కోలీవుడ్‌లో మెరిసిన టాలీవుడ్‌ భామ ఐశ్వర్యా రాజేశ్‌


Sun,August 25, 2019 02:07 AM

Aishwarya-Rajesh
తెలుగు కుటుంబంలో పుట్టి తమిళనాట మెరిసిన చిన్నది ఐశ్వర్యా రాజేశ్‌. ఇప్పుడు తెలుగు తెరమీద కనిపించింది. మొన్న రిలీజ్‌ అయిన హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ ‘కౌసల్య కృష్ణమూర్తి’లో లీడ్‌రోల్‌ చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. కోలీవుడ్‌ ఫేమస్‌ భామ ఐశ్వర్య టాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె గురించి.

- వినోద్‌ మామిడాల


ఐశ్వర్యా రాజేశ్‌.. ఎక్కడో విన్నట్టుకొడుతున్న ఈ అమ్మాయి ఎవరో కాదు. ‘మల్లె మొగ్గలు’ (1986) తొలి చిత్రంతో హీరోగా పరిచయమైన ‘రాజేశ్‌' కూతురు. రాజేశ్‌ తెలుగులో 54 సినిమాలు చేశారు. ఐశ్వర్య పుట్టి పెరిగింది చెన్నయ్‌లో. అప్పుడు తెలుగు చిత్రపరిశ్రమ అక్కడే ఉండడంతో చెన్నయ్‌లోనే చదువుకొని అక్కడే పెరిగింది.

చెన్నయ్‌లోని ఎతిరాజ్‌ ఉమెన్స్‌ కాలేజీలో బీకామ్‌ డిగ్రీ చదివింది. అప్పుడే కల్చరల్‌ ఆక్టివిటీస్‌లో పాల్గొనడానికి డ్యాన్స్‌ నేర్చుకుంది. ఐశ్వర్య మొదట యాంకర్‌గా తన జీవితాన్ని ప్రారంభించింది. కైలంజ్ఞర్‌ చానెల్‌లో ‘మానదా మైలదా’ అనే డ్యాన్స్‌ కాంపిటీషన్‌ షోకు యాంకర్‌గా చేసింది.

చూడడానికి కాస్త నల్లగా కనిపించడంతో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నది. ‘నువ్వు చచ్చినా హీరోయిన్‌ కాలేవ’ని చాలా మంది మొహం మీదే అన్నారట. కానీ ఇప్పుడు ఆమె దేశవ్యాప్తంగా పేరుపొందిన తమిళ హీరోయిన్‌.

2015లో ‘కాక్కా ముట్టయ్‌' (కాకి గుడ్డు) సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు పొందింది. మురికివాడల్లో నివాసం ఉండే పిల్లలకు పిజ్జా తినాలనే కోరిక గురించి తీసిన ఈ సినిమా జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించింది. పిల్లల తల్లిగా నటించిన ఐశ్వర్యకు కూడా ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టింది.

హిందీలో కూడా ఐశ్వర్య డాడీ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

‘హీరోయిన్‌ కావాలంటే తెల్లగా ఉండాలా? సైజ్‌ జీరో కావాలా? నేను నల్లగానే ఉంటాను. నేను నాలానే ఉంటాను. మంచి పాత్రలు ఎంచుకొని చేస్తాను’ అంటుందీ అమ్మడు

హీరోయిన్‌గా కాకుండా ఐశ్వర్య ప్లే బ్యాక్‌ సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా చేసింది. మొన్న వచ్చిన ‘ద లయన్‌ కింగ్‌' అమెరికన్‌ యానిమేషన్‌ సినిమా తమిల్‌ వెర్షన్‌లో ‘నాలా’ క్యారెక్టర్‌ వాయిస్‌ ఇచ్చింది.

తెలుగులో మొన్న కౌసల్య కృష్ణమూర్తితో మహిళా క్రికెటర్‌లకు బూస్ట్‌ ఇచ్చి అందరినీ ఆకర్షించిన ఐశ్వర్య, విజయ్‌ దేవరకొండతో మరో సినిమా ప్రాజెక్ట్‌లో ఉంది.

648
Tags

More News

VIRAL NEWS