సన్యాసి - జాలరి


Sun,October 20, 2019 12:37 AM

మన జీవితంలో ఎందరో మనకు తటస్థిస్తూ ఉంటారు. అందరూ మనకు గురువులే. అందరూ మనకు ఏదో నేర్పుతారు. ఆ జాలరిని మనం ప్రశ్నించాం. కానీ మన ప్రశ్నలకు ఏ మాత్రం చలనం లేకుండా, ఎలాంటి ఆటంకంగానూ భావించకుండా ఆయన తన పనిమీద దృష్టి పెట్టారు. తనగాలం మీద కేంద్రీకరించాడు.
-సౌభాగ్య

marmika
ఒక బాటసారి దూర ప్రయాణంలో ఉన్నాడు. ఎండ తీవ్రత వల్ల ఒక ప్రాంతంలో ఆగాడు. ఒక చెట్టుకింద సేదతీరి తిరుగు ప్రయాణానికి సిద్ధపడ్డాడు. కానీ అతను వెళ్ళాల్సిన ఊరికి దారి ఇదేనా? అన్న సందేహం అతనికి కలిగింది. ఇటూ అటూ చూశాడు. దగ్గరగా చిన్న నీటిగుంట ఉంది. దాంట్లో గాలం వేసి ఒక జాలరి దగ్గరగా చూస్తున్నాడు.బాటసారి ఆ జాలరి దగ్గరికి వెళ్ళి అయ్యా! భీమాపురానికి వెళ్ళే మార్గం ఇదేనా? అని అడిగాడు. జాలరి వినిపించుకోలేదు. జాలరికి వినపడలేదేమో అని బాటసారి అయ్యా! నేను చాలాదూరం నుంచి వస్తున్నాను. ఈ ప్రాంతం గురించి నాకు పరిచయం లేదు. భీమాపురం వెళ్ళడానికి మార్గం ఇదేనా? అని అడిగాడు.

జాలరి ఒక మనిషి తన దగ్గరికి వచ్చాడని, తనను ఏదో అడుగుతున్నాడని కూడా అనుకోలేదు. కనీసం తలతిప్పి కూడా ప్రయాణికుడి వైపు చూడలేదు. లక్ష్య పెట్టలేదు. నిర్లక్ష్యం కూడా ప్రదర్శించలేదు. బాటసారి ఇతనెవరో వింత మనిషిలాగా ఉన్నాడే. కనీసం బదులు కూడా చెప్పడు. అవును, కాదు అని ఏదో ఒకటి చెప్పవచ్చు కదా! అనుకున్నాడు. అయినా అవసరం తనది కదా అనుకుని అయ్యా! దయచేసి భీమాపురానికి ఎటువైపు వెళ్ళాలో చెప్పండి అన్నాడు. బదులు లేదు.బాటసారికి కోపం వచ్చింది, చిరాకు వేసింది. అయినా ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఏమీ తోచక వెళ్ళి చెట్టు నీడన కూచున్నాడు. దిక్కులు చూశాడు. అంతలో ఒక యువకుడైన సన్యాసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మెల్లగా జాలరి దగ్గరకు వెళ్ళి నమస్కరించి అయ్యా! వెంకటాపురం వెళ్ళడానికి దారి ఏది? అని అడిగాడు.

ఎప్పటిలాగే జాలరి బదులివ్వలేదు. శిలలా నిశ్చలంగా ఉండిపోయాడు.కాసేపటికి సన్యాసి స్వామీ! వెంకటాపురం ఎటువైపు వెళ్ళాలో చెబుతారా! అన్నాడు. బదులు లేదు. అట్లా రెండు మూడు సార్లు అడిగాడు బదులులేదు. అయినా ఏ మాత్రం కోపం తెచ్చుకోకుండా సమాధానపడినవాడిలా సన్యాసి తలవంచి జాలరికి నమస్కరించి లేచి తన దారిన తాను వెళ్ళాడు.ఇంత జరుగుతున్నా జాలరి ఉలకలేదు, పలకలేదు. చెట్టుకింద కూర్చున్న బాటసారి జరుగుతున్నదంతా వింతగా, విచిత్రంగా గమనిస్తున్నాడు. ఏ మాత్రం ఉద్రేకపడకుండా, శాంతంగా కృతజ్ఞతా పూర్వకంగా సన్యాసి జాలరికి ప్రణామం చేసి మరీ వెళ్ళడం చిత్రమనిపించింది.వెంటనే లేచి పరిగెత్తుకుంటూ యువ సన్యాసిని అందుకొని స్వామీ! మీరు జాలరిని వెంకటాపురం గురించి అడిగారు, నేను భీమాపురం గురించి వాకబు చేశాను. మనిద్దరికీ అతను బదులివ్వలేదు. కానీ నాకు కోపం వచ్చింది. మీకేమో అతని పట్ల కృతజ్ఞత కలిగింది. అతనికి నమస్కారం చేశారు. ఆశ్చర్యంగా ఉంది అన్నాడు.

యువ సన్యాసి నవ్వి ఆ జాలరి నా గురువు. ఆయన్ని గురించి తక్కువగా మాట్లాడకండి అన్నాడు.ఆ జాలరి మీకు గురువా? అన్నాడు బాటసారి.మన జీవితంలో ఎందరో మనకు తటస్థిస్తూ ఉంటారు. అందరూ మనకు గురువులే. అందరూ మనకు ఏదో నేర్పుతారు. ఆ జాలరిని మనం ప్రశ్నించాం. కానీ మన ప్రశ్నలకు ఏ మాత్రం చలనం లేకుండా, ఎలాంటి ఆటంకంగానూ భావించకుండా ఆయన తన పనిమీద దృష్టి పెట్టారు. తనగాలం మీద కేంద్రీకరించాడు. అంత ఏకాగ్రత ఏ పనిలోనైనా ఉండాలని మనకు పాఠం నేర్పాడు. అందుకనే ఆయన నా గురువు. ఆ గురువు నుంచి ఆ విలువైన పాఠం నేను గ్రహించాను. ఆ కృతజ్ఞతతోనే ఆయనకు అభివాదం చేశాను అన్నాడు. బాటసారి ఆశ్చర్యపోయాడు.

282
Tags

More News

VIRAL NEWS