సంతానభాగ్యం కలిగించే నాంపల్లి నరసింహస్వామి


Sun,September 22, 2019 12:22 AM

NAMPALLY
చుట్టూ పచ్చని చెట్ల్లు కనుచూపుమేర పంట పొలాలూ, ఓ వైపు మూలవాగు, మరో వైపు మానేరు వాగు... ఆ ప్రకృతి అందాలమధ్య ఎత్తైన గుట్టమీద ఐదు తలల సర్పాకారం... తలపై శ్రీకృష్ణుడి నృత్యరూపం.. ఆ గుట్టపై లక్ష్మీసమేతంగా కొలువై ఉన్న నరసింహస్వామివారి ఆలయం ఎంతో పురాతనమైంది. గుట్ట దిగువన పడగ విప్పిన సర్పాకారంలో పెద్దగా నిర్మించిన నాగదేవత ఆలయం అద్బుతాన్ని కళ్లకు కడుతుంది. ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగానూ భక్తుల పూజలందుకుంటున్న నాంపల్లి నరసింహస్వామి సంతాన నర్సింహుడుగా పూజలందుకుంటున్నాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ- కరీంనగర్‌ ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న నాంపల్లి గుట్టను పూర్వం నామపల్లిగా పిలిచేవారు. 600 సంవత్సరాల క్రితమే ఈ గుట్టపైన శ్రీలక్ష్మీనరసింహస్వామి వెలసినట్లు చెబుతారు. చోళుల కాలంలో స్వామి వారికి పూజాదికా లు జరిగినట్లు ఆధారాలున్నాయి. సహజ సిద్ధంగా ఓ వైపు మూలవాగు.. మరోవైపు మానేరు వాగు ప్రవహిస్తుంటా యి. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్ఠత లోపల ఉన్న అంజనేయస్వామి రాతి శిల. ఈ హనుమంతుడికి మం డల దీక్షలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం.

సంతాన నర్సింహుడు: కొత్తగా పెళ్లయిన జంటలు సంతానం కలగాలని మొక్కుకుని, కోరిక నెరవేరాక ఇక్కడ వనభోజనాలు చేస్తారు. రాజరాజనరేంద్రుడు, ఆయన సతీమణి కూడా స్వామివారిని సేవించి, సంతానాన్ని పొందినట్లు చారిత్రక కథనాలున్నాయి. క్రీ.శ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజనరేంద్రుడు వేములవాడ ప్రాంతాన్ని దర్శించి ఇక్కడి కోనేటికి మెట్లు కట్టించాడని చెబుతుంటారు. ఆయన భార్య రత్నాంగిదేవి ఈ గుట్టపైనే తపస్సు చేసి సారంగధరుడిని కుమారుడిగా పొందిందనేది చారిత్రక కథనం. ఈ కారణంతోనే పెళ్లైన కొత్త జంటలు సంతానం కల్గితే ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అందుకే, నాంపల్లి లక్ష్మీనర్సింహస్వామిని సంతాన నర్సింహుడనీ పిలుస్తారు. సంతానం కల్గిన దంపతులు, కోర్కెలు తీరిన భక్తులూ ఆలయం తూర్పువైపున ఉన్న రావి చెట్టుకు ముడుపులు కట్టి వెళ్తుంటారు.

నవనాథ సిద్ధులు: గుట్టపైన కొండచరియల మధ్య సహజ సిద్ధమైన రెండు కోనేరులున్నాయి. ఇక, ఆలయానికి పక్కనే ఉన్న చిన్నగుహలో శివలింగంతోపాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకూ పూజలు జరుగుతాయి. క్రీ.శ 9, 10 శతాబ్దాల్లో నవనాథ సిద్ధులు (తొమ్మిదిమంది) ఈ గుట్టమీద తపస్సు చేసి సిద్ధి పొందారట. వారు నిత్యం ఈ గుహనుంచి భూగర్భ సొరంగం ద్వారా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి వచ్చేవారట.

కాళీయ మర్దనం: ఇక్కడున్న మరో ప్రత్యేక ఆకర్షణ కాళీయమర్దనం. ఇది ఐదుతలల సర్పాకారంలో నిర్మించిన నాగదేవత ఆలయం. నాగుపాము తలపై శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవితో నృత్యం చేస్తున్న దృశ్యం కనువిందు చేస్తాయి. మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు రూ.50 లక్షలు వెచ్చించి గుట్ట దిగువ భాగంలో దీన్ని నిర్మించారు. గుట్టపైనుంచి చూస్తే చెట్ల మధ్యన చుట్టుకున్న కొండంత పాములా కనిపిస్తుంది. నాంపల్లిగుట్ట సింహం నిద్రిస్తున్న తీరులో ఉంటుంది. పామునోటిలోకి వెళ్తుంటే శ్రీలక్ష్మీనర్సింహస్వామి లీలలను తెలిపే రకరకాల శిల్పాలను ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ చూస్తూ చివరగా నాగదేవతను దర్శించుకోవచ్చు. నాంపల్లి గుట్ట ఆలయాన్ని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం అధికారులు 15 ఏళ్ల క్రితం దత్తత తీసుకొని దీని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ప్రధాన రోడ్డు నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా గుట్టపై వరకు అన్ని వాహనాలూ వెళ్లడానికి రోడ్డుసౌకర్యం ఉంది.

ఉత్సవాలు : శ్రావణమాసంలో సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. ఏటా నాంపల్లిగుట్టపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం, మహాశివరాత్రి వేడుకలు, శ్రావణమాసం ప్రత్యేక పూజలు, శ్రీరామనవమి, గోధారంగనాథస్వామి కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు.
NAMPALLY1

ఎలా వెళ్లాలి?

నాంపల్లిగుట్టకు చేరాలంటే రోడ్డు మార్గం ఒక్కటే ఉంది. హైదరాబాద్‌ మీదుగా రావాలంటే సిద్దిపేట, సిరిసిల్ల గుండా 152 కిలోమీటర్లు ప్రయాణించి వేములవాడ చేరుకోవాలి. అక్కడి నుంచి మూడుకిలోమీటర్ల దూరంలో నాంపల్లిగుట్ట దర్శనమిస్తుంది. కరీంనగర్‌కు 32 కిలోమీటర్ల దూరంలో వేములవాడ మార్గంలో ఉంది. జగిత్యాల మీదుగా వచ్చే వారు 55 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆర్టీసీ బస్సు సౌకర్యం, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.

4597
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles