ఆహారభద్రత ఎప్పుడు?


Sun,October 13, 2019 03:38 AM

food
అడుగున పడి నలుగుతున్న బడుగుజనుల బతుకులు,భవితవ్యం ఎరగనట్టి బాధితులు, పీడితులు సిరిగల వారికే పంచభక్ష్య పరమన్నాలు, కలవారికే కడుపునిండా కమ్మని భోజనామృతాలు అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడు?

food1
స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడచినా ఇంకా ఈ ప్రశ్నలకు సమాధానం మనదగ్గర లేదన్నది నిజం. అణుపరీక్షల్లో విజయం సాధించాం, క్షిపణిని విజయవంతంగా పరీక్షించాం, చంద్రునిపై కాలుమోపాం అంటూ సగర్వంగా చెప్పుకునే దేశాలు మా దేశంలో పేదరికాన్ని, ఆకలిని సంపూర్ణంగా నిర్మూలించాం అని చెప్పుకోలేక పోతున్నాయి. కారణం కడుపు నిండా తిండి.. కట్టుకోవడానికి బట్ట.. ఉండడానికి గూడు మనిషి కనీసావసరాలు. కానీ, ప్రపంచంలో కొన్ని కోట్లమంది ఒక్కపూట కడుపునిండా తిండి దొరకక అన్నమో రామచంద్ర అంటూ అంగలారుస్తున్నారు. ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆకలి మాత్రం తీర్చలేకపోతున్నది. ఫలితంగా జానెడు పొట్ట నింపుకునేందుకు మనిషి పడరాని పాట్లు పడుతున్నాడు. ఈ భూమీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఆహార కొరత లేకుండా, అందుబాటులో ఉండేలా చూడాలన్నది ఐక్యరాజ్యసమితి లక్ష్యం. ఆ లక్ష్యసాధనకోసమే ఏటా అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది.

- మధుకర్ వైద్యుల, సెల్: 9182777409


అంతరిక్షంలోకి దూసుకుపోతు న్న ఈ రోజుల్లో కూడా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 53 దేశాల్లోని 11.3 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కనీసం ఒక పూట కూడా కడుపు నింపుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని సాక్షాత్ ఐక్యరాజ్య సమితి అధికారికంగా వెల్లడించింది. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చి ఇన్సిట్యూట్ (ఐఎఫ్‌పిఆర్‌ఐ) రూపొందించిన ప్రపంచ ఆకలి సూచీలో 118 దేశాలలో భారత్ 97వ స్థానంలో ఉన్నది. పోషకాహార లోపం, ఎత్తుకు తగినంత బరువు లేకపోవటం, వయసుకు తగ్గ ఎత్తులేకపోవటం, బాలల మరణాల శాతం అంశాల ప్రాతిపదికగా ఐఎఫ్‌పిఆర్‌ఐ ప్రపంచ ఆకలి సూచీని రూపొందించింది. మనకన్నా తక్కువ ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, అమెరికా దురాక్రమణతో తీవ్రంగా చితికిపోయిన ఇరాక్ కన్నా మనదేశం ప్రపంచ ఆకలి సూచీలో పై స్థానంలో ఉన్నది. ఆఫ్రికా ఖండంలో పేదరిక దేశాలుగా మద్ర పడిన అనేక దేశాలు మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి.అనేక ఏళ్లుగా మనదేశం కూడా ఆహారభద్రత కోసం పరితపిస్తున్నది. ఒక్కోఅడుగూ వేస్తున్నది. 2030 నాటికి ప్రపంచం ఏ మూల కూడా ఆకలికేకలు వినిపించకూడదని, ఆకలి అన్నది ఉండకూడదన్న (జీరో హంగర్) లక్ష్యంతో అందరూ అడుగువేస్తున్నారు.

ఎందుకీ దినోత్సవం?

పుట్టిన ప్రతి మనిషికి ఆహారం అవసరం. అది ప్రాథమిక హక్కుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అయితే పెరుగుతున్న జనాభాకు తగినట్లు,వారి ఆహార అవసరాలకు తగ్గట్లు ఉత్పత్తులు పెరగాలి. జనాభా పెరిగిపోవడం, ఆర్థిక వ్యత్యాసాలు, వాతావరణ మార్పులు ఆహారకొరతకు కారణమయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొన్నివర్గాలు ఆకలితో అలమిటిస్తున్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ఐక్యరాజ్య సమితి అనుబంధంగా 1945 అక్టోబర్ 16న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎఒ) ఆవిర్భవించింది. ఏటా అదేరోజున ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. 1981 నుండి ఏటా ఒక లక్ష్యా న్ని నినాదంగా చేసుకుని ప్రజాచైతన్యం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ప్రస్తుతం ఎఫ్.ఎ. ఒ. పరిధిలో 150కిపైగా దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి. ఈ ఏడాది మన చర్యలే మన భవిష్యత్(our actions are our future) అన్న నినాదంతో 2019 ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. సభ్య దేశాలన్నీ ఇందుకు తగ్గట్లుగా కార్యక్రమాలను రూపొందించాయి.ఆకలికేకలు వినిపిస్తున్న దేశాల్లో మనదేశం కూడా ఉంది. జనాభాపరంగా, ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్న చిన్నచిన్న దేశాలు ఆకలిని తరిమేస్తూ ఆకలిలేని సమాజాన్ని నిర్మిస్తుంటే అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకునే మనదేశం మాత్రం ఈ విషయంలో ఇంకా వెనుకబడి ఉండడం విచారకరం.2030నాటికి ఆకలి లేని సుభిక్షమైన లోకంగా భూగోళం అవతరించాలన్నది ఐరాస ఆకాంక్ష.
food3

ఆకలికేకల ప్రపంచం

ప్రపంచజనాభాలో నాలుగోవంతు మందికి కడుపునిండడం లేదు. అంటే 830 మిలియన్లమంది ఆకలితో అలమటిస్తున్నారు. తీవ్రమైన ఆకలితో వారంతా జీవచ్ఛవాల్లా మారిపోయారు. కనీసం ఒకపూట తిండికూడా కష్టమవుతున్నవారు అనేకమంది. బతకడానికి తిండి కావాలి. ఆ తిండి కోసం పుట్టినచోట పనిలేక, తిండిలేక పస్తులతో బతకలేక పొట్టచేత పట్టుకుని వలసవెళ్లిపోతున్న జనాభా కోట్లలోనే ఉంది. ఊళ్లు ్ల, దేశాలు, ఖండాలు దాటి ఆహారం కోసం ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు.ఒక ప్రాంతం లో సరైన అవకాశాలు దొరకకపోవడం, నిరుద్యోగం, వసతుల లేమి, పేదరికం, ఆహార అభద్రత, వర్గాల మధ్య ఘర్షణ వంటి అనేక కారణాలతో ప్రపంచవ్యాప్తంగా వలసలు అధికమవుతున్నాయి. ఇలా 1990 నుంచి 2017 వరకు ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశం నుంచి మరో దేశానికి, దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి సుమారు 68.5 మిలియన్ల మంది వలస వెళ్లారు.

కారణాలివి

ప్రపంచ దేశాలు ఆకలిని ఎదుర్కోవడానికి అనేక కారణాలున్నాయి. వాటిలో గత 2018లో సంభవించిన అంతర్యుద్ధాలు, వాతావరణ వైపరీత్యాల వల్ల 11.3 కోట్ల మంది తీవ్రమైన ఆకలితో అలమటించారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ దుస్థితి ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోనే కనిపించిందని తెలిపింది. ఆహార సంక్షోభానికి సంబంధించి 2019 నివేదికను ఐరాస విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 53 దేశాల్లో ఆకలి తీవ్రత ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ఆకలి తీవ్రతను ఎదుర్కొన్న వారిలో ఎనిమిది దేశాలకు చెందిన ప్రజలు ఉన్నారని.. ఈ ఎనిమిది దేశాల్లో యెమెన్, కాంగో, సిరియా, ఆఫ్ఘనిస్థాన్ దేశాలున్నాయని నివేదిక వెల్లడించింది. ఒక్క ఆఫ్రికా ప్రాంతంలోనే 7.2 కోట్ల మంది ఆకలి తో అలమటించారని.. సంఘర్షణలు, అభద్రత, ఆర్థికపరమైన సమస్యలు, కరవు, వరదలు వంటి పలు కారణాలే ఈ ఆకలికి ప్రధాన కారణమని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది. సిరియాలో అంతర్యుద్ధం, మయన్మార్ లో అశాంతి వల్ల రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలస వెళ్లడం వంటి పరిస్థితులు ఆకలి తీవ్రతకు అద్దం పడుతున్నాయని వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్‌లో కూడా ఆకలికేకలు వినిపిస్తున్నాయని తెలిపింది.

భవిష్యత్‌పై ప్రభావం

నేటి బాలలే రేపటి పౌరులని నేతలంతా నినాదాలు ఇవ్వడం వరకు బాగానే ఉంటుంది. కానీ భావి భారత పౌరుల బతుకులు ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నాయో పట్టించుకునే నాయకులే కరువయ్యారు.తిండి కలిగితే కండకలదోయ్-కండ కలవాడే మనిషోయ్ అన్నారు. కానీ నేటి బాల్యం సరైన తిండిలేక ఎముకల గూడవుతుందన్న విషయాన్ని గుర్తించిన నాథుడే లేడు. బాలల్లో ఈ పరిస్థితి దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. బాల్యంలో సరైన పోషకాహారం తీసుకోని బాల్యం రేపటికి బక్కచిక్కి, శల్యమైన శరీరంతో, చేతకాక, చేవలేక ఎదిగీ ఎదగని శరీరంతో వీధులవెంట, గల్లీలచెంత బుక్కెడు బువ్వకోసం చేతులు చాస్తున్నది. ఈ లోపం వారికి భవిష్యత్తులో ఎప్పటికీ పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తుంది. బాలబాలికలు పుట్టినప్పటి నుంచి వెయ్యి రోజుల లోపల వారికి ఏర్పడిన పోషకాహార లోపాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. ఆ సమయం దాటితే వారిలోపాన్ని సరిచేయడం సాధ్యంకాదు. శారీరక, మానసిక వికాసానికి అవసరమైన పోషకాహారాన్ని బాల్యంలో పొందలేకపోతే వారు వయసుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగిన బరువు పెరుగరు.

శారీరకంగా అభివృద్ధి చెందని వారిలో మెదడు కూడా అభివృద్ధి చెందదు. బాల్యంలో తగినంత ఆహారం తీసుకోకపోవటంతో రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. దీంతో రోగ నిరోధక శక్తి కుంటుపడుతుంది. అటువంటి బాల్యం నిత్యం అనారోగ్యాల పాలవుతుంది. అంటువ్యాధులు వంటివి వారిని త్వరగా చుట్టు ముడుతాయి. అవి అంత తొందరగా నయం కావు. అప్పుడు ఎన్ని రకాల పోషకాలు తీసుకున్నా లాభం ఉండదు. మందులు వారిపై అంతగా పనిచేయవు. ఎక్కువ మోతాదులో ఉన్న మందులనే వాడాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ గాఢత కలిగిన మందులు వాడడం వల్ల భవిష్యత్‌లో సాధారణ వ్యాధికి సైతం అంతకంటే బలమైన మందులు వాడాల్సి వస్తుంది. నిజానికి మనదేశంలో ఎక్కువ కుటుంబాలలో తీసుకొనే ఆహారంలో వివిధ పోషకాల లోపం ఎక్కువగా ఉంటున్నది.

ఆ లోపం బాలలతోపాటు కుటుంబసభ్యులపై కూ డా ప్రభావాన్ని చూపుతున్నది. గత 40 సంవత్సరాలలో కూరగాయలు, కొవ్వు పదార్థాలు, నూనెలు తీసుకోవటం తగ్గిందని నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో నివేదిక తెలిపింది. విటమిన్ ఎ, సి మినహా మిగతా సూక్ష్మ పోషకాలను తీసుకోవటం కూడా తగ్గిందని నివేదిక వెల్లడించింది. మొత్తంగా చూసినప్పుడు బాలలతో పాటు ప్రజలు కూడా ఉండాల్సినంత ఆరోగ్యంగా లేరని స్పష్టమౌతున్నది. ఈ పరిణామాలు భారతదేశ భవిష్యదభివృద్ధిపై పెను ప్రభావం చూపుతాయి.

ప్రభుత్వ చర్యలేవి?

దేశ ప్రజలు తీవ్ర ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వాలు మాత్రం ఏ మాత్రం చర్యలు చేపట్టడం లేదు. ప్రజలకు చౌకగా ఆహారధాన్యాలను అందించటం, బాలలకు పౌష్టికాహారాన్ని అందించటంలో చాలా ప్రభుత్వాలు విఫలమయ్యాయనే చెప్పాలి. దీంతో సాధారణ ప్రజలు అధిక ధరలతో ఆహారధాన్యాలను కొనలేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఒకప్పుడు పదుల్లో కిలో ఉన్న బియ్యం, పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలైన కూరకాయల ధరలు ఆకాశంలో విహారిస్తున్నాయి. దీంతో రోజుకు వంద రూపాయలు కూడా సంపాదించలేని నిరుపేదలు అంతే మొత్తంలో ఉన్న ఆహార పదార్థాల్ని కొనలేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడియస్) ద్వారా ఆహారధాన్యాలను కొద్డిమందికి మాత్రమే అందజేస్తున్నారు.
food5
ఇస్తున్నవారికి కూడా అన్ని రకాల ధాన్యాలు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం 2013లో చేసిన ఆహార భద్రతా చట్టం ఈనాటికీ సక్రమంగా అమలు చేయటం లేదు. ప్రజలకు తగిన న్ని ఆహారధాన్యాలను, ఇతర ఆహార సరుకులను తక్కువ ధరలకు సరఫరాచేసి, పేదల ఆకలిని, పోషకాహార లోపా న్ని నివారించాల్సి ఉంది. మార్కెట్లో ఆహారధాన్యాల ధరల పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం తన వద్ద ఉన్న ఆహారధాన్యాలను మార్కెట్లోకి విడుదల చేసి ధరల పెరుగుదలను అరికట్టాలి. ఆయా సీజన్లలో ఉల్లిపాయలు, పప్పులు, కూరగాయలు, తదితర సరుకుల ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండాపోతున్నాయి. దీంతో ఆకలితో అలమటించి శోకంతో కుమిలిపోయే బడుగుజనుల బతుకులు చిన్నవయస్సులోనే తెలవారిపోతున్నాయి. ఈ కన్నీటి కథకు ముగింపు ఎవరిస్తారో, ఎపుడొస్తుందో వేచి చూడాల్సిందే.
food7

మనమేం గొప్పకాదు

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనదేశం ఒకటి. అదే సమయంలో ఆకలితో అలమటిస్తున్న ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో కూడా మనమూ ఉన్నాము. మనకన్నా చిన్నచిన్న దేశాలు పేదరికాన్ని, ఆకలిని తరిమేస్తుంటే మనం ఇంకా వెనుకబడే ఉన్నాం. 2014లో 76 దేశాలలో 55వ స్థానంలో ఉన్న మనదేశం 2015లో 104 దేశాలలో 80వ స్థానానికి, 2016లో 114 దేశాలలో 97వ స్థానానికి పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో సరైన ఆహారం లేక, పౌష్టికత లోపించి ప్రాణాలు విడుస్తున్నవారి సంఖ్య ఏటా 3.1 మిలియన్లమంది. మనదేశంలో చిన్నపిల్లల మరణాల సంఖ్య దేశీయంగా 48శాతం. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే ఆకలిని తరిమేయాలి. ఆ దిశగా 120 దేశాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే 72 దేశాలు గణనీయమైన ప్రగతి సాధించాయి.

మనం మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాం. ఆకలి సూచికలో మనం అట్టడుగులో ఉన్నాం. ప్రపంచంలో ప్రతి 9 మంది చిన్నారుల్లో నలుగురు పౌష్ఠికాహార లోపంతో బాధపడుతుంటే మనదగ్గర వారి సంఖ్య ఇంకాస్త ఎక్కువ. నిరక్షరాస్యత, పేదరికం, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగకపోవడం, అడవుల నరికివేత, ప్రభుత్వ నిరాసక్తత దీనికి కారణం. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకాలు మొదలయ్యాయి. రైతులకు మద్దతు ధరలు, సబ్సిడీలు, రాయితీలు ఇవ్వడం, వారి ఆదాయాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆహార భద్రత చట్టాన్ని అమలు చేస్తూ, 2022 నాటికి రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.

ఆహారభద్రత

ఆహారభద్రత అంటే ప్రజలందరికీ ఆహారం అందుబాటులో ఉండటం అని స్థూలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యం గా నాలుగు అంశాలతో ఆయా దేశాల్లో ఆహారభద్రతా ప్రమాణాలను లెక్కగట్టవచ్చు. ప్రజలకు అందుబాటులో ఆహారపదార్థాలు ఉండటం, వాటిని కొనుగోలు చేసుకోవడానికి అనుసంధాన ఏర్పాట్లు ఉండటం, వాటిని వినియోగించుకునే సౌకర్యాలు ఉండటం, ఇవన్నీ ఎప్పుడూ స్థిరంగా ఉండటాన్నిబట్టి ఆ ప్రాంతంలో ఆహారభద్రత ఉన్నట్లు లెక్క. ఈ పరిస్థితులను ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో కల్పించి ఆకలి పేదరికం లేకుండా చూడటమే ప్రస్తుత లక్ష్యం. నిజానికి మనదేశంలో 1950-51లో ఆహారధాన్యాల ఉత్పత్తి 50 మిలియన్ టన్నులుఉంటే 2014-15 నాటికి 250 మిలి యన్ టన్నులకు పెరిగింది. 2022నాటికి రైతులకు ఇప్పుడు వస్తున్న ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో భారత్ అడుగులు వేస్తున్నది.

1974లో వరల్డ్ ఫుడ్ కాన్ఫరెన్స్, 1996లో వరల్డ్ ఫుడ్ సమ్మిట్‌లలో ఆహార భద్రత అన్న అంశం చర్చకు వచ్చింది. భారత్‌లో 2013 నుంచి ఆహారభద్రత దిశగా తొలి అడుగుపడింది. ఆధునిక కాలంలో జనాభా విస్ఫోటనంతో నిల్వల మాట దేవుడెరుగు. ఎప్పటికప్పుడు అవసరాలకు తగ్గట్లు ఉత్పత్తి చేసుకోవడమే గగనం అయిపోయింది. మనిషి సేద్యయోగ్య భూమిని తగ్గిస్తూ అభివృద్ధి పేరిట నిర్మాణాలను చేపట్టడం, భూతాపం పెరగడం, దానివల్ల వ్యవసాయం దెబ్బతినడం ఈ పరిస్థితికి కారణం.

ఏం చేయాలి?

పోషకాహార లోపాన్ని అరికట్టి, బాలలకు, ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది. రేపటితరం బలంగా ఉండాలన్నా, అనారోగ్యాల పాలు కాకుండా దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాలన్నా వారికి బలవర్ధక ఆహారం అందాల్సి ఉది. పేదలు, మహిళలు, పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉంది. పేదల ప్రధాన ఆహార అవసరాలను తీర్చే విధంగా ఆహార భద్రతా చట్టంలో మార్పులు చేసి, అమలుచేయాలి. తమకు అవసరమైన ఆహారాన్ని కొనుగోలు చేయలేని ప్రజలకు సంపూర్ణశక్తినిచ్చే ఆహార సరుకులను అందించేందుకు తగిన ప్రణాళికను రూపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే పోషకాహార లోపాన్ని నివారించి, దేశం ప్రపంచ ఆకలి సూచీలో దిగువస్థాయికి రావటం సాధ్యం అవుతుంది.
food2

తెలంగాణ బేష్

అనేక ఉద్యమాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడియస్)మిగిలిన రాష్ర్టాలతో పోలిస్తే చాలా ఆదర్శవంతంగా ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పిడియస్ విధానం లోపభూయిష్టంగా ఉండేది. నాడు కుటుంబానికి కేవలం ఐదు కిలోల ఉచిత బియ్యం మాత్రమే సరఫరా చేసేవారు. అవి కేవలం కుటుంబానికి రెండు రోజుల తిండికి కూడా సరిపోయేవి కావు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పదవీ బాధ్యతలు చేపట్టగానే ఆహార భద్రత కార్డును ప్రవేశపెట్టి కుటుంబంలో ఎంతమంది ఉన్నా నెలకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నారు. అలాగే బాలలకు చిన్నతనం నుండే పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్బిణీ స్త్రీలకు అంగన్‌వాడి కేంద్రాల్లో పోషకాలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నది. బిడ్ద పుట్టిన తర్వాత మూడేండ్ల వరకు పిల్లలకు బాలామృతం పేరుతో పోషకాల పిండిపదార్థాలు, వారానికి 5 కోడిగుండ్లు, ఒక్కోరోజు ఒకో రకం అన్నం, ఉడకబెట్టిన కోడిగుడ్డు, కూరగాయల భోజనం, ఎగ్‌కర్రీ, లెమన్‌రైస్, రాగి లడ్డు, బేసన్ లడ్డు, పల్లీల లడ్డు, పప్పు పుట్నాలు, బెల్లం ఇలా రకరకాల ఆహారపదార్థాలతో పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తున్నది. తద్వారా బాల్యంలోనే పోషకవిలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తూ బాల్యాన్ని బలమైన పౌరులుగా ఎదిగేలా కృషి చేస్తున్నది.
food4

నిర్వీర్యమవుతున్నబాల్యం

ముఖ్యంగా ఐదేండ్లలోపు చిన్నారులు అసలు ఆహారంలేక, మరికొందరు బలవర్ధక ఆహారం దొరకక ప్రాణాలు విడుస్తున్నారు. బాలల్లో ఈ పరిస్థితి దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. బాల్యంలో ఎదురైన పోషకాహార లోపం వారికి భవిష్యత్తులో ఎప్పటికీ పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తున్నది. శారీరక, మానసిక వికాసానికి అవసరమైన పోషకాహారాన్ని బాల్యంలో పొందలేకపోతే వారు వయసుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగిన బరువు పెరగరు. శారీరకంగా అభివృద్ధి చెందని వారిలో మెదడు కూడా అభివృద్ధి కాదు. తగినంత ఆహారం తీసుకోకపోవటంతో రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. 2014-15లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే దేశంలో ఎత్తుకు తగిన బరువులేని ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు 37 శాతం ఉన్నారని చెప్పింది. దశాబ్దం క్రితం ఇది 42 శాతంగా ఉండగా ఈ కాలంలో ఐదు శాతం మాత్రమే తగ్గింది. ఎత్తుకు తగ్గ బరువులేని పిల్లలు 22 శాతం ఉన్నారు. దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గినా ఇంకా వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది. ఐదు ఏండ్లలోపు వయసు రాకముందే మరణిస్తున్న బాలల సంఖ్య వెయ్యికి 48 మందిగా ఉన్నది. ఇరాక్‌లో ఈ సంఖ్య వెయ్యికి 32, లిబియాలో 13, నేపాల్‌లో 36, శ్రీలంకలో 10, పాకిస్థాన్‌లో81, ఆఫ్ఘనిస్థాన్‌లో91, బంగ్లాదేశ్‌లో 38 మందిగా ఉంది. ఐసిస్ దాడులతో తీవ్ర విధ్వంసాన్ని ఎదుర్కొన్న సిరియాలో వెయ్యికి 13 మంది బాలలు మాత్రమే మరణిస్తున్నారు.

food6

పోషకాహారలోపం

-ఒకప్పుడు బలవర్థకమైన ఆహారాన్ని తీసుకున్నవారు ఇప్పటికీ బలంగా ఉన్నారు.

-కూరగాయలు, పాలు, మాంసం ఇలా అన్ని రకాల పోషకాలున్న ఆహారం వారికి కండపుష్ఠిని పెంచింది.

-నేడు పండిస్తున్న పంటలన్నీ క్రిమి సంహారకాల మయం కావడంతో వాటిలో పోషకాల ఊసే లేదు.

-గడచిన నాలుగు దశాబ్ధాల్లో కూరగాయలు,కొవ్వు పదార్థాలు, నూనెలు తీసుకోవటం తగ్గింది.

-రోజువారీ తలసరి ఆహారంలో గత 40 ఏండ్లలో వంద గ్రాములకు పైగా ఆహారధాన్యాలు, 13 గ్రాముల మాంసకృత్తులు తగ్గాయి.

-తీసుకునే ఆహారం తక్కువగా ఉంటున్నప్పుడు శరీరానికి అవసరమైన పోషకాలు సక్రమంగా అందటంగాని, ఆ ఆహారం తీసుకుంటున్న వారు ఆరోగ్యంగా ఉండటంగాని సాధ్యం కాదు.

-15-49 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలలో సగం మంది, పురుషులలో ౩వ వంతు మందికి రక్తహీనత సమస్య ఉన్నది.

-విటమిన్ ఎ, సి మినహా మిగతా సూక్ష్మ పోషకాలను తీసుకోవటం కూడా తగ్గింది.

-జాతీయ పోషకాహార సంస్థ 2011-12లో నిర్వహించిన సర్వేలో గ్రామీణ ప్రాంతంలో అన్ని రకాలైన ఆహారధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పాలఉత్పత్తులు, పంచదార, బెల్లం, నూనెలు, కొవ్వు పదార్థాలు అవసరమైన వాటికన్నా తక్కువ తీసుకుంటున్నారని స్పష్టమైంది.

బాలల మరణాలు, తల్లుల మరణాలు, పౌష్టికాహార లభ్యత, ఆహార భద్రత, తలసరి ఆదాయం వంటి గణాంకాల ఆధారంగా ప్రపంచ ఆకలి సూచికను లెక్కకడుతారు. దీనిప్రకారం ఆకలిని జయించిన దేశాలు, ఆకలితో సహజీవనం చేస్తున్న దేశాలను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. సరైన గణాంకాలు అందుబాటులో లేనికారణంగా ఈ ఏడాది బహ్రెయిన్, భూటాన్, బురుండి, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, లిబియా, మాల్డోవా, ఖతార్, సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా, తజకిస్థాన్ దేశాల ఆకలి సూచీలో పరిగణనలోకి తీసుకోలేదు.

ఆకలిని జయించిన దేశాలు

ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం అట్లాంటిక్ ఖండంలో ఉండి మధ్య ఆఫ్రికా సరిహద్దులో ఉన్న గొబన్ అనే చిన్నదేశం ఆకలికేకలు వినిపించని దేశంగా తొలిస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో మారిషస్, చైనా, పరాగ్వే, ఎల్సాల్వడార్, కిర్గిజ్ రిపబ్లిక్, ట్రినిడాడ్ అండ్ టుబాగో, కొలంబియా, మొరాకో, పెరులు ఉన్నాయి. ఈ దేశాలు రైతు అనుకూల విధానాలు, వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధానాలను అనుసరించడంతో ఆయా దేశాలు గణనీయంగా ఆహారధాన్యాలను ఉత్పత్తి చేసి ఆకలిని తరిమేశాయి.

ఆకలి రాజ్యాలు

పేదరికం తాండవిస్తున్న దేశాల జాబితాలో హైతీ అతి దారుణమైన స్థితిలో ఉంది. ఇక్కడ 55 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువ ఉన్నారు. ఆ దేశంలోని చిన్నారుల్లో 22.9 శాతం మంది పౌష్టికాహారం పొందలేకపోతున్నారు. ఇక్కడ ఆకలిచావులు చాలా ఎక్కువ. అయితే కొన్ని ఆఫ్రికా దేశాలు గడచిన దశాబ్దంలో చేపట్టిన చర్యలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయి. జాంబియా, ఎమన్, ఇథియోపియా, ఛాద్, సూడాన్, కొమెరస్, తిమోర్-లెస్టె, ఎరిత్రియా, బురిండి ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

656
Tags

More News

VIRAL NEWS