సినీ తెలంగాణం


Sun,August 25, 2019 02:40 AM

movies
నిజాం సర్కార్‌ పాలనలో ఉన్న తెలంగాణ జిల్లాలన్నింటిలో తెలుగు, ఉర్దూ భాషలు అమల్లో ఉండేవి. తెలంగాణలోని తెలుగు భాష ఇతర ప్రాంతాల భాషతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఉర్దూ ప్రభావం కూడా తోడవ్వడంతో ఉర్దూ తెలుగు కలగలిసి ప్రత్యేక మాండలికం పుట్టుకొచ్చింది. తెలంగాణ మాండలికం దానికి భిన్నమైంది. దాన్నుంచే మన భాష, యాస పుట్టుకొచ్చాయి. ఆ మాండలికంలోనే అనేక జానపదాలు, ఉద్యమ గీతాలు పెనవేసుకున్నాయి. వాటితోనే ఉద్యమమూ పుట్టింది. రాష్ట్రం సాకారమయ్యాక మన భాష, యాస అన్ని రంగాల్లోనూ ప్రభావితం చూపుతున్నాయి. అందులో తెలుగు సినిమా పరిశ్రమ ఒకటి. ఒకప్పుడు పరిశ్రమలో తెలంగాణ యాస, భాషను కించపరచడమే ఉండేది. కేవలం కమెడియన్‌లకు, విలన్‌లకు మాత్రమే మన యాసలో డైలాగులు, పాత్రలు డిజైన్‌ చేసేవారు. కానీ, ఇప్పుడు ధోరణి మారింది. ఉద్యమ ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో సినీ పరిశ్రమ ఇప్పుడు తెలంగాణ భాషను, యాసను నమ్ముకునే సినిమాలు తీస్తున్నది. ఒకప్పుడు విలన్‌ల భాషగా మిగిలిపోయిన మన భాష హీరోస్థాయికి చేరింది. మన యాస ఇప్పుడు వెండితెరను ఏలుతున్నది. అయితే మన భాష, యాసే కాదు ఇక్కడి బతుకులు కూడా తెరకెక్కాల్సిన అవసరం ఉంది. వెండితెరపై తెలంగాణ భాషకు పట్టం కట్టాల్సి ఉంది. అప్పుడే ‘మన భాషకు పట్టాభిషేకం’ చేసినవారమవుతాం.

- మధుకర్‌ వైద్యుల, సెల్‌: 9182777409

movies2
movies1
మన దేశానికి 1947 ఆగష్టు 15న స్వాతంత్య్రం లభిస్తే.. తెలంగాణ ప్రాంత వాసులకు మాత్రం స్వేచ్చా వాయువులు పీల్చడానికి చాలాకాలం పట్టింది. అప్పటికి 20 ఏండ్లకు పూర్వమే పురుడు పోసుకున్న తెలుగు సినిమా ప్రస్థానంలో తెలంగాణ సినిమా వయసు చాలా చిన్నది. 1974లో శ్యామ్‌బెనగల్‌ తెరకెక్కించిన ‘అంకుర్‌' సినిమాతోనే తెలంగాణా కథా వస్తువుతో సినిమా మొదలయిందని చెప్పాలి. అయితే ఇది హిందీలో తెరకెక్కిన ఆర్ట్‌ ఫిల్మ్‌. 1975లో మాధవరావు దర్శకత్వంలో వచ్చిన ‘చిల్లరదేవుళ్లు’ సినిమా తెలంగాణా కథ, భాష, యాసలతో వచ్చిన తొలిసినిమా. దాశరథి రంగాచార్య రాసిన ‘చిల్లర దేవుళ్లు’ నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మించారు. ఆ తర్వాత తెలుగు సినిమా రంగంపై సీమాంధ్రుల ప్రభావంతో అప్పట్నించీ ఇప్పటివరకూ ‘తెలంగాణ సినిమా’ అని చెప్పగలిగిన సినిమాలు మొత్తం 100లోపే ఉన్నాయనేది వాస్తవం. అయితే ఈ సినిమాలన్నీ దాదాపుగా ఆర్ట్‌ సినిమాలు మాత్రమే. దీనికి కారణం ప్రధానంగా నిర్మాతల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నత స్థానాల్లో లేకపోవడమేనని నిస్సందేహంగా చెప్చవచ్చు. బాలీవుడ్‌, తెలుగు సినిమాల కోవలో కమర్షియల్‌ సినిమా లుగా ఇప్పటివరకూ తెలంగాణా సినిమాలు అంతగా రాలేదనే చెప్పాలి. అదే సమయంలో బి. నరసింగ రావు ఆర్ట్‌ ఫిలిం పార్మాట్‌లో తీసిన ‘మాభూమి’ సినిమా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కమర్షియల్‌గా మంచి వసూళ్లనే సాధించింది. ఆ తర్వాత కమర్షియల్‌ మెయిన్‌స్ట్రీమ్‌ కోణంలోంచి ఎన్నెన్నో తెలంగాణ నేపథ్య సినిమాలు ‘తెలుగు సినిమా’లో భాగంగా వచ్చాయి.
movies3

అచ్చ తెలంగాణం

తెలంగాణా సినిమాకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించి పెట్టిన వ్యక్తి బి.నరసింగ రావు! ఆయన ‘రంగుల కల’, ‘మా భూమి’, ‘మట్టి మనుషులు’, ‘దాసి’ వంటి చిత్రాలు తెలంగాణ మట్టిమనుషుల జీవితాలను వెండితెర మీదా ఆవిష్కరించాయి! ఆయన సినిమాల్లో తెలంగాణ సామాన్యుడే కథానాయకుడు. తెలంగాణ సమాజమే పాత్రలు. తెలంగాణ సినిమాకు మన నల్లగొండ, మన కరీంనగర్‌ కోటలు, గడీలు, తెలంగాణ సినిమాకు వాస్తవిక లొకెషన్లయ్యాయి. అందుకే ఆయన సినిమాల్లో తెలంగాణ భాష, యాస బతికింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సామాన్య రైతుల పోరాటాన్ని వాస్తవిక కోణంలో ఆవిష్కరించిన చారిత్రక చిత్రం మా భూమి! నాటి తెలంగాణ సినిమాల్లో పాట, పద్యం, నాటకం, బాగోతం, బుర్రకథ అన్నీ కూడా భాగంగానే ఉండేవి. ‘టప టప టప చమట బొట్లు తాళలై పడుతుంటే కరిగి కండరాలు స్వరాలు కడుతుంటే పాట పనితోపాటే పుట్టింది. పని పాటతోనే జతకట్టింది అన్నట్లు శ్రమలోంచి సేద దీర్చుకునే క్రమంలో ఉల్లాస కాసారంగా కళలు తెలంగాణ జీవితంలో భాగమయ్యాయి. అందుకే నాటి మన సినిమాల్లో ఈ కళలన్నీ సినిమాల్లోకి చొచ్చుకుపోయాయి. ఆ కళలన్నింటిలోనూ మన మట్టివాసన గుబాలించింది. ఆ పాత్రలకు తగ్గట్టే మన గోసి, గొంగడి, రుమాలు, తువాలు కాస్ట్యూమ్స్‌గా మారాయి. మన యాదగిరి, సమ్మన్న, ఎంకన్న, మల్లమ్మ, బుచ్చమ్మ సినిమా కథానాయకులయ్యారు. డప్పు, డోలు, కంజీర సంగీతాన్ని సృష్టిస్తే, ‘బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతవు కొడుకో నైజాం సర్కారోడా’, ‘ఊరు మనదిరా ఈ వాడమనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో, వారి పోకడెందిరో’ అంటూ సంధించే ప్రశ్నలే సాహిత్యమై విలసిల్లాయి.

ఆదాయం తక్కువేమీ కాదు!

నిజానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక పరిస్థితుల కోణంలోంచి చూస్తే తెలుగు సినిమాలన్నీ నక్సలిజం తిరుగుబాటు వంటి కథావస్తువులనే హైలెట్‌ చేసాయి. ఆయా కాలాలలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను ఈ సినిమాలు కమర్షియల్‌గా లాభసాటిగా మలుచుకోగలిగాయి. అలా ‘ఒసేయ్‌ రాములమ్మ’, ‘ఎన్‌కౌంటర్‌' వంటి సినిమాలు సక్సెస్‌ అయ్యా యి. అయితే తెలంగాణ సినిమా అనగానే కేవలం నక్సలిజం, తిరుగుబాటులను కథా వస్తువులుగా హైలెట్‌ చేస్తూ సినిమాలు తీసారే తప్ప ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేసినట్లు ఎక్కడా కనిపించదు. నిజానికి తెలంగాణ ప్రాంత కథను వస్తువులుగా ఎంచుకోవడానికి ప్రధానకారణం ఇక్కడి నుండి వచ్చే ఆదాయమనే చెప్పాలి. అవును తెలుగు సినిమా మార్కె ట్‌ తెలంగాణ ఏరియాకు బలమైన బాక్సాఫీస్‌ కెపాసిటీని కలిగి ఉంది. ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో తెలంగాణ ఏరియాను నైజాం ఏరియాగా పిలుస్తారు. ఇక్కడి ఆదాయం మొత్తం సినిమా ఆదాయంలో 45 శాతం వరకు ఉంటుంది.
movies7

వ్యాపారం ముదిరి కళ చెదిరి...

చెన్నై కేంద్రంగా తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్ల తెలంగాణ ప్రాంత భాష, యాస అదరణకు నోచుకోలేదు. ఆ తర్వాత సినిమా ఒక వ్యాపారం గా మారడంతో పాటు తెలంగాణ ప్రాంతం ఆర్థిక అసమానతలు, నైజాం పాలన ప్రభావం మూలంగా మన కళలు అంతగా ఆదరణకు నోచుకోలేదు. నర్సింగరావు వంటి ఒకరిద్దరు తప్ప మన ప్రాంత కళల్ని సినిమాల్లోకి చొప్పించే ప్రయత్నం చేయకపోవడం కూడా ఒక కారణం అయ్యుండవచ్చు. మన కళల్ని కళలుగా చూడడమే తప్ప వాటిని అమ్ముకుని సొమ్ముచేసుకోవడం తెలంగాణీయులకు ఇష్టంలేకపోవడం కూడా మరో కారణం. అందుకే సినిమా తెలంగాణ జీవితాల్లోకి వారి వ్యాపారాల్లోకి అనుకున్నంతగా, విస్తృతికి తగినంతగా చొచ్చుకుపోలేదు. 1931లో తెలుగులో తొలి టాకీ చిత్రం మొదలయింది. అప్పటికే తెలుగు సినీ పరిశ్రమపై ఆంధ్ర ప్రాంతానికి చెందిన పెత్తనం నడుస్తున్నది. నటీనటులు, రచయితలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు అందరూ ఆంధ్రులే. ఆంధ్రప్రాంతానికి ఆనుకొని ఉన్న నల్గొండ జిల్లా నుండి టి.ఎల్‌.కాంతారావు, ప్రభాకర్‌ రెడ్డి మినహా తొలినాళ్లలో తెలుగు సినిమాలో తెలంగాణ నటులెవరూ కనిపించరు. సి.నారాయణరెడ్డి, దాశరథి ఇద్దరూ పాటల రచయితలుగా సినిమాల్లో నిలదొక్కుకున్నారు. అట్లా నిలదొక్కుకోలేక తిరిగి వచ్చినవారూ ఉన్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచికి చెందిన చందాల కేశవదాసు తొలి తెలుగు టాకీ చిత్రమయిన భక్త ప్రహ్లాదకు సంభాషణలు, పద్యాలు రాశారు. అయితే ఇవ్వన్నీ కూడా తెలుగులో భాగంగానే మిగిలిపోయాయి. నిజానికి మన ప్రాంతానికి చెందిన అనేకమంది సినిమాలు తీసినప్పటికీ అవన్నీ తెలుగు సినిమా ఖాతాలోకే చేరాయి. కారణం తెలంగాణ భాష, యాసకు ప్రాధాన్యం లేకపోవడమే.

ఇంకొన్ని సినిమాలు

తెలంగాణ ప్రాంతీయులు నిర్మాతలు, దర్శకులుగా తెరకెక్కించిన కొన్ని చిత్రాల్లో తెలంగాణ యాసకు కొంత ప్రాధాన్యం కనిపిస్తుంది. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో కమర్షియల్‌గా విజయం సాధించాలంటే ఆంధ్ర తెలుగునే ఎంచుకోవలసిన పరిస్థితి. అయినా ధైర్యం చేసి మన యాసను ప్రవేశపెట్టడంలో మనవారు విజయం సాధించారనే చెప్పచ్చు. 1980లోనే బి.నర్సింగరావు నిర్మించిన ‘మా భూమి’, 1983లో బి.నర్సింగరావు తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రంగులకల’, దాసి, మట్టిమనుషులు, మావూరు, 1984లో నారదాసు లక్ష్మణరావు ఇతర మిత్రుల నిర్మాణంలో ’విముక్తికోసం’, 1990లో అల్లాణి శ్రీధర్‌ ‘కొమురం భీం’, 1996లో సానా యాదిరెడ్డి ‘పిట్టల దొర’, ఎల్‌. శ్రీనాథ్‌ దర్శకత్వం వహించిన ‘కుబుసం’ చిత్రాల్లో తెలంగాణ ప్రాంత భాష, యాసకు ప్రాధాన్యం దక్కింది. ఊరుమ్మడి బతుకులు, ఒక ఊరి కథ, టి.ప్రభాకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బతుకమ్మ’, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో ఉద్యమానికి అనుకూలంగా ఎన్‌.శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ’జై బోలో తెలంగాణ’, రఫీ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘ఇంకెన్నాళ్లు’, ఆర్‌.నారాయణ మూర్తి దర్శకత్వంలో వచ్చిన ‘పోరు తెలంగాణ’, వీర తెలంగాణ ఈ ప్రాంత భాషకు పెద్దపీట వేశాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే పైన పేర్కొన్న ప్రతి సినిమాకు ఒక ఉద్దేశం ఉంది. సామాజిక ప్రయోజన లక్ష్యం ఉంది. తెలంగాణ ముద్ర ఉంది.

విలన్‌కు కామెడీయై..

తెలుగు సినిమా మద్రాస్‌ నుండి హైదరాబాద్‌కు తరలివచ్చినా సినిమాల్లో మాత్రం మార్పురాలేదు. ఇంతకాలం తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష-యాసను ఉపయోగించిన తీరు ఈ విషయాన్ని స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నది. నిజానికి తెలుగు సినిమాల్లో నిర్మాత, దర్శకుడు, హీరో ఇలా అందరూ ఎక్కువగా కృష్ణాజిల్లాకు చెందినవారే ఉండేవారు. దీంతో సినిమాల్లో వారి భాషే ప్రామాణికంగా కొనసాగింది. అయితే ఆ తర్వాత గోదావరి జిల్లాల నుంచి దర్శకులు, నిర్మాతలు పుట్టుకొచ్చారు. గడచిన రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో వారిదే హావా. దీంతో ఇప్పుడు వెండితెర భాషంతా గోదావరి తెలుగునే. ఇక్కడే మరొక విషయం చెప్పుకోవాలి. తెలుగు సినిమా భాషగా గోదావరి తెలుగుకు ప్రాధాన్యత పెరిగిన క్రమంలోనే, సినిమాల్లో తెలంగాణ భాష, యాసను వాడటం మొదలయింది. అయితే ఇదంతా సినిమాల్లో కమెడియన్లకి, విలన్‌లకి, గూండా పాత్రధారులకి మాత్రమే పరిమితమైంది. అదే సమయంలో కొన్ని చిత్రాల్లో మాత్రం హీరోలను హైదరాబాదీలుగా చూపించిన సందర్భంలో కొంతవరకు మన భాషను వాడే ప్రయత్నం జరిగింది. అయితే అది పూర్తినిడివి పాత్రలకు మాత్రం కాకపోవడం గమనార్హం. అంటే తెలంగాణ ప్రాంతీయులను భాష తెలియని వారుగా, మన భాష, యాస నెగెటివ్‌గా చిత్రించే కుట్ర జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మన ప్రాంతం, భాష, సంస్కృతి మీద జరిగిన సాంస్కృతిక దాడిగా అభివర్ణించవచ్చు.

యాది మరిచిరి..

నిజానికి మన యాస భాష సినిమా మాధ్యమంలోకి చొప్పించడంలో కొంతమంది మినహా చాలామంది మనప్రాంత దర్శక నిర్మాతలు విఫలమయ్యారనే చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఆంధ్ర భాష ప్రభావం ఓ వైపు, తెలంగాణ యాసలో మాట్లాడితే చిన్నచూపు చూస్తారనే భావన మరోవైపు వారిని అడుగు ముందుకు వేయనీయలేదనే చెప్పాలి. మన భాష ఇతర ప్రాంతాల వారికి అర్థం కాదు అన్న ఒకే ఒక కారణం వారిని వెనుకకు గుంజిందనుకుందాం. కానీ ‘ఎవని వాడుక భాష వాడు రాయాలే. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తుదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలే. నే నెన్నోసార్లు చెప్పిన. భాష రెండు తీర్లు- ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష.. పలుకు బడుల భాష గావాలె..’తెలంగాణ రచయితల వేదిక ప్రథమ మహాసభలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన అధ్యక్షోపన్యాసంలోని మాటలివి. ఆయన ఆశించినట్లుగా మన భాష, యాసకు ప్రాచుర్యం కల్పించడంలో, జనబాహుళ్యంలోకి తీసుకుపోవడంలో సినిమా రంగంలో ఉన్న మనవాళ్లు చాలామంది విఫలమయ్యారనేది భాషాభిమానుల ఆరోపణ. జిద్దుకు మాట్లాడితేనే భాష బతుకుతది..’ అని కాళొజీ చెప్పినట్లుగా జిద్దుగా మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడుతున్నది. లేదంటే తర్వాత తరాలకు ఇక్కడి ప్రజల భాష వారసత్వం అందక చతికిల పడాల్సి వస్తుంది. భాషలోనే సంస్కృతి ఇమిడి ఉంటుందని సాహితీవేత్తలు చెప్పకనే చెప్పారు. దీన్ని గుర్తించే ఈ మధ్య సినిమాల్లో తెలంగాణ భాష, యాస అనివార్యమైంది.
movies4

మన యాస పరిమళం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత కూడా సినిమా భాష లో పెద్దగా మార్పేమీ రాలేదు. ఉద్యమ సమయంలో వచ్చిన కొన్ని చిత్రాల్లో తప్ప పెద్దగా కమర్షియల్‌ చిత్రాలేవి తెలంగాణ భాష, యాసకు అంతగా ప్రాధాన్యాన్నివ్వలేదు. అయితే ఉద్యమ పాటలు, కొన్ని సినిమాల్లో తెలంగాణ భాష, యాసలతో ఇది వరకు చాలానే చిత్రా లు వచ్చాయి. కానీ పూర్తి నిడివితో కొనసాగించిన చిత్రా లు మాత్రం అరుదే. అయితే ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తుందనిపిస్తున్నది. తెలుగు సినిమా రంగం ఇప్పుడు కొత్త ఆలోచనలో పడింది. తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవించే దిశగా కళ్లు తెరుస్తున్నది. మన భాష, యాసకు ఆదరణ పెరుగుతున్నది. ఇటీవల వచ్చిన సినిమాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నవి.

వరంగల్‌కు చెందిన నిర్మాత రాజ్‌ కందుకూరి పెళ్లి చూపులు సినిమాతో తాజా ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ తెలంగాణ యాసను విజయ్‌ దేవరకొండతో పలికించాడు ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. విజయ్‌ స్లాంగ్‌ సహజంగానే ఉండడంతో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. అదేవిధంగా తెలంగాణ స్లాంగ్‌లో ప్రియదర్శి చెప్పిన ఒక్కో డైలాగ్‌ నవ్వులు పూయించింది.

ఇక ఆ తర్వాత వచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం కూడా విజయ్‌ అదే యాసతో మెప్పించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తరువాతనే ఈ స్లాంగ్‌ కు ఇంకా డిమాండ్‌ పెరిగిందని చెప్పొచ్చు. ‘ఫిదా’ సినిమా కూడా ఇక్కడి ప్రజానీకాన్ని అమితంగా ఆకట్టుకొంది. నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం సాంతం తెలంగాణ పల్లె సంస్కృతిని కళ్లకు కట్టింది. మాటలూ తెలంగాణ యాసలోనే ఉండడంతో ప్రజలు ఫిదా అయ్యారు. ఈ సినిమా విజయవంతం కావడంతో తెలంగాణ మాండలికం, వాతావరణం, యాసలో మరిన్ని చిత్రాల్ని తీసేందుకు దారి చూపినట్లయింది. ఎఫ్‌2 సినిమాలో వరుణ్‌ తేజ్‌ తెలంగాణ స్లాంగ్‌లో అదరగొట్టేసాడు. ఫలక్‌నుమాదాస్‌లో అయితే పక్కా హైద్రాబాదీ స్లాంగ్‌ను వాడుకున్నాడు విశ్వక్‌సేన్‌. యువ హీరో రామ్‌ కూడా ఇస్మార్ట్‌ శంకర్‌తో పర్ఫెక్ట్‌ హైదరాబాద్‌ లాంగ్వేజ్‌తో అదరగొట్టాడు. కె.వి.ఆర్‌ మహేంద్ర దొరసాని చిత్రం పూర్తిగా మన తెలంగాణ నేటివిటీగా దగ్గరగా ఉంది. అంపశయ్య నవీన్‌ నవల ఆధారంగా తెరకెక్కిన జైనీ ప్రభాకర్‌ సినిమా ‘క్యాంపస్‌ అంపశయ్య’ కూడా మన భాషకు జీవం పోసింది. రాజ్‌.ఆర్‌ దర్శకత్వంలో వచ్చిన మల్లేశం, ఇంద్రగంటి మోహనకృష్ణ అమీతుమీ సినిమాను పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించాడు. హుషారు, పిట్టగోడ, నువ్వు తోపురా సినిమాలతో తెలంగాణ సంస్కృతిని టాలీవుడ్‌లో మరొక మెట్టు ఎక్కించారు. ఇకపై కూడా వరుసగా తెలంగాణ కథలు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మొత్తానికి ఇన్నాళ్లకు తెలంగాణ సినిమా వాళ్లకు పనికొస్తుందన్నమాట.

హైదరాబాదీ స్లాంగ్‌

తెలంగాణ సినిమాను కొత్త పుంతలు తొక్కిస్తున్న సినిమా హైదరాబాదీ సినిమా. హైదరాబాదీ జీవనశైలి, తెలంగాణ- ఉర్దూల సత్సంగమ సంస్కృతి పునాదులపై రూపొందిన ఈ సినిమా మొదట నగేష్‌ కుకునూర్‌ తీసిన ‘హైదరాబాద్‌ బ్లూస్‌'(1998)తో మొదలైందని చెప్పాలి. కేవలం పదిహేడు రోజుల్లో 17 లక్షల వ్యయంతో తీసిన ఈ సినిమా తెలుగులోనే కాక మొత్తం భారత సినీ రంగంలోనే ఒక సంచలనం. ‘హింగ్లిష్‌' సినిమాలుగా పేరు పొందిన ఈ సినిమా మళ్లీ 2002 నుంచి సరికొత్తగా పూర్తి ఉర్దూ- తెలంగాణ నేపథ్యంలో సరదా కథాంశాలతో హైదరాబాదీ సినిమాగా నిలదొక్కుకుంది. ‘అంగ్రేజ్‌', సినిమాతో ఆరంభమైన ఈ ధోరణి ‘హైదరాబాద్‌ నవాబ్స్‌', ‘జబర్దస్త్‌' వంటి సినిమాలతో ఊపందుకుంది.

మన పరిమళం విస్తరించాలి

సినిమాల్లో తెలంగాణ భాషను వాడడం ఆహ్వానించదగింది.గతంలో రౌడీలకు, విలన్లకు, కమెడీయన్లకు మాత్రమే వాడి పరిహాస భాషగా ఉండేది.ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆత్మగౌరవ ప్రకటన దిశగా నెమ్మదిగా చేరుకుంటున్నది. కథానాయకులు, నాయికలకు, ప్రధాన పాత్రలకు తెలంగాణ భాష వాడడం మంచి పరిణామం. న్యూనతలోంచి ఆత్మ విశ్వాసంతోని భాష ముందుకు పోతున్నందుకు తెలంగాణ భాష ప్రేమికులందరూ సంతోషిస్తున్నారు. అదే సమయంలో అనేక ఇతర భాషల పదాలు చేరటం వల్లనే తెలంగాణ భాష అవుతుందనే దురభిప్రాయం మానుకోవాలి. టైటిల్స్‌ కూడా తెలంగాణ తనం ఉట్టిపడేలా పెడుతున్నారు. తెలంగాణ భాష పరిమళం మరింతగా విస్తరించాలని కోరుకుందాం.
- నందిని సిధారెడ్డి, ఛైర్మన్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ
movies5

భవిష్యత్‌ మన సినిమాదే

సినిమాల్లో తెలంగాణ భాషకు గుర్తింపు, గౌరవం రావడం సంతోషం. తెలంగాణ భాషకు కూడా మార్కెట్‌ ఉంటుందని రుజువైంది. మెయిన్‌స్ట్రీమ్‌లో కూడా తెలంగాణ నేపథ్యంతో కూడిన కథలు, పాత్రల కథలు వస్తున్నాయి. అయితే పూర్తి తెలంగాణ ఆత్మతో కూడిన సినిమాలు రావలసిన అవసరం ఇంకా ఉంది. భవిష్యత్‌లో బాలీవుడ్‌, మరాఠీ సినిమాలాగా మెయిన్‌స్ట్రీమ్‌ తెలుగు ఉన్నప్పటికీ తెలంగాణ సినిమా తనదైన అస్తిత్వంతో ముందుకు వెళుతుందని నా అంచనా. మెయిన్‌స్ట్రీమ్‌ సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆధారం గా ఉంటాయి. కథాప్రాధాన్య చిత్రాలు మాత్రమే ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాయి. ఆ పాత్రను తెలంగాణ సినిమా పోషిస్తుందన్న విశ్వాసం నాకుంది. ఇది భాషతో మొదలైంది రెండవ దశలో తెలంగాణ ప్రాంతాలు ప్రామినెంట్‌ అవుతాయి. ఇక మూడవ దశలో తెలంగాణ జీవితాలు ఉంటాయి. చివరి దశలో మెయిన్‌స్ట్రీమ్‌ టాలీవుడ్‌ ఇండస్ట్రీగా ఉంటూనే తెలంగాణ సినిమా కూడా వస్తుంది.
- మామిడి హరికృష్ణ, డైరెక్టర్‌, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ
movies6

వచ్చేది సంపూర్ణ తెలంగాణ సినిమా

చిల్లరదేవుళ్ల దగ్గర నుండి తీసుకుంటే ఇతివృత్తం, నేపథ్యం, భాషలోని యాస, జీవితం తెలంగాణం అయి ఉండేది. ఆ తర్వాత సినిమా హైదరాబాద్‌కు తరలుతున్న సమయంలో కొన్ని క్యారెక్టర్లు అంటే విలన్లు, కమెడీయన్లు, క్యారెక్టర్‌ అర్టిస్టులకు మాత్రమే తెలంగాణ భాషను వాడడం మొదలైంది. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైనాక ఆ స్పిరిట్‌, స్పూర్తి సినిమాపై కూడా ప్రభావం చూపింది.దాంతో హీరో క్యారెక్టర్లకు కూడా భాషను తొడిగారు. అది కొంచెం అతికినట్లు ఉన్నప్పటికీ కూడా ఏదో తెలంగాణ మాట్లాడుతున్నాడు హీరో అనిపించుకునేలా భాషను వాడారు. ఇప్పుడు ప్రధానపాత్రలు కూడా మన భాషను మాట్లాడుతున్నాయి. తెలంగాణ వచ్చాక తక్కువ సంఖ్యలో తెలంగాణ సినిమాలు వచ్చినప్పటికీ బయోపిక్‌లు ఇతర సినిమాల్లో హైదరాబాదీ భాష, తెలంగాణ యాసను వాడుతున్నారు. ఇతివృత్తాలు, జీవితాలు కూడా తెలంగాణే కావడం హర్షనీయం. ఇది తొలిదశలో అయినా భవిష్యత్‌లో సంపూర్ణ తెలంగాణ నేపథ్యం గల సినిమాలు వస్తాయని ఆశిద్దాం.
- ఎన్‌.శంకర్‌, దర్శకుల సంఘం అధ్యక్షులు

2369
Tags

More News

VIRAL NEWS