ఆకలి తీర్చే ఆపన్నహస్తాలు


Sun,August 4, 2019 02:15 AM

food
మన దేశంలో రోజూ 19 కోట్ల మంది ఖాళీ కడుపుతో నిద్రపోవాల్సి వస్తున్నది. ఈ సమస్యలో బంగ్లాదేశ్, నేపాల్ కన్నా భారత్ దారుణ పరిస్థితిలో ఉంది. మరోవైపు 40 శాతం ఆహారం వృథా అవుతున్నది. ఆకలి సమస్య ఎదుర్కొంటున్న దేశాల్లో మన దేశ స్థానం 103వ ర్యాంక్. ఇది ప్రపంచ ఆకలి సూచిక నివేదిక చెప్తున్న విషయాలు. ఈ భిన్న పరిస్థితులను మార్చడానికి కొందరు సామాజికవేత్తలు ఆహార వృథాను తగ్గించి, ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు..

ఆస్తులు పోగేసుకుంటారు, అంతస్తులు సంపాదించుకుంటారు. వాటికి పరిమితులుండవు. కానీ ఎంత సంపాదించినా అన్నం మాత్రం కడపు నిండే వరకే తినాలి. అందుకే ఆహారానికి మాత్రం పరిమితులుంటాయి. ఈ ప్రపంచంలో ప్రతి జీవికీ అవసరం అయ్యేది ఆహారం ఒక్కటే. అందరూ కష్టపడాల్సింది దాని కోసమే.. కానీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దేశంలో ఆకలి చావులు చూస్తున్నాం. తిండి లేక అలమటిస్తున్న వారినీ చూస్తున్నాం. అలాంటి వారి కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆపన్న హస్తాలుగా మారాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూర్, ముంబై వంటి నగరాల్లో ఎంతో మంది ఆకలి తీరుస్తున్నాయి. ఆకలి, పోషకాహారం, పేదరికం మూడు పరిస్థితులను లక్ష్యంగా చేసుకొని వాటిని మార్చడానికి ఈ సంస్థలు పని చేస్తున్నాయి.
food1

కమ్యూనిటీ ఫ్రిడ్జ్

గురుగ్రామ్‌లో సన్‌సిటీ ఒక సొసైటీ. అక్కడ ఆకలి సమస్యను తీర్చడానికి వినూత్నంగా ఆలోచించింది. మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా సేకరించేందుకు భిన్నంగా ఆలోచించింది. ఆపార్ట్‌మెంట్‌ల ముందు కమ్యూనిటీ ఫ్రిడ్జ్‌లను ఏర్పాటు చేసింది. దీనికి స్థానికులు కూడా సహకరిస్తున్నారు. కాలనీవాసులు తమ దగ్గర ఉన్న ఆహారాన్ని వృథా చేయకుండా ఫ్రిడ్జ్‌లో ఉంచుతారు. శాఖాహారం, మాంసాహారం వేర్వేరుగా నిల్వ చేయడానికి ఈ ఫ్రిడ్జ్‌లలో అవకాశం ఉంది. దీన్ని ఎవరైనా సరే ఉచితంగా తీసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్‌లు ఐస్‌క్రీమ్‌లు, పాల ఉత్పత్తులతో నిండిపోయి ఉంటాయని అక్కడి వారు చెప్తున్నారు. ఇతరులకు సాయం చేయాలనుకునే అందరినీ ఈ ఫ్రిడ్జ్‌లు కలుపుతున్నాయని స్థానికులు అంటున్నారు.
food2

రాత్రింబవళ్లు పని చేసే వారి కోసం

హైదరాబాద్‌లో రాత్రింబవళ్లు పని చేసే వారి ఆకలి తీర్చడానికి, ఆకలి లేని హైదరాబాద్‌గా చూడడానికి పని చేస్తున్నది ఆపిల్ హోమ్ ఆర్గనైజేషన్. ఫీడ్ ద నీడ్ పేరుతో ఆకలి తీర్చే కార్యక్రమం చేపట్టింది. నీలిమ ఆర్య అనే మహిళ దీన్ని నిర్వహిసున్నది. ఫంక్షన్‌లలో వృథా అయ్యే ఆహారాన్ని ముందుగానే సేకరించి పలు ప్రాంతాల్లో ఆకలితో ఉన్న వారికి అందిస్తున్నది. అట్లాగే వివిధ రకాల చాక్లెట్లు, బిస్కెట్లు, పండ్లు, నీళ్లు నిరంతరం అందుబాటులో ఉంటాయి. వీటి కోసం ప్రత్యేకమైన ఫ్రిడ్జ్‌లను తయారు చేసి నిల్వచేస్తున్నది. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రోడ్డు మీద వెళ్తున్న ఎవరైనా సరే ఈ ఫ్రిడ్జ్‌ల నుంచి ఆహారాన్ని తీసుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని ప్రధాన ఏరియాల్లోనే ఉన్న ఈ ఫ్రిడ్జ్‌లను త్వరలోనే నగర వ్యాప్తంగా విస్తరిస్తానని నీలిమ చెప్తున్నది. ప్రతి పది కిలోమీటర్లకు ఓ ఫ్రిడ్జ్‌ను అందుబాటులో ఉంచి హైదరాబాద్‌లో ఆకలితో ఉన్న వారి సమస్యను తీర్చాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నది.
food3

రాబిన్ హుడ్ ఆర్మీ

ఇది వెయ్యి మంది వలంటరీలతో పని చేస్తున్న ఆర్గనైజేషన్. సుమారు 18 నగరాల్లో విస్తరించి ఉంది. ఢిల్లీలోని వీధుల్లో దుర్భర పరిస్థితులను చూసిన ఓ ఆరుగురు వ్యక్తులు దీన్ని ప్రారంభించారు. రెస్టారెంట్లలో, ఈవెంట్లలో మిగిలిన ఆహారాన్ని సేకరిస్తారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఆహారాన్ని నగరాలకు రవాణా చేస్తారు. నగరాలకు దూరంగా ఉండే పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు. 18 నగరాల్లో రోజూ రెండు లక్షల మంది ప్రజలకు సేవలందిస్తున్నదీ ఆర్గనైజేషన్..
food4

రోటీబ్యాంక్..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ జర్నలిస్ట్ తారా పట్కార్. పేదల ఆకలి తీర్చడానికి అందరినీ ఏకం చేశాడు. మార్పు తీసుకురావడానికి సమాజం ముందుకు రావాలని తన పరిధిలోని అందరినీ మోటివేట్ చేశాడు. ఫలితంగా రోజుకు 10వేల మంది ఆకలి తీర్చగలుగుతున్నాడు. మహోబా అనేది ఉత్తరప్రదేశ్‌లోని ఓ చిన్నపట్టణం. అక్కడ నివాసం ఉంటున్న 500 కుటుంబాల వారు ప్రత్యేకంగా ఆహారాన్ని తయారు చేసి అవసరం అయిన వారికి ఇస్తారు. రోజూ రోటీ, దానికి సరిపడా కూర తయారు చేస్తారు. వీటిని వలంటరీలు వచ్చి తీసుకెళ్తారు. పట్టణంలోని కూలిలకు, డ్రైవర్లకు వీటిని అందిస్తారు. తారా పట్కార్ చొరవతో ఏర్పడ్డ రోటీ బ్యాంక్ పది మంది వలంటరీలతో కొనసాగుతున్నది.

330
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles