అతిపెద్ద సాలగ్రామ విగ్రహమూర్తి అనంతగిరి పద్మనాభస్వామి


Sun,October 6, 2019 02:25 AM

Ananthagiri-Temple
అనంతగిరి కొండలు ఇక్కడి ప్రాంత ప్రజలకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఇక్కడి అటవీ ప్రాంతం ఔషధ మొక్కల నిలయం. అంతేకాకుండా ప్రకృతి రమణీయత సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దానికి తోడు ఇక్కడ వెలసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతుంది.
Ananthagiri-Temple1
ఇక్కడి గాలి పీల్చితేనే సర్వ రోగాలు నయమవుతాయి. ‘అనంతగిరి కా హవా...లాకో మరీజోంకాదవా’ (లక్ష రోగాలకు ఔషధం వంటిది) అనే నానుడి ఉంది. పక్షుల కిలకిల రావాలు... కోయిల కుహు కుహు గానాలు..సెలయేటి గలగల పరవళ్ళు సందర్శకులకు మధురానుభూతినిస్తాయి... ఇక్కడి ప్రకృతి సోయగం ఎంతటి వారలనైనా మైమరపింపజేస్తుంది. అందుకే అనంతగిరి ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా ఈ ప్రాంతవాసులు అభివర్ణిస్తారు. ప్రకృతి ఒడి లో ఆలయం ఉండటంవల్ల సందర్శకులతో ఈ ప్రాంతం ప్రతినిత్యం కిటకిటలాడుతుంటుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయానికి 1300 ఏళ్ళ చరిత్ర ఉంది. అనంతగిరి కొండలకు ఈ పేరు రావడానికి కారణం ప్రకృతి ఒడిలో వెలసిన శ్రీ అనంత పద్మనాభ స్వామియే. స్వామివారికి ప్రతి యేటా కార్తీక మాసంలో 15 రోజుల పాటు పెద్ద జాతర ఉత్సవాలు, ఆషాఢ మాసంలో 5 రోజుల పాటు చిన్న జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు.
Ananthagiri-Temple2
ఆలయ ప్రాశస్త్యం. అనంతగిరిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రత్యేకత విష్ణు పురాణంలో కనిపిస్తుంది. ముచుకుందుడనే రాజర్షి అనేక సంవత్సరాలుగా రాక్షసులతో యుద్ధం చేసి, వారిని ఓడించి విజయుడైనాడు. అనంతరం దేవతలకు రాజైన దేవేంద్రుని ఆశ్రయించి తాను అలసట తీర్చుకోవడానికి ప్రశాంత స్థలం కావాలని కోరుతాడు.ముచుకుందుడి కోరికను ఆలకించిన దేవేంద్రుడు, అలసట తీర్చుకోడానికి అనంతగిరి కొండలు అనుకూలమని, ఎవరైన నిద్రా భంగం కలిగిస్తే వారు నీ తీక్షణ చూపులకు అగ్నికి ఆహుతవుతారని వరమిస్తాడు. దీంతో ముచుకుందుడు అనంతగిరిలోని ఓ గుహలో నిద్రకు ఉపక్రమిస్తాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరాన్ని పాలిస్తుంటాడు. కాల యవ్వనుడనే రాక్షసుడు ద్వారకా నగరంపై దండెత్తి శ్రీకృష్ణ, బలరాములను వెంబడిస్తాడు. కాలయవ్వనుడికి భయపడినట్లు నటించి బలరామ కృష్ణులు ముచుకుందుడు నిద్రపోతున్న అనంతగిరిలోని గుహలోకి ప్రవేశిస్తారు. శ్రీకృష్ణ బలరాముల ఒంటిపై ఉన్న వస్ర్తాలు నిద్రిస్తున్న ముచుకుందునిపై కప్పి గుహలో ఓపక్కన దాక్కుంటారు. ఇది గమనించని కాలయవ్వనుడు ముచుకుందుడే బలరామ కృష్ణులని భావించి నిద్రాభంగం కలిగిస్తాడు. దీంతో ముచుకుందుడు ఆగ్రహానికి గురై కాలయవ్వనుడిని తీక్షణ చూపులతో భస్మం చేస్తాడు. తదనంతరం బలరామ కృష్ణులు ముచుకుందునికి దర్శనమిస్తారు. దీంతో పరవశించిన ముచుకుందుడు, బలరామకృష్ణుల పాదాలు కడిగి సాక్షాత్కారం పొందుతాడు. వారి పాదాలు కడిగిన నీరే జీవనదిగా, ముచుకుందానదిగా...మూసీనదిగా పిలవడం జరుగుతున్నది. ఈ నది ఆలయ కోనేటి ఆవరణలో చిన్న జలధారగా ప్రారంభమై శంకర్‌పల్లి, హైదరాబాద్‌, నల్లగొండల మీదుగా ప్రవహించి కృష్ణానది లో కలుస్తుంది.
Ananthagiri-Temple3

మార్కండేయుడి తపస్సు:

అల్పాయుష్షుతో జన్మించిన మార్కండేయుడిని యముడు అంతమొందిస్తాడని తెలిసి తపోబలంతో శివసాక్షాత్కారం పొంది పూర్ణాయుష్కుడవుతాడు. తదనంతరం మార్కండేయుడు అనంతగిరి కొండల్లో తపస్సుకు పూనుకొంటాడు. కలియుగ ప్రారంభంలో మార్కండేయుని భక్తికి మెచ్చిన శ్రీ మహా విష్ణువు అతనికి దర్శమిస్తాడు. ‘ఏ వరం కావాలో కోరుకో అని శ్రీహరి మార్కండేయుని అడుగగా...సాలగ్రామ స్వయం భూ శ్రీ అనంత పద్మనాభ స్వామిగా ఇక్కడ వెలయాలని వరాన్ని కోరతాడు. అంతట శ్రీ మహావిష్ణువు తథాస్తు అని చెప్పి..సాలగ్రామ విగ్రహ రూపంలో అనంతుడు స్వయంభూవుగా వెలుస్తాడు. అనంత పద్మనాభ స్వామి అంటేనే శేషతల్పంపై పడుకుని ఉంటాడు. ఇక్కడ మాత్రం సాలగ్రామ రూపంలో అనంత చక్రాలతో నిలబడి ఉంటాడు. అనం త పద్మనాభుడు నిలబడి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రపంచంలోనే అతిపెద్ద సాలగ్రామ విగ్రహమూర్తిగా ఈ అనంతుడికి పేరుంది. మార్కండేయుడు తపస్సు చేసిన గుహ ఇప్పటికీ చరిత్రకు ఆనవాళ్ళుగా ఆలయ ప్రాంగణంలో కనిపిస్తుంది. ఇక్కడ మార్కండేయ గుహతో పాటు చాలా గుహలు ఆలయ కోనేటి ఆవరణలో కనిపిస్తాయి.

కనువిందు చేసే కోనేరు :

పద్మనాభుని ఆలయ ప్రాంగణంలో భవనాశిని అనే కోనేరు ఉంది. దీనితోపాటు ఆలయ ప్రాంగణంలో 7 గుండాలు ఉన్నాయి. కోనేటి పక్కనే రాళ్ళ కుచ్చలు కనిపిస్తాయి. ఈ రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చితే..ఇల్లు కట్టే భాగ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు.
Ananthagiri-Temple4

స్వామి వారి ఆలయ

ప్రాంగణంలో 7 గుండాలు ఉన్నాయి. పెళ్లికాని యువతీ యువకులు ఈ గుండాలలో స్నానమాచరించి స్వామివారికి పూజలు చేస్తే వారి కోరికలు
ఫలిస్తాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.


- జిల్లా ప్రతినిధి, వికారాబాద్‌, నమస్తే తెలంగాణ

225
Tags

More News

VIRAL NEWS