వైద్య నారాయణుడు


Sun,August 4, 2019 02:08 AM

docter
అందరు వైద్యులు స్టెతస్కోప్ పట్టుకుని గుండె చప్పుడు వింటారు. కానీ అతడు మాత్రం సమాజం నాడిని పట్టుకుంటారు. వారి ఆక్రందల్ని మనసుతో వింటారు. జనం బాధల్ని తన బాధలుగా భావిస్తారు. అందుకే అందరి నోటా అతడు దేవుడిగా కీర్తించబడుతున్నారు. పేదలకు ఆరోగ్య ప్రదాతగా, బీద జనుల గుండె చప్పుడుగా పేరుపొందారు. ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. వారానికి 1000 నుంచి 1500ల మంది వరకు ఆయన రాకకోసం ఎదురుచూస్తుంటారు. ఒక్క పైసా తీసుకోకుండా ఉచితంగా వైద్యసేవలు అందిస్తారు. అంతేకాదు వైద్యం కోసం వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టి మరీ పంపిస్తారు. ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మందికి ఆయన ఉచితంగా వైద్యమందించారు. ఆ వైద్య నారాయణుడి పరిచయమిది.

అది బెంగళూరుకు సమీపంలోని ఓ మారుమూల గ్రామం. పేరు టిబేగుర్. అక్కడ దాదాపు రెండు వేల వరకు జనాభా ఉంటుంది. గ్రామంలోకి అడుగు పెట్టగానే ఓ పెద్ద కాంపౌండ్ వాల్ దర్శనమిస్తుంది. ప్రతి ఆదివారం ఆ ప్రహరీ వెంట పెద్ద క్యూలైన్ కనిపిస్తుంది. దైవ దర్శనానికో, ఓట్లు వేయడానికో, సినిమా టికెట్ల కోసమో క్యూలైన్‌లో నిల్చోలేదు వారంతా. మనసు నిండా బాధను, ఒంట్లో నిస్సత్తువను నింపుకుని వేచి ఉన్నారు. సమయం తొమ్మిదవుతున్నది. తెల్ల బట్టలు వేసుకుని బైక్ మీద వచ్చిన ఒక వ్యక్తికి వారంతా నమస్కరిస్తున్నారు. ఆయన ప్రజాప్రతినిధి అనుకుంటే పొరపాటే.. అంతకు మించి సేవ చేసే వైద్యుడు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లి వారి వారి సమస్యల్ని తెలుసుకుంటున్నాడు. వారిలో కొందరికి మానసిక ధైర్యం ఇస్తున్నాడు. ఇంకొందరికి అవసరమైన మందులు ఉచితంగా ఇస్తున్నాడు. ఇలా ఉదయం తొమ్మిదింటికి ప్రారంభమైన శిబిరం రాత్రి పదింటిదాకా సాగుతుంది. సంవత్సరాంతం ప్రతీ ఆదివారం ఇక్కడ జన జాతరే.
docter1

ప్రజల చెంతకే ఆరోగ్యం

భోగరాజు రమణారావు స్వస్థలం హైదరాబాద్. మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చేశారు. ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. 1968లో వైద్య వృత్తిలోకి వచ్చారు. గుండె సంబంధిత వ్యాధుల ప్రత్యేక నిపుణులుగా పేరు తెచ్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వైద్యం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి రావడం గమనించారు. అనారోగ్యంతో ఇన్ని గంటలు ఎలా ప్రయాణిస్తున్నారు. అదీ మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం కూడా లేదు కదా అని కొందర్ని ప్రశ్నించారు. బతకాలంటే వాగుల్ని, వంకల్ని దాటుకుంటూ.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాకతప్పదు కదా సారూ అని రోగులు చెప్పడంతో రమణారావు మనసు చలించింది. తానే ప్రజల వద్దకు వెళ్లి సేవలందించాలనే నిర్ణయానికి వచ్చారు.
docter2

డేరా కింద వైద్యం

వారం రోజులు తన కోసం. ఒక్క ఆదివారం మాత్రం పేదల కోసం కేటాయించారు. తన సేవల్ని ప్రారంభించడానికి బెంగళూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిబేగుర్ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ గ్రామం చుట్టుపక్కల మరో 40 గ్రామాలున్నాయి. 1973 ఆగస్టులో మొదటిసారి ఓ డేరా కింద శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆతర్వాత విస్తృత ప్రచారం లభించింది. ప్రతివారం రోగుల సంఖ్య పెరగసాగింది. వేర్వేరు జిల్లాల నుంచీ రోగులు వచ్చేవారు. డేరా కింద మొదలైన క్లినిక్ ప్రస్తుతం 10ఎకరాల్లో విస్తరించింది.

ఉచిత భోజనం.. సేవలకు గుర్తింపు!

రమణారావు కుటుంబ సభ్యులంతా వైద్యులే. భార్య, ఇద్దరు కొడుకులు సైతం క్లినిక్‌లో వైద్యం అందిస్తున్నారు. వైద్యం కోసం వచ్చిన వారికి ఉచితంగా భోజనం పెడుతున్నారు. రమణారావు టీం కర్ణాటకలో 700 పబ్లిక్ టాయిలెట్లు కట్టించింది. 16 గ్రామాల్లో నీటి సమస్య పరిష్కరించింది. 50గ్రామాల్లోని పాఠశాలలను దత్త త తీసుకున్నది. ప్రతి యేటా ఆయా పాఠశాలల్లోని పిల్లలకు బ్యాగులు, నోట్‌బుక్కులు అందిస్తున్నది. ఆయన సేవలకు గాను 2008లో అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు లభించింది. భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
docter3

ఉచితంగా వైద్యమందాలనే తపన

నా దగ్గరికి వచ్చే రోగుల్లో 99 శాతం కేసులు కొద్దిగా ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోయేవే. నిరుపేదలకు అది కూడా కష్టతరం. అందుకే వారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నా. చాలా దూరం నుంచి వచ్చిన వారు ఖాళీ కడుపుతో వెళ్లడం నాకిష్టం లేదు. శిబిరం ఉన్న రోజున మధ్యాహ్నం భోజనం పెడుతున్న. నా టీంలో ఉన్న వాళ్లంతా దయార్ద హృదయులే. అందుకే నేను చేసే పని సులువు అవుతున్నది. సేవల్ని మరింత విస్తరిస్తా.
- డాక్టర్ బి.రమణారావు, బెంగళూరు

221
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles