బ్రహ్మమొక్కటే


Sun,August 18, 2019 12:37 AM

Brahmanokatey
రాము నెమ్మదస్థుడు. వినయ విధేయతలున్నవాడు. పెద్దల్ని గౌరవించేవాడు. గురువు మాటని జవదాటని వాడు, పసితనం నుంచే ఆశ్రమంలో పెరిగినవాడు. ఆశ్రమంలో గురువు చెప్పే వేదాంగాల్ని ఔపోసన పట్టాడు.గురువుకు రాము పట్ల ఎంతో అభిమానం, ప్రేమ, బుద్ధిమంతుడిగా, మాటను జవదాటని వాడంటే ఎవరికయినా ఇష్టముంటుంది కదా! ఒకరోజు గురువు శిష్యులందర్నీ ‘కూర్చోబెట్టుకొని ‘బ్రహ్మజ్ఞానం’ గురించి చెప్పాడు. బ్రహ్మమంటే ఈ అనంతవిశ్వం. ఈ విశ్వంలోని అణువణువూ బ్రహ్మమయమే. గ్రహాలు, నక్షత్ర మండలాలు అన్నీ బ్రహ్మమయమే. గ్రహవాసులు కూడా బ్రహ్మమయమే. అంటే చరాచర జగత్తంతా బ్రహ్మమయమే. మనుషులు, పశువులు, పక్షులు, చెట్లు, పుట్టలు, నదీనదులు ఒకటేమిటి మన కళ్లకు కనిపించే ప్రతీది బ్రహ్మమే!’

గురువు మాటలు రాము మనసులో బలంగా నాటుకున్నాయి, బ్రహ్మమంటే ఏమిటో తనకు తెలిసిపోయిందని రాము నిర్ధాణకు వచ్చేశాడు. ఏడాది తర్వాత తన గ్రామం వెళ్లి రావడానికి గురువు నుంచి అనుమతి పొందుతూ అప్పటికి అతని బాల్య స్నేహితుల్ని చూసి ఏడాది అవుతుంది. ఇన్ని రోజులుగా గురువు దగ్గర తను పొందిన జ్ఞానమంతా మిత్రులకు చెప్పాలని రాముకు ఎంతో ఉత్సాహంగా ఉంది.ఆశ్రమాన్ని దాటి కొంతదూరం నడిచాడు. పక్కన ఉన్న చెట్లు నీడనిస్తున్నాయి. చల్లగా ఉన్నాయి. దారిలో నడిచేవాళ్లు రాముని చూసి చిరునవ్వు నవ్వారు. చల్లటి కొండలు దూరం నుంచి కన్నులకు యింపుగా కనిపించాయి. చల్లటి గాలి మనసును తాకి హాయిగా అనిపించింది. ఎవరో పశువుల్ని తోలుకుంటూ ఎదురు వచ్చారు. వాటి మెడలో గంటలు ఇంపుగా ధ్వనించాయి. అదంతా బ్రహ్మలో భాగమే కదా అనుకున్నాడు. అంతా సౌమ్యంగా, సన్నిహితంగా, ఆనందంలో హావభావాలుగా అనిపించి ఎంత మనోహర సృష్టి! అనుకున్నాడు. బ్రహ్మమంటే గొప్ప సామరస్య సంగీతం అని పరవశించాడు. అంతలో ఎక్కడినుంచి వచ్చిందో, తప్పించుకొని వచ్చిందో అడవినుంచి దారి తప్పి వచ్చిందో ఒక ఏనుగు దూరం నుంచీ తనకు ఎదురుగా రావడం కనిపించింది. ఏనుగును చూస్తూనే రోడ్డుమీద నడిచే జనం ఎక్కడివాళ్ళు అక్కడ మాయమయ్యారు. కాలికి బుద్ధి చెప్పాడు. కానీ రాము ఆగ్రహంతో వస్తున్న ఏనుగును నిర్మలంగా చూసి నేనూ బ్రహ్మమే. చెట్టూ, పుట్టా బ్రహ్మమే. అలాగే ఏనుగు కూడా బ్రహ్మమే అని దానికి ఎదురుగా వెళ్ళాడు. పరిగెత్తే జనం ‘ఏనుగు ఆగ్రహంతో వస్తున్నది. చాలా ప్రమాదం, పక్కకి తప్పుకో’ అన్నారు. కానీ రాము చిరునవ్వు నవ్వి ఏనుగువైపు వెళ్లాడు.

ఆగ్రహంతో ఎదురుగా వచ్చిన ఏనుగును చూసి రాము భయపడలేదు. కానీ ఏనుగు తొండంతో రామును ఎత్తి పక్కకు విసిరేసింది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం కలగలేదు,కానీ ఒళ్ళు హూనమయింది. స్పృహ తప్పాడు. అక్కడున్న జనం వాకబు చేసి మొత్తానికి రాముని ఆశ్రమానికి చేర్చారు. ముఖం మీద నీళ్లు చల్లారు. మెల్లగా కళ్లు తెరిచి రాము అటూ ఇటూ చేశాడు. ఎదురుగా ‘ గురువు ఉన్నాడు. గురువుకు శిష్యుడి నిర్వాకం తెలిసింది. గురువు గారూ, మీరు ప్రతీది బ్రహ్మమే అన్నారు కదా! అందుకని నేను ఏనుగు ఏమీ చెయ్యదని ఎదురుగా వెళ్ళాను. ఇలా తొండంతో ఎత్తి విసిరేస్తుందనుకోలేదు’ అన్నాడు రాము. ‘నేను ప్రతీది బ్రహ్మమన్నాను కదా అన్నాడు గురువు. ‘అవును ’అన్నాడు రాము. మరి ఇక్కడ పారిపోతున్న మనుషులూ బ్రహ్మమే కదా! ‘మరి వారు పక్కకి తప్పుకో, ప్రాణాపాయం. పారిపో! అన్నారు కదా. ఆ బ్రహ్మ చెప్పిన మాటల్ని ఎందుకు పెడచెవిన పెట్టావు?’ అన్నాడు.రామూకు ఏం చెప్పాలో తోచలేదు. ‘చెప్పిన మాటల్ని విని పాటించడమే కాదు, దాని వెనుకనున్న అంతరార్థాన్ని గ్రహిస్తే మనుషులు వివేకవంతులవుతారు’ అన్నాడు గురువు.

‘నేను ప్రతీది బ్రహ్మమన్నాను కదా అన్నాడు గురువు. ‘అవును ’అన్నాడు రాము. మరి ఇక్కడ పారిపోతున్న మనుషులూ బ్రహ్మమే కదా! ‘మరి వారు పక్కకి తప్పుకో, ప్రాణాపాయం. పారిపో! అన్నారు కదా. ఆ బ్రహ్మ చెప్పిన మాటల్ని
ఎందుకు పెడచెవిన పెట్టావు?’ అన్నాడు.


ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్‌ నంబర్‌లో తెలియజేయండి.

- సౌభాగ్య

230
Tags

More News

VIRAL NEWS