ఇదో కొత్త పర్యాటకం


Sun,October 13, 2019 12:58 AM

slum
పాన్‌టేలా అంత వైశాల్యంతో ఇండ్లు. వాటి ముందు నుంచి పారే కాలువలు. తుప్పు పట్టిన రేకు తలుపులు. ప్లాస్టిక్ కవర్లే ఆ ఇండ్లకు పైకప్పులు. అక్కడక్కడా ఇండ్లపై కనిపించే మట్టి పెంకులు. కుటుంబీకులతో సహా కలిసి జీవించే ఈగలు, దోమలు. చుట్టూ చెత్తా చెదారం. అక్కడ ఇల్లంటే ఒకే గది. కిచెన్, బెడ్రూం, హాల్ స్టడీ రూం అన్నీ ఒకే గదిలో. కనీసం ఆటో పట్టేంత స్థలం లేని రోడ్లు అక్కడుంటాయి. కాలనీలో ఎక్కడపడితే అక్కడ చెత్త... అదంతా దుర్బర ప్రపంచం. కానీ ఇప్పుడదే ఓ ఫేమస్ టూరిజం ప్లేస్. అలాగని అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లేం చేయలేదు. మరెందుకు పర్యాటకులు ఆ మురికి వీధుల్ని సందర్శిస్తున్నారు?

చాలా ఆనందంగా ఉంది. పేదల జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశాను. ఇక్కడ ప్రతి ఒక్కరిలోనూ కష్టపడేతత్వాన్ని గుర్తించాను. వాళ్ల ఇండ్లు ఇరుకుగా ఉన్నాయి. కానీ వాళ్ల మనసు చాలా విశాలంగా ఉంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే.. ఒక్కరంటే ఒక్కరు అక్కడ యాచించడం నేను చూడలేదు. వాళ్ల కష్టపడే తత్వానికి సెల్యూట్ చేయాలనుంది. నిజంగా సామాన్యుడి జీవితం అంటే ఇలా ఉంటుందా.. అనిపించింది. అని తన అభిప్రాయం చెప్పారు సందర్శనకు వచ్చిన బ్రిటన్‌కు చెందిన పారిశ్రామిక వేత్త జాక్.

అద్దాల మేడలు.. ఆ పక్కనే పూరి గుడిసెలు

అది ముంబై మహానగరం. లక్షల సంఖ్యలో మేడలున్నాయక్కడ. అదేసంఖ్యలో పూరిగుడిసెలున్నాయి. ఆ ప్రాంతం పేరు ధారవి. అక్కడన్నీ గట్టిగా గాలి వీస్తే లేచిపోయే పైకప్పులే. ఆ ప్రాంతమంతా నిరుపేదలే. దాదాపు పదిలక్షల మంది పేదలుంటారక్కడ. అపరిశుభ్ర వాతావరణం. ఈగలు, దోమలు విపరీతం. ఇండ్ల మధ్యలోంచే కాలువలు పారుతుంటాయి. పబ్లిక్ టాయిలెట్లు, కుళాయిలు ఉన్నాయి. కానీ పరిసరాల పరిశుభ్రత మాత్రం మచ్చుకైనా కనిపించదు. అయినప్పటికీ చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. సరికొత్త అనుభవాల్ని పొందుతున్నారు. ఎందుకంటే..]

స్లమ్ టూరిజం..

ఇటీవల రియాలిటీ టూరిజం అనేది ట్రెండ్‌గా మారింది. కొన్ని ట్రావెల్, టూరిజం సంస్థలు ఇతరదేశాల్లో రియాలిటీ టూరిజం పేరుతో ధారవి ప్రాంత గొప్పదనాన్ని చెబుతున్నాయి. నిరుపేదలు ఎలా బతుకుతారు. వారి జీవన విధానం ఎలా ఉంటుంది. డబ్బుల్లేకుండా ఆనందంగా ఎలా జీవిస్తారు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ధారవిలో పర్యటించాలి అని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మురికి ఏరియాగా ధారవికి పేరుంది. ఈ ఒక్క కారణంతో స్లమ్ ఏరియాను టూరిజంగా మార్చాయి సంస్థలు. రోజూ వేల సంఖ్యలో విదేశీయులు ధారవిలో పర్యటిస్తున్నారు. అక్కడి పరిస్థితుల్ని కెమెరాల్లో బంధిస్తుంటారు. సామాన్యులతో కలిసి ఫొటోలు దిగుతున్నారు. ధారవిలో ఎవ్వరి పని వారు చేసుకుంటారు. ట్యాక్సీ నడిపేవారు. హమాలీ పనిచేసేవారు, దినసరి కూలీలు, చిరువ్యాపారులు ఈ ఏరియాలో ఎక్కువగా ఉంటారు.

పర్యాటకులు ఇక్కడేం చేస్తారంటే..

ధారవిలో అన్ని రకాల వృత్తుల వారూ ఉన్నారు. లగ్జరీ లైఫ్ నుంచి ఆర్డినరీ లైఫ్ ఎలా ఉంటుందో చూడడం విదేశీయులకు కొత్త అనుభవం. టూరిస్టులు స్థానికులెవ్వరినీ ఇబ్బందులకు గురిచేయరు. ధారవి వాసులు కూడా పర్యాటకుల్ని పట్టించుకోరు. తాహతుకు తగ్గట్లుగా వ్యాపారం చేస్తూనో, మరేదైనా పని చేస్తూనో ప్రతి ఒక్కరూ కనిపిస్తుంటారు.
Krishna-Pujari

విదేశీయులు ఎక్కువొస్తున్నారు!

రియాలిటీ టూరిజం పేరుతో మేమే మొదటగా ధారవిని పర్యాటక ప్రాంతంగా విదేశీయులకు పరిచయం చేశాం. మా వ్యాపారం బాగుంది. ఈ మధ్య తాజ్‌మహల్‌ను చూసేవారికంటే ధారవి ప్రాంతాన్ని చూసేవారి సంఖ్య పెరిగింది. ఎక్కువగా బ్రిటన్, రష్యా, అమెరికా దేశాల పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇంట్లోని అందరూ కష్టపడుతారు. ఎవ్వరూ ఖాళీగా ఉండరు. సౌకర్యాలు అంతగా లేకపోయినా ఇది పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నది.
slum1
- కృష్ణ పూజరి
రియాలిటీ టూర్స్ అండ్ ట్రావెల్స్
సహవ్యవస్థాపకుడు, ముంబై

257
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles