పద్య రత్నాలు-23


Sun,October 13, 2019 01:40 AM

Srikalahastisvara

అన్నీ తెలిసిన గుడ్డితనం!

తరగల్ పిప్పల పత్రముల్ మెఱగు టద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత్కీట ప్రభల్
సురవీధీ లిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాప:పిండముల్
సిరులందేల మదాంధులౌదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!
- శ్రీ కాళహస్తీశ్వర శతకం
తాత్పర్యం:భూమిమీద జీవుల ప్రాణాలన్నవి నీటి అలల్లా, రావి ఆకులలా, మెరుపు అద్దాల్లా, గాలిలో దీపాల్లా, ఏనుగుచెవుల కొనల్లా, ఎండమావుల్లా, మిణుగురు పురుగుల కాంతిలా, శూన్యంలోని అక్షరాల్లా క్షణికభ్రాంతి కలిగిస్తాయంతే. ఇది తెలిసి కూడా మనుషులు సిరిసంపదల పట్ల అక్కర్లేని మమకారాలను పెంచుకొంటున్నారు. ఎందుకింత అజ్ఞానమో కదా స్వామీ!.

Bhaskara-century

వారికి దూరముంటేనే మంచిది!

తడవగరాదు దుష్టగుణుదత్త మెరుంగ యెవ్వరైన నా
చెడుగుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై
గదుదెగ జూచుగా మఱుగగాగిన తైలము నీటిబొట్టుపై
బదునెడ నాక్షణం బెగసి భగ్గు మండకయున్నె భాస్కరా!!
- భాస్కర శతకం

తాత్పర్యం:దుష్టులకు దూరముండడమే మంచిది. ఎందుకంటే, వారి గుణమే అంత. దుర్జనులని తెలిశాక ఏ మాత్రం వారికి నీతులు చెప్పే సాహసానికి పూనుకోకూడదు. ఎలాంటి హితవాక్యాలూ వారి చెవి కెక్కవు. పైగా, కోపంతో మంచిమాటలు చెప్పిన వారికే చెడు తలపెడతారు. బాగా కాగిన నూనె నీటిబిందువును ఎలాగైతే దహించి వేస్తుందో అలాగ!

Kumari-Centennial

మెట్టినింటి శ్రేయస్సు కోసం..

పతి కత్తకు మామకు స
మ్మతిగాని ప్రయోజనంబు మానగ వలయున్
హిత మాచరింపవలయును
బ్రతుకున కొకవంక లేక పరగు గుమారీ!
- కుమారీ శతకం

తాత్పర్యం:పుట్టినిల్లయినా, మెట్టినిల్లయినా పెద్దలమాటను కాదని పిల్లలు చేసే పనులేవీ శోభిల్లవు. పెద్దలుకూడా వారి మనసులు బాధ పెట్టకుండా
ప్రవర్తించాలి. అప్పుడే గృహాలు స్వర్గసీమలవుతాయి. భర్త, అత్త, మామలకు ఇష్టం లేని పనులను కోడలు ఎంత ప్రయోజనకరమైనా చేయకపోవడమే మంచిది. అలా ఎవరూ వేలెత్తి చూపించలేని నేర్పరితనంతో
జీవించగలగాలి.

Shri-Narasimha

ప్రభువులే ఆలోచించాలి మరి!

మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెఱుప సమర్థులంత,
యెండిన యూళ్ల గోడెఱిగింప డెవ్వడు, బండిన యూళ్లకు బ్రభువులంత,
యితడు పేదయటంచు నెఱింగింప డెవ్వడు, గలవారి సిరులెన్నగలరు చాల,
దన యాలి చేష్టలదప్పెన్న డెవ్వడు బెఱకాంత తప్పెన్న బెద్దలంత,
యిట్టి దుష్టు కధికార మిచ్చినట్టి
ప్రభువు తప్పులటంచును బలుకవలెను
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- శ్రీ నరసింహ శతకం

తాత్పర్యం:భూములిచ్చే వారొక్కరైనా ఉండరు కానీ, ఆక్రమణకైతే సిద్ధం. బంజర్ల గోడు ఎవరికీ పట్టదు కానీ పండిన పంటలకైతే ముందుంటారు. పేదవారిని పట్టించుకొనే వారుండరు కానీ సంపన్నుల సిరులైతే కావాలి. తమ భార్యల తప్పులు పట్టవు కానీ, పరస్త్రీలపట్ల చింత ఒలకబోస్తారు. ఇలాంటి వారిని అందలమెక్కించే ముందు ప్రభువులే ఆలోచించాలి కదా స్వామీ!

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్ నంబర్‌లో తెలియజేయండి.

225
Tags

More News

VIRAL NEWS