నెట్టిల్లు


Sun,August 18, 2019 02:01 AM

మన చుట్టూ కొన్ని ఘటనలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. పరిశీలిస్తే అవే కథావస్తువుగా మారుతాయి. కల్పితంగానో, యధార్థంగానో వాటిని సరుకుగా ఉపయోగించి లఘుచిత్రాలు తీస్తున్నారు నేటితరం యువ దర్శకులు. అలాంటివే కిందటి వారం యూట్యూబ్‌లో వచ్చాయి.సీతిక్కడ..

కథ: శివ,
దర్శకత్వం: సుకుమార్‌.పి
నటీనటులు : సాధిక, హర్షిత్‌

రామ్‌కు పెండ్లి సంబంధాలు చూస్తుంటారు. ఇందులో భాగంగానే సీతను కలుస్తాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ పెండ్లికి ఒప్పుకుంటారు. సీత ఈ విషయం ఓ ఫ్రెండ్‌తో షేర్‌ చేసుకుంటుంది. రామ్‌తో ఎలాంటి పరిచయం లేని అమ్మాయి ఆమె. అతని గురించి నెగెటివ్‌గా చెప్తుంది. అంతకు ముందే రామ్‌ ఫ్రెండ్స్‌ సీత గురించి మద్యం మత్తులో వాగుతారు. మరోవైపు సీతకు రామ్‌మీద, అతని ఫ్రెండ్స్‌మీద అనుమానం పెరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత రామ్‌ వ్యక్తిత్వం అర్థం చేసుకుంటుంది. పెండ్లి చేసుకోవాలని ఫిక్స్‌ అవుతుంది. అతని గతం ఎలా ఉన్నా భవిష్యత్‌ మాత్రం బాగుంటుందని నమ్ముతుంది. ఫ్రెండ్స్‌ మాటలను పట్టించుకోకుండా సీత, రామ్‌ను అర్థం చేసుకుంటుంది కాబట్టి వీరి పెండ్లికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ మధ్యలో ఇద్దరి ఫ్రెండ్స్‌ వల్లే వివాదాలు అయ్యే ప్రమాద వాతావరణం ఏర్పడింది. ఫ్రెండ్స్‌ ఉండాలి కానీ మంచి ఫ్రెండ్స్‌ ఉండాలి. అలాగే ఎలాంటి పరిచయం లేని ఒకరి బాహ్య ప్రవర్తన చూసి వారి పట్ల పూర్తి అంచనాకు రావొద్దు, క్యారెక్టర్‌ను జడ్జ్‌ చేయొద్దు అనేది ఈ లఘు చిత్రం ద్వారా అర్థం చేసుకోవచ్చు.

Total views 16,907+ (ఆగస్టు 10 నాటికి) Published on Aug 3, 2019తన్మయిసూర్య

దర్శకత్వం: సన్నీ
నటీనటులు : సాయి, సితార

ప్రేమ, హారర్‌, మెసేజ్‌ కలిసి ఉన్న లఘుచిత్రం తన్మయిసూర్య. ఇందులో సూర్య ఓ బిజినెస్‌మ్యాన్‌ కొడుకు. చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. తండ్రి వ్యాపార హడావుడిలో సూర్యను పట్టించుకోడు. దీంతో ఎవరి ప్రేమకూ నోచుకోకుండా పెరుగుతాడు. ఈ క్రమంలోనే చెడు వ్యసనాలకు అలవాటవుతాడు. మద్యం సేవించి అతివేగంగా నడపడం సూర్యకు కామన్‌. ఈ క్రమంలోనే ఓ అమ్మాయిని ఢీ కొడతాడు. సీన్‌ కట్‌ చేస్తే తన్మయి అనే అమ్మాయి సూర్య లైఫ్‌లోకి వస్తుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ సూర్యను ఏదో వెంటాడినట్టు అనిపిస్తుంది. ఒత్తిడికి, భయాందోళనకు గురవుతాడు. తీవ్ర హెల్యూసినేషన్‌తో బాధపడతాడు. ఇట్లా అతని ప్రవర్తనలో భయంకరమార్పు వస్తుంది. దీని నుంచి సూర్యను ఎలా అయినా బయటపడేయాలని తన్మయి ప్రయత్నిస్తుంది. చివరకు మరో ప్రమాదం జరుగుతుంది. డబ్బు వ్యామోహంలో పిల్లలపై పట్టింపులేకుండా ఉన్న తల్లిదండ్రుల వల్ల పిల్లల పరిస్థితి ఎలా తయారవుతుందో చూపించారు. కథకు తగ్గ స్క్రీన్‌ప్లేతో లఘుచిత్రం ఆకట్టుకుంటుంది.

Total views 2,770+ (ఆగస్టు 10 నాటికి) Published on Aug 9 2019గోపవరం

దర్శకత్వం: సతీశ్‌ గోపవరం
నటీనటులు : రామ్‌ సాత్విక్‌, సాయిశ్రీ

స్రవంతి ఇండిపెండెంట్‌ అమ్మాయి. ప్రాక్టికల్‌గా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నది. సతీష్‌, స్రవంతిని ప్రేమిస్తాడు. అతను కొంచెం రిచ్‌. ప్రేమంటే కేవలం అమ్మాయికి సెక్యూర్‌ లైఫ్‌ ఇవ్వడమే అని ఫ్రెండ్‌ చెప్తే నమ్ముతాడు. అదే విషయం స్రవంతికి చెప్తాడు. అప్పటి వరకూ అసలు స్రవంతికి సతీశ్‌ ఎవరో కూడా తెలియదు. కానీ ప్రేమ విషయం, తన ఆస్తి, ఆంతస్థుల గురించి చెప్తాడు. పెండ్లి చేసుకుంటే సెక్యూర్డ్‌గా ఉండొచ్చు అంటాడు. దీనికి స్రవంతి స్పందిస్తూ డబ్బు చూసి పడిపోయే రకం కాదు. ప్రేమకు డబ్బుకు సంబంధం లేదు అని క్లాస్‌ తీసుకుంటుంది. అమ్మాయిల మీద ఇలాంటి అభిప్రాయం పెట్టుకున్నందుకు చివాట్లు పెడుతుంది. సతీష్‌ కొద్ది రోజుల కు మళ్లీ వచ్చి క్షమాపణలు చెపుతాడు. తను ఎంత సీరియస్‌గా ప్రేమించాడో చెప్తాడు. పెండ్లి తర్వాత తనే మారతానని, స్రవంతి ఏం రామాల్సిన అవసరం లేదనీ, అన్ని పనులూ చేసి పెడతా అని అంటాడు. మాటతప్పను అని మాటిస్తాడు. దీనికి కరిగిపోయిన స్రవంతి ఓకే చెప్తుంది. మొదట అంత ప్రాక్టికల్‌గా మాట్లాడిన అమ్మాయి చివర్లో సతీశ్‌ మాటలకు అంత ఈజీగా ఎలా ఒప్పుకుంటుందో అర్థం కాదు. ఓవరాల్‌ డైలాగ్స్‌ బాగున్నాయి.

Total views 4,951+ (ఆగస్టు 10 నాటికి) Published on Aug 2, 2019ప్రేమకు స్వాగతం

దర్శకత్వం: భూక్య భానుప్రసాద్‌
నటీనటులు : హరి చౌహన్‌, పవిత్ర

హరి వాళ్ల అమ్మ క్యాన్సర్‌తో బాధపడుతుంటుంది. వైద్యం చేయించడానికి సరిపడా డబ్బులు ఉండవు. ఏం చేయాలో అర్థం కాదు. ఈ క్రమంలోనే వాళ్ల ఊరికి ఓ మెడిసిన్‌ స్టూడెంట్‌ వస్తుంది. ఆమె సాయంతో అమ్మకు ఆరోగ్యం చేయించాలనుకుంటాడు. మొదట ఆమెతో పరిచయం ఏర్పరుచుకోవడానికి రోజూ ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు. ఎందుకు ఫాలో అవుతున్నావ్‌ అని ఆమె ఓ రోజు అడుగుతుంది. ఇదంతా ప్రేమ కోసమేనేమో అని అనుకుంటుందామె. కొద్దిసేపటి తర్వాత విషయం చెప్తాడు. అప్పుడే ఓ ఘటన జరుగుతుంది. దాని నుంచి ఆమెను రక్షిస్తాడు హరి. దీంతో హరిమీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నాన్న సాయంతో హరి వాళ్ల అమ్మకు చికిత్స చేయిస్తుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. ఆమెనే వచ్చి హరికి తన ప్రేమ గురించి చెప్తుంది. మధ్యలో సీరియస్‌నెస్‌, ఫైట్‌ సీన్లు ఉంటాయి. ఓవరాల్‌గా బాగుంది చూడండి.

Total views 1,183+ (ఆగస్టు 10 నాటికి) Published on Aug 9, 2019

- వినోద్‌ మామిడాల, సెల్‌: 7660066469

190
Tags

More News

VIRAL NEWS