పద్య రత్నాలు-22


Sun,October 6, 2019 02:19 AM

poetry

ఎంత వేడుకొన్నా తక్కువే

దండమయా విశ్వంభర
దండమయా పుండరీకదళ నేత్రహరీ
దండమయా కరుణానిధి
దండమయా నీకు నెపుడు దండము కృష్ణా!!
- శ్రీ కృష్ణ శతకం
తాత్పర్యం:సమస్త విశ్వాన్ని భరిస్తూ పాలించేవాడు, తామర రేకుల వంటి అద్భుతమైన కన్నులు గలవాడు, హృదయం నిండా కరుణనే నింపుకొన్న సముద్రమంతటి దయామయుడు ఎవరంటే శ్రీమహావిష్ణువే. సృష్టికంతటికీ స్థితికారుడైన ఆ బ్రహ్మాండ నాయకుణ్ణి ఎంత వేడుకొన్నా తక్కువే. ఎన్నిసార్లు ఆయనకు ప్రణామాలు సమర్పించినా తనివితీరదు కదా.
poetry1

అన్నదమ్ముల అనుబంధం

తమ్ములు తమయన్న యెడ భ
యమ్మును భక్తియును గలిగి యారాధింపన్‌
దమ్ముల నన్నయు సమ్మో
దమ్మును బ్రేమింప గీర్తి దనరు కుమారా!
- కుమార శతకం

తాత్పర్యం:రక్తసంబంధంలోని గొప్పతనం ఇదే కదా మరి. ప్రత్యేకించి సొంత అన్నదమ్ములైన వారు ఎలా వుండాలో చెప్పిన నీతిపద్యమిది. తమ్ములు తమ అన్నపట్ల భయంతోపాటు భక్తినీ కలిగి ఉండాలె. అలాగే, అన్నలు కూడా తమ తమ్ములపట్ల అంతే అనురాగాన్ని చూపించాలె. అప్పుడే ఆ అన్నదమ్ముల అనుబంధం అజరామరం (శాశ్వతం) అవుతుంది.
poetry2

ప్రేమ తోడిదే జీవితం

ఇమ్ముగ జదువని నోరును
నమ్మా యని బిలిచి యన్నమడుగని నోరున్‌
దమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
- సుమతీ శతకం

తాత్పర్యం: మనిషి జీవితానికి ప్రేమే ఇంధనం. ప్రేమ లేని పిలుపులు ఎన్నయినా నీళ్లు లేని నదులు. లోపల్లోపల చదువుకోవడం అటుంచి, బయటకు గట్టిగా వినిపించేలా చదివే చదువులైనా ఇంపుగా ఉండాలి. అన్నం పెట్టేవారు ఎవరైనా సరే అమ్మతో సమానం. తమ్ముళ్లపట్ల నిష్కల్మషమైన ప్రేమను చూపించాలి. ప్రేమ లేనితనం కుమ్మరి గొయ్యి వంటిదే సుమా.
poetry3

శుచి-శుభ్రతలకే పెద్దపీట

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా?
విశ్వదాభిరామ వినురవేమ!
- వేమన శతకం

తాత్పర్యం:మానవ జీవన విధానంలో హృదయంలో నిర్మలత్వం ఎంత ముఖ్యమో భౌతికంగా శుచి-శుభ్రతలూ అంతే అవసరం. అప్పడే మనసులో ప్రశాంతత, ఆరోగ్యభాగ్యమూ మనల్ని వదిలిపోవు. వంట వండేముందు పాత్రలు శభ్రపరచుకోవాలి. ఏ ఆచారమైనా ఆత్మశుద్ధితోనే పాటించాలి. అలాగే, మనసులో భక్తి లేకుండా శివపూజలవల్ల ఫలితం సున్నా.

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్‌ నంబర్‌లో తెలియజేయండి.

140
Tags

More News

VIRAL NEWS