పద్య రత్నాలు-16


Sun,August 18, 2019 02:12 AM

Poems

వనితలకు ఇది అలంకారం

దానములు ధర్మకార్యము
లూనంగా గలిగినంత యుక్త క్రియలన్‌
మానవతుల కిది ధర్మము
గా నెఱిగి యొనర్పవలయు గాదె కుమారీ!

- కుమారీ శతకం

తాత్పర్యం:
దానధర్మాలు ప్రతీ ఒక్కరికీ ఆచరణదాయకం. ప్రత్యేకించి వనితలకైతే దానాలు, ధర్మకార్యాలు ఆభరణాల్లా వెలుగొందుతాయి. ‘ఇవి మగవారి పనులు, మావి కావు’ అని అనుకోకుండా మహిళలు తప్పకుండా వీటిని పాటించాలి. అప్పుడే ఉత్తమ మహిళలుగా కీర్తింపబడతారు. కనుక, వారు ఈ నీతిని తెలుసుకొని మసలుకోవాలి.
Poems1

జ్ఞానజ్యోతి వెలిగించు దేవా!

పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో
గ రహస్యంబులు, వేదశాస్త్రములు వక్కాణించితిన్‌, శంక వో
దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన, నమ్మించి, సు
స్థిర విజ్ఞానము త్రోవ చెప్పగదవే శ్రీకాహస్తీశ్వరా!
- కాళహస్తీశ్వర శతకం

తాత్పర్యం:
మంత్రతంత్రాలన్నీ పరిశీలించాను. సాంఖ్యాది యోగ రహస్యాలను తెలుసుకొన్నాను. వేదశాస్ర్తాలను చదివాను. అయినా, నాలోని అనుమానాలు నివృత్తి కావడం లేదు. అవేవీ నా శంకలను తీర్చలేకున్నాయి. కాసింత నమ్మకమనే దీపాన్ని
నాలో వెలగించవా దేవా! తద్వారా సుస్థిరమైన జ్ఞానజ్యోతిని నాలో ప్రసరింపజేయుమా!
Poems2

సజ్జనుల పట్టుదల

పరహితమైన కార్య మతిభారముతోడిదియైన బూను స
త్పురుషులు లోకముల్పొగడ బూర్వము నందొకఱాల వర్ష
మున్‌ కురియగ జొచ్చినన్‌ గదిసి గొబ్బున గోజనరక్షణార్థమై
గిరినొక కేలనైతి నంట కృష్ణుండు ఛత్రముభాతి భాస్కరా!
- భాస్కర శతకం

తాత్పర్యం:
సజ్జనుల పట్టుదల సామాన్యమైంది కాదు. పరుల హితాన్ని కోరి, వారు చేసే కార్యం ఎంత భారమైనా సరే వెనుకడుగు వేయకుండా వెంటపడి మరీ సాధిస్తారు. అలాంటి వారే ప్రజలతో ప్రశంసలందుకొంటారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎలాగైతే ఎంత సునాయసంగా ఎత్తి చూపాడో అంత సులభంగా సత్పురుషులు కార్యభారాన్ని మోస్తారు.
Poems3

పరిపూర్ణ వర్ణన ఎవరికి సాధ్యం?

సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, శూరుడై రణమందు బోరవచ్చు,
రాజరాజైన పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానంబు లియ్యవచ్చు,
గగనమందున్న చుక్కల నెంచగావచ్చు, జీవరాసుల పేర్లు చెప్పవచ్చు,
నష్టాంగయోగంబు లభ్యసించవచ్చు, కఠినమౌ రాల మ్రింగంగవచ్చు,
తామరసగర్భ హరపురంధరులకైన
నిన్ను వర్ణింప దరమౌనె నీరజాక్ష!
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- నరసింహ శతకం

తాత్పర్యం:
విద్యలన్నీ నేర్చి సభలను మెప్పించవచ్చు. శూరులమై పోరాడవచ్చు. రాజుగా పుట్టి రాజ్యాలను ఏలవచ్చు. బంగారం, గోవు వంటి దివ్యదానాలు చేయవచ్చు. ఆకాశంలోని చుక్కలనూ లెక్కించవచ్చు. భూమ్మీది జీవరాసుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగయోగాన్ని అభ్యసించవచ్చు. కఠిన శిలలను మింగవచ్చు. కానీ, నీ పరిపూర్ణ వర్ణన ఎవరికి సాధ్యం స్వామీ!

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్‌ నంబర్‌లో తెలియజేయండి.

177
Tags

More News

VIRAL NEWS