మృత్యువును స్వాగతించిన ఉక్కుమనిషి జేఆర్‌డీ టాటా


Sun,September 22, 2019 01:51 AM

JRD-Tata
అది 1993, నవంబర్‌.
స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలోని ఆసుపత్రి.

‘ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్షణం నిష్క్రమించక తప్పదు. అయితే ఆ నిష్క్రమణ ప్రశాంతంగా, ఇతరులను అంతగా ఇబ్బంది పెట్టని విధంగా వుంటే బాగుంటుంది కదా? తనను చూడడానికి వచ్చిన ఆత్మీయులతో జే.ఆర్‌.డీ టాటా అన్నమాటలివి. ఆ మాటలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. కోట్లాది సంపదకు అధిపతి, వేలాది మంది కార్మికుల ఆశాజ్యోతి, అందులోనూ ఒక దేశ ఆర్థిక పురోగతికి పునాది వేసిన వ్యక్తి అలా నిర్వేదంతో మాట్లడడం అందరినీ కలిచివేసింది. 80 ఏళ్ల వయస్సులోనే తన వ్యాపార సంస్థల చైర్మన్‌ బాధ్యతల నుండి తప్పుకున్నప్పటికీ ఇతర బాధ్యతలు తప్పకుండా చూడాల్సిన పరిస్థితి ఆయనది. దీంతో తరుచుగా విదేశీ పర్యటనలు, సమావేశాలు సాధారణంగానే సాగేవి. అలా 1993 సెప్టెంబర్‌లో తన 89వ ఏట విదేశీ పర్యటనకు బయలు దేరారు. విదేశాలలో ఉండగానే అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరారు. ముఖ్యంగా ఆయనకు యూరినరీ ఇన్ఫెక్షన్‌, విడవని జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి ‘ఉక్కు’పాలు పట్టించి, జాతి పురోభివృద్ధికి రెక్కలు తొడిగిన అజేయుడైన పారిశ్రామిక సార్వమౌముడు జెఆర్‌డి టాటా.

ఫ్రాన్స్‌లోని హార్డెలాట్‌ సిటీ.

అక్కడి బీచ్‌లో స్నేహితులతో కలిసి ఆడుకుంటూ పైన ఎరుగుతున్న విమానాన్ని చూశాడు చిన్నారి జే.ఆర్‌.డీ మొదట ఆశగా చూశాడు. తర్వాత ఆసక్తిగా చూశాడు. అతడి ఆశని, ఆసక్తిని చూసి - ‘మా డాడీకి చెప్పి జాయ్‌రైడ్‌కి తీసుకెళ్తాలే’ అని జే.ఆర్‌.డీ కి మాటిచ్చాడు ఒక స్నేహితుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఆ స్నేహితుడి తండ్రి పేరు బ్లేరియట్‌. లూయీ బ్లేరియట్‌. తర్వాత్తర్వాత ఆయనే జే.ఆర్‌.డీ కి ఆరాధ్యుడయ్యాడు. ఆయన స్ఫూర్తితోనే జే.ఆర్‌.డీ పాతికేళ్లలోపే పైలట్‌ అయ్యాడు! ముప్పై నిండకుండానే సొంత విమానయాన సంస్థకు ఓనర్‌ అయ్యాడు. చివరికి భారత పారిశ్రామిక రంగానికే పైలట్‌ అయ్యాడు.

జే.ఆర్‌.డీ. టాటా పేరు వినిపించినప్పుడు యావత్‌ భారతదేశం కంటే ముందు ముంబైలోని కేథడ్రాల్‌ అండ్‌ జాన్‌ కన్నన్‌ స్కూల్‌ ఉప్పొంగుతుంది. ఆయన చదువుకున్నది అక్కడే. ఆయనతో అనుబంధం ఉన్న సంస్థల యజమానులు, సన్నిహితులు, సాధారణ వ్యక్తులు, ప్రముఖులు, టాటా ఉద్యోగులు ఆయన్నొక వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా భావిస్తారు. ఆయన మాటల్లో అంతటి మంత్రం ఉంది మరి! నిజానికది మాటల్లోని మంత్ర శక్తి కాదు, జీవితాన్ని క్రమబద్ధం చేసుకున్న ఒక వ్యక్తి అనుభవాల నుంచి అనుక్షణమూ పలుకుతుండే అంతర్వాణి. చదువు పూర్తయ్యాక ఫ్రెంచి సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఈ భారతీయుడు... తండ్రి ఆదేశం మేరకు ఇండియా వచ్చి ‘ఇండస్ట్రియల్‌ దళపతి’గా దేశాన్ని నడిపించడం వెనుక ఆయన సామర్థ్యం ఎంత ఉందో, విధుల నిర్వహణలో ఆయన నెలకొల్పిన విలువల ప్రభావం అంతగానూ ఉంది. లాభాలతో బరువెక్కిన ప్రతిమ కాదు జె.ఆర్‌.డి. జీవితం. దేశభక్తి, వ్యాపారశక్తి కలిసి ప్రతిష్ఠించిన ఉత్తేజపూర్వక విగ్రహం.

లాక్‌హీడ్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్‌ ఫ్యాక్టరీ. క్యాలిఫోర్నియా.

గుయ్యిన విడిపరికరాలు తయారవుతున్నాయి. అన్నిటినీ కలిపితే జుయ్యిన పైకి ఎగిరే ఒక విమానం! ఆసక్తిగా చూస్తున్నాడు జే.ఆర్‌.డీ టాటా. ఎంత ఎత్తుకు ఎదిగింది అమెరికా! కానీ అక్కడొక లూయీ బ్లేరియట్‌ పుట్టకుండా ఎలా సాధ్యం? అదే ఆలోచిస్తున్నారు జే.ఆర్‌.డీ .లూయిన్‌ బ్లేరియట్‌... ఫ్రెంచి ఏవియేటర్‌! విమానాలు నడుపుతాడు. ఎలా నడుపుతాడంటే, ఎక్కినవాళ్లకు దిగాలనిపించదు. దిగాక కూడా దిగినట్లనిపించదు. భూమి గిర్రున తిరుగుతున్నట్లుంటుంది. అన్ని చక్కర్లూ కొట్టిస్తాడు. చెవులు పిండుతాడు. అతడి మీసాలు కూడా మీసాల్లా ఉండవు. విమానం రెక్కల్లా ఉంటాయి. పిల్లవాడిగా ఉన్నపుడు అతడి గురించి విన్నాడు జే.ఆర్‌.డీ కాస్త పెద్దవాడయ్యాక అతడిని నేరుగా చూశాడు. ఎగురుతున్న పక్షిని మొదటిసారి చూసినప్పుడు జే.ఆర్‌.డీ కి ఏమనిపించిందో తెలీదు. బ్లేరియట్‌ను చూసి నప్పుడు మాత్రం ఒకటనిపించింది. తను కూడా బ్లేరియట్‌లా విమానం తోకకు తాడు కట్టితిప్పినట్లు ఆకాశంలో గిరగిర తిప్పేయాలని! అలా జే.ఆర్‌.డీ కి హీరో అయ్యాడు బ్లేరియట్‌. పక్షులు చీకట్లో ఎగరవు నిజమే కానీ, బ్లేరియట్‌ను గుర్తుచేసుకుంటే జే.ఆర్‌.డీ నిద్దట్లో కూడా పక్షిలా మారిపోయి ఖండాలు దాటేస్తుంటాడు. ఇండియాలో తొలి పైలట్‌ లెసైన్స్‌ జే.ఆర్‌.డీ టాటాది. దాని వెనుక ఉన్న ఇన్స్పిరేషన్‌ బ్లేరియట్‌ది. లాక్‌హీడ్‌ కర్మాగారంలోని యంత్రాల కర్ణకఠోర ధ్వనులను శ్రావ్యంగా వింటూ - చేతులు వెనక్కు కట్టుకుని - ముందుకు నడుస్తున్నారు జే.ఆర్‌.డీ ఇండియా నుంచి పనిగట్టుకుని అక్కడికి వచ్చారు ఆయన. విమానాల్ని ఎలా మలిస్తే ఎలా నడుస్తాయో తెలుసుకోవడం కోసం వచ్చారు. అప్పటికి ‘ఎయిర్‌ ఇండియా’ లేదు. ఇండియాను స్వేచ్ఛగా ఎగరనిచ్చే స్వాతంత్య్రమూ లేదు. ఇండియాలో ఎప్పటికైనా - ప్రయాణికుల కోసం విమానాలను నడిపే కంపెనీ పెట్టాలన్న ఒకే ఒక ఆలోచన ఆయన్ని ఇంతదూరం రప్పించింది.

‘నేను ఒక కొత్తలోకంలోకి అడుగుపెట్టబోతున్నాను... అది చాలా ఆసక్తికరమయిన లోకం... నన్నెంతో ఆకట్టుకుంటున్నది’ కొత్తకాంతి నిండిన కళ్లతో ఆయన అంటుంటే అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా చూసే వా రు. ‘ఈ వయసులో నన్నెందుకు ఇబ్బంది పెడుతారు? నన్ను కళ్లుమూసుకుని మృత్యువుకోసం ఎదురు చూడనివ్వండి, హాయిగా ఇబ్బంది లేకుండా మరణించడం బాగుంటుందికదా’ అంటూ మరణాన్ని సైతం చిరునవ్వుతో ఆహ్వానించిన వ్యక్తి జహంగీర్‌ రతన్‌జీ దాదాబాయ్‌ టాటా (జే.ఆర్‌.డీ.టాటా). పేర్లకు షార్ట్‌కట్స్‌ ఉంటాయి, దారులకు షార్ట్‌కట్స్‌ ఉంటాయి కానీ కలలు నెరవేర్చుకోవడానికి, లక్ష్యాలకు దారులు వేసుకోవడానికి లాంగ్‌ అవర్స్‌..వెరీ లాంగ్‌ అవర్స్‌ పనిచేయాలి’ అన్నదే ఆయన విజయరహస్యం. ఆయన చివరిరోజు వరకు అదే కమిట్‌మెంట్‌తో పనిచేశారు. పనిచేస్తూనే ఈ లోకం నుండి సెలవు తీసుకున్నారు. ‘ఉక్కు’మనిషి జే.ఆర్‌.డీ.టాటా చివరిపేజీ..తండ్రి పిలుపుతో భారత్‌ చేరుకున్న జే.ఆర్‌.డీ టాటా 1925లో టాటా అండ్‌ సన్స్‌ కంపెనీలో వేతనం లేని అప్రెంటిస్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1938 నాటికల్లా టాటా అండ్‌ సన్స్‌ చైర్మన్‌గా ఎదిగారు. అప్పటికి అది భారత్‌లోనే అతిపెద్ద సంస్థ. ఇక భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకుని, 1929లో ఫ్రెంచి పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరుడిగా మారారు. ఒక వైపు టాటా సంస్థలో పనిచేస్తూనే ఉన్నా, ఆయన దృష్టి అంతా విమానయానంపైనే ఉండేది. తీరికవేళల్లో విమానం నడపడం నేర్చుకున్నారు.అప్పట్లో భారత్‌ను పరిపాలిస్తున్న బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి 1929లో పైలట్‌ లెసైన్స్‌ పొందారు. పైలట్‌ లెసైన్స్‌ పొందిన తొలి భారతీయుడిగా అరుదైన ఘనత సాధించిన జే.ఆర్‌.డీ టాటా అక్కడితో ఆగిపోలేదు. టాటా అండ్‌ సన్స్‌ సంస్థలో 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు.

తర్వాతి కాలంలో అదే ఎయిర్‌ ఇండియాగా మారి, భారత ఉపఖండంలోనే అతి పెద్ద విమానయాన సంస్థగా చరిత్ర సృష్టించింది. ఎయిర్‌ ఇండియా చైర్మన్‌గా ఆయన దాదాపు ముప్పయ్యేండ్లు సేవలందించారు. వైమానిక రంగంలో ఆయన నైపుణ్యానికి గుర్తింపుగా భారతీయ వైమానిక దళం ఆయనకు పలు గౌరవ పదవులను కట్టబెట్టింది. జే.ఆర్‌.డీ టాటా తన ఆధ్వర్యంలో టాటా గ్రూపును అపారంగా విస్తరించారు. టాటా మోటార్స్‌, టైటాన్‌ ఇండస్ట్రీస్‌, వోల్టాస్‌, ఎయిర్‌ ఇండియా, టాటా టీ, టీసీఎస్‌ వంటి సంస్థలకు పునాదులు వేశారు. వాటన్నింటినీ విజయవంతంగా లాభాల బాటలో నడిపించారు. వ్యాపార విజయాలతో సంతృప్తి చెందకుండా, ధార్మిక సేవా రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. సర్‌ దోరాబ్జీ టాటా ట్రస్టుకు ట్రస్టీగా సేవలందించారు. మంబైలో టాటా మెమోరియల్‌ సెంటర్‌ ఫర్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ ఆసుపత్రిని స్థాపించారు.ఇదే భారత్‌లోని మొట్టమొదటి క్యాన్సర్‌ ఆస్పత్రి.

శాస్త్ర సాంకేతిక, సామాజిక, కళా రంగాలలో మేలైన బోధన, పరిశోధనల కోసం టాటా ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, టాటా ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ వంటి సంస్థలను స్థాపించారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆయనకు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’తో సహా అనేక బిరుదులు, గౌరవాలు దేశ విదేశాల్లో దక్కాయి. అలాగని, తన కంపెనీలను లాభాల బాట పట్టించడం, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం మాత్రమే ఆయన ఆశయం కాదు. భారత్‌ ఆర్థికశక్తిగా ఎదగడం కంటే, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించే పరిస్థితులు కల్పించడమే తన ఆశయం అంటూ ‘భారతరత్న’ పురస్కారాన్ని స్వీకరిస్తున్నప్పుడు తన మనసులోని మాటను బయటపెట్టారు.

కార్పొరేట్‌ సంస్థలకు కార్మిక సంక్షేమం పెద్దగా పట్టదు. కార్మిక సంక్షేమ చట్టాలు ఎన్ని ఉన్నా, వాటిని అవి మొక్కుబడిగా మాత్రమే అమలు పరుస్తాయి. ఇప్పటికీ చాలా కార్పొరేట్‌ సంస్థలది ఇదే తీరు. అయితే, కార్మిక సంక్షేమానికి కట్టుదిట్టమైన చట్టాలేవీ లేని కాలంలో సైతం జే.ఆర్‌.డీ .టాటా తన సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం స్వచ్ఛందంగానే పలు పథకాలను అమలు చేసేవారు. అవి ఇప్పటికీ టాటా సంస్థల్లో అమలవుతున్నాయి. ఉద్యోగి ఇంటి నుంచి కార్యాలయానికి బయలుదేరిన సమయం నుంచే ‘ఆన్‌ డ్యూటీ’గా పరిగణించే పద్ధతికి ఆద్యుడు జే.ఆర్‌.డీ టాటా. తను గొప్ప వ్యక్తినని జే.ఆర్‌.డీ . ఏనాడూ, ఎక్కడా చెప్పుకోలేదు. కానీ ఆయన పేరు, ప్రస్తావన లేకుండా భారతదేశం గొప్పతనం గురించి మాట్లాడుకోవడం కుదరని పని. స్వాతంత్య్రం వచ్చాక దేశ పునర్నిర్మాణానికి వెన్ను అందించిన జే.ఆర్‌.డీ. రిటైర్‌ అయ్యేనాటికి ఆయన చేతికింద యాభైకి పైగా అత్యంత కీలకమైన పరిశ్రమలు ఉన్నాయి. పదివేల కోట్ల రూపాయలకు మించిన టర్నోవర్‌ ఉంది. స్టీల్‌, కెమికల్స్‌, ఏవియేషన్‌, ఇంజినీరింగ్‌, సైన్స్‌. వీటిల్లో కొన్ని... స్వాతంత్య్రానికి ముందే పుట్టినవి. జే.ఆర్‌.డీ పుట్టింది కూడా స్వాతంత్య్రానికి పూర్వమే.
JRD-Tata1

శాస్త్ర సాంకేతిక, సామాజిక, కళా రంగాలలో మేలైన బోధన, పరిశోధనల కోసం టాటా ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, టాటా ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ వంటి సంస్థలను స్థాపించారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆయనకు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’తో సహా అనేక బిరుదులు, గౌరవాలు దేశ విదేశాల్లో దక్కాయి.ఎవరు ఏ రంగంలో నిపుణులో గుర్తించి బాధ్యతలు అప్పగించి స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించడమే తన విజయరహస్యం అనేవాడు జే.ఆర్‌.డీ టాటా. ‘నాకు ‘ఎక్స్‌లెంట్‌' మనుషులు వద్దు. ఫర్పెక్ట్‌గా పనిచేసే మనుషులు కావాలి’ అన్నది ఆయన మాట. ఆయన తన 80 ఏళ్ల వయస్సులోనూ రోజూ రాత్రి పదిగంటల వరకు పనిచేసేవారు. దేవుడి పట్ల అంతగా ఆసక్తి చూపని టాటా ఛైర్మన్‌ పదవినుండి తప్పుకున్న తర్వాత ఎక్కువగా దైవచింతనలోనే గడిపారు. ఎక్కువగా చావును గురించే ఆలోచించేవారు. తన 89వ ఏట జెనీవా వెళ్లిన ఆయన అక్కడే అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యారు. విడువని జ్వరం, యూరినరీ ఇన్ఫెక్షన్‌, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఇక తన జీవితం ముగిసిన అధ్యయనం అని స్వయంగా ఆసుపత్రి వారికి చెప్పేవారట. అంతేకాదు, ‘నా వయస్సు 89 సంవత్సరాలు. ఇంకా బతకాలని లేదు’ అని నిర్వేదంతో మాట్లాడడమే కాకుండా భోజనం తీసుకోవడం కూడా మానేశారు. ఆసుపత్రి సిబ్బంది తినమని ఇబ్బంది పెడితే ‘నన్ను ఇబ్బంది పెట్టకండి. నన్ను కళ్లుమూసుకుని మృత్యువుకోసం ఎదురు చూడనివ్వండి’ అని వారితో అనేవారు. మూడు రోజులపాటు ఆయన ఆసుపత్రిలోనే కదలలేని స్థితిలో ఉన్నారు. మందులకు ఆయన శరీరం స్పందించడం మానేసింది. నవంబర్‌ 29,1993 తెల్లవారుజామున ఆయన జెనీవా నగరంలోనే తుదిశ్వాస విడిచారు. ప్యారిస్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

కార్పొరేట్‌ సంస్థలకు కార్మిక సంక్షేమం పెద్దగా పట్టదు. కార్మిక సంక్షేమ చట్టాలు ఎన్ని ఉన్నా, వాటిని అవి మొక్కుబడిగా మాత్రమే పాటిస్తాయి. ఇప్పటికీ చాలా కార్పొరేట్‌ సంస్థలది ఇదే తీరు. అయితే, కార్మిక సంక్షేమానికి కట్టుదిట్టమైన చట్టాలేవీ లేని కాలంలో సైతం జే.ఆర్‌.డీ .టాటా తన సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం స్వచ్ఛందంగానే పలు పథకాలను అమలు చేసేవారు. అవి ఇప్పటికీ టాటా సంస్థల్లో అమలవుతున్నాయి.- మధుకర్‌ వైద్యుల, సెల్‌: 9182777409

945
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles