విషంతో ఆడుకుంటున్నాడు


Sun,October 13, 2019 12:40 AM

snake
రోగ, పీడనల నుంచి విముక్తి కోరుతూ, మనిషి ఆయురారోగ్యాలతో ఉండాలని యజ్ఞయాగాదులు చేస్తారు. క్షీరసాగర మదనంలో వచ్చిన విషాన్ని లోకసంరక్షణార్థం శివుడు కంఠంలో దాచుకొని గరళ కంఠుడు అయ్యాడు. ఇతనూ అంతే.. లోకకల్యాణార్థం నిలువెల్లా విషాన్ని నింపుకునే యజ్ఞం చేస్తున్నాడు. ఒక్కొక్క బొట్టు విషాన్ని ఒళ్లంతా దాచుకుంటున్నాడు. ఒంట్లో రక్తానికి బదులు అత్యంత ప్రమాదకరమైన రకరకాల పాముల విషాల్ని నింపుకుంటూ.. తన దేహాన్ని ఓ ప్రయోగశాలగా మలిచాడు

1980లో వచ్చిన తెలుగు సూపర్ హిట్ సినిమా పున్నమినాగు. ఈ సినిమాలో హీరో నాగులు(చిరంజీవి)కి ఒళ్లంతా విషమే ఉంటుంది. పాములు పట్టేవారికి పాముతోనే చావు అని తెలిసిన నాగులు తండ్రి.. తన కొడుక్కి చిన్నప్పటి నుంచే పాలల్లో పాము విషం పట్టి పెంచుతాడు. దీంతో నాగులుకు నిలువెల్లా విషం ఉంటుంది. తన తండ్రి వరం ఇచ్చాడని అనుకున్నా.. అది శాపమైందని తెలుసుకొని, ఆత్మహత్య చేసుకుంటాడు నాగులు.ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే.. అమెరికాలోని విస్కాన్సిన్‌కు చెందిన టిమ్ ఫ్రీడ్ కూడా 20 యేండ్ల నుంచి అత్యంత ప్రమాదకరమైన పాములతో కాటు వేయించుకుంటున్నాడు. ఎందుకంటే సమర్థవంతమైన యాంటీ వీనమ్ కోసమే. ఈ భూమ్మీద 3వేల జాతులకు పైగా పాములున్నాయి. ఆయా జాతుల్లో 200 రకాలు అత్యంత విషపూరితమైనవి ఉన్నాయి. ఈ 20 యేండ్లలో టిమ్ ఆ 200 రకాల విష సర్పాలతో కాట్లు వేయించుకున్నాడు.
SNAKE1

విషానికి విరుగుడు ఎలాగంటే?

పూర్వకాలంలో పాములు కరిస్తే.. పసర్లే దిక్కు. వాటివల్ల కొన్ని ప్రాణాలు దక్కినా.. ఎక్కువగానే ప్రాణనష్టం జరిగేది. ఆ తర్వాత వైద్యరంగం మెరుగైన ఫలితాలివ్వడంతో గుర్రాలు, గొర్రెలు వంటి జంతువుల శరీరంలోకి తక్కువ మోతాదులో విషాన్ని ఎక్కించి.. ఆ తరువాత వాటి రక్తం నుంచి యాంటీబాడీస్ సేకరిస్తున్నారు. 19వ శతాబ్దం నుంచీ యాంటీ వెనమ్ తయారీ పద్ధతులు మారలేదు. ఇప్పటికీ అవే పద్ధతులు అవలంభిస్తుండడం వల్ల చాలామంది ప్రాణాలకు గ్యారెంటీ లేదు. కారణం.. అవి జంతువుల నుంచి సేకరించిన యాంటీబాడీస్ కాబట్టి. అందుకే తనని తాను విషయాగం చేసుకున్నాడు టిమ్ ఫ్రీడ్. వాటిలానే మనం కూడా ఎందుకు విషాన్ని తట్టుకునేలా తయారుకాకూడదు? అంటాడు టిమ్. 51 ఏళ్ల టిమ్ గతంలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేశాడు. మొదట్లో ఆయన సాలీడు, తేలు వంటివాటితో కాటేయించుకునేవాడు. క్రమంగా తాచుపాములు, పింజర్లతోనూ కాటేయించుకోవడం ప్రారంభించాడు. ఇలా 20 యేండ్ల్లుగా శరీరంలో విషనిరోధక వ్యవస్థ పెంచుకునేందుకు పాములతో కాట్లేయించుకుంటున్నాడు. నేను ఈ భూమ్మీద ఉండే అన్నిరకాల విషసర్పాలతో కాటు వేయించుకోవడం లేదు. ఏవి కాటేస్తే మనిషి నిమిషాల వ్యవధిలోనే చనిపోతాడో.. అలాంటి భయంకర సర్పాలతోనే కాటేయించుకుంటున్నాను అంటున్నాడు. పాములతో కాటేయించుకునే టిమ్ అనేకసార్లు మృత్యువు అంచువరకూ వెళ్లాడు. అయినా, తన పద్ధతి మాత్రం మార్చుకోలేదు. టిమ్ ప్రయోగాలు ఆయనలో విశ్వాసాన్ని పెంచాయి. అంతేకాదు.. సాధారణ మనుషుల కంటే ఆయనలో ఇప్పుడు రెట్టింపు యాంటీబాడీస్ ఉన్నాయని వైద్య పరీక్షలూ తేల్చాయి. ఇదంతా 20 యేండ్లుగా వేయించుకుంటున్న పాము కాట్ల వల్లే.
snake2

ఇంటినిండా పాములే..

మన ఇళ్లలో గృహోపకరణాలు, పుస్తకాలు, పలు రకాల వస్తువులున్నట్లే.. టిమ్ ఫ్రిడ్ ఇంట్లో అత్యంత విషపూరితమైన పాములుంటాయి. ఆ పాములతో కాటు వేయించుకొని, ఆ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. అలాంటి ఒక వీడియోలో.. బ్లాక్ మాంబా (అత్యంత విషపూరితం) పాము వెంటవెంటనే రెండు సార్లు కాటు వేస్తుంది. మోచేతి కింద గాయమై రక్తం కారుతుంటుంది. విషం శరీరంలోకి పాకుతుంటే నొప్పిని పంటి బిగువన భరిస్తూ కెమెరాను చూస్తూ మాట్లాడుతుంటాడు టిమ్. బ్లాక్ మాంబా కాటేస్తే కలిగే నొప్పి భయంకరంగా ఉంటుంది. వేయి తేనెటీగలు ఒకేసారి కుడితే కలిగే నొప్పిలా ఉంటుంది. తేనెటీగలు కుడితే ఒకటో రెండో మిల్లీగ్రాముల విషం శరీరంలోకి ఎక్కుతుంది. కానీ, ఒక బ్లాక్ మాంబా కాటేస్తే 300 నుంచి 500 మిల్లీగ్రాముల విషం శరీరంలోకి వెళ్తుంది. టిమ్ తనకు పాము కాటేసిన తరువాత ఏమవుతుందో చెప్పాడు. కాటేసిన వెంటనే ఆ ప్రాంతమంతా వాపు వస్తుంది. తరువాత ఒకట్రెండు రోజులు లేవలేని పరిస్థితిలో ఉంటా. వాపు తీవ్రతను బట్టి నా ఒంట్లోకి ఎంత విషం వెళ్లిందో నాకు అర్థమైపోతుంది. ఆ నొప్పి భరించలేనంతగా ఉంటుంది.

ప్రాణాలను పణంగా పెట్టి..

ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదానికి ఎదురెళ్తున్నాడు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడానికే ఇలాంటివి చేస్తున్నాడు అనే వారితో టిమ్ ఏకీభవించడు. ఇదంతా నేను ప్రజల ప్రాణాలు కాపాడే మందుకోసం ప్రయత్నిస్తున్నాను అని సగర్వంగా చెబుతున్నాడు. పాము కాట్లతో పాటు 700 సార్లకు పైగా విషం ఇంజెక్షన్లు కూడా వేయించుకున్నాడు టిమ్. యాంటీవెనమ్ తయారుచేసేందుకు సొంతంగా సంస్థ నెలకొల్పే పనిలో ఉన్న ఇమ్యునాలజిస్ట్ జాకబ్ గ్లాన్‌విలే రెండేండ్ల కిందట టిమ్ వీడియోలు చూశారు. ఆయన ప్రఖ్యాత ఔషధ సంస్థ ఫైజర్‌లో పనిచేసి రిటైరయ్యారు. టిమ్ రక్త నమూనాలను పరీక్షిస్తూ సమర్థమైన యాంటీవెనమ్ తయారీ కోసం కృషి చేస్తున్నారు జాకబ్. అయితే.. టిమ్‌లా ఎవరూ చేయొద్దని మాత్రం జాకబ్ సూచిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర ప్రయోగాలు ప్రాణాలకే ముప్పు తెస్తాయి. ఎవరూ ఇలాంటివి చేయకూడదు.

335
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles