శిక్షణ


Sun,August 11, 2019 01:00 AM

Sikshana
- మల్లాది వెంకట కృష్ణమూర్తిలె

న్ చంపడం గురించి, మరణం గురించి ఆలోచిస్తున్నాడు. అతను అరుదుగా వాటి గురించి ఆలోచిస్తాడు.
లెన్ మేపిల్ లేన్‌లో గత మూడు నెలలుగా జాగింగ్ చేస్తున్నాడు. ఆ ఉదయం జాగింగ్ చేస్తూ ఆ ఏడాది తన ఆదాయం గురించి ఆలోచిస్తున్నాడు. లక్ష డాలర్లు దాటవచ్చు. ముప్ఫై ఆరో ఏట మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు. ఈసారి ఎలాంటి ఇబ్బందీ ఉండదని అతని నమ్మకం. ఆ వీధి పూర్తవగానే ఓల్డ్ క్వారీ రోడ్‌లోకి మళ్ళాడు.
కనెక్టికట్ రాష్ర్టంలోని బ్రిమ్‌స్టోన్. అక్కడ చాలా తక్కువ ఇండ్లున్నాయి. పొలాలు, రాళ్లతో నిర్మించిన కంచెలు, కొత్తగా పాతిన చెట్లు కనిపిస్తున్నాయి. అతను పావు గంటనించి జాగింగ్ చేస్తూ ఓ మైలు దూరం పరిగెత్తాడు. ఐనా అలసట లేదు.
తన వెనుక నించి వినపడే అడుగుల చప్పుడుని లెన్ పట్టించుకోలేదు. మరో ఆదివారం జాగరై ఉంటాడు అనుకున్నాడు. సాధారణంగా వాళ్ళు చేత్తో సైగ చేసి, చిన్నగా నవ్వి వెళ్ళిపోతారు.
బార్నే లెన్స్‌ఫోర్డ్? పక్కనించి మాటలు వినపడ్డాయి.

ఎవరికీ ఆ పేరు తెలీదు! తన భార్యలానే అదీ ఎప్పుడో మరణించింది.
మిమ్మల్ని ఇలా కలుసుకోవడం కాకతాళీయం పక్కనే పరిగెత్తే వ్యక్తి చెప్పాడు.
లెన్ పరిగెత్తుతూనే తల తిప్పి తన వంక నవ్వుతూ చూసే వ్యక్తితో చెప్పాడు.
క్షమించండి. మీరు పొరబడ్డారు.
బార్నే... నేను లార్క్. ఓ మీసం, ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీలతో నువ్వు నన్ను మూర్ఖుడ్ని చేయలేవు.
లార్క్ అతనికన్నా మూడేండ్లు చిన్న. నుదుట రుమాలు కట్టుకున్న అతను సన్నగా ఉన్నాడు. ఇద్దరూ పక్కపక్కనే జాగింగ్ చేయసాగారు. తర్వాత లెన్ చెప్పాడు.
నువ్వు కనెక్టికట్‌లో ఉన్నావని నాకు తెలీదు.
స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ పత్రికలో నా మీద వ్యాసం చదువలేదా? నేను దేశమంతా తిరుగుతూంటాను.
చదువలేదు.

నువ్వు చూసావని పందెం. నాకు ఖ్యాతి వచ్చి నీకు రాకపోవడం మిత్రుడిగా నువ్వు భరించలేవు లార్క్ నవ్వి చెప్పాడు.
ఇరుగు పొరుగు తప్పించి మనం మిత్రులం కాదు లార్క్.
నేను నీ స్నేహితుడ్ని. నీకు, డేనాకి కూడా.
లెన్‌కి ఇప్పుడు కొంత ఆయాసం ఆరంభమైంది. అయినా ఆగదలచుకోలేదు.
బ్రిమ్‌స్టోన్‌కి నువ్వు నన్ను వెంటాడుతూ వచ్చావా?
కాదు. కనెక్టికట్‌కి నేను రావడానికి ప్రధాన కారణం జాగ్.
అర్థం కాలేదు.

నువ్వు మంచి నటుడివి కావు లెన్. నువ్వు నా పుస్తకం గురించి తప్పనిసరిగా విన్నావు. గత మూడున్నర నెలలుగా ది న్యూయార్క్ టైమ్స్‌లో అది నంబర్‌వన్ బెస్ట్ సెల్లర్. టామనీస్ లేన్‌లోని నీ ఇంటికి టైమ్స్ మేగజైన్ వస్తుందని నాకు తెలుసు. ఆ ఇంటి ఖరీదు కనీసం రెండు లక్షల డాలర్లు ఉంటుంది. అంత ఇంటిని ఎలా సంపాదించావు? లార్క్ అడిగాడు.
అంటే, నేను ఎక్కడ ఉంటున్నానో నీకు తెలుసన్నమాట.
నా మాటలని బట్టి తెలిసే ఉండాలి. భయపడకు బార్నే. నాకు తెలిసింది అధికారులకి తెలీదు. సంవత్సరంన్నర క్రితం నేను, ఈవ్లిన్ విడిపోవడంతో నాకు చెప్పడానికి ఆమెకూడా లేదు. జాగ్‌కి అడ్వాన్స్ వచ్చాక విడిపోయాం. నలభై వేలు ఎడ్వాన్స్‌గా ఇచ్చారు. లార్క్‌లో ఎలాంటి అలసట లేదు. కానీ, లెన్‌కి ఆయాసం పెరుగుతున్నది.
శాన్ ఫెర్నాండోలో మనం పక్కపక్క ఇండ్లలో ఉన్నప్పుడు జాగింగ్ చేసేవాళ్లం. ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు వేటాడి కనుక్కున్నావు? లెన్ అడిగాడు.
మనం కలవడం కేవలం కాకతాళీయం. నిజానికి నేను ఓల్డ్ క్వారీ రోడ్‌లో ఉదయం పనుండి...
నువ్వు నా ఎడ్రస్ ఎలా కనుక్కున్నావు? లెన్ సాధ్యమైనంత మామూలుగా ప్రశ్నించాడు.
నేను తెలివిగల వాడినని నువ్వు ఎప్పుడూ అనుకోలేదు బార్నే. కేలిఫోర్నియాలో నేను ఉడ్‌లేండ్ హిల్స్ అలర్ట్ పత్రికకి గుర్తింపు లేని స్పోర్ట్స్ రైటర్‌గా ఉన్నప్పుడు నువ్వు నటుడివి అవుదామనుకుని నీ భార్య సంపాదనతో...
ఆ వివరాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు లెన్ అడ్డుపడ్డాడు.
ఎన్ని నెలలుగా నువ్వు జాగింగ్ చేస్తున్నావు? కొంత మౌనం తర్వాత చిన్నగా నవ్వి లార్క్ అడిగాడు.
చాలాకాలంగా.

ఈ రూట్లో నువ్వు నెల రోజులుగా జాగింగ్ చేస్తున్నావని నాకు తెలుసు. అంతకు ముందు జాగింగ్ చేసావనుకోను. జాగింగ్ చేసేప్పుడు ఎలా ఊపిరి తీసుకోవాలో నీకు ఇంకా తెలీదు.
ప్రతీ ఉదయం నేనీ దారిలో జాగింగ్ చేస్తానని నీకు ఎలా తెలుసు?
నేను ప్రెస్ రిపోర్టర్‌ని అన్న సంగతి మర్చిపోయావా? నేనీ ప్రాంతానికి నా జాగ్ పుస్తకాన్ని ప్రమోట్ చేయడానికి వచ్చినప్పుడు ఇంటర్‌వ్యూలు చేయడానికి వచ్చిన వాళ్ళని...
కాని నేను ఇక్కడ ఎవరికీ తెలీదు లెన్ ఆయాసపడుతూ చెప్పాడు.
కానీ, నాకు తెలుసు. నీ భార్యని నువ్వు చంపావని కూడా.
నేను డేనాని హత్య చేయలేదని నీకు తెలుసు. అది ప్రమాదవశాత్తు జరిగింది.
నువ్వు ఆమె తలని ఇటుకరాయితో పగులకొట్టావు బార్నే ఇప్పుడు లార్క్ మొహంలో నవ్వు మాయమైంది.
మేం పోట్లాడుకున్నాం. నాకు పుస్తకాల షెల్ఫ్ తగిలింది. మా లివింగ్ రూంలో పుస్తకాల షెల్ఫ్ ఇటుకలతో కట్టిందని నీకు తెలుసు. ఊడిన ఓ ఇటుకని నేను కోపంగా పట్టుకున్నాను. డేనా దానిమీద పడింది. నా మీద డేనా చాలా నిందలు మోపింది.
అవన్నీ నిజం.

సరే. నాకు ఇంకో యువతితో అక్రమ సంబంధం ఉంది. కానీ, నా వ్యాపారంలో పరిచయాలు చాలా ముఖ్యం.
నటుడిగా నువ్వు అలా ఎదగాలని అనుకున్నావా?
నేను ఇంతదాకా కెమెరా ముందుకి వెళ్ళలేదు. డబ్బింగ్ పనే.
నీ కంఠం బావుంటుంది. ఈవ్లిన్ కూడా చాలాసార్లు ఆ మాట అంది. ఆమెతోకూడా నీకు సంబంధం ఉంది కదా? లార్క్ అడిగాడు.
నీ భార్యతోనా? ఎప్పుడూ లేదు.
విడాకులిచ్చాగా. ఉన్నా ఇప్పుడు ఫర్వాలేదు. ఓ నిమిషం ఆగి అలసట తీర్చుకుంటావా?
అవసరం లేదు. పరిగెత్తగలను.
నేను నీ గొంతుని గుర్తుపట్టాను బార్నే.
నేను రెండేండ్ల క్రితం మెక్సికోలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. నా కంఠాన్ని ఎవరైనా గుర్తు పడతారని అనుకోలేదు.
ఇప్పుడు నువ్వు సంవత్సరానికి లక్షదాకా సంపాదిస్తున్నావు కదా? లార్క్ అడిగాడు.
అంత కాదు.

నాకు న్యూయార్క్ టి.విలో మిత్రులు ఉన్నారు. నువ్వు ఎంత సంపాదిస్తున్నావో నాకు తెలుసు.
నీకు నా నించి ఏదైనా కావాలా? ఏం కావాలి? లెన్ ప్రశ్నించాడు.
నాకు అంతా ఉంది. కీర్తి, సంపద. ప్రస్తుతం భార్య లేకపోయినా ఆకర్షణీయమైన గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు లార్క్ చెప్పాడు.
కావాలనే నువ్వు ఇవ్వాళ నేను పరిగెత్తే మార్గంలోకి వచ్చావని నాకు తెలుసు.
కాదు. కాకతాళీయమని ఇందాక చెప్పాగా. నేను ఏడాదికి రెండు లక్షలు సంపాదిస్తున్నాను. ఇంకో ఏభై వేలు చేదు కాదు.
బ్లాక్ మెయిలా? లెన్ కోపంగా అరిచాడు.
బ్లాక్ మెయిల్ హత్యానేరం కంటే కొద్దిగా తక్కువ స్థాయిదే. నువ్వు నీ భార్యని హత్య చేసి పారిపోయావు. నేను పెళ్ళయ్యాక పరాయి స్త్రీ వంక కన్నెత్తి చూడలేదు, కొందరి మీద కోరిక ఉన్నా. వారిలో డేనా ఒకరు. నువ్వామె తల పగులకొట్టి ఇంట్లోని ఏభై వేల డాలర్లతో పారిపోయావు.

నేను ఆమెని చంపాలని అనుకోలేదని ఇందాకే చెప్పాను లెన్ చెప్పాడు.
నాకు ఇష్టమైన వ్యక్తిని నువ్వు చంపావు. అందుకు నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు నేను నిన్ను ఆర్థికంగా, మానసికంగా, ఇంకా ఎలా వీలైతే అలా బాధ పెట్టదలచుకున్నాను.
అది మూర్ఖత్వం.
లెన్ కాలు జారి కింద పడ్డాడు. లార్క్ ఆగి సహాయం కోసం అతనికి చేతిని అందించాడు. లెన్ చేతికి అందిన రాతితో అతన్ని బాదాడు-చాలాసార్లు, రోడ్డుమీద చచ్చిపడ్డాక కూడా. తేరుకున్నాక అతను శవాన్ని లాగుతూ అనుకున్నాడు.
ఇది ప్రమాదవశాత్తు జరిగింది అనుకునేలా కొండమీంచి తోసేసి...
ఇంతలో...
అతనికి పరిగెత్తుకు వచ్చే అడుగుల చప్పుడు వినిపించింది. ఒకరు కాదు. చాలామంది అతనివైపు పరిగెత్తుకు వస్తున్నారు. లెన్ చేతిలోని రక్తసిక్తమైన రాయిని చూసి అంతా ఠక్కున ఆగారు. వాళ్ళ ఒంటిమీది టి.షర్ట్‌ల మీద కెవిన్ లార్క్ ్స మినీ మారథాన్ అనే అక్షరాలు ముద్రించి ఉన్నాయి. లార్క్ అక్కడికి జాగింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి వచ్చాడని ఆ షర్ట్‌లని చూసాక లెన్‌కి అర్థమైంది.
(రాన్ గొలార్ట్ కథకి స్వేచ్ఛానువాదం)

బ్లాక్ మెయిల్ హత్యానేరం
కంటే కొద్దిగా తక్కువ స్థాయిదే. నువ్వు
నీ భార్యని హత్య చేసి పారిపోయావు. నేను పెళ్ళయ్యాక పరాయి స్త్రీ
వంక కన్నెత్తి చూడలేదు, కొందరి
మీద కోరిక ఉన్నా. వారిలో డేనా ఒకరు. నువ్వామె తల పగులకొట్టి ఇంట్లోని
ఏభై వేల డాలర్లతో పారిపోయావు.

615
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles