ళీ చదివిన ఫేంటీ కథలను మళ్ళీ చదవసాగాను. నా కుర్చీ చేతుల మీద పొగమంచు లాంటిది ఏర్పడి క్రమంగా నల్లకోటు తొడుక్కున్న ఓ రూపం ప్రత్యక్షమైంది. ఎర్రటి నిప్పుల్లాంటి కళ్ళు నా కళ్ళల్లోకి దయగా చూశాయి.

నా ఇంటిని అద్దెకి తీసుకుని అర్ధరాత్రి చీకట్లో పారిపోయిన వాళ్ళు వాళ్ళ ఊహల్లో ఎవర్నీ చూడలేదు. ఆ ఇంట్లోని భయంకరమైన వాతావరణం వల్ల అలా చూసామని అనిపించింది అని చెప్పిన వారందరిదీ తప్పు. ఈ ఇంట్లో నిజంగా ఓ దెయ్యం ఉంది. అతని పేరు యోరిక్. అతను ఏ రూపం ధరించాలనుకుంటే ఆ రూపాన్ని ధరించగలడు.
యోరిక్ నా మీదకి ఒంగి భయపెట్టే కళ్ళతో నా వంక చూశాడు. మేమిద్దరం మంచి స్నేహితులం కాబట్టి అతను నటిస్తున్నాడని నాకు తెలుసు.
యోరిక్. తమాషా చాలించు కోప్పడ్డాను.
సారీ హెన్రీ! నేను ఆపుకోలేను. నీకు మరోసారి సహాయం చేసాను చెప్పి మృదువుగా నవ్వి చుట్టూ ఉన్న గాల్లోకి కరిగిపోయి మాయమయ్యాడు.
నేను నా పైప్‌ని వెలిగించి మళ్ళీ చదువసాగాను. నా మిత్రుడు కాబట్టి నా ఆదాయం కోసం అతను నాకు సహాయం చేస్తున్నాడు. అందరిలా నేనూ మొదటి రాత్రి పారిపోయి ఉంటే నాకీ దయగల మిత్రుడు లభించే వాడే కాదు.
ఆ ఇంట్లోని భయంకరమైన వాతావరణం వల్ల అలా చూశామని అనిపించింది అని చెప్పిన వారందరిదీ తప్పు. ఈ ఇంట్లో నిజంగా ఓ దెయ్యం ఉంది.
(జాక్ రిట్చీ కథకి స్వేచ్చానువాదం)

716
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles