కోరికలు తీర్చే కోరమీసాల వీరభద్రుడు


Sun,August 25, 2019 01:19 AM

kuravi
నల్లని రూపం, కోరమీసాలు, ఇంకా పదునైన చూపులు, కుడివైపున ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలం, వేరొక చేతిలో పుష్పం, ఇంకో చేతిలో గద, ఐదో చేతిలో దండం, ఎడమవైపున ఓ చేతిలో ఢమరకం, ఒక చేతిలో సర్పం, మరొక చేతిలో విల్లు , ఇంకో చేతిలో బాణం, వేరొక చేతిలో ముద్ధరం, మొత్తంగా ఐదు జతల చేతులు. స్వామి పాదాల దగ్గర వినయంగా నంది వాహనం. ఎడమవైపున భక్తులకు అభయమిస్తూ భధ్రకాళిక. వీరభద్రుడి రౌద్రరూపం భూతప్రేత పిశాచాలకు వణుకు పుట్టిస్తుందని భక్తుల విశ్వాసం. కాబట్టి దుష్టశక్తల పీడ తొలగించుకోవడానికై ఎక్కడి జనమో ఈ దేవుడిని శరణు వేడతారు. అందుకే కోరిన కోరికలు తీర్చే దైవంగా పూజలందుకుంటున్నాడు మహబూబాబాద్‌ జిల్లా కురవిలోని భద్రకాళీ సమేతంగా కొలువుతీరిన వీరభద్రుడు.

పది హస్తాలు, కోరమీసాలు

కురవి దేవాలయం అష్టాదశ స్తంభాల మహామండపంతో మూడు గర్భాలయాలతో విస్తరించి ఉంది. ఈ ఆలయంలో శిల్పకళ ఉట్టిపడుతున్నది. గర్భగుడిలో మూలవిరాట్‌ వీరభద్రస్వామి త్రినేత్రుడై దశహస్తాలతో దౌద్రరూపంతో ఉండటం విశేషం. స్వామివారి నోటికిరువైపులా రెండు కోరలు, పాదాల చెంత నందీశ్వరుడి విగ్రహం ఉండగా ఎడమవైపు శ్రీ భద్రకాళి అమ్మవారి విగ్రహం ఉంటుంది. రుధిర నేత్ర జ్వాలలకు ప్రతీక అన్నట్లు ఇక్కడే పరమశివుడూ పూజలందుకొంటున్నాడు. ఆలయం లోపలకు ప్రవేశించగానే గణపతి దర్శనమిస్తాడు. గణపయ్య ఆనతి తీసు కున్నాకే వీరభద్రుడికి పూజలు చేయడం ఆనవాయితీ. అనుమతి ఇచ్చేవాడు కనుకనే అనుజ్ఞ గణపతి అయ్యాడు. ఆలయ ఉత్తరభాగంలో రామలింగేశ్వరస్వామి, దక్షిణంలో చంద్రమౌళీశ్వరుడూ ఉన్నారు. ఇంకా ఇక్కడ నవగ్రహాలను సప్తమాతృకలనూ ప్రతిష్టించారు. ఆలయానికి అనుబంధంగా ఆంజనేయుడి గుడి ఉంది. నాగేంద్రుని విగ్రహన్ని కూడా చూడవచ్చు.

ఆలయ చరిత్ర

రాష్ట్రకూట రాజైన భీమరాజు కురవిని (నేటి కొరవి సీమను) పాలించేవాడు. అతడే వీరభద్ర ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత కాలంలో శిథిలస్థితికి చేరుకున్న ఆలయాన్ని కాకతీయ పాలకుడు ఒకటో బేతరాజు పునర్నిర్మించాడు. ఓసారి కురవి ప్రాంతంలో అల్లకల్లోలం తలెత్తింది. శత్రుమూకలు స్వైరవిహారం చేశాయి. అపార ప్రాణనష్టం కలిగించాయి. ఆ సమయంలో వీరభద్రుడు ప్రత్యక్షమై, దుష్టులను చంపినట్లు చరిత్ర. కొన్నిసార్లు మానవరూపంలో వచ్చి ప్రజలతో ఆటలు ఆడేవాడట, పాటలు పాడేవాడట. అంతలోనే హఠాత్తుగా అదృశ్యమయ్యేవాడట. కాకతీయ వీరనారి రుద్రమాంబ వీరభద్రుడిని దర్శించుకుని కానుకలు సమర్పించినట్లు తెలుస్తున్నది. ఈ క్షేత్రం కాకతీయుల పాలనలో ప్రసిద్ధ్ది చెందింది. 2002 ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని కోరిన కోర్కెను నెరవేర్చినందుకుగాను సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతగా 2017 వ సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఈ వీరభద్రస్వామికి బంగారు మీసాల మొక్కు తీర్చుకున్నారు.
kuravi1

జాతర

ప్రతియేటా శివరాత్రికి ఈ క్షేత్రం కైలాసగిరిని తలపిస్తుంది. భద్రకాళి, వీరభద్రుల వివాహం అంగరంగ వైభవంగా జరుపుతారు. మహాశివరాత్రి నాడు జాతర ప్రారంభమై ఉగాదికి ముగుస్తుంది. ఈ కాలంలో వివిధ ప్రాంతాల నుండి దాదాపు పదిహేను లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శివరాత్రి పర్వదినం తర్వాతి రోజు తెల్లవారుజామున స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ జాతరను తెలంగాణలో మేడారం జాతర తర్వాత అతి ఎక్కువ మంది భక్తులు హాజరయ్యే గిరిజన జాతరగా పరిగణిస్తారు. శివరాత్రికి రథోత్సవం జరుగుతుంది. ప్రబల బళ్ళు కడతారు. సకల శక్తిమూర్తి, వరప్రదాత అయిన శ్రీ వీరభద్రస్వామి శ్రీ భద్రకాళి సమేతంగా కొలువుండటం వల్ల ఈ ఆలయాన్ని ‘శ్రీ వీరభద్రేశ్వరాలయం’గా కూడా పిలుస్తారు.

268
Tags

More News

VIRAL NEWS