సీతరాములు నడయడిన నేల పర్ణశాల


Sun,October 13, 2019 01:58 AM

PARNASHALA
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి గోదావరి తీరం ఆధ్యాత్మిక ధామం.. భద్రాచలం, పర్ణశాలలో సీతారాములు నడియాడిన నేల.. చుట్టూ రమణీయ ప్రకృతి.. గలగల పారే వాగులు ఈ ప్రాంతపు ప్రత్యేకత.. భద్రాచలంలోని రాములోరిని దర్మించుకునే వారు కచ్చితంగా పర్ణశాలను దర్శించుకోవాలనుకుంటారు.. సీతారాములు వనవాసం చేసినప్పుడే ఈ ప్రాంతం పంచవటిగా ప్రసిద్ధికెక్కిందనేది స్థానికులు చెబుతున్న చరిత్ర..! విత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాల ప్రాంతం ఎంతో చారిత్రాత్మక ప్రదేశమని పురాణాలు చెబుతున్నాయి. సీతారాములు వనవాస సమయంలో మూడేళ్ల పాటు పర్ణశాల నదీ తీరంలో నివాసం ఉన్నారని స్థానికులు చెబుతుంటారు. పర్ణశాలను పంచవటి అని పిలవడానికి కారణం గౌతమీ నదీ తీరాన ఐదు మర్రివృక్షాలు ఉండటం, ఈ ప్రాంతంలో శ్రీసీతారామలక్ష్మణులు నివాసం ఏర్పరుచుకుని ఇక్కడే నడయాడినట్లు ఆధారాలుండడం.

ఆనాటి ఆనవాళ్లు

పర్ణశాలకు తూర్పు దిక్కున ఓ పెద్ద కొండ ఉంది. సీతాదేవి వనవిహారం చేస్తుండగా ఆ కొండ సమీపానికి వెళ్లగా ఆ సమయంలో దాహం వేయడంతో లక్ష్మణా.. నాకు దాహంగా ఉంది.. అని తెలపడంతో లక్ష్మణుడు బాణం తీసుకుని శిలను ఛేదించాడు. దాని నుంచి గలగల జలధార పొంగి వచ్చింది. సీతమ్మ దాహం తీర్చుకుంది. అప్పటి నుంచి అక్కడ సీతమ్మ వాగు నిత్యం ప్రవహిస్తుందని స్థల పురాణం. ప్రధాన ఆలయానికి ఈశాన్య భాగంలో పర్ణశాల కుటీరం, లేడిపాదాలు, శ్రీరాముని పాదాలు, సీతాదేవి మూర్చపోయిన ఆనవాళ్లు, రావణాసురుడు వచ్చి సీతాదేవిని అపహరించిన ఆనవాళ్లు, నారచీరెలు ఆరవేసిన ప్రదేశం, వామనగుంటలు ఇప్పటికీ చెరగని గురుతులు. అదే విధంగా సీతారామలక్ష్మణులు ఇక్కడున్న సమయంలో పూజలు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న శివాలయం ఇప్పుడు శ్రీరామలింగేశ్వర ఆలయంగా పేరుగాంచింది

ఇక్కడ పర్ణశాల.. అక్కడ పంచవటిభద్రాచలం నుంచి రాములవారు సీతమ్మను వెతుక్కుం టూ పంపానదీ తీరంలో శబరినీ, ఆ తరువాత రుష్యమూక పర్వతం మీద సుగ్రీవుణ్ణీ కలుసుకున్నాడట. ఇక అక్కడి నుంచి సాగిన రామాయణ కథ అందరికీ తెలిసిందే! అయితే మన భద్రాచలంలో పర్ణశాల ఉన్నట్లు మహారాష్ట్రలోని నాసిక్ క్షేత్రంలో పంచవటి అనే ప్రదేశం ఉంది. సీతాపహరణం జరిగింది అక్కడే అని స్థానికుల నమ్మకం. గోదావరీ తీర ప్రదేశాలైన ఈ రెండు క్షేత్రాలలోనూ రాములవారు గడిపి ఉంటారని నిస్సందేహంగా భావించవచ్చు.

ఆలయ నిర్మాణం జరిగిందిలా..

పురాతన దేవాలయాన్ని శ్రీనందుడు అనే స్వామిజీ నిర్మించగా, 1969లో భూకంపం రావడంతో ఆలయం కూలిపోయింది. అదే ఏడాది దేవాదాయశాఖ ఆ ఆలయాన్ని స్వాధీనం చేసుకుని ఆ ప్రదేశంలోనే దేవాలయాన్ని పునఃనిర్మించింది. ఇలా పర్ణశాల ప్రదేశంలో అణువణువూ కళ్లకు కట్టేలా అపురూప సుందర దృశ్యాలే కనువిందు చేస్తుండటంతో ఈ పర్ణశాల పవిత్ర పుణ్యక్షేత్రం గా, పర్యాటక ప్రాంతంగా మారింది.

ఎక్కడ ఉంది? ఎలా వెళ్లాలి?

భద్రాచలం నుండి 32 కిలోమీటర్ల దూరంలో సీతమ్మవారి పర్ణశాల ఉన్నది. భద్రాచలం నుండి షేర్ ఆటో లేక టాక్సీల ద్వారా పర్ణశాల చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి. నవంబరు-ఫిబ్రవరి మధ్యలో పర్ణశాలకు భద్రాచలం నుంచి పడవలో కూడా వెళ్లవచ్చు. అప్పుడు గోదావరి నదిలో నీటి ప్రవాహం బాగుంటుంది. శ్రీరామనవమి సమయంలో నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పడవలుండవు.

sita

సీతమ్మ అపహరణ

సీతారాములు ఉన్న కుటీరమే పర్ణశాల. దాదాపు వాళ్ల వనవాసంలో చాలా సమయం ఇక్కడే గడిపారని ఈ ప్రదేశ చరిత్ర చెబుతున్నది. సీతమ్మవారు గోదావరిలో స్నానం చేసి, పర్ణశాల పక్కనున్న రాధగుట్టపై చీర ఆరేసుకుంది అని అంటారు. ఇప్పుడు ఆ చోటుని నార చీరల స్థలం అంటారు. పర్ణశాలకు వెళ్లే దారిలో ఈ రాధగుట్ట ఉంది. రాధగుట్ట పక్కనే లక్ష్మణుడు, శూర్పణఖల మధ్య సంఘర్షణ జరిగిన ఒక చిన్న గుట్ట ఉంది. ఇదే ప్రదేశంలో సీతమ్మ బంగారు జింకను చూసి రాములవారిని ఆ జింక కావాలని కోరిందిట. శ్రీరాముడు జింక రూపంలో వచ్చిన మారీచుని సంహరించాడట. ఆ సమయంలో జటాయువు అనే పక్షి సీతమ్మను కాపాడే ప్రయత్నం చేయగా, భద్రాచలానికి సమీపంలో ఉన్న యేటపాక అనే స్థలంలో రావణాసురుడు, జటాయువుని అంతమొందించాడన్నది స్థలపురాణం. రావణాసురుడు తన పుష్పక విమానంలో ఈ ప్రదేశానికి వచ్చాడట. గోదావరి ఒడ్డున తన వాహనాన్ని ఆపి, సన్యాసి అవతారం ధరించి, పర్ణశాలకు వచ్చి, సీతమ్మవారిని అపహరించాడట.

305
Tags

More News

VIRAL NEWS