టాప్‌లో.. టెంపుల్‌ జువెలరీ!


Sun,September 8, 2019 03:01 AM

నగలు ఎంత నాజూగ్గా ఉంటే అంత అందం..
ఇది ఒకప్పటి మగువల మాట.
ఎంత ఆడంబరంగా ఉంటే అంత సొగసు..
ఈ మాట నేటి మగువలది.
పైగా పాతకాలపు నగలకే నీరాజనాలు పడుతూ..
వాటిని గొలుసులు.. అరవంకీలు.. జుంకాలుగా..
ఇలా ఒక్కటేమిటి.. నఖశిఖపర్యంతం..
టెంపుల్‌.. యాంటిక్‌ జువెలరీలను..
తమ నగల లిస్ట్‌లోకి చేరుస్తున్నారు..
రత్నాలు.. వజ్రాలను ఇందులో చేరుస్తూ..
తమ ముచ్చట తీర్చుకుంటున్నారు..
మరి ఆ టెంపుల్‌ జువెలరీ సంగతేంటో చదువండి..

Gold
భారతదేశపు స్త్రీలకి బంగారం పేరు చెబితేనే ఒకలాంటి వైబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇక నగలపై మక్కువ లేని మగువ ఉంటుందా? చెప్పండి. రోజువారీ పెట్టుకొనే నగల నుంచి, పార్టీలు, ఫంక్షన్లు, పెండ్లిళ్లకు పెట్టే నగలు అన్నీ వేరువేరుగా ఉండాలని కోరుకుంటారు. నిలువెల్లా బంగారం చేయించినా ఇంకా ఏదో తక్కువ ఉందనే ఆలోచనే ఉంటుంది. నగల బరువు ఎక్కువా, తక్కువ అన్న సంగతి పక్కన పెడితే ఆ నగలు మరింత అందాన్ని పెంచాలనుకునే వాళ్లే చాలామంది. ఎప్పుడో కనుమరుగవుతున్న ఫ్యాషన్‌ని ఇప్పడు ట్రెండ్‌ అని బట్టల విషయంలో ఫాలో అయినట్టుగానే ఇప్పుడు నగల విషయంలోనూ అనుకోవాల్సి వస్తుంది.

ట్రెండ్‌ జువెలరీ..

బంగారం ధర పెరిగితే అమ్మకాలు తగ్గిపోతాయనుకుంటారు. దిగుమతులు తగ్గాయేమో కానీ పాత బంగారాన్ని కరిగించి కొత్త నగలు చేయించుకుంటున్నారు. ఈ అమ్మకాలు అధికంగానే జరుగుతున్నాయి. అందులోనూ రాళ్లు రత్నాలు పొదిగిన నగల కంటే కూడా వట్టి బంగరు నగలపైన ఆసక్తి పెరుగుతుందని కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇక అరుంధతి, రుద్రమదేవి, బాలీవుడ్‌లో దేవదాస్‌, కలంక్‌, జోధా అక్బర్‌లాంటి సినిమాల వల్ల టెంపుల్‌ జువెలరీకి మరింత ఆదరణ లభించిందని చెప్పొచ్చు. సింపుల్‌ జువెలరీ, మ్యాచింగ్‌ జువెలరీ, హెవీ వెడ్డింగ్‌ జువెలరీ అంటూ బోర్‌ కొట్టకుండా బంగారు నగలను ఎంచుకుంటున్నారు మగువలు. టెంపుల్‌, యాంటిక్‌ జువెలరీల్లో.. దేవుళ్లు, దేవతల విగ్రహమూర్తుల్లి పెండెంట్లుగా తయారు చేయించుకుంటున్నారు. వీటిని లోలాకుల్లోనూ లక్ష్మీదేవి, వినాయకుడి రూపాలే కాదు.. వెంకటేశ్వరస్వామి, కృష్ణుడి విగ్రహాలు ఎక్కువగా మనం ఈ జువెలరీలో చూడవచ్చు.
Gold1

చరిత్ర చెబుతున్నది..

భూమి గుండ్రంగా ఉంది అన్నట్టు.. ఫ్యాషన్‌ సైకిల్‌ నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్న పాత సామెత మన గోల్డ్‌ని చూసే అన్నట్టున్నారు. టెంపుల్‌ జువెలరీ 80, 90వ దశకాల్లో ఉన్నదేమోనని అనుకుంటారు. కానీ 9వ శతాబ్దంలోనే దక్షిణాది రాష్ర్టాల్లో ఈ జువెలరీ పుట్టిందని ప్రతీతి. క్లాసికల్‌ డ్యాన్సర్‌లకు ఈ జువెలరీ తరతరాలుగా వారసత్వంగా వస్తుందని అంటారు. కాకపోతే.. 16వ శతాబ్దంలో ఈ జువెలరీ ఎక్కువగా రాజ్యమేలిందని కొన్ని ఆధారాలు కూడా లభించాయి. అప్పటి రాజులు, రాణులు.. తర్వాత రాజ్యాన్ని పాలించిన ఇతర యంత్రాంగం మొత్తం ఈ జువెలరీతో ధగధగా మెరిసిపోయేవారట. పైగా గుడి గోపురాల మీద ఉండే బొమ్మల ఆధారంగా ఈ జువెలరీని తయారు చేయించేవారట. ఆ తర్వాత కాలంలో దేవతా విగ్రహాలకు కూడా ఇలాంటి నగలను తయారు చేయించి వేయడం ప్రారంభించారు.
Gold2

ఫ్యాషన్‌లో ప్రధానంగా..

ఆడవాళ్ల ఫ్యాషన్‌ ప్రపంచంలో నగలది ప్రత్యేక స్థానం. అందుకే ఒకప్పుడు వస్ర్తాల కోసం ఫ్యాషన్‌ షోలు చేసేవారు. ఇప్పుడు నగలకోసం కూడా ప్రత్యేకంగా ఫ్యాషన్‌ షోలు నిర్వహిస్తున్నారు. ఏడు వారాల నగల్లో కాసుల పేరుది ప్రత్యేక స్థానం. అది టెంపుల్‌ జువెలరీలో కూడా ప్రధాన స్థానాన్నే సంపాదించింది. అయితే ఈ టెంపుల్‌ జువెలరీని కేవలం కొన్ని అకేషన్లకు మాత్రమే పరిమితం చేస్తున్నారని ఫ్యాషనిస్టుల అంచనా. అలా కాకుండా అన్ని రకాల అకేషన్లకే కాదు.. అన్ని రకాల డ్రెస్సింగ్‌లపైన కూడా ట్రై చేయొచ్చు. నకాషీతో డిజైన్‌లో వచ్చిన నగలను వేసుకుంటే అచ్చు అమ్మవారిలా ఉంటారు. మోటిఫ్‌, పోల్కీలతో చేసిన జువెలరీ హెవీ చీరలు కట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ నగలు స్టేటస్‌ సింబల్‌గా మారిపోయాయంటే అతిశయోక్తి కాదేమో!
Gorgeous

సూపర్‌ అనిపించే డిజైన్లు..

పెద్ద పెద్ద గొలుసులు, చోకర్స్‌లాంటివి మీ మెడను మరింత అందంగా మారుస్తాయి. పైగా ఎక్కువ లక్ష్మీదేవి ప్రతిమను పెడతారు కాబట్టి మీ వెంటే లక్ష్మీదేవి ఉంటుందనే నమ్మకం కలిగిస్తాయి ఈ నగలు. గుడి గంటల్లా ఉండే చెవి కమ్మలు మీ చెవులను మరింత అందంగా చూపిస్తాయి. గాజులకు ఏనుగు బొమ్మలు, నెమళ్లతోపాటు లక్ష్మీదేవి ఉంటే మరింత శోభాయమానంగా కనిపిస్తాయి. మధ్యలో పెద్ద లక్ష్మీదేవి ప్రతిమ ఉండి.. చుట్టూ చిన్న చిన్నగా లక్ష్మీదేవిలు కొలువై ఉండే వడ్డాణం ఇప్పుడు హాట్‌ కేక్‌లా అమ్ముడవుతుందట. పూర్తి జడ కవర్‌ అయ్యేలా వచ్చే వాలుజడకు కూడా ఈ టెంపుల్‌ జువెలరీ వచ్చేసింది. పైన లక్ష్మీదేవి కొలువై ఉండి.. కిందవైపు జడలా అల్లుకొనే ఈ జువెలరీ పెండ్లికూతుళ్లకు ఎక్కువ ప్రియంగా ఉంది. మునుపటి కంటే కూడా ఈ టెంపుల్‌ జువెలరీ అమ్మకాలు పెరిగాయని బంగారు ఆభరణాల తయారీదారులు కూడా చెబుతున్నారు. దేశ, విదేశాల్లో సైతం టెంపుల్‌ జువెలరీకి ఆదరణ ముందుముందు మరింత పెరుగనున్నదట.
jewellery

ప్రత్యేకంగా ఈ నగలు..

నగలంటే.. బంగారమే! ఈ అపోహ కొన్ని రోజు ల వరకు ఉండేది. కానీ రానురాను ఈ నానుడి తగ్గిపోయింది. వన్‌గ్రామ్‌, వెండితో చేసిన నగ లు కూడా మగువల మనసు దోచడం ప్రారంభించాయి. దీంతో ఈ టెంపుల్‌ జువెలరీ ప్రత్యేకంగా ఈ మెటల్స్‌తో కూడా వస్తున్నాయి. ఇక బంగారంలో ప్రత్యేకంగా.. కెంపులు, ముత్యా లు, రుబీస్‌, కుందన్స్‌, డైమండ్స్‌, పోల్కా, మీనాకారీలతో ఈ జువెలరీని తయారు చేస్తున్నా రు. అన్‌కట్‌ స్టోన్స్‌ ఈ నగలకు మరింత అందా న్ని తెచ్చిపెడతాయనడంలో సందేహం లేదు. దేవ, దేవుళ్ల మూర్తులతో పాటు.. పువ్వుల డిజై న్లు, పక్షుల డిజైన్లను మనం ఈ టెంపుల్‌ జువెలరీలో చూడొచ్చు. టెంపుల్‌ జువెలరీని రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి.. రెగ్యులర్‌ టెంపుల్‌ జువెలరీ. మామూలుగా సంప్రదాయంగా జరిగే ఫంక్షన్లకు వీటిని ధరిస్తారు. కేవలం గొలుసులే కాదు.. బ్రాస్‌లెట్స్‌, చెవికమ్మలు, చోకర్‌, రింగ్స్‌ కూడా మ్యాచింగ్‌గా ఉండాలి. ఇంకొక రకం.. అకేషనల్‌ టెంపుల్‌ జువెలరీ. ఈ నగలను ప్రత్యేకంగా డ్యాన్సర్‌ల కోసం, పెండ్లికూతుళ్లు వేసుకొనే రకాలుగా వర్గీకరించారు. ఇందులో వంకీలు, పట్టీలు, జుట్టుకు చెందిన యాక్ససెరీస్‌ని కూడా జతచేస్తే చూడచక్కగా ఉంటారు.
-సౌమ్య నాగపురి

443
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles