మూ(మో)డు మనసులు


Sun,August 25, 2019 01:50 AM

Mumedu-manasullu
“మీ ఫ్రెండ్‌ ఫస్ట్‌నుండి మొండిదేనా బ్రో..! పెండ్లి చేసుకోవటానికి నేను ఇంకొక జన్మ ఎత్తాల్సి వచ్చిందంటే నమ్మండి. చివరి మూమెంట్లో ఓకే చెప్పింది. అందుకే ఓకే చెప్పిన వెంటనే అస్సలు ఆలస్యం చేయకుండా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసేసుకున్నాం. మళ్ళీ ఎక్కడ మనసు మార్చుకుని వద్దంటుందో అని భయంతో” అని నవ్వాడు సంజయ్‌. “అందుకే తన ఫ్రెండ్స్‌ను కలిసే అవకాశమే కలుగలేదు బ్రో నాకు. ఇప్పుడనిపిస్తుంది, అందరినీ పిలిచి గ్రాండ్‌గా మళ్లీ పెండ్లి చేసుకోవాలి అని.. కానీ కుదరదుగా” మళ్ళీ నవ్వాడు.

- పులవర్తి లక్ష్మీ ప్రియాంక“హే రహమత్‌.. రహమత్‌”.. ఎవరో పిలుస్తున్నారు.
వినిపించినా వెనక్కి తిరిగి చూడలేదు రహమత్‌.
తనకు బాగా తెలిసిన గొంతులా ఉంది. ఎంతగానో వినాలని ఆశపడే గొంతులా ఉంది. కానీ, అతనికి వెనక్కి తిరిగి చూడాలని లేదు. అలా చూసి తాను కాదని తెలిశాక నిరాశకు లోనవ్వాలని లేదు. అంతేనా! తను వెనక్కి తిరిగితే, ఆ పిలుపు ఎక్కడ ఆగిపోతుందో అన్న భయం కూడా వేసింది అతనికి.
‘మరొక్కసారి పిలిస్తే బావుండు’ అనుకున్నాడు. ‘అది అతను ఆశించిన వ్యక్తే అయితే ఇంకా బావుండు’ అనుకున్నాడు.
“హే రహమత్‌.. నిన్నే...” మరొక్కసారి వినబడింది.
ఆ గొంతులో ఉన్న చనువు చూసి తనే అని నిర్ధారించుకున్నాడు. వెనక్కి తిరిగి చూశాడు.
అవును తనే! మూడేండ్ల నుంచీ ఏం చేస్తుందో? ఎలా ఉందో? అని అతని ప్రతీ ఆలోచనలోనూ నిండిపోయింది తను. ‘కలవాలి, మాట్లాడాలి’ అని ఎన్నిసార్లు అనిపించినా.. ఎక్కడో అనవసరపు కోపాన్ని తెచ్చి పెట్టుకుని తనను దూరం పెట్టాడు. ‘తనే అన్నీ, తను లేకపోతే నేను లేను’ అన్న విషయం చెప్పాలనుకున్న ఆ క్షణంలో ఆమె తన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్లింది. ఇప్పుడు మళ్లీ వచ్చింది.
* * *

ఆమెను చూడగానే రహమత్‌లో ఒక రకమైన బెరుకు మొదలైంది. మనసు రెక్కలు కట్టుకొని గాల్లో ఎగురుతున్నట్టు అనిపించింది. అక్కడి గాలి ఏవో తియ్యని ఊసులను మోసుకొచ్చింది.
సంతోషించాడు. ‘ఇంతటి ఆనందం తానెప్పుడూ ఎరుగనే లేదు’ అనుకున్నాడు మనసులో.
ఒకవైపు ఆనందంగా ఉన్నా, మరోవైపు ఎక్కడో తెలియని అసంతృప్తి. దాని వెనుకే ఓ బాధతో కూడిన కోపం. ఇలా రకరకాల ఆలోచనలలో మనసు అల్లకల్లోలంగా ఉంది.
అప్పుడే ఆమె భుజం తట్టింది. తన ఆలోచనలను కట్టడి చేయడానికా అన్నట్టు..
“ఏంటి పిలుస్తుంటే పలకవ్‌? నన్ను గుర్తు పట్టలేదా?..”
‘గుర్తు పట్టలేదా! ఎంత సునాయాసంగా అడిగిందా ప్రశ్న? అసలు తను మర్చిపోతేగా’ అని చెప్పాలనిపించింది రహమత్‌కు. ‘అసలెందుకు పిలిచింది? పలకరించుకునేలా ఏముందని మా మధ్య? ఆమె లేని నా జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నదా? అది చూసి నవ్వుకోవాలనుకుంటున్నదా? లేక ఏదన్నా సంతోషం మిగిలుంటే దాన్నికూడా తీసుకొని వెళ్ళాలనా? అసలెందుకు వచ్చినట్టు యూఎస్‌ నుంచి?.. వచ్చినా, నన్ను చూసిందే అనుకో, పట్టించుకోకుండా వెళ్లిపోవచ్చు కదా! గతంలో వదిలేసి వెళ్ళిపోయినట్టే’.
‘ఆమెకు అసలు ఇదంతా గుర్తుందా? ఎలా మర్చిపోతుంది? అయినా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? ఇక నేను వెళ్ళనా అని ఆమె నన్ను అడిగినప్పుడు నా మనసులో ఉన్నమాట చెప్పకుండా ఆమెను వెళ్లనిచ్చింది నేనే. ఆమె వెళ్ళిపోయాక ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తియ్యకుండా మొండిగా ప్రవర్తించింది కూడా నేనే. పాపం! తను మాత్రం ఏం చేస్తుంది ఇంకా!’-
సవాలక్ష ఆలోచనలు రహమత్‌ మనసులో సుడులు తిరిగాయి. ఆ క్షణంలోనే మళ్లొక్కసారి వినిపించింది.
“ఓయ్‌” అని.

మళ్లీ మళ్లీ వినాలనిపించే వాయిస్‌ ‘ఓయ్‌'. రహమత్‌ ఆలోచనలకు తెరపడింది. వెంటనే ఈ లోకంలోకి వచ్చాడు.
“హే... తులసి.. వినిపించలేదు సారీ.. ఎలా ఉన్నావ్‌?” అంటూ క్షేమసమాచారాలతో పొడిపొడిగా ముగించేశాడు. “హమ్మయ్య గుర్తున్నాను, అన్నమాట. పోనిలే” అంటుండగానే అప్పుడే అక్కడికి వచ్చిన ఓ అమ్మాయిని చూసింది తులసి. ‘ఎవరన్నట్టు’ సైగ చేసింది.
“She is Meher, my wife (ఆమె మెహర్‌. నా భార్య)” అని బదులిచ్చాడు రహమత్‌.
“Hi, I am tulasi, his class mate (హాయ్‌, నేను తులసిని. అతని క్లాస్‌మేట్‌ను)” అంటూ ఒక నిమిషం మెహెర్‌ని తదేకంగా చూసింది తులసి. ‘ఎంత చక్కగా ఉందో’ అని అనుకోకుండా ఉండలేకపోయింది.
బురఖాలో ఉంది తను, కానీ ఫేస్‌ కవర్‌ చేసుకోకుండా ఉండటం వల్ల ఆమెను చూడగలిగింది తులసి. పాలసముద్రంలో నుండి పుట్టినట్టు ఉంది తన రంగు. పెద్ద కండ్లు, నిండుగా ఉన్న నవ్వుముఖం. అదే హిందువులైతే ‘లక్షణంగా ఉన్నావమ్మా’ అని అనే వారు, ముస్లిమ్‌లు ఏమంటారో తెలియక అక్కడే ఆగిపోయింది తులసి.
“మెహెర్‌.. పేరు బావుంది.”
మెహెర్‌ ఏం చెప్పకుండా చిన్నగా నవ్వింది, బదులుగా.
రహమత్‌, తులసి మాట్లాడుకుంటున్నారు. రహమత్‌ని ఇంతకు ముందెప్పుడూ అంత ఆనందంగా చూడలేదు మెహెర్‌. ఇదే మొదటిసారి కావటంతో అలా చూస్తూ ఉండిపోయింది. కానీ, ఆ ఆనందానికి కారణం ‘తను కాదు వేరొకరు’ అని తెలిసినపుడు తనకు బాధేసింది.

ఈసారి తులసిని చూసింది. గుండ్రటి ముఖం, చిన్న కండ్లు, అందమైన నవ్వు. నీలం రంగు జీన్‌మీద గులాబీ రంగు టాప్‌ ఏదో వేసుకుంది. ఒకసారి చూసిన వారెవరైనా మరోసారి తిరిగి చూసేలా ఉందామె.
మెహెర్‌ చూపులని గమనించిన తులసి మాట కలిపింది.
“మనమే మాట్లాడేస్తున్నాం, పాపం తనకు బోర్‌ కొడుతుందేమో” అన్న మాటలకు మెహెర్‌ ఉలిక్కిపడింది.
తులసి మీదనుండి చూపు మరల్చింది.
“మెహెర్‌ పెద్దగా ఎవరితోనూ కలవదు. తనకు ఇల్లే ప్రపంచం. ఈ రోజు కూడా నేనే బలవంతంగా బైటకి తీసుకొచ్చాను” అన్నాడు రహమత్‌.
అతను అలా చెప్తుంటే తులసికి కాస్త అసూయ కలిగినా బయటికి కనిపించకుండా జాగ్రత్త పడింది.
“ఇంకా తులసీ.. ఒక్కదానివే వచ్చావా?”
“అహ! లేదు..”... ‘నా ఫ్రెండ్‌..’ అని చెప్తూ ఒక్క నిమిషం ఆగింది. ఆ క్షణంలో కొన్ని వేల ఆలోచనలు తనని ముసిరాయి. ఫ్రెండ్‌ అని చెప్తే ఏమనుకుంటారు? అయినా అనుకోవడానికి ఏముందని. ఫ్రెండ్‌ని ఫ్రెండ్‌ అని చెప్పటంలో తప్పేముంది, సరే చెప్పేస్తాను. తర్వాత పెండ్లయిందా? పిల్లలెంతమంది? లాంటి ప్రశ్నలు వేస్తే అప్పుడేం చెప్పాలి?
రహమత్‌ ఇంకా తన మనసులోనే ఉన్నాడనీ, అతన్ని కాదనుకొని ఇంకొక పెండ్లికి తను సిద్ధం కాలేదని ఎలా చెప్పగలదు? చెప్పినా రహమత్‌ ఇప్పుడేం చెయ్యగలడు? ఏం చెయ్యటం మాట అలా పక్కన పెడితే అతన్ని మెహెర్‌ జాలిగానో, కోపంగానో చూస్తే! తనకు దక్కనిది ఆమెకు దక్కిందన్న గర్వాన్ని ప్రదర్శిస్తే తను తట్టుకోగలదా.
అతని వల్లనే తను ఇలా ఒంటరిగా మిగిలిన విషయం తెలిస్తే రహమత్‌, మెహెర్‌తో సరిగా ఉండగలడా? ఇలా వచ్చి పడుతున్న ఆలోచనల తెంపరలు ఒక్కొక్కటీ ఒక్కో అలలా తనను తాకుతున్నాయి. అవి కొన్ని వేల టన్నుల బరువును మోసుకొస్తున్నట్టున్నాయి. ఆ బరువును ఎలా మొయ్యాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నది తులసి.
అప్పుడే ఓ పిలుపు చెవిన తాకింది. అది సంజయ్‌.

“హే వెళ్దామా?”
“Yeah (యహ)” అన్నది.
“మీట్‌ సంజయ్‌. మై హస్బెండ్‌. ఇతను రహమత్‌.. మై ఫ్రెండ్‌, అండ్‌ తను మెహెర్‌ హిస్‌ వైఫ్‌” పరిచయం చేసింది. సంజయ్‌కు తులసి చిన్నప్పటినుంచీ తెలుసు. ఆమె జీవితంలో జరిగే విషయాలు కూడా. అందుకే అనుకుంటా అతనేం బదులు మాట్లాడకుండా రహమత్‌తో హ్యాండ్‌షేక్‌ చేసి తులసివైపు జాలిగా చూసాడు.
కానీ, రహమత్‌ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. తను తులసితో మాట్లాడట్లేదు అనే కానీ తన గురించి వాకబు చేస్తూనే ఉన్నాడు. ‘తులసికి పెండ్లయింది. ఆ విషయం నాకు తెలియనే లేదు. కనీసం పిలువనే లేదు’ అని నొచ్చుకున్నాడు.
అతన్ని గమనించిన తులసి వెంటనే సంజయ్‌ను చూసింది ఏదో ఒకటి చెయ్యి అన్నట్టుగా.
“మీ ఫ్రెండ్‌ ఫస్ట్‌నుండి మొండిదేనా బ్రో..! పెండ్లి చేసుకోవటానికి నేను ఇంకొక జన్మ ఎత్తాల్సి వచ్చిందంటే నమ్మండి. చివరి మూమెంట్లో ఓకే చెప్పింది. అందుకే ఓకే చెప్పిన వెంటనే అస్సలు ఆలస్యం చేయకుండా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసేసుకున్నాం. మళ్ళీ ఎక్కడ మనసు మార్చుకుని వద్దంటుందో అని భయంతో” అని నవ్వాడు సంజయ్‌.
“అందుకే తన ఫ్రెండ్స్‌ను కలిసే అవకాశమే కలుగలేదు బ్రో నాకు. ఇప్పుడనిపిస్తుంది, అందరినీ పిలిచి గ్రాండ్‌గా మళ్లీ పెండ్లి చేసుకోవాలి అని.. కానీ కుదరదుగా” మళ్ళీ నవ్వాడు.
“యు ఆర్‌ లక్కీ” అని ఓ నవ్వుని ముఖంపైన అంటించుకొని అన్నాడు రహమత్‌.
“ఓకే బ్రో.. నా ఫ్రెండ్‌ పెండ్లి ఉంది ఈవెనింగ్‌, లేట్‌ అవుతుందేమో. మేము ఇంక బయల్దేరతాం” అన్నాడు సంజయ్‌. ఇంకాసేపు అక్కడే ఉండాలన్న తులసి ఆలోచనలు ఆగిపోయాయి.
“యా ..ఓకే” చెప్పాడు రహమత్‌.

మెహెర్‌ ఎప్పటిలానే నవ్వింది. మాములుగా మాట వరసకు కూడా ‘ఓసారి ఇంటికి రండి’ అని పిలవాలనిపించలేదు ఆమెకు.
“నైస్‌ మీటింగ్‌ యు బ్రో” అంటూ సంజయ్‌ పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశాడు.
“వెళ్దామా అంటూ” తులసిని చెయ్యి పట్టి అక్కడినుండి తీసుకొని వెళ్ళిపోయాడు.
రహమత్‌ మనసు మనసులో లేదు. తులసి వెళ్లిపోతున్నది.
వెళ్తున్నంతసేపు అలా చూస్తూ ఉండిపోయాడు. ‘మెహెర్‌ చూస్తుందేమో’ అన్న ఆలోచన కూడా అతనికి కలుగలేదు.
మెహెర్‌ కూడా ఏమీ అనలేదు. ఆమెకు తెలుసు, తన భర్త మోస్తున్న ప్రేమ బరువెంతో.
“యువర్‌ ఫ్రెండ్‌ ఈస్‌ నైస్‌” అన్న మెహెర్‌ మాటలకు రహమత్‌ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే, అతనికి తెలుసు మెహర్‌కు తన మనసు తెలుసని..!

రచయిత్రి చిరునామా:
అయ్యగారిపేట, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా
[email protected]

247
Tags

More News

VIRAL NEWS