బడికి పోలేదు..బల్బును కనిపెట్టాడు!


Sun,October 20, 2019 02:38 AM

1847లో జరిగిన యదార్థ ఘటన. అమెరికాలోని ఓహియో పట్టణం మిలాన్ ఏరియా. శామ్యూల్.. నాన్సీకి ఏడుగురు పిల్లలు. చిన్నబ్బాయి అల్లరి బుడుగు. బయటివాళ్లు మాత్రం అతడినొక వింత జీవిగా చూసేవాళ్లు. అలా చూడటానికి కారణాలు చాలానే ఉన్నాయి. వెడల్పైన తల.. సింధూరం రంగు నాలుక.. ఒకటి చెప్తే ఇంకోటి పలికే స్వభావం చూస్తే అతడు నిజంగా వింత పిలగాడే అనిపించేది. శామ్యూల్.. లైట్‌హౌజ్ కీపర్‌గా పనిచేసేవాడు. నాన్సీ ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. పెద్ద పిల్లల్లా చిన్నోడిని కూడా స్కూల్‌కి పంపిస్తే ప్రవర్తనలో కొద్దోగొప్పో మార్పు కనిపిస్తుందనుకున్నది నాన్సీ. ఆ అబ్బాయి రోజూ స్కూల్‌కు వెళ్తున్నాడు. స్కూల్‌లో ఏం చెప్తున్నారోగానీ పిల్లోడు మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నాడని సంతోషించింది తల్లి.
దాయి శ్రీశైలం,
సెల్: 8096677035

edison

12 వారాలు గడిచాయి.

ఒకరోజు.. అమ్మా.. నేనొచ్చేశా అని పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేశాడు ఆ పిలగాడు. ఏంటి.. అప్పుడే స్కూల్ అయిపోయిందా? అంటూ ఆశ్చర్యంగా అడిగింది వాళ్లమ్మ. సర్లే.. ఏదైనా ప్రోగ్రాం ఉందేమో అందుకే పంపారు కావచ్చు అనుకుంటూ కొడుకు భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగును తీసుకుంటుండగా చేతిలో ఏదో కాగితం గమనించింది. ఈ పేపరేంట్రా? అని అడగ్గా.. మా టీచర్ ఇచ్చాడమ్మా.. నీకివ్వమని చెప్పాడు అని ఆ బుడ్డోడు సమాధానమిచ్చాడు.ఏమై ఉంటుంది? ఎన్నడూ లేనిది నాకెందుకు ఈ ఉత్తరం పంపాడు? అని లోలోపల అనుకుంటూ ఆ ఉత్తరం తెరిచింది. ఓ ఐదు నిమిషాలు సైలెంట్‌గా ఉండిపోయింది. అమ్మా.. ఏమైంది? మా టీచర్ ఏం రాశాడు? అని ప్రశ్నిస్తూ గోల చేస్తాడు ఆమె కొడుకు.

ఆమె ఏం చెప్పలేదు. కానీ కన్నీరు పెట్టుకుంది. పిల్లోడికేం అర్థం కాలేదు. స్కూల్‌కి వద్దు.. ఇంట్లోనే ఉంటూ చదువుకో. ఇప్పటి నుంచి నీకు నేనే టీచర్‌ని అని చెప్పింది. ఇంటి పాఠాలు అలవాటు పడిన తర్వాత కొద్ది రోజులకు ఆ లెటర్‌లో ఇలా ఉంది అని తల్లి చెప్పింది. డియర్ పేరెంట్. ఇక మీ అబ్బాయిని స్కూల్‌కు పంపనక్కర్లేదు. అతడు హైపర్ యాక్టివ్. ఎలిమెంటరీ స్టాండర్డ్‌లోనే హయ్యర్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిజ్ఞానం ఉంది. మేం చెప్పే విషయాలు.. అతడికున్న తెలివి రెండూ మ్యాచ్ కావడం లేదు. మీ పర్యవేక్షణలో అయితేనే అతడి చదువుకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం అని లెటర్‌లో ఉన్నట్లు తెలుసుకున్నాడు.

1971లో నాన్సీ చనిపోయింది.

తల్లి జ్ఞాపకాలను నెమరేసుకుంటుండగా.. చిన్నప్పుడు స్కూల్ టీచర్ రాసిన లెటర్ చూశాడు. ఆ ఉత్తరం చదివి చాలా ఫీలయ్యాడు. తన తల్లి తన కోసం పడిన కష్టాన్ని తలుచుకుంటూ కుమిలిపోయాడు. ఉత్తరంలో ఏముందంటే.. డియర్ పేరెంట్. మీ కొడుకును మేం భరించలేం. అతడికి మానసిక వ్యాధి ఉంది. అతడిని ఒక్కడినే చూసుకుంటూ ఉంటే మిగతా స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? స్టూడెంట్స్‌కే కాదు.. అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. మా సిచ్యువేషన్‌ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. మీ అబ్బాయిని ఇకపై స్కూల్‌కు పంపించక్కర్లేదు అని రాసి ఉంది. అతడు చాలా బాధపడ్డాడు. కష్టం దిగమింగుకొని తన తల్లి తనను ఎలా పెంచిందో అర్థం చేసుకున్నాడు. ఇంతకూ అతడెవరనుకుంటున్నారు? తన అద్భుత ఆవిష్కరణతో చీకటిమయ ప్రపంచాన్ని వెలుగులోకి తెచ్చిన అపర మేధావి థామస్ అల్వా ఎడిసన్. విద్యుత్ బల్బ్ కనిపెట్టి ఓ ప్రభంజనం సృష్టించాడు.

edison2
ప్రతి అన్వేషణకు ఏదో ఒక నేపథ్యం ఉంటుంది. ప్రతి ఆవిష్కరణకు స్వీయానుభవమేదో కారణమై ఉంటుంది. థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ బల్బ్‌ను కనిపెట్టడానికి కూడా ఓ స్వీయానుభవమే కారణం. తల్లి కష్టమే నేపథ్యం. అది.. 1854. కుటుంబ ఆర్థిక పరిస్థితులేం బాగాలేవు. గత్యంతరం లేక మిచిగాన్ నగరంలోని పోర్ట్ హురోన్‌కు షిప్ట్ అయ్యారు.

తలా ఓ పని చేస్తే కనీసం తిండి మందమైనా సంపాదించొచ్చు అనుకున్నారు. తను ఎలాగూ ఇంటి దగ్గరే ఉంటున్నాడు కాబట్టి ఏదైనా పని చేయాలి అనుకున్నాడు ఎడిసన్. 1859లో రైళ్లలో న్యూస్ పేపర్.. స్వీట్లు అమ్మడం మొదలుపెట్టాడు. తల్లికి ఎంతో కొంత ఆసరా అవుదామనేది అతడి ఆలోచన. ఎడిసన్ వింత మనిషి అని ఎంతమందికి తెలుసో.. అంతకన్నా ఎక్కువమందికి అతడొక జీనియస్ అని తెలుసు.

కానీ అతడి తికమక పనుల వల్ల పూర్తిగా నమ్మలేకపోయేవారు. ఎడిసన్ జీనియస్ అని నిరూపించడానికి ఎన్నోసార్లు తల్లి నాన్సీ ప్రయత్నం చేసినా వర్కవుట్ కాలేదు. ఎడిసన్‌కు కూడా తాను జనాలు అనుకుంటున్నట్లుగా మెంటల్ కేసు కాదని చెప్పుకోవడానికి ఏదైనా మంచి పని చేసి చూపించాలని ఉండేది. 1862లో ఆ అవకాశం వచ్చింది. రైళ్లలో న్యూస్ పేపర్లు అమ్ముతున్నప్పుడు ప్రమాదానికి గురైన ఓ స్టేషన్ మాస్టర్ కూతురును కాపాడాడు. నా ఒక్కగానొక్క బిడ్డను కాపాడిన నిన్ను ఉత్త చేతులతో పంపించలేను. నీకేం కావాలో కోరుకో అన్నాడు స్టేషన్ మాస్టర్. మేం చాలా బాధల్లో ఉన్నాం. మా అమ్మ మా గురించి ఎంతో కష్టపడుతుంది. ఆమె కష్టాన్ని నేను చూడలేకపోతున్నా. ఏదైనా అక్కెరకు వచ్చే పని నేర్పించు. నేను దేన్నయినా తొందరగా నేర్చుకుంటా అని ఎడిసన్ అడిగాడు. టెలిగ్రఫీ నేర్పిస్తాలే అని స్టేషన్ మాస్టర్ చెప్పడంతో నేర్చుకున్నాడు.

తల్లి మెచ్చుకున్నది. అయినప్పటికీ తన కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్దాలని నిరంతరం కృషి చేసేది నాన్సీ. స్కూల్‌లో చదివే అవకాశం కోల్పోయిన తన కొడుకును చూసి స్కూల్ టీచర్లే కాదు.. ప్రపంచం మొత్తం గర్వపడాలని అనుకునేది. ఎన్నో కొత్త విషయాలు.. ప్రాక్టికల్ అంశాలు స్టడీ చేసి కొడుక్కి నేర్పేది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలకోర్చింది నాన్సీ. కుటుంబం మొత్తాన్ని చూసుకోవడం ఒకెత్తు. ఎడిసన్‌ను చూసుకోవడం ఇంకొక ఎత్తు. హైపర్ యాక్టివ్ అయిన తన కొడుకు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆమెకు తెలియదు. రాత్రయింది పడుకోరా అంటే.. రాత్రిళ్లే ఎందుకు పడుకోవాలి? అనే టైపు ఎడిసన్.

ఒకరోజు.. పని ముగించుకొని ఇంటికొచ్చేసరికి ఆలస్యమైంది. అప్పటికే వర్షమొచ్చి చుట్టూ చీకటి కమ్మేసింది. ఇల్లు కూడా చీకటితో ఉంది. ఓ మూలన వెలుగుతున్న పొయ్యి.. దాని ముందు ఊదుతూ కూర్చున్న వాళ్లమ్మ కనిపించింది. కొడుకు ఆకలితో వస్తుండొచ్చు.. వానకు తడిసి ఉండొచ్చు. ఏదైనా వేడి ఆహారం చేస్తే తిని పడుకుంటాడనేది ఆ తల్లి ప్రేమ. కనీసం నూనెతో గానీ వెలిగించే దీపం కూడా లేకపోవడం.. చిమ్మ చీకట్లోనూ తల్లి తనకోసం కష్టపడుతుండటం చూసి చలించిపోయాడు ఎడిసన్. అమ్మా.. ఇంత చీకట్లో ఎందుకు? అంటాడు. చీకటి మనకు తెలుసుగానీ.. ఆకలికి ఉండదు కదరా? అంటుంది.

edison1
ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు ఎడిసన్‌కి. ఇన్నాళ్లు డబ్బుల కోసం ఏదో ఒకటి చేశాను. ఇప్పుడు నా తల్లి కష్టం తీర్చడం కోసం ఏదైనా చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. తన తండ్రి లైట్‌హౌజ్ కీపర్‌గా చేస్తున్నప్పుడు చాలాసార్లు అతడితో వెళ్లి.. బల్బులను పరిశీలించిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. కొన్నాళ్లు లైటింగ్ సిస్టమ్‌పై అధ్యయనం చేశాడు.

అమ్మా.. నువ్వు నేర్పిన చదువు నీ కష్టాల్ని తీర్చబోతుంది. నేను లైట్ బల్బ్‌ను తయారుచేస్తా. ఇకపై నువ్వు చీకట్లలో పని చేయనవసరం ఉండదు అని తల్లికి మాటిచ్చాడు. తన కొడుకు జీనియస్ అని నాన్సీకి తెలుసు కాబట్టి సరే అన్నట్లుగా నవ్వింది. తానొక మానసిక రోగినని ఏ సమాజమైతే హేళన చేసిందో.. తన కొడుకొక జీనియస్ అని ఏ తల్లి నమ్మిందో.. ఆ సమాజం కోసం.. ఆ తల్లి కోసం 1878లో విద్యుత్ బల్బ్‌ను కనిపెట్టి తొలి కాంతిని ఇంట్లో వెలిగించి బల్బ్‌ను అమ్మకు బహుమతిగా ఇచ్చాడు థామస్ అల్వా ఎడిసన్.

మేధావి అంటే ఒకశాతం ప్రేరణ.. తొంభైశాతం పరిశ్రమ అని నిరూపించాడు. స్వీయానుభవం నుంచి ప్రేరణ పొందిన ఎడిసన్.. సుమారు వెయ్యిసార్లు ఫెయిల్ అయినా ఎలాగైనా తన తల్లి కష్టాన్ని తీర్చాలని.. తన ఇంట్లో కాంతి వికసింపజేయాలని సంకల్పించి విద్యుత్ బల్బ్‌ను రూపొందించి సక్సెస్ అయ్యాడు. తాను మానసిక రోగిని కాదని.. మేధో సామర్థ్యం కలిగినవాడినని నిరూపించుకున్నాడు. మనకు కరంటు బల్బును బహుమతిగా అందించాడు.

590
Tags

More News

VIRAL NEWS