ప్రేమలు మొలకెత్తే రాఖీలు!


Sun,August 11, 2019 01:10 AM

Rakhi
రాఖీ.. ఓ సెంటిమెంట్. అక్క తమ్ముడికి.. చెల్లె అన్నకు ప్రేమతో కట్టే పేగుబంధపు సెంటిమెంట్. అన్న.. తమ్ముళ్ల క్షేమం కోరుతూ అక్కాచెల్లెండ్లు కట్టే బంధాల బంధనం.. రక్షాబంధనం. ఆగస్టు 15న మనకు ఇండెపెండెన్స్ డేతో పాటు ఇంటింటా రంగుల మెరుపులతో వచ్చే రాకిట్ల పున్నమి సంబురాలు కూడా. రకరకాల రాఖీలు.. రకరకాల డిజైన్లు మాత్రమే కాదు.. వాటి వెనకాల రకరకాల కథలు కూడా ఉంటాయి. ఈ జంట సంబురాల నేపథ్యంలో ఇంటింటా రాఖీ పౌర్ణమి తెచ్చే ప్రేమల పంట విత్తనాలరాఖీల విశేషాలను తెలుపుతూ ఈ ముచ్చటైన జంటకమ్మ మీ కోసం.!!

అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదనే సామెతలోని నిజమెంతో తెలియదు కానీ.. అడిగినా అడగకున్నా పెట్టే చేయి.. అడగాలని.. పిలువాలని ఆశలేకుండా కట్టే చేతులు ఉన్నాయి మన మధ్యలో. ప్రతీ యేడాది ఈ రాకిట్ల పున్నమినాడు వాకిట్ల బంధాల పందిరేసుకొని ప్రేమ అనురాగాల కలబోత మధ్య కనువిందు చేస్తుంటాయి. ఆ కట్టే చేయి రాఖీ కట్టే సోదరిది. పెట్టే చేయి.. కానుకలు పెట్టే సోదరునిది. అన్న దూరంగా ఉన్నా.. ఆహ్వానం అందకున్నా.. తమ్ముడు దగ్గర లేకున్నా.. కబురు చేరకున్నా పరుగు పరుగున వచ్చేస్తారు.. పాత రోజుల్ని గుర్తుచేసుకుంటారు. మనమూ ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ అందమైన రంగులే కాదు.. ఆసక్తి కరమైన కథలూ ఉన్నాయి.
Rakhi1

ఎకో రాఖీ

రాఖీలు ప్లాస్టిక్‌తోగానీ.. రసాయనిక కాగితాలతో గానీ చేసినవి ఉంటాయి. అయితే మరి పర్యావరణం సంగతి ఏంటి? ఆ ఆలోచనలోంచి పుట్టుకొచ్చినవే ఎకో రాఖీస్. ప్రకృతిని రక్షించడమే కాక.. విత్తనాలుగా పెట్టి మొక్కలుగా కూడా పెంచే రాఖీలు ఇప్పటి ట్రెండ్. వెనుకటి రోజుల్లో పెద్దగా రసాయనిక కాగితాలు వాడకుండా సాధారణ రాఖీలే చేసేవారట. అయితే రానురాను ప్లాస్టిక్ వాడకం.. రసాయనాల వాడకం ఎక్కువయి ఎక్కువగా మెరుస్తూ కనిపించేలా రాఖీలను తయారుచేశారు. ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటకొచ్చి ఎకో రాఖీకి జై కొడుతున్నారు.

కార్టూన్ రాఖీ

ఇది దారంతో కట్టిన మెరుపుల పేపరే అయుండొచ్చు. కానీ దీని వెనకాల ఓ గొప్ప భావోద్వేగం దాగి ఉంటుంది. రాఖీ రక్షణకు.. సంఘీభావానికి చిహ్నం. అందుకే రాఖీని విప్పేయరు. దానంతట అది ఊడిపోతేనే తీసేస్తారు. కొందరు సాధారణ రాఖీలకు సై అంటే.. మరికొందరు స్టయిలిష్ థ్రెడ్స్‌తో ఉన్న రాఖీలపై ఆసక్తి కనబరుస్తారు. తమ్ముడికి కట్టే రాఖీ అయితే కార్టూన్‌లతో ఉన్నది ఎంచుకుంటారు. అన్నలకు కట్టేవి అయితే ట్రెడిషనల్ డిజైన్లలో ఉండేవి ఎంచుకుంటున్నారు. అన్న అభయమిచ్చేవాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం పొందేలా.. తమ్ముడు భరోసా ఇచ్చేవాడు కాబట్టి ఆయన ఆదరణ పొందేలా రాఖీ మోడల్స్ అందుబాట్లో ఉంచుతున్నారు.
Rakhi2

బయో క్యూ రాఖీ

విత్తనాలతో పెన్నులు మాత్రమే ఎందుకు చేయాలి? రాఖీలు ఎందుకు చేయొద్దు అన్న ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే బయో క్యూ రాఖీ. దీని రూపకర్త సౌరబ్. అతని చెల్లె ప్రతీ సంవత్సరం రాఖీ కట్టగానే మరుసటి రోజే విప్పేసేవాడు. సౌరబ్ బాల్ పెన్నుల కంపెనీలో పనిచేసే సౌరబ్ కంపెనీ నిబంధనల ప్రకారం చేతికి ఎలాంటి కంకణాలు, దారాలు ఉండకూడదు. దీంతో అక్కడ పని మానేసి బయో క్యూ అనే పర్యావరణహిత స్టేషనరీని ఏర్పాటు చేసి ప్రతీ సంవత్సరం 5-6 లక్షల ప్లాంట్ పెన్సిల్, పెన్స్‌తో పాటు బయో క్యూ రాఖీలు తయారుచేస్తున్నాడు. ఢిల్లీలోని మురికివాడల్లో నివసించే మహిళలకు దీని ద్వారా ఉపాధి కల్పిస్తున్నాడు.

కిట్ అండ్ హెల్ప్ రాఖీ

పర్యావరణ అనుకూలమైన ఒక కిట్ అండ్ హెల్ప్ రాఖీని తులసి విత్తనం, రీసైకిల్ కాగితంతో తయారుచేశారు. దీనిని ఓ కిట్‌లో అందిస్తారు. కిట్‌లో కోకోపీట్, సేంద్రియ ఎరువులు, కోకోపాట్ ప్లాంటర్, ఇన్‌స్ట్రక్షన్ కార్డు ఉంటాయి. 4-6 వారాల్లో ఈ రాఖీ మొలకెత్తుతుంది. సీడ్ పేపర్ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు రోషన్ రాయ్ వీటిని తయారుచేస్తున్నారు. ప్లాంటెడ్ రాఖీల ద్వారా వచ్చిన మొత్తాన్ని బెంగళూరులోని హెన్నూర్ హెచ్‌ఐవీ హోంలో ఉన్న హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు విరాళంగా ఇస్తారు. గత సంవత్సరం 8000 రాఖీలను విక్రయించగా.. ఈ సంవత్సరం 15000 రాఖీలను లక్ష్యంగా పెట్టుకున్నారు.

జెండర్ న్యూట్రల్ రాఖీ

బాబో బాట్వో వ్యవస్థాపకుడు గార్గీ దీనిని తయారుచేస్తున్నారు. మేరీ బహెన్.. మేరీ తాఖత్ పేరుతో సామాజిక అవగాహన కల్పిస్తున్నారు. సోదరులకు మాత్రమే దీనిని ఎందుకు కట్టాలి? మార్పు రావాలి అనేది గార్గీ అభిప్రాయం. దీనిద్వారా ఈ జెండర్ న్యూట్రల్ రాఖీలను తయారుచేస్తున్నారు. మట్టితో తయారుచేసి మిల్లెట్టియా పిన్నెటా, కాసియా ఫిస్టులా విత్తనాలతో నింపి ఎకో ఫ్రెండ్లీ రాఖీలను తయారుచేస్తున్నారు. వీటిని కట్టడానికి సహజమైన పసుపు, బియ్యం పేస్ట్ వంటి సహజరంగుల థ్రెడ్లను ఉపయోగించారు. ప్యాకేజీ కోసం వ్యర్థ బట్టలు, కొబ్బరి పీచు, సోరెల్ ఆకులను ఉపయోగించి కుషన్లుగా తయారుచేశారు.
Rakhi3

19 నాడల రాఖీ

రెడ్ బిక్సా ఒరెల్లా విత్తనాలు, పింక్ థ్రెడ్‌తో చేసిన ఈ రాఖీ ద్వారా సమాజంలో ఉన్న లింగ అంతరాన్ని చెరిపేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ రాఖీ గర్భాశయం ఆకారంలో ఉంటుంది. ముంబైకి చెందిన ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన నవ్లీన్ జ్ఞాపకార్థం ఈ రాఖీని విడుదల చేశారు. నవ్లీన్‌కు పడిన 19 కత్తి పోట్లను ప్రతిబింబించేలా ఈ రాఖీకి 19 నాడలు ఉంటాయి. హమ్ కంజోర్ నహీ అనే సందేశాన్నిస్తూ వేలకొద్ది రాఖీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వీటిని మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన 100 మంది గ్రామీణ మహిళలు తయారుచేస్తున్నారు.

బైస్మితా రాఖీ

క్యాబేజీ విత్తనాలతో ఈ రాఖీని తయారుచేస్తారు. మట్టి, బియ్యం కలిపి కిట్‌గా దీనిని అందిస్తారు. గ్యాడ్జెట్లు విస్తరిస్తుండటం.. రాఖీల్లో పర్యావరణానికి హానిచేసేవి ఉండటం వల్ల మూలాలకు తిరిగి వెళ్లేలా నేటి తరాన్ని ప్రోత్సహించాలని ఈ రకం రాఖీలు రూపొందిస్తున్నారు. తోబుట్టువులకు వీటిని ఇచ్చేటప్పుడు మనోహరమైన బంధాలను ఈ రాఖీలు గుర్తుచేస్తాయట. ఈ రాఖీలను బైస్మితా బ్రాండ్‌తో స్మితా భట్టర్ అందిస్తున్నారు.

అభికా రాఖీ

మట్టితో తయారుచేసిన ఈ రాఖీపై వింకా రోసియా విత్తనాలు పెడతారు. ఇవి మొక్కలుగా మారి సంవత్సరానికి రెండుసార్లు వికసిస్తాయి. అభికా క్రియేషన్స్ వీటిని తయారుచేస్తున్నది. బయోగ్రేడెబుల్ పాట్, మట్టి ప్యాకెట్, ఇన్‌స్ట్రక్షన్స్ మాన్యువల్ కలిపి ఓ కిట్ ద్వారా ఈ రాఖీని అందిస్తారు. వెన్న కాగితంలో ప్యాక్‌చేసి ముడతలు పెట్టిన పెట్టె లోపల ఉంచుతారు. ప్లాస్టిక్‌తో తయారుచేసిన సెల్లోటేప్‌ను కాకుండా బాక్స్‌ను పేపర్‌టేప్‌తో సీల్ చేసి ఈ రాఖీలను మార్కెట్లో
అమ్ముతున్నారు.

ఎంత ధరకు?

ఎకోఫ్రెండ్లీ రాఖీ బాక్స్ (3): రూ. 350
ఎకోఫ్రెండ్లీ క్లాసిక్ కిట్ (1): రూ. 275
ప్లాంటేబుల్ సీడ్ యెల్లో రాఖీ (2): రూ. 298
ప్లాంటేబుల్ సీడ్ ఆరేంజ్ రాఖీ (2): రూ. 298
ఎకోఫ్రెండ్లీ లగ్జరీ రాఖీ కిట్ (2): రూ. 500
ఎకోఫ్రెండ్లీ ప్లాంటేబుల్ సీడ్ రాఖీ కిట్ (2): రూ. 447
అసార్టెడ్ ప్లాంటేబుల్ సీడ్ రాఖీ (1): రూ. 200
హ్యాండ్‌మేడ్ ప్లాంటేబుల్ సీడ్ రాఖీ కిట్ (1): రూ. 224

- దాయి శ్రీశైలం, 8096677035

776
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles