వినాయక మంగళహారతి


Sat,August 31, 2019 11:47 PM

Gananadhudu6
శ్రీ శంభు తనయునకు సిద్ధిగణనాథునకును
వాసిగల దేవతా వంద్యునకును
జయమంగళము నిత్య శుభమంగళమ్

ఆ సరస విద్యలకు ఆదిగురువైనట్టి
భూసురోత్తమ లోకపూజ్యునకును ॥జయ॥

నేరేడు మారేడు నెలవంక మామిడి
దూర్వార చెంగల్వ ఉత్తరేణు
వేరువేరుగ దెచ్చి వేడ్కతో పూజింతు
పర్వమున దేవగణపతికి నిపుడు ॥జయ॥

సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు
పొసగ సజ్జనులచే పూజగొల్తు
శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము
పర్వమున దేవగణపతికి నిపుడు ॥జయ॥

పానకము వడపప్పు పనసమామిడి పండ్లు
దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు
తేనెతో మాగిన తియ్యమామిడి పండ్లు
మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు ॥జయ॥

ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ల మీదికి దండుపంపు
కమ్మనీ నెయ్యియు కడుముద్ద పప్పును
బొజ్జ నిండుగ దినుచును పొరలుచును ॥జయ॥

వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు
కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసికొని
దండిగా నీకిత్తు ధవళ హారతి ॥జయ॥
పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు
గంథాల నినుగొల్తు కస్తూరినీ
ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున
పర్వమున దేవగణపతికి నిపుడు ॥జయ॥

ఏకదంతమున ఎల్లగజ వదనంబు
బాగైన తొండంబు వలపు కడుపు
జోయిన మూషికము పరకనెక్కాడుచు
భవ్యుడగు దేవగణపతికి నిపుడు ॥జయ॥

మంగళము మంగళము మార్తాండతేజునకు
మంగళము సర్వజ్ఞ వందితునకు
మంగళము ముల్లోక మహిత సంచారునకు
మంగళము దేవగణపతికి నిపుడు ॥జయ॥

సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు
ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ
మరువమ్ము దర్భవిష్ణుక్రాంత
యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ॥జయ॥

కలువలు మారేడు గన్నేరు జిల్లేడు
దేవకాంచన రేగు దేవదారు
జాజి బలురక్కసి జమ్మిదాసన పువ్వు
గరిక మాచిపత్రి మంచి మొలక ॥జయ॥

అగరు గంధాక్షత ధూపదీప నైవేద్య
తాంబూల పుష్పోప హారములును
భాద్రపద శుద్ధ చవితిని కుడుములు
నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ॥జయ॥

పాయసము జున్ను తేనెయు భక్తిమీర
కోరి పూజింతు నిన్నెపుడు కొర్కెలలర ॥జయ॥

బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి
సంగతిగ శిశువునకు జలకమార్చి
మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు
రంగైన నా ప్రాణలింగమునకు ॥జయ॥

పట్టుచీరలు మంచి పాడిపంటలు గల్గి
ఘనముగా కనకములు కరులు హరులు
యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి
పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ॥జయ॥

ముక్కంటి తనయుడని ముదముతో నేనును
చక్కనైన వస్తుసమితి గూర్చి
నిక్కముగ మనమును నీయందె నేనిల్పి
ఎక్కుడగు పూజలాలింప జేతు ॥జయ॥

మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా
చల్లనైనా గంధసారములను
ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు
కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ॥జయ॥

దేవాధిదేవునకు దేవాతారాధ్యునకు
దేవేంద్ర వంద్యునకు దేవునకును
దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు
భవ్యుడగు దేవగణపతికి నిపుడు ॥జయ॥

చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు
తామరలు తంగేడు తరచుగాను
పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు
బహుబుద్ధి గణపతికి బాగుగాను ॥జయ॥

మారేడు మామిడి మాదీఫలంబులు
ఖర్జూర పనసలును కదళికములు
నేరేడు నెలవంక టెంకాయ తేనెయు
చాలగా నిచ్చెదరు చనువుతోడ ॥జయ॥

ఓ బొజ్జగణపయ్య ఓర్పుతో రక్షించి
కాచి నన్నేలు మీ కరుణతోను
మాపాల గలవని మహిమీద నెల్లపుడు
కొనియాడుచుందును కోర్కెదీర
జయ మంగళము నిత్య శుభమంగళము.. ॥జయ॥

వాయనదానం

శ్లో॥ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ
గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః
(ఈ శ్లోకము వాయన మిచ్చువారు చెప్పవలెను)
మంత్రము: దేవస్యత్వాసవితుః ప్రసవేశ్వినోర్చాహుఖ్యాం పూష్ణోహస్తాభ్యామా దదా!
(ఈ శ్లోకము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)
(పూజ చేసిన వారు ఈ క్రింది శ్లోకములను చెప్పుచూ
ఆత్మప్రదక్షిణ నమస్కారములను చేయవలెను)
శ్లో॥ యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాప కర్మాణాం పాపాత్మా పాప సంభవః
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష వినాయక!!
॥సర్వేజనాస్సుఖినోభవంతు॥
వినాయకుని వ్రతకల్పం సమాప్తం.

345
Tags

More News

VIRAL NEWS