
ఇంటికి ఉత్తరం మధ్యలో ఓపెన్‌గా బాల్కనీ ఉండొచ్చా?
-కె.ఆనందరావు, కీసర
దాదాపు అన్ని ఇండ్లకు అందరు బాల్కనీలు ఇస్తుంటారు. కానీ వాటిని శాస్త్ర సమ్మతంగా ఇచ్చేవారు తక్కువ. బాల్కనీల పేరుతో ఇండ్ల మధ్యకు కోసి యు ఆకారంలో సి ఆకారంలో ఇండ్లు (విల్లాలు) కడితే అవి అందం అనుకుంటారేమో కానీ పెను ప్రమాదాలు జరిగే నిలయాలుగా అవి ఉంటాయన్నది చాలామందికి లేటుగా అర్థం అవుతుంది. కొన్నేండ్లుగా నిర్మాణ సంప్రదాయంలో వచ్చే పద్ధతులు మార్చడం ఆధునికత అనిపించుకుంటుందేమో కానీ అవస్థలు రాకుండా మాత్రం ఆపలేరు. ఇవాళ చాలా ఇండ్లు కట్‌చేసి మధ్యన బాల్కనీలు ఇస్తున్నారు. అది ఉత్తరం ఓపెన్కాదు. ఇంటి ఉత్తరగర్భం కటింగ్ చేసేయడం. అలాంటి గృహాలలో స్త్రీలు పిల్లలు రేపు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పనిసరిగా వాటిని సరిచేసుకోవాలి. తూర్పు ఉత్తరం భాగాలు తెగ్గోసి వాటి మధ్య వంతెనలుగా అలా ఉంటే తప్పక సరిచేసుకోండి. వీలు కాకుంటే దానిలోకి వెళ్లకండి.స్టోర్ వెనుక పూజగది ఉండొచ్చా? దేనికదే ఉండాలా?
-చెలక వెంకటలక్ష్మి, మీర్‌పేట
ఇంట్లో గదుల విభజన చేసేటప్పుడు ప్రతి అంశాన్నీచక్కగా గుర్తు వేసుకొని వాటికి తగిన స్థలాన్ని తగినచోట శాస్త్రబద్ధంగా లౌక్యంగా సెట్ చేసుకోవాలి. ఇల్లు - గోడలు కట్టాక వస్తువుల జాగకోసం ఆగం కావద్దు. చెప్పుల స్టాండ్ ప్లేస్ నుండి పూజ గదిప్లేస్ వరకు ప్రతిచిన్న స్విచ్బోర్ట్ కూడా మన ప్లానింగ్‌లో ఉండాలి. దానినే నక్ష అంటారు. పూజను స్టోర్‌ను కలుపడం సరైన విధానం కాదు. స్థలం లేక అలా పెట్టాము అనేది సమాధానం కాకూడదు. దేని విభజన దానికే ఉండాలి. ప్రతీది తన వ్యక్తిగత ఆటిట్యూడ్‌తో ఉంటుంది. సరుకుల గదిలోకి వెళితే అనేక వాసనలు వస్తుంటాయి. దానికి ఒక వెంటిలేటర్ అవసరం. దానితో పూజగది కలిపి అంటే ఒకే అర్రను రెండు భాగాలు చేస్తే ఒకదానికి ఒకటి పడదు. ప్రతి గది బయటే వాతావరణానికి లింక్ అయ్యి ఉండాలి. అప్పుడే గృహం శుద్ధిగా ఉంటుంది. మీరు దేనికదే పెట్టుకోండి.
ఇంటికి పడమరలో రౌండు పోర్టికో పెట్టవచ్చా?
-కొలనుమల్లిక, నిజాంపేట
ఇంటికి పోర్టికో అవసరం కోసం పుట్టి, అది కాస్త అందం కోసం మారింది. వర్షం పడే సమయంలో ఎండ వేళలో, పోర్టికోలోకి కారు రావడం అందులో నుండే కారులోకి వెళ్లడం ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ... ఆ పోర్టికో ఎలా వేస్తున్నారు. దాని పొడవు వెడల్పు ఎంత అనేది తప్పనిసరిగా చర్చించాల్సి వస్తుంది. మీరు రౌండుగా అంటున్నారు. రౌండు కన్నా చతురస్రంగా దక్షిణ, పడమరలో ఇంటి సింహద్వారం ఎదుట వేసుకోవాలి. అది వాస్తుపరంగా బాగుంటుంది. ఎప్పుడైతే పడమర వేస్తారో తూర్పు కూడా వేయడం అవసరం. ఆ తూర్పు పోర్టికో కేవలం ద్వారం ముందు మాత్రమే వేస్తే దానిని ఇంటికి అంటకుండా వేయండి. పడమరలో వేసే పోర్టికో ఎలా వేసినా ఫరవాలేదు. నిర్మాణాల్లో రౌండు కన్నా చతురస్రం, దీర్ఘచతురస్రం పటిష్ఠతను ఇస్తాయి.
అపార్ట్మెంటులో ఏ ఫ్లోర్లో ఇల్లు కొనాలి?
- కె.వి.రవీందర్‌రెడ్డి, కర్మన్‌ఘాట్
అపార్ట్మెంట్లో ఇండ్లు కట్టే విధానం రకరకాలుగా ఉంటుంది. కొందరు కామన్వాల్ పెట్టి ఫ్లాట్స్ కడుతారు. కొందరు అన్ని ద్వారాలు ఒక దగ్గరకు వచ్చేలా కడుతారు. కొందరు ఒక దగ్గరకు వచ్చేలా కడుతారు. కొందరు స్థలం ఉంటే చాలు ఫ్లాట్స్ కడుతుంటారు. కాబట్టి ముందు వాళ్లు కట్టిన స్థలం ఎలాంటిదో మొదట గుర్తించాలి. దానికి నిర్మాణ యోగ్యత ఉన్నదా అలాంటి చోట గృహ సముదాయం ఉండవచ్చా? లేదా అనేది చూడాలి. స్థల ప్రాంతం చక్కగా ఉంటే శాస్త్రబద్ధంగా నిర్మాణం జరిగితే ఏ ఫ్లోర్లోనైనా ఇల్లుకొనొచ్చు. సాధారణంగా అన్నీ ఒకలాగానే కడుతూ ఉంటారు. ఎస్.ఎఫ్.టీ.లో భేదం తప్ప. మంచి హాలు, గాలి వెలుతురు ఉన్న వాస్తు ఇల్లు ఏ ఫ్లోర్లోనైనా మీరు కొనుగోలు చేయండి.

సుద్దాల సుధాకర్ తేజ
[email protected]
Cell: 7993467678