నవ్విందంటే బుగ్గల్లోన డింపుల్..


Sun,October 27, 2019 02:33 AM

దిల్ రాజు కేరింతతో తెరంగేట్రం చేసిన నిత్యా నరేశ్ ఇప్పుడు తెలుగు, మలయాళం చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌తో మరోసారి టాలెంట్ నిరూపించుకుంది ఈ సొట్టబుగ్గల చిన్నది. డైరెక్టర్ అవ్వాలనుకొని హీరోయిన్ అయిన నిత్యా గురించి కొన్ని సంగతులు..

-వినోద్ మామిడాల

నాలుగు భాషలు..

నిత్యా నరేశ్ సౌత్ ఇండియన్ అమ్మాయి. తల్లిది కేరళ, తండ్రిది మైసూర్. తండ్రి ఉద్యోగ విరమణ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. దీంతో నిత్యాకు కొంచెం తమిళ్, కొంచెం కన్నడ, కొంచెం మళయాళం, కొంచెం తెలుగు వచ్చు.
Nithya

అనుకోలేదేనాడు..

నిత్య కుటుంబానికి డిఫెన్స్ రంగంతో సంబంధాలున్నాయి. తండ్రి నేవీలో ఉద్యోగం చేస్తారు. కుటుంబంలో అందరూ ఆర్మీ, డిఫెన్స్‌లో ఉన్నారు. నిత్య మాత్రం ఎప్పుడూ సినిమాల గురించి అనుకోలేదు. కనీసం హీరోయిన్ అవ్వాలని కూడా కల కనలేదట.

కళలనే చదివింది..

డిగ్రీలో మాస్ కమ్యూనికేషన్ చేసింది నిత్య. యాక్టింగ్, అడ్వైర్టెజింగ్, టీవీ విభాగాల్లో ఇంటర్న్‌షిప్ చేసింది. ఇలా చేస్తున్న క్రమంలోనే చిత్ర పరిశ్రమను ప్యాషన్‌గా ఎంచుకుంది. అసిస్టెంట్ డైరెక్షన్ కోర్సు చేసింది. కుదిరితే డైరెక్షన్ చేద్దాం అని భావించింది. ముంబైలోని ఓ కాలేజీలో ఫిల్మింగ్‌లో పీజీ చేసింది. చదువుతోపాటే ఫొటోగ్రఫీ, ట్రావెలింగ్, బ్లాగింగ్ వంటి ఆసక్తులనూ ఏర్పరుచుకుంది.

టాలెంట్ మ్యాటర్..

నాకు ఎవరూ గాడ్‌ఫాదర్ లేరు. తల్లిదండ్రులు, దర్శకులు ప్రోత్సహించారు. అందాన్ని చూసి అవకాశాలిస్తే నాకు తృప్తిగా ఉండదు. నటనను బట్టి అవకాశాలు ఎంచుకుంటాను. ఇది వరకు చేసిన సినిమాలు అలాంటివే. అట్లాంటప్పుడే నాకు సంతృప్తిగా ఉంటుంది అని నిత్యా
అంటున్నది.

ఇలా మొదలైంది

కేరింత తర్వాత వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటున్నది నిత్య. 2016 నందినీ నర్సింగ్ హోంలో లీడ్ రోల్ చేసి మంచి హిట్ అందుకుంది. అనంతరం 2017లో ఓ మలయాళం సినిమా చేసింది. తల్లి, కూతురు ప్రేమ నేపథ్యంలో ఉన్న ఈ హర్రర్ సినిమాతో అక్కడామంచి అవకాశాలే తెచ్చింది. వీటితర్వాత వరుసగా తెలుగులో గోలీసోడా, మలయాళంలో ఎన్నాళం షారత్ సినిమాలు చేసింది.

క్లిక్.. క్లిక్..

ముంబైలో ఓ రోజు నిత్య ఫొటోషూట్ చేసింది. అది కేవలం టైంపాస్ కోసమే. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు కాస్తా ముంబై నుంచి టాలీవుడ్‌కు వచ్చాయి. దీంతో ఏకంగా టాలీవుడ్ నుంచే నిత్యాకు ఫోన్ వెళ్లింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఇంట్లో వాళ్లతో చెప్పింది. వాళ్లూ ఒప్పుకోవడంతో హైదరాబాద్ వచ్చేసింది. ఇలా మొదటి సారి కేరింత సినిమాలో కనిపించింది. పాత్ర చిన్నదే అయినా గుర్తింపును ఇచ్చిందని చెపుబున్నది నిత్య.

703
Tags

More News

VIRAL NEWS