ఆధారం


Sun,October 6, 2019 02:44 AM

Crime
క్రైమ్‌స్టోరీ -60
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
కాళ్ళు, చేతులు నొప్పి పెడుతున్నా కీళ్ళవ్యాధిగల లావుపాటి లోర్నా మొహంలో ఆ బాధకు బదులు సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. కారణం, ఆవిడ పాతిన పెటూనియస్‌ మొక్కలు మొగ్గ తొడగడం. తను ఆ ఇల్లు కొన్నప్పుడు ఇంటి వెనుక తోట అడ్డదిడ్డంగా పిచ్చిమొక్కలతో నిండి ఉండేది. వాటన్నింటినీ పీకేసి ఎరువులు వేసి తాను పడిన కష్టానికి ప్రతిఫలం కంటికి కనిపిస్తూంటే ఆవిడకి ఎంతో సంతోషంగా ఉంది. మట్టిలో ఇంకా అక్కడక్కడా తుప్పు పట్టిన మేకులు, ఖాళీ కేన్స్‌, దినపత్రికల ముక్కలు లాంటివి కిందనించి ఉపరితలం మీదకి వస్తున్నాయి. ఆవిడ వాటిని ఏరుతూంటే ఓ వింత తెల్లటి రాయి కనిపించింది. దాన్ని ఊడ పెరికితే అది తేలిగ్గా చేతిలోకి వచ్చేసింది.

లోర్నా దానికి ఉన్న రెండు రంధ్రాలను మానవ నేత్రాలుగా గుర్తించగానే అది పుర్రె అని అర్థమైంది. వెంటనే, ఆవిడ దాన్ని కింద పడేస్తూ చిన్నగా కేక పెట్టింది. తర్వాత వంగి మళ్ళీ వర్క్‌ గ్లవ్స్‌ తొడుక్కున్న చేత్తో దాన్ని అందుకుని చెత్తని నింపే అట్టపెట్టెలో వేసింది. ఇక అక్కడ పని చేయలేక ఇంట్లోకి వెళ్ళి టీ కలుపుకుంది.
* * *

ఆ సాయంత్రం లోర్నా ఆ చిన్న గ్రామంలోని హీదర్స్‌ గిఫ్ట్‌ షాప్‌కి వెళ్ళింది. హీదర్‌ కూడా తన ఇంట్లో తోటని పెంచుతున్నాడు. అతని దగ్గరే గతంలో విత్తనాలు, ఎరువులు, తోట పరికరాలను ఆమె కొన్నది. ఆవిడని చూసి అతను నవ్వుతూ పలకరించాడు.
“హలో లోర్నా! ఎలా ఉన్నారు?”
“బావున్నాను, మిస్టర్‌ హీదర్‌. ఓసారి మీరు నాకు ఇల్లు అమ్మిన బిర్చ్‌ గురించి చెప్పారు కదూ?”
“నేను అతని గురించి చాలా చెప్పగలను. కానీ, మీరు ఎన్నడూ ఆ విషయాల్లో ఆసక్తి చూపించలేదు. మన గ్రామంలోని గొప్ప వినోదాల్లో ఒకటి గాసిప్‌. దాన్ని మీరు కోల్పోతున్నారు.”
“మీరు అతని భార్య గురించి ఏదో చెప్పారు?”
“అతని భార్య పోయింది. ఓ తెల్లారు ఝామున తెడ్ల పడవలో చెరువులోకి వెళ్ళింది. మర్నాడు ఉదయం ఆ పడవ ఖాళీగా తిరిగి వచ్చింది. అతను ఒంటరివాడు అవడంతో మీకు ఇల్లు అమ్మి ఇంకో చిన్న ఇంటికి మారాడు. ఐతే, అతని భార్య శవం మాత్రం దొరకలేదు. చెరువు చాలా లోతుగా ఉంటుంది. రెండు రోజులు ప్రయత్నించాక ఇక విరమించుకున్నారు.”
“అప్పటి నించేనా బిర్చ్‌ తాగడం ఆరంభించింది?”
హీదర్‌ చిన్నగా నవ్వి బదులు చెప్పాడు.
“బిర్చ్‌కి తాగడానికి కారణం అక్కర్లేదు. భార్య బతికుండగానే చాలా తాగేవాడు. అతనికి ఎవరైనా పని ఇవ్వడం వింతే.”
“ఏం పని చేస్తాడు?”
“అన్నీ చిన్న చిన్న పనులు. మా ఇంట్లో చెక్క షెల్ఫ్‌లని బిగించాడు. వాటిని ఎంతో చక్కగా చేసాడు. కానీ, నెలదాకా అక్కడ డిస్టిలరీ వాసన వేసిందంటే నమ్మండి... అకస్మాత్తుగా ఎందుకు మీరు అతని గురించి అడుగుతున్నారు? మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడా?” హీదర్‌ అడిగాడు.
“లేదు, లేదు. ఊరికే. అతన్ని చూసి నెలలైంది.”
“బిర్చ్‌ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే పాల్‌ కిరాణా దుకాణానికి వెళ్ళి అడగండి. అతనికి గ్రామంలోని ప్రతీ వారి గురించీ తెలుసు. ఆడవాళ్ళే ఎక్కువగా గాసిప్‌ చేస్తారంటారు. కానీ, పాల్‌ వాళ్ళని మించిన వాడు” హీదర్‌ నవ్వుతూ చెప్పాడు.
* * *

“మిమ్మల్నీ మధ్య చాలా రోజులుగా చూడలేదు మిసెస్‌ లోర్నా. మీరు తోటని చక్కగా పెంచుతున్నారని చాలామంది చెప్పారు” ఆవిడని చూసిన పాల్‌ పలకరించాడు.
“టీ బ్యాగ్స్‌ కావాలి. అన్నట్లు బిర్చ్‌ కూడా మీ కస్టమరే కదా? పాపం. భార్య పోగానే అతను బాగా కృంగిపోయాడు కదా?” అడిగింది.
“కృంగడమా? భార్యని ఎలా వదిలించుకోవాలా అనుకునే వాడు. వారిద్దరూ బాగా పోట్లాడుకునే వాళ్ళు. బాధ పడకండి. ఆమె పోయినప్పటి నుంచి సెలబ్రేట్‌ చేసుకోవడం ఆపలేదు” పాల్‌ నవ్వుతూ చెప్పాడు.
“ఆమెది వింత మరణమని విన్నాను. నిజమేనా?”
“అది ప్రమాదకర మరణం కాదని చాలామంది అంటారు. కానీ, నేను ఆ మాట అనను. ఎందుకంటే, బిర్చ్‌ నాకు మిత్రుడు.”
“అంటే, హత్యా?”
“చాలామంది అలాగే అనుకుంటున్నారు.”
‘తనకి దొరికిన పుర్రె ఆమెదేనా?’ అనుకుంటూ లోర్నా ఆ షాప్‌లోంచి టీ బ్యాగ్స్‌ పెట్టెతో బయటకి నడిచింది. ఆవిడ సరైన సమయంలో దాన్ని పోలీసులకి ఇవ్వాలని అనుకుంది.
అరగంట తర్వాత తలుపు చప్పుడు విని తెరిచింది. ఎదురుగా బిర్చ్‌ నిలబడి ఉన్నాడు. అతన్నించి ఆల్కహాల్‌ వాసన గుప్పున కొట్టింది.
“మీతో మాట్లాడాలి” గర్జించాడు.
“ఏమిటి? దేని గురించి?”
“నేను లోపలకి రావచ్చా? లేదా?” అదే కంఠస్వరంతో అడిగాడు.
ఆవిడ పక్కకి జరగ్గానే లోపలకి వచ్చాడు.
“మీరు గ్రామంలో నా గురించి ఎందుకు విచారిస్తున్నారు? మీరీ ఇంటిని చవక ధరకే కొన్నారని నాకు తెలుసు.”
“నేనీ గ్రామంలో ఎవర్నీ పట్టించుకోకుండా జీవిస్తున్నానని మీకు తెలుసు మిస్టర్‌ బిర్చ్‌” ఆవిడ అఫెండైనట్లుగా చెప్పింది.

“అలాగే, జీవించండి. నా గురించి మీకేమైనా ప్రశ్నలు ఉంటే నన్నే సూటిగా అడగండి. లేదా ఇంకాస్త చేదు విషాదం జరగవచ్చు. ఆడవాళ్ళతో నేను చాలా కష్టాలు అనుభవించాను. మీ పని పడతాను జాగ్రత్త.”
అతను వెళ్ళిపోయిన ఓ నిమిషం దాకా ఆవిడ తేరుకోలేక పోయింది. ఆవిడ బిర్చ్‌ని కటకటాల వెనక్కి నెట్టాలని నిర్ణయించుకుంది. లేదా తనకి రక్షణ ఉండదు.
వెంటనే బయలుదేరి వెళ్ళి షెరీఫ్‌ డానీని కలిసి అడిగింది.
“బిర్చ్‌ తన భార్యని హత్య చేసాడని చాలామంది అనుకోవడం నిజమా?”
“వారిలో ఒకర్ని మీరు చూస్తున్నారు లోర్నా. అతని కేసు నా కెరీర్లో గొప్ప నిరాశని మిగిల్చింది. అతనికా టెంపర్‌మెంట్‌, కారణం, అవకాశం ఉన్నాయి. అతనే ఆమెను చంపాడని నేను నమ్ముతున్నాను. కానీ, ఋజువులు దొరక్క ఏం చేయలేక పోయాను.”
“మీకు కావాల్సిన ఋజువుని నేను ఇవ్వగలను. కానీ, అదేమిటో వెంటనే చెప్పలేను. కొంత కాలం ఆగి చెప్తాను” లోర్నా గంభీరంగా చెప్పింది.
“ఆ ఇంట్లో మీకేమైనా ఆధారాలు దొరికాయా? ఉత్తరాలు, రక్తపు మరకలు లాంటివి” అతను ఆసక్తిగా చూస్తూ అడిగాడు.
“ఇప్పుడు అది నేను చెప్పలేను. మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించినందుకు నా రక్షణ కోసం అతన్ని జైల్లో పెట్టండి. ఈ మధ్యాహ్నం వచ్చి బెదిరించి వెళ్ళాడు. అతన్ని అరెస్ట్‌ చేయండి” కోరింది.
“ఎందుకు బెదిరించాడు?”
“అతని గురించి అందర్నీ అడిగి తెలుసుకుంటున్నందుకు. నన్ను కూడా చంపుతానని చెప్పాడు.”
“సాక్షుల ముందా?”
“కాదు.”
“ఐతే, నేనేం చేయలేను. మీ దగ్గరున్న ఆధారాల గురించి చెప్తే నేనేమైనా సహాయం చేయగలను” షెరీఫ్‌ డేనీ చెప్పాడు.
“ఇప్పుడు ఋజువు ఇవ్వలేను. గుడ్‌ డే.” చెప్పి ఆవిడ బయటకి నడిచింది.
* * *

లోర్నా తన భర్త పోయాక ఎన్నడూ చీకటికి కాని, ఒంటరితనానికి కాని భయపడలేదు. ఆవిడ నిద్ర పోవడానికి లైట్లు ఆర్పుతుండగా ఇంటి తలుపుమీద ఎవరో దబదబ బాదసాగారు. ఆవిడ గుండె వెంటనే వేగంగా కొట్టుకోసాగింది. వెళ్ళి తలుపు తెరచింది. గుప్పున ఆల్కహాల్‌ వాసన. బిర్చ్‌ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతను తప్ప తాగి ఉన్నాడని గ్రహించింది. అతను లోపలకి రాగానే పెద్దగా అరిచింది.
“ముసల్దానా! నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పానా, లేదా?” భీకరంగా చూస్తూ అడిగాడు.
“నేను నీకేం హాని చేయలేదు. బయటకి నడు.”
“పాల్‌ నాకు చెప్పాడు. నువ్వు షెరీఫ్‌ దగ్గరకి ఎందుకు వెళ్ళావు? అంటే, నీకేదైనా ఆధారం దొరికిందా? అదేదో నాకు ఇవ్వు.”
“నాకేం ఆధారం దొరకలేదు.”
“అబద్ధాలు ఆడకు. దాన్ని ఇస్తావా? లేక నీ తల పగులకొట్టమంటావా?” మీదమీదకి వస్తూ బల్లమీంచి కొట్టడానికి బరువైన ఫ్లవర్‌ వేజ్‌ని అందుకున్నాడు.
“అంటే, నువ్వు నిజంగానే నీ భార్యను చంపావన్న మాట.”
‘’నిన్ను కూడా చంపుతాను.”
ఆవిడ వెంటనే పెద్దగా అరిచి రెండు అడుగులు వెనక్కి వేసింది. వెంటనే తలుపు తెరచుకుంది. బిర్చ్‌ తల వెనక్కి తిప్పి చూస్తే యూనిఫాంలోని ఓ సార్జెంట్‌ కనిపించాడు.
“నేనేం చేయలేదు” కోపం మొత్తం మాయమై అర్థింపు స్వరంతో చెప్పాడు.
“థాంక్‌ గాడ్‌! సమయానికి మీరు వచ్చారు” లోర్నా చెప్పింది.
“షెరీఫ్‌ నన్ను ఇక్కడ మీ రక్షణకు కాపలా ఉండమన్నారు. ఆయన ఊహ నిజమైంది.”
“ఇతను తన భార్యని చంపాడు. నా దగ్గర అది ఒప్పుకున్నాడు.”
“అది షెరీఫ్‌ చూసుకుంటాడు. ఇక ఇతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు.” చెప్పి సార్జెంట్‌ బిర్చ్‌కి బేడీలు వేసి తీసుకు వెళ్ళిపోయాడు.
* * *

మర్నాడు ఉదయం ఎనిమిదికి లోర్నా తోటలో పని చేసుకుంటూంటే షెరీఫ్‌ కారు ఆమె ఇంటిముందు ఆగింది. అందులోంచి దిగిన షెరీఫ్‌ డేనీ లోపలకి వచ్చి చెప్పాడు.
“గుడ్‌ మార్నింగ్‌ లోర్నా. సారీ. బిజీగా ఉండటంతో నిన్న రాత్రి మీతో మాట్లాడలేక పోయాను.”
“నా రక్షణకో మంచి సార్జెంట్‌ని కాపలా పెట్టినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి. లేదా అతను నన్ను చంపేసేవాడు” ఆవిడ చెప్పింది.
“మీకు థాంక్స్‌ మిసెస్‌ లోర్నా. చాలా జరిగింది. బిర్చ్‌ నిన్న రాత్రి తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇంత కాలానికి అతను తన భార్యని చంపానని స్టేట్‌మెంట్‌ ఇచ్చి సంతకం కూడా చేసాడు.”
“ఐతే, ఇక నాకు భయం లేదు.” ఆనందంగా చెప్పింది.
“నాకు అంతు పట్టనిది, అతను హంతకుడని మీరు ఎలా కనుక్కున్నారా అని.”
“చెప్తే నా తోటని తవ్వరుగా?”
“తోటని తవ్వడమా, అంటే?”
ఆవిడ గ్లవ్స్‌ తొడుక్కుని అట్ట పెట్టెలోని ఆ తెల్లటి వస్తువు తెచ్చి షెరీఫ్‌కి చూపించి చెప్పింది.
“ఇది అతను నేరస్థుడని నాతో చెప్పింది. నేను పాత మేకులకోసం తవ్వుతుంటే ఈ కపాలం బయటపడింది.”
వెంటనే షెరీఫ్‌ మొహంలో అయోమయం కనిపించింది.
“కానీ, బిర్చ్‌ తన భార్యని చెరువులో ముంచి చంపానని చెప్పాడు?”
అతను తన చేతిలోని ఆ వస్తువుని నెమ్మదిగా తిప్పి చూసి వేళ్ళతో గట్టిగా నొక్కాడు. సులువుగా పగిలిన ముక్క అతని చేతిలోకి వచ్చింది.
“ఇది ప్లాస్టిక్‌తో చేసింది. గుమ్మం బయట వేలాడదీసే పాత ఫ్లవర్‌ వేజ్‌. కళ్ళల్లా కనిపించే ఈ రంధ్రాల్లోంచి తీగలు బయటకి వస్తాయి” షెరీఫ్‌ నెమ్మదిగా చెప్పాడు.
(జెఫ్‌ హెల్లర్‌ కథకి స్వేచ్ఛానువాదం)

“ముసల్దానా! నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పానా, లేదా?” భీకరంగా చూస్తూ అడిగాడు. “నేను నీకేం హాని చేయలేదు. బయటకి నడు.” “పాల్‌ నాకు చెప్పాడు. నువ్వు షెరీఫ్‌ దగ్గరకి ఎందుకు వెళ్ళావు? అంటే, నీకేదైనా ఆధారం దొరికిందా? అదేదో నాకు ఇవ్వు.”

159
Tags

More News

VIRAL NEWS