కొత్తతరహా ఫర్నీచర్ సామ్రాజ్యంలో రారాజు హరీష్ మెహతా


Sun,August 11, 2019 02:22 AM

Farnichar
ఉన్నత చదువులు చదివిన వారు మాత్రమే ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ విజయవంతమవ్వాలని లేదు. చదవు మధ్యలోనే మానేసినవాళ్లూ అనేక రంగాల్లో విజయపథాన దూసుకుపోతున్నారు. హరీష్ మెహతా సరిగ్గా ఈ కోవకు చెందిన వారే. చదివింది తక్కువే అయినా కార్డ్ బోర్డ్ ఫర్నీచర్ వ్యాపారంలో అడుగుపెట్టి తానేంటో నిరూపించుకున్నారు. సరికొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టి ఫర్నీచర్ సామ్రాజ్యంలో రారాజుగా నిలుస్తున్నారు.

పర్యావరణ హితం కోసం...

పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా చెట్లు మాత్రం పెరగడం లేదు. అడవుల నిరికివేత మూలంగా పర్యావరణ పరంగా ఇప్పటికే తగిన మూల్యం చెల్లించుకుంటున్నాం. కలప, ప్లాస్టిక్ వాడకం కూడా మరో ముప్పుగా పరిణమించింది. అందుకే ఈ రెండింటికీ ప్రత్యామ్నాయంగా కార్డుబోర్డును ఉపయోగించి ఫర్నీచర్ వ్యాపారాన్ని ప్రారంభించాడు ముంబైకి చెందిన హరీష్ మెహతా. తనదైన శైలిలో వస్తువుల్ని తయారుచేసి మార్కెట్‌లో మంచి బ్రాండ్ క్రియేట్ చేశాడు. కార్డ్‌బోర్డుతో రూపొందించే వస్తువులు వంగిపోవడం, కుంగిపోవడం వంటివి వుండవు. తేలిగ్గా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. పర్యావరణానికి ఈ ఉత్పత్తులతో ఎటువంటి ముప్పు వాటిల్లదు. అవసరమైతే రీసైకిల్ కూడా చేయొచ్చు.
Farnichar1

పేపర్ షేపర్ మొదలయిందిలా...

గుజరాతీ కుటుంబానికి చెందిన హరీష్ చదువు మధ్యలోనే మానేశారు. ఆయన తండ్రి ప్యాకేజింగ్ వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలో వచ్చే లాభాలు, నష్టాలను గురించి పూర్తిగా అధ్యయనం చేశారు. ఇందులో పాఠాలు నేర్చుకున్నారు. చదువుకుంటే జ్ఞానం మాత్రమే వస్తుంది. కానీ తండ్రి చేసే వ్యాపారంలో మెహతాకు ప్రయోగాత్మకంగా నిర్ణయాలు తీసుకునే శక్తి వచ్చింది. అలా హరీష్‌కు థీయరీతోపాటు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్ కూడా వచ్చింది. తాను చేసే బిజినెస్‌తో అన్ని వర్గాల వారికి సేవలందించాలనుకున్నారు. ప్లాస్టిక్, కలప ఫర్నీచర్‌కు బదులుగా లైట్‌వెయిట్, పోర్టబుల్, డ్యూరబుల్‌తోపాటు ట్రెండీగా ఉండేలా కార్డుబోర్డు ఫర్నీచర్‌ను ప్లాన్ చేశారు. పేపర్ షేపర్ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. ఆలోచన బాగానే ఉంది కానీ అట్టపెట్టెలతో చేసిన ఫర్నీచర్ నాణ్యతను ఎంతవరకు విశ్వసిస్తారు అనే సందేహం వచ్చింది. ఆ ఫర్నీచర్ క్వాలిటీ, దృఢత్వాన్ని తెలియజేసేలా సోషల్ మీడియాలో ఓ ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో జనాలు కార్డుబోర్డుతో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు క్యూలో నిలబడ్డారు. కొద్దిరోజులకు ఈ- కామర్స్‌లో అమ్మకాలు మొదలు పెట్టారు. అప్పటి నుంచి వెనకకు తిరిగి చూసే పనిలేకుండా మెహతా బిజినెస్ వేగం పుంజుకున్నది.
Farnichar2

సరికొత్త ఉత్పత్తులు

ఇల్లు, ఆఫీసుల్లో ఉండే ప్రతి ఫర్నీచర్ ఐటమ్‌ను సరికొత్తగా తయారు చేయడం మొదలు పెట్టారు. మంచం, కుర్చీలు, డైనింగ్ టేబుల్ వంటి వస్తువులను సులువుగా మోసుకెళ్లేలా తయారు చేశారు. అవసరాన్ని బట్టి వస్తువులను ఫోల్డ్ చేసేలా రూపొందించడంతో అందరికీ పేపర్ షేపర్ ఉత్పత్తులు నచ్చేశాయి. వృద్ధులు, చిన్నారుల అవసరాలకు తగిన విధంగా ఫర్నీచర్‌ను అందించారు. మార్కెట్‌లో లభించే ఉడెన్ ఫర్నీచర్‌తో పోలిస్తే హరీష్ అందించే ప్రొడక్ట్స్ ధర కూడా తక్కువే. మన్నిక విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. చిన్నారుల ఆట వస్తువులను కార్డుబోర్డుతో తయారు చేశారు. వీటితో ఆడుకునే సమయంలో పెద్దగా బరువు ఉండవు కాబట్టి పిల్లలకు ఎటువంటి ప్రమాదం ఉండదు.
Farnichar3

పోర్టబుల్ టాయిలెట్స్

మన దేశంలో మరుగుదోడ్ల సమస్య అంతా ఇంతా కాదు. సుదూర ప్రయాణాల్లో సరైన సౌకర్యాలు లేక జనాలు ఇబ్బందులు పడుతుంటారు. దానిని దృష్టిలో ఉంచుకుని హరీష్ ముడతల కార్డు బోర్డుతోనే పోర్టబుల్ టాయిలెట్స్ తయారు చేశారు. వీటిని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. మడత పెట్టొచ్చు. వృద్ధులు, దివ్యాంగులు జర్నీ చేసే సమయంలో వాటిని ఉపయోగించవచ్చు. మెహతా చేసే వినూత్న ప్రయోగాలు జనాలకు అర్థమయ్యాయి. పర్యావరణ హితంతోపాటు మన్నికైన వస్తువులను అందించడంతో బజాజ్, రేమండ్, గినీ అండ్ జానీ వంటి పెద్ద పెద్ద సంస్థలు సైతం పేపర్ షేపర్‌కు ైక్లెంట్లుగా మారాయి. మూడేండ్లలో పేపర్ షేపర్ కంపెనీని రూ. 40 కోట్ల టర్నోవర్‌కు తీసుకెళ్లేందుకు హరీష్ శ్రమిస్తున్నారు.

217
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles