మాటే మంత్రం


Sun,October 6, 2019 03:02 AM

health
పెరిగిన జుట్టు.. మాసిన బట్టలు. బెదిరిపోయే చూపులు. గ్లాసు కింద పడ్డా గుండె పగిలేంత భయం. బిక్కుబిక్కు మంటూ జీవనం. జనంలో ఉన్నా మనలో కలవలేని మనస్తత్వం. ఆత్మీయంగా కౌగిలించుకునే ఒంటరితనం. అదే వారి జీవనవిధానం.
అతడేం పాపం చేశాడు. ఆమె ఏం అన్యాయం చేసింది? మానసిక వైకల్యం అనుభవించడం వారికి శాపమా? మనోవేదనతో కుంగిపోవడం వారు చేసిన నేరమా? చేతులకు, కాళ్లకు ఆ సంకెళ్లెందుకు? కనీసం వారిని మనుషులుగా అయినా గుర్తిస్తున్నామా? పదండి ఒక్కసారి వారి జీవితాల్లోకి తొంగిచూద్దాం. మానవత్వపు పరిమళాల్ని వారి జీవితాలకు పూసి వద్దాం.

- పడమటింటి రవికుమార్‌
సెల్‌: 99483 93391


మన పక్కనే ఉంటారు. పని భారమో, మరో కారణమో.. నిత్యం ఒత్తిడితో బతుకుతుంటారు. వారిలో వారు మాట్లాడుతుంటారు. మన పనేదో మనం చేసుకొని వెళ్లిపోతుంటాం. కానీ, వారిని గుర్తించం. కనీసం వారి బాధల్ని పంచుకునే ప్రయత్నమైనా చేయం. పదిమందిలో పనిగట్టుకొని ‘వాడో పెద్ద మెంటల్‌' అని మనమే నిర్ధారిస్తుంటాం. ప్రేమ, ఆప్యాయతలు, బాధల్ని పంచుకునే వారు లేకనే వారలా మానసికంగా కృంగిపోతుంటారు. వారిలో వారు మాట్లాడుతున్నా.. ఇతరులకు దూరంగా ఉన్నా వీలైనప్పుడల్లా ఆత్మీయంగా పలుకరిద్దాం.. మనోధైర్యాన్ని నూరిపోద్దాం. పోయేదేముంది మహా అయితే నాలుగు మాటలు. కానీ మీరిచ్చే మాటసాయం ఓ నిండు జీవితాన్ని నిలబెడుతుంది.
health1

మానసిక సమస్యలు సాధారణమే!

మనిషికి మానసికంగా సమస్యలుండి, శరీరం ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తిని ఆరోగ్యవంతుడిగా చెప్పలేం. శరీర అనారోగ్యాల్ని వ్యక్తపరుస్తారు. కానీ మానసిక సమస్యల్నెవరూ బయటపెట్టరు. ఇటీవల ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌' ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ‘హౌ ఇండియా పర్సీవ్‌ మెంటల్‌ హెల్త్‌' పేరిట ఓ నివేదిక ప్రచురించింది. దీని ఆధారంగా భారత్‌లోని 8 ప్రధాన నగరాల్లో నివసిస్తున్న జనాభాలో 87శాతం మంది ఏదో ఒక మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తేలింది. వీరిలో ఎక్కువమంది షిజోఫ్రీనియా, అబ్సెస్సివ్‌, కంపల్సివ్‌ డిజార్డర్‌లతో బాధపడుతున్నవారే అని తెలిసింది. మానసిక రోగం పేరు చెబితే మనందరికీ భయం. పొరపాటున అలాంటి వ్యాధి సోకితే జబ్బు తీవ్రతకంటే ఎక్కువగా మనోవేదనతో తల్లడిల్లిపోతాం. నిజానికి మనలో 40 శాతం పిచ్చివాళ్లేననేది మెడికల్‌ అనాలసిస్‌. నిపుణుల అభిప్రాయం ప్రకారం నార్మల్‌గా ఉండేవారు రెండు లేదా మూడు శాతం మంది మాత్రమే. మిగతావాళ్లంతా.. ప్రేమ, డబ్బు, పుస్తకాలు, పేరు, ఆస్తి, అంతస్తు, సినిమాలు, గొప్పలు, ఆడంబరాలు, షాపింగ్‌, అతివాగుడు, మితిమీరిన కోపం ఇలా ఏదో ఒకదాంట్లో పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఏ లక్షణమైనా అవధులు దాటితే పిచ్చి చేష్ట అవుతుంది.
health2

మనసుకూ వ్యాధులొస్తాయ్‌!

ఈమధ్య ఆరోగ్యంపై శ్రద్ధ బాగా పెరిగిపోయింది. శరీర ఆరోగ్యం సరే.. మరి మనసు ఆరోగ్యం సంగతేంటి? ఎంత ఉన్నా.. ఎంత తిన్నా మనసు బాగాలేకపోతే ఏం లాభం? ప్రశాంతత లేకపోతే ఏంటి ప్రయోజనం? హెల్త్‌ బాగాలేకపోతే ఆస్పత్రికి పరిగెడతాం. మరి మనసు బాగాలేకపోతే? అందుకూ పరిష్కారమార్గాలెన్నో ఉన్నాయి. అందుకూ కొంతమంది నిపుణులున్నారు. ఇప్పటికీ కొంతమంది సైకాలజిస్టులను కలవడానికి జంకుతుంటారు. నాకేం పిచ్చి పట్టలేదని వాదిస్తుంటారు. అభివృద్ధిచెందిన అనేక దేశాల్లో ప్రతి హాస్పిటల్లో సైకాలజిస్టు ఉంటారు. ముందుగా రోగి మానసిక స్థితిని తెలుసుకున్నాకే డాక్టర్‌ దగ్గరికి పంపిస్తారు. ఇలాంటి విధానం మన దేశంలోనూ వస్తే చాలావరకు డాక్టర్‌ వద్దకు వెళ్లకుండానే జబ్బులు నయమవుతాయి.
health3

గుర్తిద్దాం.. మాటిద్దాం..

ఎవరైనా తమలో తాము మాట్లాడుకుంటుంటే గుర్తించాలి. వారి కుటుంబీకులకుగానీ, బంధువులకు గానీ చెప్పాలి. వైద్యులకు చూపించాలి. ఉన్నదానితో సంతృప్తి పడకుండా ఎదుటివారితో పోలికలు వద్దు. ఇలాంటి వారు తీవ్ర మనోవేదనకు గురవుతుంటారని గ్రహించాలి. తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవాళ్లు అధిక కోపాన్ని ప్రదర్శింస్తుంటారు. నిద్రపట్టకపోయినా, మాటిమాటికీ అసహనం వ్యక్తం చేసినా వారిని సైకాలజిస్టులకు చూపించాలి. మానసిక వ్యాధి ముదిరితే ఆత్మహత్య బాటపట్టే అవకాశం ఉంది. అలాంటి వారికి ఆత్మైస్థెర్యాన్ని నూరిపోసేది మాట ఒక్కటే. ఒక్కమాట దానమిచ్చి వారి జీవితం నిలబెడదాం. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సైకాలజిస్టులు కావాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో స్ఫూర్తిని నింపడం వల్ల వారు మానసిక వ్యాధులకు లోనవకుండా ఉంటారు. ఒకవేళ మానసిక వ్యాధులతో బాధపడుతూ ఉంటే వారిని మామూలు మనుషులుగానే గుర్తించాలి. గొలుసులతో కట్టేసి, రూముల్లో బంధించవద్దు. వారు మరింత ఒంటరిగా ఫీలవుతుంటారు.
health4

దయనీయం!

మానసిక రోగులు చికిత్సా కేంద్రాల్లో, సంస్థల్లో దాదాపు బందీలుగా ఉంటారు. చాలాసార్లు భౌతిక, లైంగిక దాడులకు గురవుతుంటారు. భావోద్వేగపరమైన ఒత్తిళ్లకు లోనవుతుంటారు. ఆస్పత్రిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా వారి పరిస్థితి జైల్లో ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ఒక్కసారి మానసిక వైకల్యానికి గురయితే వారి సాధారణ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ కరువవుతుంది. తప్పనిసరిగా ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే వీరు అశ్రద్ధకు గురవుతుంటారు. త్వరగా మరణిస్తుంటారు. చదువు, ఉద్యోగ అవకాశాలు వీరికి అందనంత దూరం. వారు అనుభవిస్తున్న పరిస్థితులను మార్చుకునే శక్తి వారికి లేకపోవడం దరదృష్టం. కానీ వారిని సవ్యమైన పంథాలో తీసుకుపోయేందుకు ప్రభుత్వాలు, కుటుంబీకులు కృషి చేయాలి. ప్రభుత్వాలు వారి సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏనాడో వెల్లడించింది.
health5

ఏం చేద్దాం!

మానసిక రోగులను సాటి మనుషులుగా గుర్తించాలి.మనోవేదన చెందే వారిని సైకాలజిస్టులకు చూపించాలి. వీలైనంత వరకు వారికి ధైర్యాన్ని నూరిపోయాలి. విద్య, వారు చేయగలిగిన వృత్తుల్లో శిక్షణ ఇప్పించాలి.రోజూ మోటివేషన్‌ అందించాలి. యోగా, మెడిటేషన్‌ చేయించాలి.ప్రభుత్వాలు, వైద్యులు, కుటుంబాలు కలిసి మానసిక వికలాంగుల కోసం కృషి చేయాలి.మెంటల్‌ హెల్త్‌ కేర్‌ రంగంలో కృషి చేసిన ఆరోగ్య సిబ్బంది మానసిక రోగులకు అండగా నిలవాలి. వారి ఆశలు, ఆశయాలు తెలుసుకొని నెరవేర్చే దిశగా కృషి చేయాలి.వైకల్యం ఉన్న వారి కుటుంబాలు ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకుంటూ మానసిక వికలాంగుల హక్కులను రక్షించాలి.
health6

ఎప్పుడు.. ఎలా?

వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌ డేను అక్టోబర్‌ 10న జరుపుకుంటున్నాం. 1992లో వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 150 దేశాల మానసిక ఆరోగ్య కేంద్రాల సభ్యుల సలహాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మానసిక అనారోగ్య సమస్యను సాధారణ అనారోగ్యంగా భావించాలని తెలిపేందుకు ఈ ప్రత్యేక రోజును నిర్వహిస్తున్నారు. ప్రతి యేటా ఒక థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ‘గతేడాది మారుతున్న ప్రపంచంలో యువత, వారి మానసిక ఆరోగ్యం’ అనే థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఏడాది ‘ఆత్మహత్యల నివారణపై దృష్టి’ అనే థీమ్‌తో కార్యక్రమాలు జరుపనున్నారు.
health7

మానసిక వైకల్యాలెన్నో..

డిప్రెషన్‌, యాంగ్జయిటీ, యాంగ్జయిటీ న్యూరోసిస్‌, బైపోలార్‌ డిజార్డర్‌, సోషల్‌ యాంగ్జయిటీ డిజార్డర్‌, పానిక్‌ డిజార్డర్‌, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌, పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌, ఫోబియా, మానియా, స్కిజోఫ్రీనియా, డిల్యూషనల్‌ డిజార్డర్‌, స్టీవ్‌ డిజార్డర్‌(ఇన్‌ సోమ్నియా), ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌, సుపీరియారిటీ కాంప్లెక్స్‌, ఇల్యుషన్‌, అడిక్షన్‌ సైకో సోమాటిక్‌ డిజార్డర్‌ వంటి మానసిక వైకల్యాలు అనేకం.
health8

చైతన్యం పెరగాలి..

మానసిక సమస్యలు, వ్యాధుల పరిష్కారానికి గ్రామీణ ప్రాంతప్రజలు ఇప్పటికీ మానసిక నిపుణులను కలవరు. మంత్రాలని, తాయత్తులని, రంగురాళ్ల ఉంగరాలనీ సమస్యను మరింత జఠిలం చేసుకుంటున్నారు. మానసిక వ్యాధులను తరిమికొట్టడానికి సైకాలజిస్టులూ, సైకియాట్రిస్టులు ఉన్నారు. కొన్నింటికి కేవలం కౌన్సెలింగ్‌ ద్వారా, మరికొన్నింటికి మందుల ద్వారా చికిత్స ఉంటుంది. మోటివేషన్‌ ద్వారా కూడా సగం మనోవ్యాధులు దూరమవుతాయి. పరిమితికి మించిన ఒత్తిడి కూడా మానసిక వ్యాధులకు దారితీస్తుంది. స్నేహితులు, కుటుంబసభ్యులతో సమస్యను చెప్పుకుంటే సగం బాధ తీరిపోతుంది. సమస్యలన్నింటికీ చావు పరిష్కారం కానేకాదు. ధైర్యంగా నిలబడి ఇష్టమున్న రంగంలో రాణిస్తేనే మనం ప్రపంచానికి విజేతగా పరిచయమవుతాం.
- జక్కని రాజు, సైకాలజిస్టు

735
Tags

More News

VIRAL NEWS