సహనం


Sun,August 25, 2019 01:35 AM

Sahanam
మీరు జనాల్ని కాటు వేయకు, సౌమ్యంగా ఉండు అన్నారు. నేను నెమ్మదిగా వుండడంతో నాతో ప్రమాదం లేదని గ్రహించిన జనం నాతో ఆడుకున్నారు. నా తోక పట్టుకొని తిప్పేవాళ్లు. కొందరు నన్ను మెడకు చుట్టుకొనేవారు. నన్ను చంపలేదు కానీ జనం దాదాపు అంత పని చేస్తున్నారు.

ఒక సన్యాసి ఒక గ్రామాన్ని సందర్శించాడు. తన బోధనలతో ఆ గ్రామ జనులను సంతృప్తి పరిచాడు. ఆయన అట్లా ఎన్నో గ్రామాలు తిరుగుతూ జనాలకు మంచి చెడుల గురించి చెబుతూ వుండేవాడు. ఈ క్రమంలో ఆ గ్రామానికి వచ్చాడు.
సన్యాసి ఆ గ్రామం వదిలి వెళ్లే సమయం వచ్చింది. ఆ గ్రామ సమీపంలో విశాలమైన పచ్చిక బయలు ఉంది. ఆ పచ్చిక బయలు దాటాక దూరంగా మరో గ్రామం కనిపిస్తుంది. సన్యాసి ‘ఈ పచ్చిక మైదానం గుండా వెళితే ఆ గ్రామం చేరవచ్చా?’ అని గ్రామస్థుల్ని అడిగాడు. గ్రామస్థులు ‘చేరవచ్చు. కానీ మేమందరం ఇట్లా కాకుండా ఇంకో మార్గం గుండా ఆ గ్రామం వెళతాం’ అన్నారు.

సన్యాసి ‘ఎందుకని అట్లా వెళతారు?’ అన్నాడు.
‘ఈ పచ్చిక బయల్లో ఒక పెద్ద నాగుపాము ఉంది. పచ్చిక బయలు గుండా వెళ్లే మనుషుల్ని అది కాటు వేస్తుంది. ఇప్పటి వరకూ ఎందరినో కాటు వేసింది. ఆ భయం వల్ల జనం అటు వెళ్లరు’ అన్నారు.
సన్యాసి ఏమీ బదుల్వికుండా పచ్చిక మైదానం గుండా సాగుతూ జనం ప్రమాదం అన్నా వినిపించుకోలేదు.
సగం దూరం వెళ్లేసరికి నాగుపాము బుస కొట్టి, పడగ విప్పి సన్యాసిని కాటు వేయబోయింది. సన్యాసి మంత్రం జపించి దాన్ని అదుపు చేశాడు. అది పడగ ముడుచుకొని నెమ్మదిగా మారింది. సన్యాసి ‘ఎందుకని నువ్వు జనాల్ని కాటు వేస్తున్నావు’ అడిగాడు. పాము ‘స్వామీ .. ఏం చెయ్యమంటారు.. జనం నాపైన రాళ్లు విసురుతారు. కట్టెతో చంపాలని ప్రయత్నిస్తారు. నాకు మార్గాంతరం లేదు. ఆత్మరక్షణ కోసం నేను కాటు వేయకతప్పదు’ అంది.
సన్యాసి ‘చాలు ఇక ఈ క్రూరత్వం మానుకో.. నేను జనాలతో చెబుతాను. నిన్ను చంపవద్దంటాను. నువ్వు ఎవర్నీ కాటు వేయకు. సౌమ్యంగా ఉండు’ అన్నాడు.

పాము ‘సరే’ అన్నది.
మరుసటి రోజు గ్రామానికి వచ్చిన సన్యాసి దగ్గరకు జనం పరిగెత్తుకుంటూ వచ్చి ‘స్వామీ ఆశ్చర్యం! పాము మిమ్మల్ని కాటు వేయలేదా?’ అని అడిగారు.
సన్యాసి ‘ఇకమీద పాము మిమ్మల్ని ఎవర్నీ కాటు వేయదు. మీరు కూడా దాన్ని చంపడానికి ప్రయత్నించకండి’ అన్నాడు.
సన్యాసి తన దారెంట తాను వెళ్లిపోయాడు. సంవత్సరం తర్వాత మళ్లీ ఆ గ్రామానికి వచ్చాడు. రావడంతోనే ఆ పచ్చిక మైదానం అంతా చూశాడు. ఎక్కడా చప్పుడు రాకపోయేసరికి పామును పిలిచాడు. పాము తన రంధ్రం నుంచి మెల్లగా బయటకు వచ్చింది. అది బలహీనంగా ఉంది. బక్కచిక్కి ఉంది.

సన్యాసి ఆశ్చర్యంగా ‘ ఏమైంది.. ఎందుకలా తయారయ్యావు?’ అన్నాడు. పాము ‘స్వామీ! ఇదంతా మీ చలువే! మీరు జనాల్ని కాటు వేయకు, సౌమ్యంగా ఉండు అన్నారు. నేను నెమ్మదిగా వుండడంతో నాతో ప్రమాదం లేదని గ్రహించిన జనం నాతో ఆడుకున్నారు. నా తోక పట్టుకొని తిప్పేవాళ్లు. కొందరు నన్ను మెడకు చుట్టుకొనేవారు. నన్ను చంపలేదు కానీ జనం దాదాపు అంత పని చేస్తున్నారు. పిట్టలు, ఇతర జంతువులు అన్నిటికీ నేను లోకువ అయిపోయాను. తిండి కూడా సరిగా దొరకడం లేదు’ అంది.
సన్యాసికి చాలా జాలి వేసింది. ‘జనాల్ని కాటు వేయవద్దు అన్నాను. కానీ భయపెట్టవద్దని, బుసకొట్టవద్దని నేను అన్నానా? నీ జాగ్రత్త నీకు అవసరం కదా! పొరపాటు చేశావు. ఇకనైనా పడగవిప్పి బుసకొట్టు’ అన్నాడు.
పాము ‘అలాగే స్వామీ’ అని కృతజ్ఞత తెలిపింది. సన్యాసి సంవత్సరం గడిచాకా మళ్లీ వచ్చి పామును కలిశాడు. ఊర్లోకి వెళ్లి జనాల్ని కలిసి పాము గురించి ఆరాతీశాడు. జనం ‘స్వామీ మీరు చెప్పినట్టు పాము సాత్వికమైంది కాదు.. మేము దగ్గరికి వెళ్తే పడగ విప్పి బుసకొడుతున్నది. కాటు వేస్తున్నదని భయంతో దాని దగ్గరకు వెళ్లడం మానేశాం’ అన్నారు.
సన్యాసి ‘ మీకు తగిన శాస్తి జరిగింది’ అన్నాడు.

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్‌ నంబర్‌లో తెలియజేయండి.

244
Tags

More News

VIRAL NEWS