ఒక్కో పర్వతం అధిరోహిస్తూ!


Sun,August 11, 2019 01:17 AM

Mountain
కష్టాలు లేకపోతే విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేం.. పర్వతారోహకుడు తుకారాం జీవితమే దీనికి ఉదాహరణ. ఎక్కడో మారుమూల తండాలో మేకలు కాస్తూ పెరిగిన తుకారాం ఇప్పుడు ప్రపంచం గుర్తించదగ్గ ధీశాలి. ధైర్యంలో ఎవరెస్టంత ఎత్తుకు ఎదిగిన యువకుడు. చిన్నతనం నుంచి చెట్టూ.. పుట్టతో స్నేహం చేసిన అతను పర్వతారోహణలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. విరామం లేదు.. విశ్రాంతి లేదు.. అలుపు అంతకన్నా లేదు. ఒక్కొక్క పర్వతాన్ని వరసబెట్టి ఎక్కుతూ సాహసానికి చిరునామాగా మారుతున్నాడు. తాజాగా మౌంట్ ఎల్‌బ్రోస్ అధిరోహించి మరో రికార్డు సృష్టించాడు.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి తండాకు చెందిన ఆంగోత్ రాందాస్.. ఝుంకు దినసరి కూలీలు. వీరికి నలుగురు కొడుకులు. వారిలో చిన్నవాడు తుకారాం. పేదరికం వల్ల పిల్లల్ని పెద్దగా చదివించలేదు. అయితే తుకారాం తనను చదివించాల్సిందిగా పట్టుబట్టడంతో మెదక్‌లోని ఆశ్రమ పాఠశాలలో చేర్చారు. అక్కడే జీవితంపై ఒక స్పష్టత.. లక్ష్యంపై ఒక అవగాహన ఏర్పడింది. అదే తుకారాంను ఇప్పుడు ఎవరెస్ట్ వంటి ఎత్తయిన పర్వతాలను అధిరోహించేలా చేసింది.

అదరుదైన ఆటగాడు

మెదక్ ఆశ్రమ పాఠశాలలో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తిచేసిన తుకారాం.. మాధ్యమిక విద్యను ఇబ్రహీంపట్నం ప్రతిభ కళాశాలలో చదివాడు. బీఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ఇంటర్‌లో ఎన్‌సీసీపై దృష్టిపెట్టిన తుకారాం మిలటరీలో చేరి సైనికుడిగా దేశానికి సేవ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో స్కౌట్ అండ్ గైడ్స్‌లో రకరకాల శిక్షణ తీసుకున్నాడు. ఇంటర్ చదువుతూనే మల్లకంబలో శిక్షణ తీసుకున్నాడు. అందరూ వెళ్లే దారిలో కాకుండా తానొక ప్రత్యేకమైన దారిలో వెళ్లాలనే ఉద్దేశంతో చాలా తక్కువమందికి ప్రవేశం ఉన్న లంగ్డీ ఆటను ఎంచుకొని దానిపై పట్టు సాధించాడు. రాష్ట్రస్థాయి క్రీడాకారుడిగా లంగ్డీలో మంచి గుర్తింపు సాధించాడు. లంగ్డీ తర్వాత మల్కుందా ఆటపై దృష్టి పెట్టాడు. మల్కుందా అనే పదమే చాలామందికి వింతగా అనిపిస్తుంది. అలాంటి అరుదైన ఆటలో ఆరితేరాడు. ఎన్‌సీసీని ఎంచుకోవడం ద్వారానే ఇలాంటి ఆటల గురించి తెలుసుకున్నాడు. మౌంటెనీర్ కావాలనే లక్ష్యంతో ఉత్తరకాశీలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.
Mountain2

లక్ష్యం ఉంటే సరిపోతుందా?

పర్వతారోహకుడు కావాలనుకున్నాడు. ఎన్‌సీసీ శిక్షణ ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ.. పేదరికం అడ్డొచ్చి వెక్కిరించింది. ఇక ఆగిపోదాం అనుకున్నాడు. కానీ రాత్రిళ్లు నిద్రపట్టక.. పగలు ఆకలికాక.. మనసు మనసులో లేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు తుకారాం. ఆ సమయంలో మల్లి మస్తాన్‌రావు లాంటి విజయగాథలు మేల్కొలిపాయి. లక్ష్యం ఉండడమే కాదు.. దాన్నెలా సాధించాలి? సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? అనేది లక్ష్యంగా కన్నా ముఖ్యం అని ధైర్యం తెచ్చుకున్నాడు. టార్గెట్ రీచయ్యేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి? లక్ష్యాన్ని చేరాలంటే తన నైపుణ్యం సరిపోతుందా? తర్పీదు పొందాలా? అనేవి విశ్లేషించుకున్నాడు. ఆ ఫార్ములానే ఫాలో అవుతూ పర్వతాలపై విజయ పతాకాలు ఎగురవేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితులు అడ్డుపడుతున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతున్నాడు.

మౌంట్ ఎల్‌బ్రోస్

రష్యాలోని 18,510 ఫీట్ల ఎత్తయిన ఎల్‌బ్రోస్ పర్వతాన్ని తన సాహస యాత్రతో అధిరోహించి ఔరా అనిపించాడు తుకారం. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనేది తన విజయ పరంపరతో నిరూపిస్తున్నాడు అతను. అతని విజయం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని ఏడు ఖండాలలో అత్యంత ఎత్తయిన పర్వతాలను అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్న తుకారాం ఇప్పటికే దక్షాణాఫ్రికాలోని కిలిమంజారో, ఆసియాలోని ఎవరెస్టు పర్వతాలను అధిరోహించాడు. తాజాగా ఎల్‌బ్రోస్ పర్వతాన్ని సైతం విజయవంతంగా అధిరోహించడంతో ఇక ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఖండాలలోని ఎత్తయిన పర్వతాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఉత్తర కాశీలో శిక్షణ

ఎవరెస్ట్ ఎక్కాలంటే బేసిక్ కోర్స్ చేసి ఉండాలి. దీనిని బీఎంసీ అంటారు. జమ్మూ కశ్మీర్లో ఇది ఉంటుంది. బీఎంసీ ద్వారా సర్టిఫికేట్ అందుకున్న వారిలో దక్షిణభారతం నుంచి తొలి యువకుడు తుకారాం కావడం విశేషం. మంచులో శిక్షణ.. వెయిట్ రన్నింగ్.. పర్వతారోహణ సామర్థ్యాన్ని బట్టి తుకారాంకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం బెస్ట్ టెక్నిక్ అవార్డు ఇచ్చింది కూడా. ఇక్కడ శిక్షణ పొందిన అనంతరం ఎవరెస్ట్ ఎక్కాలంటే మూడు ఎత్తయిన పర్వతాలు అధిరోహించి ఉండాలి. తుకారాం ఈ అర్హత కూడా సాధించాడు. సమర్థ పర్వతారోహకులుగా ఎదిగేందుకు ప్రోత్సాహాన్నిచ్చే అడ్వెంచర్ క్లబ్ అతని ప్రతిభను గుర్తించింది. ఉత్తర కాశీలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో శిక్షణ పొంది ఒంటరిగా ఎవరెస్ట్ ఎక్కిన తెలంగాణ తొలి గిరిజన యువకుడిగా తుకారాం రికార్డు సృష్టించాడు.
Mountain3

స్టాక్ కాంగ్రీ

హిమాలయాల్లోని స్టాక్ శ్రేణిలో 20,580 అడుగుల ఎత్తున్న పర్వతం స్టాక్కాంగ్రి. పర్వతారోహణ వృత్తిగా.. అభిరుచిగా ఎక్కేవాళ్లకు ఇదే అత్యంత ఎత్తయిన పర్వతం. ఒక్కోసారి అనుభవమున్నవాళ్లకూ ఈ పర్వతం ప్రమాదకర వాతావరణ పరిస్థితుల్ని కల్పిస్తూ సవాలు విసురుతుంటుంది. చుట్టూ మంచు కప్పేసుకొని ఉంటుంది. శిఖరాలను చూస్తుంటే వాటిని మేఘాలు భస్మధూళితో అభిషేకిస్తున్నాయా అనిపించేలా ఉంటాయి. అలాంటి పర్వతాన్ని శ్రమించి 2017 జూలై 15వ తేదీన అధిరోహించాడు తుకారాం.

రుదుగైరా

మౌంట్ రుదుగైరా ఉత్తరాఖండ్‌లొ ఉంది. ఇది ఎక్కాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జీవితం తలకిందులయ్యే పరిస్థితి. ఒకరకంగా ఇది జీవితంతో సాహసం. అలాంటిది తుకారాం రుదుగైరా ఎక్కి మనదేశ జెండాను రెపరెపలాడించాడు. 2017 జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా పర్యాటక శాఖ సహకారంతో 8మంది బృందం రుదుగైరాను అధిరోహించేందుకు వెళ్లారు. వారిలో తుకారాం ఒక్కడే రుదుగైరా మొత్తం ఎక్కాడు. రుదుగైరా ఎత్తు 5,819 మీటర్లు. తుకారాం ప్రతిభను మెచ్చిన సంస్థలు.. సంఘాలు.. శ్రేయోభిలతో పాటు తుకారాంకు ఏదో ఒక రకంగా ప్రోత్సాహమందిస్తూ వచ్చారు. ఒక్కో పర్వతాన్ని అధిరోహిస్తున్న తుకారాంను సత్కారాలు.. సన్మానాలు ఏర్పాటు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు.

నార్బు

2016 జూన్ 2న మనమంతా రాష్ర్టావిర్భావ సంబురాలు జరుకొన్నాడు. అదే రోజున హిమాచల్ ప్రదేశ్‌లోని నార్బు పర్వతం అంచుల్లో ఉదయం 8.30 గంటలకు భారత జెండాను రెపరెపలాడించింది ఓ పర్వతారోహక బృందం. తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో నార్బో పర్వతాన్ని అధిరోహించిన ఆ బృందం ముఖ్యుల్లో తుకారాం ఒకడు. భూమికి 5,226 మీటర్ల ఎత్తులో ఉన్న నార్బో పర్వతారోహణ ప్రారంభించి రాత్రికల్లా ఫైనల్ సమ్మిట్లో పర్వత శిఖరానికి చేరుకున్నారు. కేవలం పర్వతాలు ఎక్కడాన్ని.. నదులు ఈదడాన్ని నేర్చుకోవడం ఈ కార్యక్రమాల లక్ష్యం కాదు. సమస్యల్ని అధిగమించేందుకు కావాల్సిన సాహసాన్ని, నాయకత్వ లక్షణాల్ని దేశ సమైక్యతా భావాన్ని ప్రకృతితో సహజీవనాన్ని పెంపొందించడం వీటి పరమార్థం అంటూ నార్బో నుంచి సందేశమిచ్చాడు పర్వతారోహకుడు ఆంగోత్ తుకారాం.

2015 అక్టోబర్‌లో ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్వతారోహణకు సెలక్షన్స్ జరగ్గా నేపాల్, పోలాండ్, ఇండియాకు చెందిన పర్వతారోహణ ఆసక్తిపరులు హాజరయ్యారు. ఆబ్స్రికల్ రేస్.. క్రాస్ కంట్రీ.. స్పోర్స్ ైక్లెంబింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నైపుణ్యం ఉన్న తుకారాం దీంట్లో ఎంపికయ్యాడు. ఆసక్తికి తగ్గట్టు శ్రమిస్తూ అడ్వెంచర్ క్లబ్ నుంచి మంచిమార్కులు కొట్టేశాడు. అలా సాధారణంగా ప్రారంభమైన అతని ప్రస్థానం నేడు ఉత్తమ మౌంటెనీర్ వరకు తీసుకెళ్లింది. తుకారాం హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ వారిచే తెలంగాణ యంగెస్ట్ మౌంటెనీర్‌గా పురస్కారం అందుకున్నాడు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన సందర్భంగా గవర్నర్ ద్వారా అభినందనలు పొందాడు.
Mountain1

ఎవరెస్ట్ అధిరోహణ

నాలుగేండ్ల ప్రయత్నం ఫలించింది. కష్టాలెన్ని ఎదురైనా పర్వతారోహణ అంటే ఇష్టంతో ఒంటరి పోరాటం చేసి విజయాన్ని పొందిన గిరిజన యువకుడు తుకారాం. మే 22న ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు(8,848మీటర్లు) శిఖరాన్ని అత్యంత సాహసంతో అధిరోహించి తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. ఏప్రిల్ 1వ తేదీ 2019 సాహసయాత్రకు బయల్దేరి ఏప్రిల్ 8 నుంచి ట్రెక్కింగ్ మొదలుపెట్టాడు. నాగార్జున పీక్ ఎక్కి.. ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ చేరుకున్నాడు. 22వ తేదీ ఉదయం 8.59 గంటలకు ఎవరెస్ట్ అధిరోహించి సమ్మిట్ పూర్తిచేశాడు. వాతావరణం సహకరించకపోవడం.. మంచు తుఫాన్లు రావడం.. తన వెంట వచ్చినవారిలో ముగ్గురు తన ముందే చనిపోవడం తుకారాంను కలచివేశాయి. కానీ వర్షమొస్తుంటే పక్షులన్నీ గూట్లోకి వెళ్లి దాక్కుంటాయి. కానీ.. గద్ద మాత్రం గూట్లోకి వెళ్లి దాక్కోదు. వానకు అందనంత దూరాలకు వెళ్తూ మేఘాలపైన ఎగురుతూ ఉంటుంది. ఆంగోత్ తుకారాం అంతే. క్లిష్టమైన దక్షిణమార్గం గుండా వెళ్లి భారతీయ పతాకాన్ని ఎవరెస్ట్ పర్వతంపై రెపరెపలాడించాడు.

513
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles