ఘట స్వాగత సంప్రదాయం


Sun,July 14, 2019 01:56 AM

Tradition
ఈ ఉత్సవం అమ్మవారికి ఎదురువెళ్లి పుట్టింటి నుంచి తీసుకొచ్చే ఎదురుకోలుతో ప్రారంభమవుతుంది. ఘటం అంటే కలశం. ఘటంతో ఎదురు వెళ్లి అమ్మవారికి స్వాగతం పలుకడం ఈ ఉత్సవ సంప్రదాయం. కలశంతో స్వాగతం పలికే కార్యక్రమాన్ని కాలక్రమంలో ఘటోత్సవంగా పిలుస్తున్నారు. ఈ ఘటోత్సవానికి ప్రత్యేకమైన కలశంలో అమ్మవారు అవాహన చేయబడి పురవీధులలో ఊరేగుతారు. అసలైన బోనాల ఉత్సవం ముందురోజు వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారు ఘటముపై సూక్ష్మరూపంలో ఆసీనురాలై పురవీధుల గుండా సంచారం చేసి భక్తులతో పూజలు అందుకుంటుంది. ఘటోత్సవం అమ్మవారి పూజలు ప్రారంభమైనట్లు తెలియజేస్తుంది. అమ్మవారి ఆలయానికి వెళ్లలేని వృద్ధులు, వికలాంగులు తమ తమ ఇండ్లవద్దకు తరలివచ్చిన అమ్మవారిని సేవించుకుని మొక్కులు తీర్చుకుంటారు.

గావు పట్టి.. గుమ్మడికాయ కొట్టి

రంగం కార్యక్రమం ముగిసిన తర్వాత ఆలయానికి వంశపారంపర్యంగా వస్తున్న పోతురాజులు విలయ తాండవం చేస్తూ.. ఉద్వేగంతో ఊగిపోతూ ఆలయం చుట్టూ నాట్యవిన్యాసాలు చేస్తారు. మేళతాళాల మధ్య అమ్మవారికి ఎదురుగా పోతురాజులు నాట్యం చేస్తున్నప్పుడు అమ్మవారు వారిని ఆవహిస్తుంది. ఈ సందర్భంలో గుమ్మడి కాయలతో అమ్మవారికి బలితీస్తారు. పూర్వం జంతు బలులు ఉండేవి. వాటిని నిషేదించడంతో వీటిని బలిగా ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్నే గావు పట్టడం అంటారు. ఈ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు ఆసక్తిగా తిలకిస్తారు.

ఫలహార బండ్లొచ్చెనా

బోనాల పండుగ రోజున భక్తులు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను ఇండ్లలో తయారు చేసుకొని వాటిని బండిలో పెట్టుకొనివచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి కొంత సమర్పించి, మిగిలినది ఇంటికి తీసుకుపోయి కుటుంబ సభ్యులకు, ఇరుగుపొరుగువారికి అందజేస్తారు. ఈ విధంగా వేల సంఖ్యలో భక్తులు బండ్లపై నైవేద్యాలు తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ప్రసాదాలు తెచ్చే ఈ బండ్లను ఫలహారపు బండ్లు అని పిలుస్తారు.
Tradition1

సాగనంపి.. సాకవెట్టి

గావు పట్టడం పూర్తయిన తర్వాత అమ్మవారి విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఏనుగుపై, పల్లకిపై ఉంచి మంగళవాయిద్యాలతో పుర వీధుల గుండా ఊరేగిస్తూ తీసుకువెళతారు. ఈ ఊరేగింపుతో అమ్మవారిని సాగనంపి ఉత్సవాన్ని ముగిస్తారు. సాక అంటే శాఖ. శాఖ అంటే చెట్టుకొమ్మ. పసుపు నీటిలో ఈ వేప కొమ్మలను వేస్తారు. ఈ కొమ్మలతోపాటుగా పసుపు నీటిని అమ్మవారికి సమర్పించడాన్ని సాకివ్వడం లేదా శాఖా సమర్పణ అంటారు. వేపాకు ఉంచిన పసుపు నీరు చల్లగా ఉంటుంది. ఈ చల్లని నీటిని సమర్పించడం వల్ల ఈ నీటి లాగా చల్లగా ఉండేట్లు తల్లి దీవిస్తుందని సాక సమర్పించే స్త్రీల విశ్వాసం.
Tradition2

మేళవింపు

భిన్న సంస్కృతుల మేళవింపుగా నిలిచిన భాగ్యనగరంలో శతాబ్దాలుగా బోనాల వేడుల ఘనంగా సాగుతోంది. హిందూ సంప్రదాయ ప్రథమ పండుగైన తొలి ఏకాదశి అషాఢంలోనే వస్తుంది. ఇక్కడి నుంచే పర్వదినాలు మొదలవుతాయి. గురుపౌర్ణమి ఈ సందర్భంలోనే జరుగుతుంది. అందుకే అషాఢానికి అంత ప్రాధాన్యం.. ఈ మాసంలో వర్షాలతో ప్రకృతి వైపరీత్యాలు రాకుండా చూడాలని అమ్మవార్లను ప్రార్థించి భక్తులు బోనాలు సమర్పిస్తారు.
Tradition3

రంగమెత్తే భవిష్యవాణి

రంగం అంటే భవిష్యవాణి. భవిష్యత్తును చెప్పడం. బోనాల సమర్పించుకున్న తరువాత వేడుకల ముగింపు దశలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దేవత ఆవహించిన అవివాహిత స్త్రీని అమ్మవారికి ఎదురుగా కుండపై కూర్చోబెట్టి ఈ రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ స్త్రీ అమ్మవారి వంకే చూస్తూ అమ్మవారి కళను తనపై ఆవహింపజేసుకుని భవిష్యత్తులో జరిగే పరిణామాలను, ముఖ్య విషయాలను చెబుతుంది. ఈ సందర్భంలో అమ్మవారి పలుకులను వినాలని భక్తులు ఆసక్తి కనబరుస్తారు. ఇందుకోసం మైకులు ఏర్పాటు చేసి అందరికీ భవిష్యవాణిని వినిపిస్తారు. రంగం కార్యక్రమంలో పాల్గొనే స్త్రీ ఒక కత్తికి మాంగల్య ధారణ చేసి జీవితాంతం అవివాహితగా ఉండిపోతుంది. బోనాల జాతర జరిగే ప్రతి ఆలయానికి ఒక మాతంగి ఉంటుంది.

487
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles