బ్రహ్మపీఠం


Sun,August 4, 2019 12:34 AM

KATHA
రామా చంద్రమౌళి
సెల్: 9390109993


డిసెంబర్ నెల.. రెండవ ఆదివారం. విపరీతమైన చలి. పొద్దెక్కి ఎనిమిది గంటలౌతున్నా.. అంతా పొగమంచే చిక్కగా. మనిషికి ఎదుటనున్న మనిషే కనబడ్తలేడు. గీ వరంగల్‌ల గింత పొగమంచు ఎన్నడూ లేదు.. ఎవరో నగరమంతా దట్టంగా పొగను చిమ్మినట్టు.. ఏందో అనుకుంది ఇరవై నాలుగేళ్ల నిర్మల. ఎల్లంబజార్ మాంసపు బజార్‌ల.. వెనుక వరుసగా కాపుడు కొట్లు.. ఒకటే జనం హడావిడి. వరుసగా బజ్ జ్ జ్ జ్ మని అరుస్తున్న బ్లోయర్ల చప్పుడుతో జీవధ్వని. గాలినిండా చర్మం కాలుతున్నప్పటి కమురు వాసన గాఢంగా. మార్కెట్ లోపలికి అడుగుపెట్టగానే రెండు వైపులా వరుసగా మాంసపు దుకాన్లు. ఇంకాస్త పదడుగులు నడిస్తే రెండు వైపులా అరుగులపై కూర్చుని కూరగాయలు అమ్మే ఆడవాళ్లు.. ఎక్కువగా ముసలోల్లే. ఇంకాస్త పదడుగులేస్తే.. చేపల లక్ష్మి. వరుసగా చేపల డమ్ములు.. గంపల్లో జిలజిలా మెసుల్తూ చేపలు. ఆమె ఎప్పుడూ బొమ్మె చేపల్నే అమ్ముతది. గత ముప్పై ఏండ్లకు పైగా ఆమే అక్కడ చేపల అమ్మకానికి సర్వాధికారిణి. హోల్ సేల్.. రిటైల్. పక్కా తూకం.. పక్కా రేట్‌కు పేరు మోసిందామె. ఆమె చుట్టూ చేపలను అప్పటికప్పుడే చంపి, శుభ్రం చేసి, కోసి ముక్కలు చేసి కడిగి ఇచ్చే నలుగురైదుగురు నడీడు స్త్రీలు. చుట్టూ తమవంతు చేపలను కడిగించుకుని వెళ్లేందుకు ఎదురుచూస్తూ నిలబడ్డ కస్టమర్ జనం.

ఆ చేపల అడ్డా దాటితే.. వెనుక వరుసగా మేకల, పొట్టేళ్ల తలకాయలనూ, కాళ్లనూ కాపి, నీటితో కడిగి ఇచ్చే ఆరేడు కొట్లు పొగ చూరి, ఎప్పుడో ప్రభుత్వం వేయించిన నాసిరకం టైల్స్ పగిలి ఊడిపోయి.. పెచ్చులు పెచ్చులుగా చెదిరిపోయి.. కొన్ని బొగ్గులు.. కుప్పలు కుప్పలుగా కట్టె ముక్కలు, పెద్ద పెద్ద ప్లాస్టిక్ గంగాళాల్లో నల్లని మసి నీళ్లతో.. అంతా పొగ.. ధూళి.. కమురు వాసన.. ప్రతి కొట్టు ముందూ కస్టమర్లు తమ కాళ్లు తలకాయల కోసం ఎదురు చూస్తూ. ఇంకెప్పుడమ్మా తొందరగా కానీ అని తొందర. గద్దింపులు. ప్రతి కొట్టు మీదా ఇద్దరు వ్యక్తులు. ఒకరు వచ్చిన గిరాకీనుండి పచ్చి కాళ్లు తలకాయలను తీసుకుని వరుసలో పెట్టడానికి.. మరో వ్యక్తి బట్టీ ముందు తపస్సులో ఉన్న మనిషిలా బ్లోయర్‌ను ఒడుపుగా తిప్పుతూ సన్నని మంటమీద అటో రెండు కాళ్లూ.. ఇటు మధ్యలో ఒక తలకాయను పెట్టి.. అటు ఇటు మంటల మధ్య సర్దుతూ.,
అంతా ఒక సంరంభం. హడావిడిగా అటు ఇటూ నడుస్తూ వస్తూ వెళ్లే మనుషులతో ఒక జీవన వ్యాపారం.
ఆ మూలకున్న చివరి కొట్టులో.. నిర్మల తదేకంగా చూస్తోంది బజ్ జ్ జ్ మని శబ్దిస్తున్న ఎర్రని మంటలోకి.

చిన్నప్పటినుండి.. ఏడో తరగతిలో ఈ ఎల్లంబజార్‌కు తల్లి జమీలా బాయ్ వెంట తీసుకుని వచ్చింది మొదలు.. కొత్తదనంతో.. చిన్నపిల్ల చేష్టలతో .. అమ్మీ నేను బ్లోయర్ ను తిప్పుతనే.. కాల్చిన కాళ్లను కత్తితోటి గీకుతనే .. మై సాఫ్ కరూంగీ అని మారాం చేసి గిరాకీ కటికోల్ల దగ్గర బేరమాడి చేతులతోటి తీసుకొచ్చుకున్న ఒక మొండీ చార్ పైర్.. చటుక్కున వాళ్ల చేతులనుండి లాక్కుని.,
అన్నా అన్నా.. మై కరూగీ జల్దీ ఔర్ బెహ్తర్ అని అరుస్తూ.. తల్లి దగ్గరకొచ్చి.. ఇచ్చి.. నవ్వు ముఖం మీద చూడు నేను గిరాకీని పట్టుకొచ్చిన అని.
అప్పుడు మొదలైన ఎర్రని నాలుకలను చిమ్ముతూ కాల్చే మంటలోకి చూచే అలవాటు. మంట కాలుస్తుంది. మాడుస్తుంది. బుగ్గి చేసి బూడిగను మిగులుస్తుంది. అంతిమంగా ఏమీ మిగులకుండా నిశ్శేషం చేస్తుంది.
మంట.. బయటి మంట.. లోపలి మంట. వయసు గడుస్తున్నకొద్దీ నిర్మలకు అర్థమైంది బయటి మంటకంటే లోపలి తీవ్రమైన మంటే అతి శక్తివంతమైందని.
ఇటు అమ్మి జమీలా బాయ్.. అటు నోటినిండా జర్దా పాన్ నముల్తూ ముఖం నిండా మంటల నీడలు పారాడ్తూండగా తపస్సులో నిమగ్నమై ఉండే యోగిలా.. మన లోకంలోనే లేని ఋషిలా.. బాపు కటికె దయానంద్. ఏండ్ల పర్యంతం బ్లోయర్ తిప్పుతూ తిప్పుతూ .. గిరాకీ తెచ్చే పొట్టేల్ తలకాయల ముక్కు రంధ్రాల్లో ఒడుపుగా ఇనుప కడ్డీలను లోతుగా గుచ్చి దిగేసి .. దాన్ని చేతితో చురుగ్గా మంటల్లో మాడుస్తూ.. మరో చేత్తో బ్లోయర్ హాండిల్‌ను ఆగకుండా తిప్పుతూ.. దాంట్లో ఎంతో నైపుణ్యం దాగి ఉంది. మంట సన్నగా నిలకడగా రావాలె. జ్వాల తెగకూడదు. వేడి స్థిరంగా తాకాలె మొందీకీ, పైర్ కూ.

ఇదొక రకమైన వృత్తి. కటికోల్లు సాధారణంగా మేకలనూ, పొట్టేళ్ళనూ కోసి.. చర్మాలనూ, మాంసాన్నీ అమ్ముకుని దాంతో జీవిస్తారు. అదే కులవృత్తి. ఇక దాంట్లో కస్టమర్లను మోసం చేయడాలు.. జోకుడులో దండీ కొట్టడాలు. ఆడమేకలను కోసి మేకపోతులని దబాయించడాలు.. కల్తీ మాంసం.. బాట్లల్ల చీటింగ్ .. మరో దిక్కు మున్సిపాలిటీ వాళ్లకు, పోలీసులకు, సానిటరీ ఇన్‌స్పెక్టర్లకు.. తూనికలు కొలతలోల్లకు మామూళ్లు.. లంచాలు నజ్‌రానాలు.. ఎన్నో తతంగాలు.
చిన్నప్పటినుండి అనుభవాలన్నీ వెరసి బతకడం అంత సులువేమీ కాదు అని చెప్పిన పాఠం.
నిర్మల పక్కనే ఉన్న తన స్మార్ట్ మొబైల్‌ను తాకింది చేతితో.. తెరపై టైం ప్రత్యక్షమైంది. ఏడూ యాభై నిముషాలు.
టచ్ స్క్రీన్.. టచ్ స్కిన్.. నవ్వుకుంది నిర్మల.

తల్లి జమీలాబాయికి కేన్సర్.. కొలోన్ కేన్సర్ అని రెండు నెలల క్రితమే తేలింది. ఫోర్త్ స్టేజ్ అన్నడు డాక్టర్. కష్టమే అని తాత్పర్యం. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స. ఇక్కడ లోకల్ దవాఖాన.. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి.. హైదరాబాద్‌కు.. యశోద సికింద్రాబాద్.. ఆంకాలజీ ఫ్లోర్. ఎందరు కేన్సర్ రోగులో.. వందలమంది. ఆరోగ్యశ్రీ అనేది ఒక అంతులేని నిరంతర దోపిడీ పథకం. ప్రజలు ఎంత బాగుపడ్తున్నారోగాని.. దవాఖాన్లూ డాక్టర్లు మాత్రం అతి పచ్చగా విలసిల్లుతున్నారు.
అమ్మ చనిపోవడం ఖాయం అని తేలిపోయింది. కాని మనిషిని చివరి శ్వాసవరకు పీల్చి పిప్పిచేస్తూ డబ్బు దండుకోవాలెగదా ఆరోగ్యశ్రీ కింద. అదే జరుగుతున్నది.. కీమో థెరపీ.. రేడియేషన్.. సకల పరీక్షలు.. స్కానింగ్‌లు.
అందువల్ల ఈ మూడు నెలలుగా.. ప్రతి ఆదివారం.. పండుగరోజులు.. గిరాకీ ఎక్కువగా ఉంటుందనుకున్న రోజుల్లో.. నిర్మల చేస్తున్నది ఎల్లంబజార్ దుకాణం డ్యూటీ.. తలకాయలు, కాళ్లు కాపుడు.. షాప్ నడుపుడు. ఇంటి సభ్యులు.. నాయిన దయానంద్.. అమ్మమ్మ ఈశ్వరమ్మ, తమ్ముడు కిషన్.. అందరిలోనూ గడ్డకట్టిన దుఃఖమే. అమ్మ చచ్చిపోతుంది త్వరలో .. అనేది బహిరంగ రహస్యమైపోయింది ఇంట్లో.
చదువుకో బిడ్డా.. మా లెక్క ఈ మొండీ, పైర్ కాపుడు.. కాల్చుడు వద్దు బిడ్డా అని. తలకాయ కాళ్లు కాపుతే అరవై రూపాయలు ఇప్పుడు.. పది రూపాయలనుండి చూస్తున్నది నిర్మల.
చదువు.. చదువు.. ఇంజినీరింగ్.. బి.టెక్ కంప్యూటర్ సైన్స్.. తర్వాత గేట్.. పి.జి.సెట్.. ఎం.టెక్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లన్నీ.. ఒట్టి బూటకం..అన్నీ ఫీజ్ రీ-ఎంబర్స్‌మెంట్ వ్యాపారం. కాలేజ్‌కు రాని స్టూడెంట్స్.. దొంగలెక్కల అటెండెన్స్.. యూనివర్సిటీలతో కుమ్మక్కు.. బి.సి.. ఎస్.సి, ఎస్.టీ డిపార్ట్‌మెంట్స్‌తో అవగాహన.. అన్నీ పర్సెంటేజ్‌లు. కోట్లకు కోట్లు ప్రజాధనం మిస్ యూజ్.. స్టాఫ్ నాసిరకం.. వాళ్లవి ఫేక్ డిగ్రీలు.. ఫేక్ పి.హెచ్‌డిలు. ఫేక్ తనిఖీలు. విద్యార్థులకు బయోమెట్రిక్ మెషిన్స్ పెడితే క్లోనింగ్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసుకుని వాటిని ప్రతిరోజూ ఉపయోగిస్తూ.. మేనేజ్‌మెంట్స్ చీటింగ్.

ఈ దేశం నరనరాన అవినీతి.
చదువురాని వాళ్లకంటే.. బాగా చదువుకున్న విద్యావంతులతోనే భయంకరమైన దోపిడి.
ఎట్లా.. ఎట్లా.. ఈ దోపిడీ వ్యవస్థను ఎట్లా ప్రక్షాళన చేయాలె. రాజకీయ నాయకుల్లో అవినీతి.. ప్రతివాడు కోతులకంటే హీనంగా గోడలు దూకుతూ పార్టీలను మార్చడమే. రాష్ట్రమేదైనా నీచ రాజకీయాల్తో బహిరంగంగానే శాసనసభ్యులతో క్యాంప్‌లు నిర్వహిస్తూ జస్ట్ పర్చేజ్ ..యువత క్రికెట్ మానియా.. ఇంటర్‌నెట్ పిచ్చి.. బూతు సినిమాల వ్యసనం.. ఒక్క మొబైల్ తెరిస్తే సకల పోర్నో బరితెగింతలు.. విచ్ఛలవిడి సెక్స్.. హింస.. వావి వరుసలు లేని అరాచకాలు.. ప్రభుత్వాధికారుల అంతులేని దోపిడి.. ప్రతివాడూ లగ్జరీ జీవితాన్ని స్వప్నించేవాడే.. క్విక్ మనీ.. క్విక్ గ్రోత్.. ఓవర్ నైట్.. కోటీశ్వరుడు కావాలన్న దురాశ. ప్రభుత్వాలన్నీ ఒట్టి ప్రేక్షకపాత్ర. నాయకులకు అధికారమే పరమావధి.
అమ్మా వీటిని కాపుతవా అని గొంతొకటి.. పరిచయమున్న కంఠం.. ఎక్కడనో ఇదివరకు విన్నట్టు.
తలెత్తింది నిర్మల.. కలెక్టర్ జయరాముడు ఎదురుగా.. అతి సాధారణంగా.. జనంలో కలిసిపోయి.. అతి నిరాడంబర జీవితాన్ని గడపడంలో పరమానందాన్ని పొందే మోస్ట్ సింపుల్ హ్యూమన్ బీయింగ్ జయరాముడు. అతని చేతిలో కొమ్ములు తిరిగిన ఒక పొట్టేల్ తలకాయ, నాలుగు బలిష్టమైన కాళ్లు ఉన్నై. చటుక్కున అందుకుంది నిర్మల.
థాంక్యూ.. ఎంతసేపైద్దమ్మా

ఒక్క పావుగంట సర్..
అప్పటిదాకా దట్టంగా అలుముకుని ఉన్న పొగమంచు కొద్దికొద్దిగా పల్చబడి విచ్చుకుంటున్నది.
అనేక సందర్భాల్లో.. తెలంగాణ మలి ఉద్యమకాలంలో.. అనేక ధర్నాలు, రైల్ రోకోలు.. బంద్‌లు, ప్రతిఘటనలు.. అన్నింటిలోనూ.. అధికారిక ప్రతిస్పందనల్లోనూ నిర్మల గమనించింది జయరాముడు గారిని. ఆసక్తికరమైన ఆయన నిరాడంబర సమర్థతను గురించి విన్న నిర్మల ఎన్నోసార్లు ఈ దేశంలో ఇటువంటి అధికారులు ఒక్క యాభైశాతం మంది ఉన్నా ఎంత బాగుండును అనుకుంది.
బాపూ.. ఈ సార్‌వి తొందరగా చేయవే అని పొటేల్ తల ముక్కులోకి ఒక ఇనుపరాడ్‌ను గుచ్చి ముందున్న కర్రమొద్దుపై బలంగా గుద్ది.. తండ్రికి అందించింది.
అతను దాన్ని సర్ది.. బ్లోయర్ మంటను కొద్దిగా పెంచి.. నోట్లోని జర్దా పాన్‌ను దవడ మార్చుకున్నాడు. బ్లోయర్ ధ్వని లయాత్మకంగా వినవస్తూనే ఉంది.
పొగమంచు దాదాపు తగ్గిపోయి.. మబ్బులను చీల్చుకుని వస్తున్న సూర్యుని కిరణాలు పడ్తూండగా.. ఆ పరిసరమంతా బంగరురంగుతో మెరుస్తున్నది. పాపం సూర్యునికేమిటి తేడా.. అది కబేళా ఐనా.. కనకదుర్గమైనా.. అవే స్వర్ణ కిరణాలు.. అదే దయ మానవాళిపై.

జయరాముడు.. ఆ పొగచూరిన, మసిపట్టిన ఇరుకు దుకాణంలోకి అలా అలవోకగా చూస్తూ ఉండిపోయాడు పరిసరాలను గమనిస్తూ.
ఆశ్చర్యపోయాడు.. ఎదురుగా గోడకు ఉన్న ఒక చెక్క ర్యాక్‌లో కొన్ని పుస్తకాలున్నాయి. ఒకటి గతరాత్రే అతను చదివిన సేపియన్స్ పుస్తకం. యువల్ నోహ్ హరారీ రాసిన మానవజాతి సంగ్రహ చరిత్ర. ఇంకొకటి.. డేనియల్ గోల్మన్ రాసిన ఆసక్తికర పుస్తకం ఎమోషనల్ ఇంటెల్లిజెన్స్ . అటు పక్కనేమో బాగా పాతగా.. పొగచూరినట్టున్న అట్టలతో భగవద్గీత.. టీకా తాత్పర్యం . అక్షరాలు మాసిపోయినై.
మీ నాయిన ఆ భగవద్గీతను చదువుతడా
అదే ఆయనను బతికించేది.. ఒక వేయిసార్లు చదువచ్చు
జయరాముడు చటుక్కున ఒక రకమైన మైకంలో ఉన్న మనిషిలా బ్లోయర్‌ను తిప్పుతూ మంటలోకి తదేకంగా చూస్తున్న దయానంద్‌వైపు చూశాడు.
జ్ఞానదాహం.. ఎవరి సొత్తు .. వాల్మీకి జ్ఞాపకమొచ్చాడతనికి ఎందుకో.
సరిగా ఆ క్షణమే జయరామునికి కొన్ని జ్ఞాపకాలు కురుస్తున్న చినుకుల్లా మదిలో వర్షించాయి.
ఆ రోజు.. జెఎన్‌టియు.. హైదరాబాద్ .. స్టూడెంట్స్ ఫీడ్ బ్యాక్ మీటింగ్‌లో.. ఇదే నిర్మల.. చాలా ధైర్యంగా.. శాస్త్రీయంగా మాట్లాడింది. మీరు ఇంజినీరింగ్ కాలేజీల చేతుల్లో తొత్తులు సార్. ఇన్స్‌పెక్షన్‌కు వస్తున్నట్టు రెండ్రోజుల ముందు చెప్పి వస్తే.. ఆ గ్యాప్‌లో సర్దుకుని అన్నీ మీ ముందు చూపిస్తారు.. స్టాఫ్‌ను కూలికి పట్టుకొచ్చి ముందు నిలబెడ్తారు. సడెన్‌గా చేయండి తనిఖీలను.. అప్పుడు బయటపడ్తుంది బండారం.. మీరు ఇంజినీరింగ్ కాలేజ్‌ల పేరుతో దేనికీ పనికిరాని మానవ చెత్తను తయారు చేస్తున్నారు లక్షలకొద్దీ గడగడా చెప్పుకుపోయింది వందల నిజాలను..లోపాలను.

అది పూర్తిగా నిజం.
తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు పోలీసుల లాఠీ దెబ్బలు తిని.. ఈ నిర్మల అరెస్ట్ అయి లాకప్ కావడం తెలుసు జయరాముడుకు.
ఒకరోజు.. ఒక వందమంది యువతీ యువకులను వెంట తీసుకుని వచ్చింది ఈ నిర్మల కలెక్టరేట్‌కు. కనీసం ఒక అరగంట సమయం కావాలని ముందే అడిగి తీసుకుని వచ్చింది. ఒక ఐదుగురు సభ్యులను అనుమతించాడు లోపలికి జయరాముడు.
నిర్మల సంఘం పేరు DOG
చెప్పమ్మా అని ప్రశాంతంగా అడిగినప్పుడు ఆమె చెప్పిన పరిష్కారాలను విని ఆశ్చర్యపోయాడు తను.
సార్.. ఈ దేశం మొత్తం నీతి నియమాలు లేని దుష్ట రాజకీయ నాయకుల చేతుల్లోనూ, తెరవెనుక ఉండి శాసించే కాంట్రాక్టర్ల చేతుల్లోనూ పూర్తిగా బందీ అయి ఉంది సార్. ప్రతిపనినీ తమ కాంట్రాక్టర్లకు ఇచ్చి కమీషన్లు దండుకునే వాళ్లు రాజకీయ నాయకులైతే.. లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లతో పాటు.. రోడ్లనూ, భవనాలనూ, ఫ్యాక్టరీలనూ, ప్రజలకవసరమైన సకల సదుపాయాలనూ సమకూర్చే వ్యవస్థలన్నీ ఈ కాంట్రాక్టర్ల చేతుల్లోనే కూరుకుపోయి ఉన్నాయి. వాళ్లు కమీషన్లు చెల్లిస్తూ.. నాసిరకపు పనులతో మమ అనిపిస్తూ.. దేశాన్ని దోపీడీ చేస్తూనే ప్రజలకు భద్రత లేకుండా చేస్తూ.. ఒక భూమిపుండువంటి సమాజాన్ని తయారు చేస్తున్నారు. దీన్ని చెక్ చేసే వ్యవస్థే పూర్తిగా కరువైంది. ఇప్పుడు మీవంటి అధికారి సహకరిస్తే.. యువకులుగా మేము ఈ కేన్సర్ లాంటి అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం సర్. డాగ్ అంటే కుక్క సార్.. DOG అన్న ఈ మూడక్షరాలను తిరగేస్తే.. అది GOD గాడ్ ఔతుంది సర్. మీకు ఒక model గురించి చెబుతాం సర్.. మాది లక్ష్మీపురం ఏరియా. మా దగ్గర ఆరు ప్రాజెక్ట్ లు నడుస్తున్నాయి. ఒకటి మూడు కిలొమీటర్ల రోడ్డు. దాని ఎస్టిమేషన్ పదిహేను కోట్లు. ట్వంటీఫైవ్ పర్సంట్ ఎక్సెస్. తెలుసు మాకు. పని నాసిరకంగా జరుగుతున్నది. ఇప్పుడు .. మేము ప్రతిదినం ఒక బ్యాచ్ వెనుక బ్యాచ్.. కాంట్రాక్టర్ నిర్మించవలసిన రోడ్డు ప్రమాణాలను ఆ పని పూర్తయే వరకు ప్రతిరోజూ చెక్ చేస్తాం. భారత పౌరులుగా మాకు ఆ హక్కు ఉంది. అటు పక్కన ఒక ఫ్లై ఓవర్ కడుతున్నారు. దాని విలువ పన్నెండు కోట్లు. మనం మౌనంగా ఉంటే.. అది వాడు కట్టిన నాలుగు నెలలకే కూలిపోతుంది. మేము మా డాగ్ సంఘంలో ఉన్న రిటైర్డ్ ఇంజినీర్స్ తో టైం టు టైం చెక్ చేయిస్తాం ప్రమాణాలను.. అట్లాగే ఒక చెరువు.. పదికోట్లతో.. దాన్నీ ఫార్స్‌గానే చేస్తారు. మేము దాన్నికూడా కాపలా కుక్కలా అడుగడుగూ చెక్ చేస్తూ.. మా ప్రజాధనాన్ని కాపాడుకుంటాం. ఐతే.. ఈ మాప్రవేశంతో మీకు రాజకీయ ప్రతిఘటన ఎదురౌతుంది. మీరు.. ఒక ఆదర్శవాదిగా.. సామాజిక స్పృహ ఉన్న అధికారిగా.. మాకు మీ చేయూతనివ్వండి చాలు.. గీకిన అగ్గిపుల్లలా మేము ఎట్లా విజృంభించి ఈ వ్యవస్థకు అగ్నిచికిత్సను చేస్తామో.. చూడండి...అట్లా గుక్క తిప్పుకోకుండా అరగంట చెప్పుకుపోయింది నిర్మల ఆ రోజు.
జయరాముడు ఉబ్బితబ్బిబ్బై పొంగిపోయాడు.. తను ఊహిస్తున్న కొత్త యువతరం డాగ్ పేరుతో సర్వైలెన్స్ వ్యవస్థగా ఆవిర్భవించినందుకు.

ఆ నిర్మల.. ఈ నిర్మలేనా.
ఒట్టి శుద్ధమైన, సారవంతమైన బురదలోనుండి.. ఎర్రని సూర్యకాంతితో కమలం వికసిస్తున్నదా.
అపరబ్రహ్మలా .. కొత్త సృష్టి ఈ యువతితో ఆరంభమౌతుందా.
ఏమో.. ఈ శాస్త్రీయ అవగాహనతో గనుక అడుగు ముందుకు వేస్తే.. మార్పు అనేది సంభవమేకదా.
జయరాముడు నిర్మల ముఖంలోకి ఆశగా చూస్తూనే ఉండిపోయాడు. బురదలోనుండి పుట్టిన కమలమేగదా బ్రహ్మపీఠం.
ఆమె వెనుక ఎమోషనల్ ఇంటెల్లిజెన్స్ పుస్తకం కనబడుతున్నదతనికి. అటువేపు భగవద్గీతను ఔపోసన పట్టిన దయానంద్ రగులుతున్న నిప్పుల్లోనుండి వెలువడ్తున్న సన్నని మంటలోకి చూస్తున్నాడు యోగిలా.
ఉదయం నుండి దట్టంగా ఉన్న పొగమంచు ఎప్పుడో కరిగి విడిపోయింది.

290
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles