డబ్బులు తూకమేసి అమ్ముతారు!


Sun,October 27, 2019 02:17 AM

అది ఓ పేద దేశం. అక్కడి ప్రధాన నగరాల్లో వీధికో మార్కెట్ ఉంటుంది. మార్కెట్ అంటే కూరగాయలో, కిరాణా సామానో దొరుకుతుందనుకొనేరు. కానే కాదు. అక్కడ ఆ దేశపు కరెన్సీని కుప్పలుగా పోస్తారు. కిలోల చొప్పున తూకమేసి మరీ అమ్ముతారు. మన దగ్గర ఒకప్పుడు వస్తుమార్పిడి ఉండేది. ప్రస్తుతం ఆ దేశంలోనూ వస్తుమార్పిడి విధానం కొనసాగుతున్నది. కరువుకు కేరాఫ్‌గా నిలుస్తున్న దేశమది. అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నది. ఇంతకీ ఏంటా దేశం. ఎందుకలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నది?

అక్కడ ఒక చాక్లెట్ కొనాలంటే ఐదువేల రూపాయలు ఇవ్వాలి. బ్రెడ్ ప్యాకెట్ కొనాలంటే డబ్బు కట్ట ఇవ్వాలి. ఒక డైపర్ పాకెట్ కొనాలంటే వేలకు వేలు చెల్లించాలి. ఒక్క అమెరికన్ డాలర్ ఇస్తే ఆ దేశ కరెన్సీ రూ. 9 వేలు ఇస్తారు. మన కరెన్సీ రూ. 650 ఇస్తే అక్కడి కరెన్సీని 50 కిలోలు తూకం వేసి ఇస్తారు. ఆ దేశంలో ఒక్క ఇంటర్నేషనల్ బ్యాంకు కూడా లేదు. ఏటీఎంలు లేవు. ఆర్థిక మాంద్యంతో అల్లాడుతున్న ఆ దేశం పేరు ఆఫ్రికా ఖండంలోని సోమాలియాల్యాండ్. దీనికి వేల ఏండ్ల చరిత్ర ఉన్నది. కానీ గతంలో కొందరు తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇప్పుడక్కడి ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు.
MOney

ఏటీఎంలు ఉండవ్: సోమాలియా ల్యాండ్ దేశ కరెన్సీ షిల్లింగ్స్. ఆ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ లేదు. ఏటీఎం సెంటర్లు లేవు. ఇక్కడి ప్రజల ఇండ్లల్లో పదుల సంఖ్యలో సంచుల్లో కుక్కి డబ్బును ఉంచుతారు. కానీ ఆ డబ్బుకు ఏమాత్రం ఇక్కడ విలువలేదు. ఈ దేశానికి ఈ పరిస్థితి రావడానికి గతంలో ఓ చిన్న తప్పిదం జరిగింది. అదేంటంటే.. సోమాలియాల్యాండ్ ఇదివరకు సోమాలియా దేశంలో కలిసి ఉండేది. 1991లో యుద్ధం జరిగింది. దీంతో సోమాలియా నుంచి సోమాలియా ల్యాండ్ విడిపోయింది. అప్పటికే దేశంలో పేదలు అధికంగా ఉన్నారు. వీరిని ధనవంతులుగా మార్చాలని నాయకులు ఆలోచించారు. రాష్ర్టానికి ఉన్న అప్పులన్నీ తీర్చాలని సంకల్పించుకున్నారు. అప్పటి పాలకులు విచ్చలవిడిగా కరెన్సీ నోట్లను ప్రింట్ చేయించారు. ఇంటింటికీ పంచిపెట్టారు. దాని వల్ల ఆ దేశంలోని ప్రజలంతా బద్ధకస్తులుగా మారిపోయారు. ఏ పనిచేయకుండా వచ్చిన డబ్బుల్తో తిని కూర్చున్నారు. ఆ తర్వాత పన్నులు కట్టకుండా ఉండిపోయారు. కనీసం విదేశీ అప్పులు తీర్చడానికి కూడా ఆ కరెన్సీ పనికి రాకుండా పోయింది. కొన్ని దేశాలు షిల్లింగ్ కరెన్సీని నిరాకరించాయి. ఆ దెబ్బ దేశ ఆర్థిక వ్యవస్థ మీద పడింది. అప్పటి నుంచి ఆ దేశం అతి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది.

వస్తుమార్పిడి: నగదు చెలామణిలో లేనప్పుడు వస్తుమార్పిడి ఉండేది. ఎవరికి ఏ అవసరమున్నా తమ దగ్గర ఉన్నది ఇచ్చి వారికి కావాల్సింది తీసుకునేవారు. అదేమాదిరిగా ప్రస్తుతం సోమాలియా ల్యాండ్‌లో వస్తుమార్పిడి వ్యవస్థ అమలులో ఉన్నది. అక్కడ ఎక్కువగా రైతులు కూరగాయలు, పప్పు దినుసులు పండిస్తుంటారు. ఈ దేశ ప్రధాన పంట బాస్మతీ వరి రకం. ఇక్కడి పల్లెల్లో వారాంతపు సంతల్లో ఎక్కువగా వస్తు మార్పిడి జరుగుతుంటుంది. ఇక్కడి రవాణా వ్యవస్థలో ఒంటెలదే ప్రధాన పాత్ర. అందుకని ఇక్కడ పెద్ద ఎత్తున ఒంటెల బిజినెస్ జరుగుతుంది. ఇక్కడి ఒంటెలు ఇతర దేశానికి కూడా ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ కరువు అధికం. క్రైం రేట్ కూడా అధికం. అందుకని ఇక్కడి ప్రజల్లో ఎక్కువ మంది దారిదోపిడీలు, ఇతర నేరాలు చేస్తుంటారు. దీంతో ఇతర దేశాలు సైతం ఆ దేశానికి సాయం చేయడానికి ముందుకు రావట్లేదు.

పన్నులు కట్టరు: సోమాలియా ల్యాండ్ దేశంలో ఎవరూ పన్నులు కట్టరు. దీంతో అక్కడ అభివృద్ధి అంతంత మాత్రమే. ఈ దేశం టూరిజం మీద ఆధారపడి ఉన్నది. ఇది సముద్ర దీవి. ఇక్కడ పురాతన కట్టడాలు ఎక్కువగా ఉన్నాయి. టూరిజం ద్వారా వచ్చే ఆదాయంతోనే పాలన కొనసాగుతున్నది. యుద్ధానంతరం కొందరు పాలకులు తీసుకున్న నిర్ణయాల వల్లనే ప్రస్తుతం అక్కడి ప్రజలు తీవ్ర కరువును అనుభవిస్తున్నారు. తమ తలరాతలు మార్చే నేతల కోసం ఆ దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు.

1140
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles