అలంకరణకే కాదు ఆరోగ్యానికి కూడా..


Sun,September 22, 2019 01:13 AM

Plants
మొక్కే కదా అని పీకేస్తే ఎలా? చిన్న మొక్కలైనా.. తీగలైనా.. ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేసేవే. అందుకే చిన్న మొక్కైనా నాటేద్దాం. ఇంటి వెనుక పెరడు లేదంటారా.. అయితే ఇండోర్‌ ప్లాంట్స్‌ను నాటుదాం. చిన్న మొక్కలే అయినా ఆరోగ్యానికి, అలంకరణకు, పర్యావరణానికి మేలు చేస్తాయి. ఇలాంటి మొక్కలు నాటడానికి వానకాలం అనుకూలమైన సీజన్‌. అందుకే ఈ సీజన్‌ను వాడుకుందాం. ఇంట్లో పచ్చందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే మొక్కలేంటో తెలుసుకొందాం..

మొక్క జాతి ఏదైనా దాని ఉపయోగాలు బోలెడుంటాయి. ఇంట్లో అందానికి, అలంకరణకు, ఆరోగ్యానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ముళ్ల జాతి మొక్కలు, కూరగాయల మొక్కలు ఇలా అన్ని రకాల జాతుల మొక్కలు ఇంట్లో ఉండడం ప్రాణావసరం. నగరాల్లో అపార్ట్‌మెంట్లలో ఉండే వారికి అనువైన స్థలం ఉండదు. అందుకే టెర్రస్‌ మీద, ఇంటిలోపల కుండీల్లో బోన్సాయ్‌ మొక్కలు పెంచుకోవచ్చు. ఈ రకమైన చెట్ల నుంచి పండ్లు, కాయలు, పూలు లభించే మొక్కలు మార్కెట్‌లో దొరుకుతాయి. తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏండ్ల వరకూ పచ్చగా ఎదుగుతాయి. అట్లాగే ఇంటి ఆవరణలో కొంత స్థలం ఉంటే నీడనిచ్చే చెట్లను పెంచుకోవచ్చు. తీగజాతి మొక్కలతో పందిరి వేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇట్లా ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలు, వాటి ఉపయోగాలు ఇక్కడ చూద్దాం..ఔషధ మొక్కలు:

పెరట్లో, ఇంట్లో కుండీల్లో చాలా రకాల ఔషధ మొక్కల్ని పెంచవచ్చు. అవన్నీ వైద్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
చిన్న కుండీల్లో పెరిగే వీలున్న పుదీనా, తులసీ, కలబంద, మెంతి, కొత్తిమీర వంటి చిన్న జాతి మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
తులసి: ఆధ్యాయత్మిక ప్రయోజనాలతోపాటు ఆరోగ్యానికీ తులసీ ఉపయోగపడుతుంది. ఈ ఆకును నమిలి తిన్నా, ఆకు రసంలో తేనే కలుపుకొని తిన్నా గొంతుకు సంబంధించిన ఇబ్బందులు నయం అవుతాయి. ఆకలి తగ్గుదల, వికారం, తలనొప్పి, మొటిమలు, చిన్న చిన్న గాయాలు సులభంగా మానుతాయి.
పుదీనా, మెంతి: పుదీనాలో యాంటీఆక్సిడెంట్లు, యాంటి సెప్టిక్‌ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. కడుపునొప్పి, వాంతులు, అజీర్ణం, తలనొప్పి వంటి సమస్యలు తగ్గడానికి పుదీనా చక్కగా ఉపయోగపడుతుంది.
కొత్తిమీర: యాంటీఆక్సిడెంట్లు ఫ్లెవనాయిడ్లను అధికంగా కలిగి ఉంటుంది కొత్తిమీర. దీన్ని తీసుకోవడం వల్ల మూత్రాశాయ, కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జాండీస్‌, రక్త్తపోటు, డయాబెటీస్‌, ఉబ్బసం, కీళ్ల నొప్పులను నయం చేయడానికి కొత్తిమీరను వాడతారు.
Plants1
కలబంద: దలసరిగా కనిపించే కలబంద అందానికీ, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంట్లో పండించే కూరగాయల మొక్కలకు కలబంద గుజ్జును రాస్తే వాటికి ఉన్న హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. అలాగే విటమిన్‌ సి పుష్కలంగా ఉండే కలబంద గుజ్జు మౌత్‌వాష్‌గా బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోవడంలోను, జీర్ణకోశ సమస్యలను నియంత్రించుకోవడంలోనూ కలబంద మంచి పాత్ర పోషిస్తుంది.
వీటితో పాటు కుండీల్లో పెంచుకొనే అవకాశం లేని ఔషధ మొక్కలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఉసిరి, వేప . ఉసిరిలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. జుట్టు రాలడం, కంటి జబ్బులు, చర్మవ్యాధులు, జీర్ణకోశ వ్యాధులను ఇది నయం చేస్తుంది. వేప ఆకులో, పూతలో అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. చుండ్రు, మొటిమలు, చర్మవ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, కడుపులోని క్రిములను, మలేరియా, డయాబెటీస్‌ వంటి వాటిని నయం చేయడానికి వేప ఉపయోగపడుతుంది.

కూరగాయల మొక్కల తర్వాత ఎక్కువ మంది ఆసక్తి చూపేది పూల చెట్ల మీదనే. బంతి, చామంతి, బిళ్ల గన్నేరు, గులాబి, కనకాంబరం, డాలియా, లిల్లీ, జిన్నియా, డాలియా, జాస్మిన్‌, నందివర్దనం, బాల్సమ్‌ మొక్కలు కుండీల్లో పెరుగుతాయి. ఆరు బయట స్థలం ఉంటే మందార, గన్నేరు, గులాబీ, బంతి మొక్కలు ఎక్కువగా పెంచుకోవచ్చు. ఇవి పెరడుకు అందాన్ని ఇవ్వడంతో పాటు ఆహ్లాదభరితమైన పరిమళాలనూ వెదజల్లుతాయి. అందులో కొన్ని ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి.
Plants2

నందివర్ధనం

నందివర్ధనం కాండంలో పాలలాంటి లెటెక్స్‌ ఉంటుంది. ఇది చలువ చేస్తుంది. వాపులు, నొప్పులకు ఇది నివారిణిగా ఉపయోగపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Plants3

పూల చెట్లు...

బిళ్లగన్నేరు: బిళ్లగన్నేరును ఔషధ మొక్కగా కూడా పిలుస్తారు. చాలామందికి అలంకరణ మొక్కగానే తెలుసు కానీ ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. మొక్కలోని ఆకులు, పువ్వులు, వేర్లు అన్నీ ఎంతగానో ఉపయోగపడతాయి. క్యాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఆకుల పేస్ట్‌ను గాయాలపై, పుండ్లపై రాస్తే తగ్గుముఖం పడతాయి. వేళ్లను సేకరించి నీటితో బాగా శుభ్రం చేయాలి. వాటిని ఎండబెట్టి పొడి చేయాలి. అరగ్రాము పొడిని, ఒక టీస్పూన్‌ తేనెతో కలిపి తీసుకోవాలి.దీంతో డయాబెటిస్‌ దూరం అవుతుంది. రాత్రి ఆహారం తీసుకొనే ముందు, ఉదయం పరిగడుపున ఈ మొక్క ఆకులను, పువ్వులను అలాగే నమలడం వల్ల కూడా నెల రోజుల్లో మార్పు చూడవచ్చు. స్త్రీలు రుతు సమయంలో ఎదుర్కొనే సమస్యలకు నివారణకు ఉపయోగపడుతుంది. ఆరు నుంచి ఏడు ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిని తాగాలి. ఇలా నెలకోసారి చేయడం వల్ల ఎక్కువ రక్తస్రావం కాకుండా ఉంటుంది. ఈ మొక్క మొటిమలకు, ఒత్తిడికి, ఆందోళనకు, ముక్కు, నోటి నుంచి వచ్చే రక్తస్రావ నివారణకు ఉపయోగపడుతుంది.

మల్లె: మల్లెలు సహజ నిద్ర సహాయ కారిగా పని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
లావెండర్‌ : సబ్బుల్లో, షాంపూల్లో తదితర సువాసన కోసం ఈ లావెండర్‌ను ఉపయోగిస్తారు. నిజానికి ఈ మొక్క నిద్రలేమి, ఒత్తిడి నివారణగా ఉపయోగపడుతుంది.దీని సువాసన పీల్చడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
బంతి: బంతిలో యాంటీబయాటిక్‌ గుణాలుంటాయి. వ్యాధినిరోధక, క్రిమి నిరోధక ఔషధంగా పనిస్తుంది. దీని నుంచే పసుపు రంగు తీస్తారు.
గన్నేరు : కఫాన్ని, వాతాన్ని గన్నేరు నివారిస్తుంది. కుష్టువ్యాధి నివారణకు పని చేస్తుంది. చుండ్రు బాధనుంచి విముక్తినిస్తుంది.
Plants4

కూరగాయల మొక్కలు

కూరగాయలు, ఆకుకూరల మొక్కలు ఇంట్లో పెంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ ఖర్చు, సంరక్షణ చర్యలు కూడా అవసరం ఉండదు. సేంద్రియ పద్ధతిలో పెంచుకునేందుకు చక్కని అవకాశం ఉంటుంది. నిత్యావసరంగా ఉపయోగించే కూరగాయల చెట్లు కుండీల్లో కూడా సులభంగా పెరుగుతాయి. ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఎక్కువ మొక్కలను సాగు చేయవచ్చు.
- రోజూ ఆహారంగా తినే టమాట, మిరప, బెండ, గోరుచిక్కుడు, వంకాయ, క్యాబేజీ.. ఇవ్వన్నీ తేలికపాటి పెంచుకోదగ్గవే. సరైన విత్తనాలను ఎంపిక చేసుకొని కుండీల్లో నాటితే కొద్ది కాలంలోనే కూరగాయలను ఇస్తాయి. బాల్కనీల్లో, టెర్రస్‌ మీద కొంచెం పెద్ద సైజు కుండీల్లో కూడా వీటిని పెంచవచ్చు. వీటిని ఇంట్లో పెంచడం వల్ల రసాయనాలకు దూరంగా ఉంచగలుగుతాం కాబట్టి నాణ్యమైన కూరగాయలను ఇస్తాయి.
Plants5
- కొత్తిమీర, వెల్లి, ఉల్లి, ఆవాలు, మెంతులు, పాలకూర, తోటకూర, పుంటికూరతక్కువ స్థలంలో అయినా తొందరగా పెరుగుతాయి. వీటికి సస్యరక్షణ చర్యలు కూడా ఎక్కువ అవసరం ఉండదు.
- చిక్కుడు, దొండ, బీర, గుమ్మడి కాయ వంటి తీగజాతి మొక్కలు కుండీల్లో పెరుగుతాయి. వీటి తీగలను ఇంటిపైకి పంపవచ్చు. ఇంటి ఆవరణలో లేదా పెరట్లో, ఆరుబయట స్థలం ఉంటే వాటికి పందిరి ఏర్పాటు చేయవచ్చు.
Plants6

ప్రాణాలు కాపాడే పొప్పడి

ఆరుబయట పెరిగే చెట్టు పొప్పడి. మనిషి ప్రాణాలు కాపాడే శక్తిని కలిగి ఉంది. పొప్పడి పండు కన్నా ఆకులో ఎక్కువ ఔషధ గుణాలుంటాయి. మూడు పూటలా ఆకు రసాన్ని తీసుకోవడం వల్ల తెల్లరక్త కణాలు పెరుగతాయి. ముఖ్యంగా ఈ ఆకుల్లోని క్షారగుణాలు డెంగీ వైరస్‌ను నాశనం చేస్తాయి. డెంగీ సోకిన వారు పొప్పడి ఆకు రసాన్ని తీసుకుంటే వెంటనే ఫలితం ఉంటుంది. ఆకులోని పాపిన్‌, కార్పైన్‌ ఎంజైమ్‌లు రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఇందులో ఉండే విటమిన్‌-కె శరీరంలోని ఐరన్‌ సంగ్రహణాన్ని పెంచుతుంది. రక్తకణాల వృద్ధిలో ఈ ఆకు పాత్ర ఉన్నప్పటికీ దీన్ని వైద్యులెవరూ సూచించడం లేదు. కానీ మార్కెట్‌లో ఈ ఆకుతో తయారు చేసిన ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి.

643
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles