నారీ నారీ నడుమ మురారి!


Sun,August 18, 2019 02:23 AM

wifes
ఆ ఊరి జనాభా మొత్తం మూడువేల పైమాటే. అయితే ఆ గ్రామంలో ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నాడు. ఇది కూడా చెప్పుకోదగ్గ విషయమే అయినా.. అందరినీ షాక్‌కు గురిచేసే మరో విషయం కూడా ఉంది. అదేంటంటే.. ఆ ఊర్లో ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు భార్యలుంటారు. ఎవరికి ఎక్కువమంది భార్యలుంటే వారికే ఎక్కువ గౌరవం, మర్యాద ఇస్తారట.

మన దేశ చట్టాల ప్రకారం బహుభార్యత్వం నేరం. రూల్స్‌ ప్రకారం విడాకులు తీసుకున్నాకే రెండో పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ భార్య ఉండగానే పెండ్లి చేసుకున్నా.. రహస్యంగానే ఉంచుతారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని లక్ష్మీపూర్‌ కేరీ పంచాయతీలోని ఫత్తేపూర్‌ గ్రామంలో ఇలాంటి నియమాలేమీ ఉండవు. ఇక్కడ ఎక్కుమంది భార్యలు కలిగి ఉండడం ఒక హోదా. ఎంతమంది భార్యలు ఉంటే మగాడికి అంత గౌరవం, మర్యాద ఇస్తారు. అక్కడ బహుభార్యత్వం ఓ ఆచారం, సంప్రదాయం. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.
wifes1

ఒకే ఇంట్లో నలుగురు భార్యలు!

ఫత్తేపూర్‌లో ఈ వింత ఆచారం ఎప్పటి నుంచో ఉన్నది. దానినే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు అక్కడి ప్రజలు. ఆ గ్రామంలో వందకు పైగా ఇళ్లు ఉంటే.. 3వేల మందికిపైగా జనాభా ఉన్నారు. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ ఒక వ్యక్తి గవర్నమెంట్‌ ఉద్యోగి ఉండడం విశేషం. అందుకే ఆర్థికంగా ఇబ్బంది లేకపోవడంతో ఈ గ్రామంలో అంతా మూడేసి పెండ్లిండ్లు చేసుకుంటున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు భార్యలున్నా.. ఎవ్వరూ గొడవ పడరు. ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్తారు. ఈ ఊరిలో చాలామంది పురుషులు నాలుగు పెండ్లిండ్లు చేసుకున్నవారూ ఉన్నారు. ఇలా నలుగురు భార్యలతో ఒకే ఇంట్లో సంసారం చేస్తున్నా ఎలాంటి కొరతా, ఇబ్బంది ఏర్పడనివ్వరు.
wifes2

కొన్ని రహస్య సంబంధాలు

ఫత్తేపూర్‌లో ఉండేవారిలో ఎక్కువమంది బ్రాహ్మణ, ఠాకూర్‌ సామాజికవర్గాలకు చెందిన వారే. ఇలా పెండ్లిండ్లు చేసుకున్న పురుషుల్లో చాలామంది గవర్నమెంట్‌ ఉద్యోగులే. దీంతో రెండు మూడు పెళ్లిళ్ల గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. వాళ్ల ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయం. ఈ కారణంగా కొంతమంది మగాళ్లకు భయం పట్టుకుంది. ఇన్నాళ్లూ గుట్టుగా సాగిన ఈ సంప్రదాయం.. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుండడంతో ఆ గ్రామంలోని ఉద్యోగులు జాగ్రత్తలు పడుతున్నారు. ఈ క్రమంలో రహస్య సంబంధాలు కొనసాగిస్తున్నారు. కొందరు ఉద్యోగులైతే పని చేసే చోట రెండో సంసారం పెడుతున్నారు. ఇంకొందరు ఊరిలోనే వేర్వేరు చోట్ల సంసారాలు పెట్టారు. తాను కాకుండా ముగ్గురు/నలుగురు భార్యలున్నారనే విషయం తెలిసినా వారి భార్యలు కూడా ఏమీ అనకపోవడంతో.. తమ వారి ఆర్థిక స్థోమత మేరకు మగవారు పెండ్లిండ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికీ వారి సంసారాల్లో ఎలాంటి ఇబ్బందీ లేదని, అంతా హ్యాపీగా భార్యలు, పిల్లలతో బతికేస్తున్నామని చెబుతుండడం విశేషం. బహుభార్యత్వం నేరం అనే విషయం తెలిసినా.. తమ గ్రామంలో ఇదొక ఆచారం, తరాలుగా పాటిస్తున్న సంప్రదాయమని అంటున్నారు. కట్టుబాట్లను కాదనలేము కదా అని నిస్సహాయతనూ వ్యక్తం చేస్తున్నారు.
wifes3

మారుతున్న నవ తరం..

ఫత్తేపూర్‌ గ్రామంలోని ప్రస్తుత తరానికి చెందిన యువకులు మాత్రం రెండో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ప్రభుత్వ ఉద్యోగం ఊడుతుందని భయపడుతున్నారు. మరోమాటగా ఎంతమంది పెండ్లాలు ఉంటే అంత గౌరవం, మర్యాద ఇస్తున్నారని, ఒక పెండ్లామే ఉంటే కనీసం మనిషిలా కూడా చూడడం లేదని వాపోతున్నారు. దీనిపై ఊరిపెద్దలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఊరిలో పరిస్థితులు మారుతున్నాయని, నేటి తరం యువకులు బహుభార్యత్వం విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని, ఎక్కువ పెండ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడడం లేదని చెబుతున్నారు. ఇలా రెండుకు పైగా పెండ్లిళ్లు చేసుకోవడానికి ఆచారం ఒక కారణమైతే.. మరో కారణం కూడా ఉందంటున్నారు. మొదటి భార్య చనిపోయినా, ఏదైనా కారణంతో వదిలి వెళ్లిపోయినా.. రెండో పెళ్లి చేసుకుంటే ఇంటి పనులు, పిల్లలను చూసుకోవడానికి సాయంగా ఉంటుందని చెబుతున్నారు. ఇకపోతే ఎంతమంది భార్యలు ఉంటే.. వారందరికీ సమానంగా భర్త తన ఆస్తిపాస్తులను పంచాల్సిందే.
wifes4

209
Tags

More News

VIRAL NEWS