పద్య రత్నాలు-26


Sun,November 3, 2019 01:50 AM

ఒదుగుతూ ఎదగాలి!

సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు అధికబాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చుకొరకే తథ్యము సుమతీ!
-సుమతీ శతకం
ODUGUTHU-GELAVALANI
తాత్పర్యం:ఏదైనా అతి పనికిరాదని పెద్దలు అన్నారు. ఒక్కోసారి విపరీతానికి పోతే, సరసం విరసానికి, పరిపూర్ణ సుఖం కూడా అధిక బాధలకు, నిలువునా పెరగడం విరగడానికి దారితీస్తాయి. ధరలు తగ్గుతున్నాయని సంతోషపడితే రాబోయే కాలంలో పెరగడానికే దీనినొక సూచనగా భావించాలన్నమాట. అందుకే, ఒదుగుతూ ఎదిగితే ఏ బాధా లేదన్నారు.

సద్బుద్ధితోనే విజయం

చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు గొదవు గాదు
విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ!
- వేమన శతకం
SADBUDHI

తాత్పర్యం:పుణ్యం కొంచెమైనా సరే, దానిని చిత్తశుద్ధితో చేయాలి. అప్పుడు దానికి తప్పక తగిన ప్రతిఫలం లభిస్తుంది. మర్రివిత్తనం చిన్నదైనంత మాత్రాన అది పెద్ద వృక్షంగా ఎదగకుండా ఉంటుందా! అందుకే, మంచిపని మంచివిత్తనంతో సమానమని పెద్దలు అన్నారు. సద్బుద్ధితో ఏది చేసినా, ఎంత చేసినా విజయం సిద్ధిస్తుందని అందరూ తెలుసుకోవాలి!

కన్నవారి కోసం..

ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబు దెలుప నేగకుమీ నీ
కన్న తల్లిదండ్రుల యశం
బెన్న బడెడు మాడ్కి దిరుగు మెలమి కుమారా!
- కుమార శతకం
KANNA-VAARI-KOSAM

తాత్పర్యం:ఎవరూ పుట్టుకతో సంపన్నులు కాలేరు. శ్రమతోనే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి, ఇంట్లో సంపదలు ఉన్నా, లేకున్నా కుటుంబ రహస్యాలు బయటపెడుతూ, పరువు తీసే పనులు చేయరాదు. మనల్ని కన్నవారికి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా, పదిమంది వారిని పొగిడేలానే మన ప్రవర్తనలు ఉండాలి సుమా.

సద్గుణాలతోనే శాశ్వత కీర్తి

ఎన్నాళ్లు బ్రతుక బోదురు
కొన్నాళ్లకు మరణదశల గ్రుంగుట జగమం
దున్నట్టివారి కందఱి
కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ!
- కుమారీ శతకం
SADGUNAALATHO

తాత్పర్యం:సృష్టిలో చావు పుట్టుకలు సహజం. లోకంలో ఎవరైనా సరే, ఎన్నాళ్లో బతకలేరు. అందరూ ఎప్పటికైనా మరణించక తప్పదు. ఎంతటి వారికైనా చావు తథ్యమనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మేరకు సద్గుణాలను అలవర్చుకొని సత్కర్మలతో ఆదర్శవంతమైన జీవితం గడపాలి. అప్పుడే మరణించిన తర్వాత కూడా శాశ్వత కీర్తిని పొందుతారు.

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్ నంబర్‌లో తెలియజేయండి.

198
Tags

More News

VIRAL NEWS