నెట్టిల్లు


Sat,October 12, 2019 11:10 PM

నిడివి చిన్నదే అయినా స్టోరీ లైన్ బలంగా ఉంటుంది. కొత్తవాళ్లే అయినా ప్రయత్నం విజయవంతం అవుతుంది. పాత్రలు ఆకట్టుకుంటాయి. మంచి కథ అనే భావన కలుగుతుంది. యూట్యూబ్‌లో వస్తున్న పలు లఘుచిత్రాలు ఇలాంటి కోవలోకే వస్తాయి. కిందటి వారం ఇలా వచ్చిన కొన్ని లఘుచిత్రాల సమీక్షలే ఇవి..


ఎడారి వర్షం

దర్శకత్వం: రాజ్‌కుమార్
నటీనటులు : రాధిక, దేవేందర్
రైతు పరిస్థితులను చూపిస్తూ తీసిన లఘుచిత్రం. వ్యవసాయానికి నీటి చుక్కా దొరకని రాజస్థాన్ ప్రాంతంలో చిత్రీకరించారు. రైతు పరిస్థితులు ఎక్కడైనా ఇలాగే ఉంటాయని చెప్పారు. కథ విషయానికి వస్తే... ఓ మధ్యతరగతి రైతు ఊర్లో జమీందార్ దగ్గర అప్పు చేస్తాడు. ఎన్ని పంటలు వేసిన నష్టమే వస్తుంది. ఎడారి భూమిలో వ్యవసాయం చేయడం కష్టం అవుతుంది. దీంతో అప్పులు తీర్చడం కుదరదు. జమీందార్ తీవ్రంగా కోపోద్రిక్తుడవుతాడు. అప్పులు అయినా తీర్చు, భూమి అయినా రాయించు అంటాడు. దీంతో ఆ రైతు తీవ్ర మనస్థాపానికి గురవుతాడు. భార్య, బిడ్డతో కలిసి తోట్లోకి వెళ్తాడు. అక్కడే కొంతసేపు గడిపి కుటుంబం అంతా విషం తాగుతారు. అక్కడే చనిపోతారు. క్రమేనా ఊర్లో నుంచి యువకులు కూడా వలస వెళ్తారు. కనీసం నీళ్లు లేని ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయడం వృథా అనుకుంటారు. రైతు కష్టాలు ఏ రాష్ట్రంలో అయినా ఇంతే అంటూ లఘుచిత్రం ముగుస్తుంది. మధ్యలో కుటుంబం, రైతు పరిస్థితులను చూస్తూ పెరుగుతున్న ఇద్దరు కూతుర్ల తీరు చూపిస్తారు.

Total views 94,883+ (అక్టోబర్ 5 నాటికి)
published on Sep 27, 2019


vela

దర్శకత్వం: విజయ్ రామ్
నటీనటులు : రోహిత్ రెడ్డి, రిషిక, బన్ని
రోహిత్ ఓ ఆస్పత్రిలో డాక్టర్. ఆర్నెళ్ల అతని తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. మరోవైపు రోహిత్ టైం ట్రావెల్ చేయాలనీ, టైం మెషీన్ ను కనుక్కోవాలని ప్రయత్నాలు చేస్తాడు. అతని ప్రయత్నాల పట్ల అందరూ అతన్ని అవమానిస్తారు. టైం ట్రావెల్ ద్వారా వెనక్కి వెళ్లి తండ్రిని బతికించుకోవడానికా అన్నట్టు ఎగతాళి చేస్తారు. కానీ అతని ఉద్దేశ్యం టైం మెషీన్‌ను కనుక్కోవడం మాత్రమే. ఇలా ఓ రోజు ఓ అబ్బాయి రోడ్డు ప్రమాదంలో గాయపడి రోహిత్ పని చేస్తున్న ఆస్పత్రికి వస్తాడు. ఆ అబ్బాయి కేస్ షీట్ రాస్తాడు రోహిత్. మాట్లాడడానికి ప్రయత్నిస్తే అతనికి మాటలు రావు. దీంతో ఓ కోడ్ భాషను ఆబ్బాయికి చూపిస్తాడు. దాని ద్వారా వివరాలు సేకరిస్తాడు. పుట్టిన తేదీ అడిగితే 2026 అని చెప్తాడు. రోహిత్‌కు అర్థం కాదు. ఎన్నిసార్లు అడిగినా అలాగే చెప్తాడు. తండ్రిపేరు అడిగితే రోహిత్ అని చెప్తాడు. అది నువ్వే అంటాడు. రోహిత్ షాక్ అవుతాడు. 2019లో ఏడాది నడుస్తుంటే 2026 పుట్టే బాబుకు అతను ఎలా తండ్రి అవుతాడో రోహిత్‌కు అర్థం కాదు. మీకు అర్థం కాలేదా? అయితే యూట్యూబ్‌లో చూడండి.

Total views 7,048+ (అక్టోబర్ 5 నాటికి)
Published on Oct 3, 2019

కలవా ? చెలియా?

దర్శకత్వం: రవి తేజ
నటీనటులు : రోజ, మానస, రవితేజ
తన్మయ్‌కి తెల్లారితే పెండ్లి. అప్పుడే స్నేహితుడు సంజూ వస్తాడు. ఒంటరిగా మాట్లాడాలనుకుంటాడు. సంజూకు తన్మయ్ మీద అభిప్రాయాన్ని చెపుతాడు. ప్రేమిస్తున్నా అంటాడు. అదంతా తన్మయ్‌కి కొత్తగా అనిపిస్తుంది. ఆమెప్పుడూ సంజూని మంచి స్నేహితునిగానే భావించింది. ఉన్నట్టుండి ఇప్పుడు వచ్చి ప్రేమ గురించి చెప్పడం వల్ల ఆమెకేమీ అర్థంకాదు. ఇలాంటి బంధుత్వాన్ని నేను మన మధ్య కోరుకోవడం లేదు అని చెప్తుంది. ఆమె పెండ్లి వల్ల తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉన్నారో చూడు అంటుంది. సరే అంటాడు సంజు. కానీ ఇప్పటికైనా తన ప్రేమ గురించి చెప్పకపోతే భవిష్యత్‌లో తట్టుకోకపోయేవాడిని అంటాడు. చివరిసారైనా నీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ అని చెప్పి వెళ్తాడు. కథకు తగ్గ వాతావరణం,మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. మేకింగ్ బాగుంది.

Total views 23,888+ (అక్టోబర్ 5 నాటికి)
Published on Sep 29, 2019


శివ శివా..

కథ: శివ
దర్శకత్వం: శ్రీనివాస్
నటీనటులు : సాయి రోనక్, చందు, సునిత
మద్యం.. మనిషిని ఎంత క్రూరత్వంగా మారుస్తుందో ఈ లఘుచిత్రం ద్వారా చూపించారు. దానికి బానిసైన మనిషి ఎంతకు దిగజారుతాడో, అతని మానిసిక స్థితి ఎలా ఉంటుందో దీని ద్వారా తెలుస్తుంది. కథలోకి వెళ్తే ఒకతను మద్యానికి తీవ్ర బాసిన. రోజూ మద్యం తాగి వస్తాడు. తండ్రిని కోల్పోయిన అతను ఇలా మద్యానికి బానిసై పిచ్చిగా ప్రవర్తిస్తాడు. ఇలా ఓ రోజు మద్యం దుకాణం నుంచి నేరుగా ఇంటికి వస్తాడు. మద్యం మత్తులో ఉన్న అతను ఇంటి దగ్గర ఓ మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడతాడు. ఆమె తప్పించుకొని ప్రాణాలను దక్కించుకుంటుంది. విషయం గమనించిన మరో యువకుడు ఇతన్ని కొడతాడు. మద్యం మత్తు వదిలేలా చితకబాదుతాడు. ఇంకా బలంగా కొట్టే సమయంలో ఆ మహిళ అడ్డుపడుతుంది. వదిలేయాలని కోరుతుంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకే.. కాటేయబోతే నాది ఇదేం బతుకురా శివా అంటూ ఆమె ఏడుస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనేది యూట్యూబ్ లో చూడండి.. మేకింగ్, నటన, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి.

Total views 2,983+ (అక్టోబర్ 5 నాటికి)
Published on Sep 5, 2019

వినోద్ మామిడాల, సెల్: 7660066469

241
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles