యురేనియం పురాణం


Sun,September 29, 2019 03:08 AM

అనగనగా ఒక అడవి. మొన్నటి వరకూ ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ అడవిలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. దీంతో అడవంతా ఏకమైంది. సాధు జంతువుల్ని వేటాడే మృగాలు.. యురేనియం కోసం వచ్చే క్రూరమృగాల కోసం మాటు వేశాయి. గడ్డి పరకల్ని తినే సాధు జంతువులు.. ఆ గడ్డిపరకల్ని గడ్డపారలుగా చేసి పోరుకు సై అంటున్నాయి. విల్లు పట్టుకొని వేటకు వెళ్లే చెంచులు.. తమ పదునైనా బాణాలతో దారి కాస్తున్నారు. చెట్టు, పుట్ట మొదలుకొని.. ఆ అడవిలోని జీవజాలమంతా జాగృతమైంది. అభివృద్ధి పేరుతో యురేనియం జాడ కోసం వచ్చే ఆ క్రూరమృగాల జాడ చెప్పేందుకు చిరుగాలి సైతం ఉవ్విళ్లూరుతున్నది. ఆ జాడ అడవికి చేరిననాడు.. ప్రకృతి చేసేది భీకర యుద్ధమే. ఇంతకీ.. ఆ అందమైన అడవిలో అలజడి సృష్టించింది ఎవరు? నల్లమలలో యురేనియం తవ్వకాల యత్నాలు, ఫలితాలు, దుష్పరిణామాలు, ప్రజా పోరాటాలపై ఈ వారం ముఖచిత్ర కథనం.

-డప్పు రవి, సెల్: 9951243487

నల్లమల.. నవయవ్వనాన్ని ప్రపంచానికి వాగ్దానం చేయగల ఊయల. నాగేటి సాల్లలో సాగేటి నీళ్ళను స్వచ్ఛంగా పారించే జీవజల. ఉమ్మడి సంస్కృతిని, ఉద్యమ పద్యాన్ని ఉర్రూతలూగించే పోరు జల. నడుస్తున్న కాలానికే కాదు.. గడచిన కాలానికీ నల్లమల ఒక సాక్ష్యం. ప్రకృతి తత్వానికీ, ప్రతిఘటనా స్వరానికీ నల్లమల ఒక ఆజ్యం. అడవి తత్వానికీ, ఆదిమ సత్యానికీ నల్లమల ఒక నిదర్శనం. ప్రకృతి ఆరాధకులకు నిలువెత్తు సాక్ష్యం. అందుకే నల్లమల పేరు వింటేనే మది విప్పారుతుంది. మనసు పులకరిస్తుంది. ఏడాదికి ఒక్కసారైనా నల్లమల ఒడిలో సేదదీరాలనిస్తుంది. అన్ని రకాల మనుషులను, మనసులను అక్కున చేర్చుకుని ఓలలాడించగల ప్రత్యేకత నల్లమల సొంతం. తన రమణీయత, జీవవైవిధ్యంతో తెలుగునేలను పులకింపజేస్తున్న నల్లమలలో యురేనియం అలజడిని రేపింది.
Uranium

ఈ యురేనియం రగడ ఇప్పటిదికాదు. 1995లోనే యురేనియం కార్పొరేషన్ పెద్దగుట్టలో సర్వే జరిపింది. ఇక్కడ 18 వేల టన్నుల ఖనిజం ఉన్నట్టు భావించింది. 2003 ఆగస్టు 8న దీనిపై నల్లగొండ కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. 2005, 2008లో కూడా నల్లగొండలో స్థానికులను యురేనియం తవ్వకాలకు ఒప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి. 2001లో నల్లగొండ జిల్లా చిత్రియాల్, పెద్దగట్టు బ్లాకుల్లో 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సర్వే చేశారు. 2009లో మళ్లీ చిత్రియాల్‌లో 50 చ.కి.మీ. మేర సర్వే చేశారు. అప్పటి సర్వేల ఫలితాలతోనే ఇప్పటి ఈ మైనింగ్ వార్తలు. 2016 నాటి తెలంగాణ అటవీ అధికారుల నివేదికతో నిమిత్తం లేకుండా, తెలంగాణ ప్రభుత్వానికి-భారత అటవీశాఖకు ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి.. భారత అటవీ సలహా మండలి (ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ) నల్లమలలో యురేనియం సర్వేకు అనుమతులు ఇవ్వడం స్థానికుల్లో భయాన్ని పెంచింది. దీంతో యావత్ తెలుగుజాతి జాగృతమైంది. యురేనియం తవ్వకాలు జరిపి.. తెలుగు రాష్ర్టాలకు ప్రాణవాయువుగా ఉన్న నల్లమలను నాశయం చెయ్యొద్దని పోరుసల్పింది. ఈ క్రమంలో జాతి ప్రయోజనాలే ముఖ్యంగా పాలన సాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమంటూ అసెంబ్లీ సాక్షిగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. భవిష్యత్‌లో కూడా ఎలాంటి తవ్వకాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వబోదంటూ స్పష్టం చేసింది.

నాణ్యమైన యురేనియం ఇక్కడే

రాయలసీమ ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో, దక్షిణ తెలంగాణల్లో చాలా భాగాలను జియాలజీ శాస్త్రవేత్తలు కడప బేసిన్‌గా పిలుస్తారు. బేసిన్ ఉత్తర భాగం.. అంటే పాత మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతంలో అత్యంత నాణ్యమైన యురేనియం నిల్వలు ఉన్నాయనే విషయం శాస్త్రవేత్తలకు తెలుసు. 2018 జూన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సింపోజియం ఆన్ యురేనియం రా మెటీరియల్ ఫర్ ద న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్ : ఎక్స్‌ప్లోరేషన్, మైనింగ్, ప్రొడక్షన్, సైప్లె అండ్ డిమాండ్, ఎకనామిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ (యురామ్) సదస్సులో భారత అణుఇంధన శాస్త్రవేత్త ఎంబీ వర్మ ఒక పత్రం సమర్పించారు. పొటెన్షియల్ ఫర్ అన్‌కన్ఫర్మిటీ - రిలేటెడ్ యురేనియం డిపాజిట్స్ ఇన్ నార్తర్న్ పార్ట్ ఆఫ్ ద కడప బేసిన్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా అనే శీర్షికతో ఉన్న ఈ పత్రంలో.. ఇక్కడి యురేనియం నిల్వల వివరాలు ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా దేశంలో ఎక్కడ యురేనియం కోసం ప్రయత్నాలు చేసినా మంచి ఫలితాలు రాలేదు. కానీ, కడప బేసిన్‌లోని శ్రీశైలం పీఠభూమి (ప్రస్తుత అమ్రాబాద్ ప్రాంతం)లో ఎంతో నాణ్యమైన యురేనియం వనరులు ఉన్నాయి అని భారత ప్రభుత్వ అటవీ సలహా కమిటీకి ఇచ్చిన నివేదికలో భారత అణుఇంధన సంస్థ చెప్పింది. ఆ యురేనియాన్ని ఇప్పుడు తవ్వి తీయాలనేది సంస్థ ఉద్దేశం.

అణుఇంధన సంస్థ ఏం చెబుతున్నది?

ఇప్పటికిప్పుడు, అమ్రాబాద్‌లో యురేనియం తవ్వడానికి తుది అనుమతులు రాలేదు. కానీ, యురేనియం ఎక్కడ ఉంది? ఎంత ఉంది? ఎలా ఉంది? ఎంత లోతులో ఉంది? తవ్వితే లాభమా? కాదా? వంటి వివరాలు తెలుసుకొనేందుకు చేయాల్సిన సర్వే, పరిశోధనా పనులకు మాత్రమే అనుమతి వచ్చింది. యురేనియం సంస్థ రహస్య పద్ధతులకూ, ఆ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతూ, ప్రాథమిక అనుమతులు వచ్చిన తీరునుబట్టి సర్వేకు అనుమతిస్తే.. వాస్తవ మైనింగుకు అనుమతివ్వడం పెద్ద సమస్య కాబోదని స్థానికులు, ప్రజా సంఘాలు భావిస్తున్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం.. అమ్రాబాద్ ప్రాంతంలో దాదాపు 4 వేల బోర్లు వేసి భూమినుంచి శాంపిళ్లు తీసుకుంటారు. ఒక్కో బోరూ 4నుంచి 6అంగుళాల వ్యాసంతో ఉంటుంది. ఒక్కో బోరుకీ గరిష్టంగా పది మీటర్ల స్థలం కావాలి. దానివల్ల జీవ జాతులకూ, భూమికీ ఏ సమస్యా ఉండదు. ఈ స్థలాలు ఐదేళ్లపాటు కావాలి. ఒక్కో బోర్ వేయడానికి 2నుంచి 30 రోజులు పడుతుంది. ఈ మొత్తం ప్రాజెక్టు విలువ రూ.45 కోట్లు అని అటవీ అనుమతుల కోసం పంపిన నివేదికలో రాసింది అణుఇంధన సంస్థ. ఈ ప్రక్రియకు అసలు పునరావాస సమస్య ఉత్పన్నం కాదనీ, తాము తవ్వకాలు జరపాలనుకుంటున్న ప్రాంతంలో గిరిజనులుగానీ, ఇతర కుటుంబాలుగానీ లేవని నివేదికలో పేర్కొన్నారు. అడవులకు కూడా ఎలాంటి నష్టం రాదని అణుఇంధన సంస్థ దక్షిణ ప్రాంతీయ డైరెక్టర్ ఎంబీ వర్మ తన నివేదికలో రాశారు. మొత్తం 83 చదరపు కి.మీ. విస్తీర్ణంలో (నాగార్జునసాగర్ వైల్డ్‌లైఫ్ మేనేజ్మెంట్ డివిజన్లో 7 చ.కి.మీ., అమ్రాబాద్ టైగర్ రిజర్వులో 76 చ.కి.మీ.) యురేనియం సర్వే, ఎక్స్‌ప్లోరేషన్ కోసం దక్షిణ భారత ప్రాంతీయ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ అనుమతి కోరింది. జాతీయ ప్రాధాన్యం దృష్ట్యా సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ. పూర్తి వివరాలూ పత్రాలూ ఇచ్చాక తుది అనుమతులపై నిర్ణయం ఉంటుందని తెలిపింది.

సేవ్ ఆదివాసీ..

నల్లమల అంటేనే చెంచులు. చెంచులు అంటేనే నల్లమల. వీరు ఈ అడవిలో అంతర్భాగం. ఈ నేలపై అత్యంత అరుదైన మానవజాతిగా ఉన్న చెంచులు నల్లమలకే ప్రత్యేకం. వీరు ఇప్పటికీ ప్రకృతి మనుషులే. అడవిని అక్కడి పక్షులను, జంతువులను, చెంచులను వేరు చేసి చూడలేము. ఈ ఆదిమజాతే మొదటినుంచి నల్లమలను కాపాడుతూ వస్తున్నది. చెంచు అనే పదం చెట్టు నుండి వచ్చిందని, అడవిలో చెట్లకిందనే వీరి నివాసం కాబట్టి చెంచులు అయ్యారని ప్రొఫెసర్ అయ్యప్పన్ లాంటి చరిత్రకారుల అభిప్రాయం. శ్రీలంకకు చెందిన వెద్దా జాతి ఆదివాసీలకు వీరికి పోలిక ఉందని, ఆ పొడవాటి దవడ, చప్పిడి ముక్కు, రింగుల జుట్టు, పొట్టిగా, నల్లగా, బలహీనమైన శరీరాకృతితో వీరు ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం. అంబు, వేటకత్తి, గొడ్డలి, కుక్క వారి ఆస్తిపాస్తులు. శ్రీశైలం మల్లికార్జునస్వామి చెంచు మల్లయ్య అవతారమని, తమ బిడ్డ చెంచు లక్ష్మిని పెండ్లి చేసుకున్నాడు కనుక శివుడు తమ ఇంటి అల్లుడని వారు నమ్ముతారు. శ్రీశైలం ఆలయ ప్రాకారంపై కూడా చెంచులు వేటాడుతున్న శిల్పాల్ని మనం చూడవచ్చు. ఆలయ పూజారులుగా గజ్జల కొండడు, మల్లయ్య తాత దొర వంటి చెంచులు ఉండేవారు. కాలం గడుస్తున్న కొద్దీ, ఆలయం ఆధునీకరణ జరుగుతున్నా కొద్దీ అడవి బిడ్డల ఆలనాపాలన నుంచి అర్చకుల ఆక్రమణకు గురైంది. వేల ఏండ్లుగా శ్రీశైల యాత్రికులను అడవి జంతువుల నుండి రక్షిస్తూ ఆలయానికి చేర్చేవారు. వీరు నివసించే ప్రాంతాలను పెంట అని అంటారు. శ్రీశైలం చేరేవరకు యాత్రికులను ఒక పెంటవారు మరో పెంటవారికి అప్పగించేవారు. ఇలా జంతువుల నుండి రక్షించి అక్కడకి చేర్చినందుకు మెట్టమరాసిగా అణా తీసుకునేవారు. అడవికి వచ్చిన వారికి సహాయపడటం తప్పితే దోచుకోవడమో, ఘర్షణ పడటమో వారికి తెలియదు. వారికి దాచుకోవడమే తెలియదు. వారు ఏ పూట తిండి ఆ పూటకే సేకరించుకుంటారు. ఉన్నప్పుడు తినడం లేనప్పుడు పస్తులుండటం మాత్రమే వారికి తెలుసు. వారి జీవన విధానం అటవీ ఆవరణ వ్యవస్థలో ఒక అంతస్తుగా పరిగణించాలి. చెంచు గడ్డలు, ఎర్రోలి గడ్డలు, బోడ గడ్డ, జూల గడ్డ, పచ్చేరు గడ్డలు, కందమూలాలు, తునికి పండ్లు, మర్రిపండ్లు, చిటుమటి పండ్లు, జంతు మాంసం, ఉడుము కూర సేకరించి ఇష్టంగా తింటారు. ఈ ఆహార సేకరణ అంతా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే విధంగానే ఉంటుంది. ఇప్పటికే యునెస్కో ప్రకటించిన అంతరించిపోతున్న జాతుల జాబితాలో చెంచులు ఉన్నారు. 2015 నాటికి ఐటీడీఏ లెక్కల ప్రకారం నల్లమల 5 జిల్లాల్లోని 47 మండలాల్లో 338 చెంచు పెంటలున్నాయి. 10,671 కుటుంబాల్లో 41,780 మంది చెంచులు ఉన్నారని నాటి లెక్కలు చెబుతున్నాయి. వీటిల్లో కొన్ని తప్పుడు లెక్కలున్నాయని క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ప్రజాసంఘాల నాయకులు, పాత్రికేయులూ చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 84 పెంటలుండగా 8500 మంది లోపే చెంచులున్నారని, వారు కూడా మరణం అంచున బతుకుతున్నారని పాత్రికేయులు ప్రకటిస్తున్నారు. ఇలాంటి అరుదైన, అపురూపమైన జాతిని కాపాడుతుంది నల్లమల.

అణువిద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా..

తెలుగు రాష్ర్టాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. కేంద్రం ముందడుగు వేయడానికి కారణం అణువిద్యుత్. దీనిని 6,780 మెగావాట్ల నుంచి 40 వేల మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నది మోదీ సర్కార్. కేంద్ర విద్యుత్‌శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ లెక్కల ప్రకారం భారత్‌లో అణువిద్యుత్ వాటా కేవలం 1.9 శాతమే. 2019 జులై 31 నాటికి దేశంలో బొగ్గునుంచి 1,95,810 మెగావాట్లు, లిగ్నైట్‌నుంచి 6,260, గ్యాస్‌నుంచి 24,937, డీజిల్‌నుంచి 638, నీటినుంచి 45,399, తరిగిపోని వనరుల (గాలి, సూర్యుడు మొదలైనవి) నుంచి 80,633 మెగావాట్ల విద్యుత్ వస్తున్నది. ఇక 6,780 మెగావాట్ల విద్యుత్ అణుపదార్థాల నుంచి ఉత్పత్తి అవుతున్నది. 2030నాటికి అణువిద్యుత్ ఉత్పత్తిని ఇప్పుడున్న 6,780 మెగావాట్ల నుంచి 40 వేల మెగావాట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిని చేరుకోవాలంటే చాలా యురేనియం కావాలి. ఇప్పుడు కెనడాతోపాటు పలు దేశాలనుంచి భారత్ యురేనియం దిగుమతి చేసుకుంటున్నది. దిగుమతులకు అదనంగా, దేశంలో జార్ఖండ్‌లోని జాదూగూడ, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా తుమ్మలపల్లె వంటి చోట్ల యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో కొత్తగా 13 ప్రాంతాల్లో ఈ ఖనిజాన్ని తవ్వాలని భారత అణుఇంధన సంస్థ ప్రయత్నాలు చేస్తున్నది. ఆ కొత్త ప్రాంతాల్లో మన నల్లమల ఒకటి.
Uranium1

మన ప్రభుత్వం అండగా ఉన్నది..

మన దేశంలో ఏడాదికి 300 రోజులు సూర్యతాపం ఉంటుంది. కాబట్టి కావాల్సినంత విండ్ పవర్, సోలార్ పవర్ ఉత్పత్తి చేసుకోవచ్చు. మనదగ్గర సంప్రదాయేతర విద్యుత్ వనరుల్లో మనం 7.3 శాతం మాత్రమే వాడుతున్నాం. దీనిలో ఇంకా 93 శాతం వాడుకోవచ్చు. ఇన్ని ప్రత్యామ్నాయాలున్నా పనిగట్టుకొని ప్రమాదాన్ని పురిగొల్పడం దేనికి? లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగు నీరు అందించే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌లను విషతుల్యం చేయడం దేనికి? నల్లమలలో చేసే యురేనియం మైనింగ్ వల్ల మనగాలి, మన నేల, మన నీరు కలుషితమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అక్కడున్న స్థానికులకే కాదు.. దాని పర్యావసానాలు మనకూ కనిపిస్తాయి. అందుకే నల్లమలలో యురేనియం తవ్వకాలు వద్దని అంటున్నాం. మన ప్రభుత్వం మన వెనకాలే ఉన్నది. మనందరి గురించి పోరాడదామని ముందుకొచ్చింది. అందరూ స్వప్రయోజాలు చూసుకోకుండా.. మన భావితరం కోసం కలిసిరావాలి.
- విజయ్ దేవరకొండ, సినీనటుడు
Uranium2

సేవ్ నల్లమలకు భారీ స్పందన

నల్లమలలో యురేనియం తవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ జాతి జాగృతమైంది. ప్రాణవాయువులను అందిస్తున్న అడవితల్లిని కాపాడడానికి #SaveNallamala, #StopUranium పేరుతో ఉద్యమం ఊపందుకున్నది. ప్రజాసంఘాలు ప్రత్యక్షంగా పోరాటం చేశాయి. యురేనియం తీవ్రతపై కరపత్రాలు, పుస్తకాలు ముద్రించి.. నల్లమల పరిసరప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. అంతేకాకుండా నల్లమల ప్రాంతాల్లో ధర్నాలు, నిరసనలు చేపట్టారు. సర్వే కోసం వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకున్నారు. ఈ పోరాటానికి సినీ ప్రముఖులు సైతం మద్దతుగా నిలిచారు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో.. పోస్టులు, వీడియోల ద్వారా మద్దతు తెలిపారు. ఎంతోమంది యువత తమ సోషల్‌మీడియా ఖాతాలకు సేవ్ నల్లమల డీపీలు పెట్టుకున్నారు. ఇక యురేనియం తవ్వకాల అనుమతులను రద్దు చేయాలని కోరుతూ డీవైఎఫ్‌ఐ విద్యార్థి సంఘం చేంజ్ డాట్ ఆర్గ్ వెబ్‌సైట్ సహాయంతో ఆన్‌లైన్ పిటీషన్ వేసింది. దీనికి దేశవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. రెండు లక్షల మందికిపైగా యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో తమ మద్దతు తెలిపారు.
Uranium3

అసలెందుకీ యురేనియం?

అణువిద్యుత్ ఉత్పత్తిలో, అణ్వాయుధాల తయారీలో యురేనియం ఎక్కువగా వాడుతారు. ఇదొక రేడియో ధార్మిక పదార్థం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేడియో ధార్మిక పదార్థాల్లోకెల్లా యురేనియం వాడకమే ఎక్కువ. ప్రపంచంలో అతి ఎక్కువగా తవ్వితీసే రేడియోధార్మిక పదార్థం యురేనియమే. బొగ్గు, నీరు, గాలి, సూర్యుడి నుంచి కరంటు తీసినట్టే అణు పదార్థాల నుంచి కూడా కరంటు తయారు చేస్తారు. వాటికంటే అణుధార్మిక పదార్థాల నుంచి ఎక్కువ మొత్తంలో కరంటు ఉత్పత్తి చేయవచ్చు. అయితే ఇందులో రిస్కు, ఖరీదు కూడా అందుకు తగినట్లుగానే ఉంటాయి. యురేనియంలో రకాల్లో యురేనియం- 235 ఒకటి. ఈ యురేనియం ఎంత శక్తిమంతమైన ఖనిజమంటే కేజీ యురేనియం-235 సుమారు 1500 టన్నుల బొగ్గుతో సమానమైన కరంటునిస్తుంది. ఈ విషయం జాన్ ఎంస్లీ రాసిన నేచర్స్ బిల్డింగ్ బ్లాక్స్ : యాన్ ఏ-జెడ్ గైడ్ టు ద ఎలిమెంట్స్ అనే పుస్తకంలో ఉన్నది.

జీవవైవిధ్యానికి ప్రతీక

నల్లమల కొండలు తూర్పు కనుమలలో భాగంగా దక్షిణాన శేషాచలం, ఉత్తరాన రాచకొండ గుట్టల్లోకి, అనంతగిరి పర్వతాల్లోకి, కృష్ణానది వెంట పడమటి కనుమల్లోకి విస్తరించి ఉన్నాయి. సముద్రమట్టానికి 917 మీటర్ల ఎత్తులో 190 కిలోమీటర్ల మేర కృష్ణానది పరవళ్ళు, 80 శాతానికి మించి కొండప్రాంతం, సంవత్సరానికి 1000 మిల్లీమీటర్ల వర్షపాతం.. ఇదీ నల్లమల ప్రత్యేకత. అడవులు అంతరించిపోవడం వల్ల రాబందులు, కొన్ని పిచ్చుకల్లాంటి 869 జీవరాసులు అంతరించాయి. అలాంటి పరిస్థితుల్లో నల్లమల అనేక జీవజాతులకు నిలయంగా, సమూహ కేంద్రంగా వర్ధిల్లుతున్నది. ఆసియా ఖండంలోనే అత్యంత జీవవైవిధ్య సంపదగల నల్లమల మన రాష్ట్రంలో ఉండటం మనకు దక్కిన గొప్ప అవకాశం. ఇది మన వారసత్వ సంపద. దక్షిణ భారతంలో అతి పెద్ద టైగర్ ఫారెస్ట్‌గా నల్లమల ఉండడం మనకు గర్వకారణం. మొత్తం నల్లమలలో 74 పులులు, 80 చిరుతలు, సుమారు 1000 దుప్పులు, జింకలు, 200పైగా మనుబోతులు, 100 ఎలుగుబంట్లు, వందలాది నెమళ్ళు, అడవి పందులు, అడవి కుందేళ్ళు, తోడేళ్ళు, హైనాలు, చుక్కల జింకలు, మొసళ్ళు, అడవి పిల్లులు, కొండగొర్రెలు, రాచ ఉడుతలు, రేచు కుక్కలు, ఉడుములు, ఆకుపచ్చ పావురాలు, అతిచిన్న ఫ్రూట్ బ్యాక్ గబ్బిలాలు, బుట్టమేక పిట్ట, నీటి కుక్క, జంగుపిల్లి, ముళ్ళపంది, బిట్టుడుత, ముంగీస లాంటి అనేక జంతువులు జీవిస్తున్నాయి. 80 రకాల పాములు, 55 రకాల మత్స్యసంపద, 20 రకాల కప్పజాతులు, 200 రకాల పక్షిజాతులు, 70 కి పైగా క్షీరదాలు, 101 రకాల సీతాకోకచిలుకలు, అపారమైన తేనెటీగల సంపద, 353 రకాల ఔషధమొక్కలు, 80 రకాల గడ్డిజాతులు నల్లమల గుండెల్లో సజీవంగా నడయాడుతున్నాయి. ఇవే కాకుండా మానవాళికి, యావత్ భూగోళానికి మేలు చేయగల వేనవేల క్రిమి కీటకాదులు ఈ పీఠభూమిని సారవంతం చేస్తూ తిరుగాడుతున్నాయి. శ్రీగంధం, జిట్రేగి, తెల్లమద్ది, నల్లమద్ది, చిరంజి, తపసి, ఎగిస, బందరు, మారేడు, నేరేడు, ఆశ్వగంధ, కరక్కాయ, ఉసిరి, కుంకుడు ఇలా 1550కి పైగా వృక్షరాశులు నల్లమల నిండా జీవగర్రలా వేళ్లూనుకుని విశాలమైన జగతికి స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. తెలంగాణాలో 21 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. యురేనియం కోసం తవ్వకాలు ప్రారంభిస్తే.. ఈ జీవవైవిధ్యానికి మరణశాసనం రాసినట్టే.
Uranium4

మైనింగ్‌తో పెను విధ్వంసం

దాదాపు 2003 నుంచి నల్లమలపై ఈ అణుబాంబు వేలాడుతూనే ఉంది. యూసీఐఎల్ ఒకవైపు యురేనియం కోసం, మల్టినేషనల్ కంపెనీలు వజ్రాలు, బంగారం, క్వార్ట్ కోసం పైనుంచి, కింది నుంచి సర్వేలు చేసి జల్లెడ పట్టారు. యురేనియం అభివృద్ధి కాదు, అణు విధ్వంసం అని అనేక అనుభవాలు తెలియజేస్తున్నాయి. యురేనియం తీయడం కోసమైనా, తీసిన యురేనియం శుద్ధికోసమైనా లక్షలాది లీటర్ల నీరు అవసరం. అందుకోసం వేలాది అడుగుల లోపలికి బోర్లు వేయాలి. అలా చేస్తే భూగర్భ జలాలన్నీ అడుగంటిపోతాయి. అణుధూళితో వందల కిలోమీటర్ల పర్యావరణం కలుషితమవుతుంది. రేడియేషన్ అమాంతం పెరిగిపోతుంది. యురేనియం శుద్ధి చేసిన జలాలు భూమిలో, నదుల్లో కలవడం వల్ల చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు కలుషితం అవుతాయి. పంటలు పండవు. భూమి గుల్లబారుతుంది. కాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, గర్భస్రావాలు, పిల్లలు వికృతంగా పుట్టడం.. ఇలా ఒకటేమిటి మన భవిష్యత్ మనకే భయంకరమవుతుంది. ఇలా నేల, గాలి, నీరు కలుషితం అయ్యాక మనకు మిగిలేవి రోగాలు మాత్రమే. ప్రస్తుతం కడప జిల్లాలలోని తుమ్మలపల్లెలో ఇలాంటి అనారోగ్యకరమైన అభివృద్ధి కనిపిస్తున్నది.
Uranium5

రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన హర్షణీయం

ఇది అమ్మ కడుపును చీల్చడానికి కేంద్రం చేసిన క్రూర హంతక చర్య. యురేనియం తవ్వకమొక విధ్వంసక వ్యూహం. ఈ వ్యూహంతోనే బహుళజాతి అంగడి కాంక్షలకు, బలమైన నెత్తుటి యుద్ధం చేయాలనే వికృతవాంఛలకు ఆదిమజాతులు బలౌతున్నాయి. చెంచులు మన కాంక్రీట్ కీకారణ్యాన్ని కోరుకోవడం లేదు, ఆక్రమించాలని అంతకంటే అనుకోవడం లేదు. అడవినుంచి ఆదివాసులను వేరు చేస్తే బతకలేరనడానికి మొలచింతలపల్లి బలవంతపు క్యాంపే ఉదాహరణ. అయితే, యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వబోమని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. భవిష్యత్‌లో కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చినమాట నిలబెట్టుకుంటుందని విశ్వసిస్తున్నాం.

- విప్లవకుమార్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు

2016 నాటి నివేదికలో ఏముంది?

నల్లమలలో ఎలాంటి మైనింగ్ చేపట్టకూడదని తెలంగాణ ప్రభుత్వానికీ, భారత అటవీశాఖకూ ఒప్పందం ఉన్నది. 2016 నాటి నివేదిక ఈ విషయాన్ని తెలియజేస్తున్నది. నల్లమలలో యురేనియం కోసం తవ్వకాలు జరిపితే.. భూమికోత, పెద్ద గుంతలు పడడం, భూమీ, నీరూ కలుషితం వంటి సమస్యలు వస్తాయి. రసాయనాల లీకేజీతో ప్రమాదాలుంటాయి. వాగులు, వంకలు, నదులూ కలుషితమైపోతాయి. 4 వేల బోర్లు వేయడానికి మెషీన్లు అడవిలోకి వెళ్లడానికి రోడ్లు లేవు. కాబట్టి పచ్చదనం దెబ్బతింటుంది. అమ్రాబాద్ బ్లాక్ 1, బ్లాక్ 2లలో అనుమతులివ్వవద్దు. ఇక 3, 4 బ్లాకుల్లో సాగర్ టైగర్ రిజర్వు ఉంది. ఈ పరిస్థితుల్లో బోర్లు వేస్తే ఇబ్బంది అవుతుంది అంటూ 2016లో ఇచ్చిన నివేదికలో అప్పటి అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ రాశారు. అత్యధిక జీవవైవిధ్యమున్న ఈ అడవిని డిస్టర్బ్ చేయడం మంచిది కాదని, అసలు ఇక్కడ ఎలాంటి మైనింగూ చేయవద్దంటూ తెలంగాణ ప్రభుత్వానికీ, భారత అటవీశాఖకూ మధ్య ఒప్పందం కూడా ఉందనీ వారు గుర్తు చేశారు.

2587
Tags

More News

VIRAL NEWS