దేవుడు చేసిన మనుషులు


Sun,November 3, 2019 04:58 AM

ఒక్కొక్కరికి ఒక్కో నమ్మకం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనలో ఉండే నమ్మకం భక్తిగా మారి ఆదర్శమూర్తులైన వారిని దేవుడిగా కొలుస్తుంటారు. ధర్మదారిలో నడవడానికి ప్రయత్నిస్తూ వారి ఇలవేల్పు అయిన దేవుడిని కొలుస్తూ.. తలుస్తూ.. పూజిస్తూ.. కానుకలు సమర్పిస్తూ.. పుణ్య కార్యాలు చేస్తూ.. మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. మంచి జరిగితే మా మంచి దేవుడు అని కొనియాడుతారు. జరగకపోతే.. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా జరుగుతుందిలే అని రెట్టించిన ఉత్సాహంతో భక్తిభావం పెంపొందించుకుంటారు. మనిషి సన్మార్గంలో నడవడానికి ఇలా తన ప్రయత్నమేదో తాను చేస్తుంటే.. ఒక దేవుడు మాత్రం భక్తులను మోసం చేస్తున్నాడు. ఇంతకూ ఆ దేవుడు ఎవరు? ఎక్కడుంటాడు? చేసే మోసమేంటి?

-దాయి శ్రీశైలం, సెల్: 8096677035

God
దేవుడు భక్తులను మోసం చేస్తున్నాడా? అని మనోభావాలు దెబ్బతీసుకోకండి. ఇక్కడ మోసం చేసే దేవుడు యాదగిరి నరసన్ననో.. శ్రీశైలం మల్లన్ననో.. తిరుపతి వెంకన్ననో.. అల్లానో.. యేసు ప్రభువో కాదు. అవతార పురుషులమనీ.. దైవాంశ సంభూతులమనీ.. మానవాతీత శక్తులుగల వాళ్లమనీ ప్రచారం చేసుకుంటూ నేను దేవుణ్ణి అని చెప్పుకునే దేవుళ్లు. ఆధ్యాత్మిక చింతనను ఆసరా చేసుకొని ఇలాంటి స్వయం ప్రకటిత దేవుళ్లు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నారు. మతమేదైనా కావచ్చు.. ప్రాంతమేదైనా ఉండొచ్చు.. అన్ని వర్గాల్లో.. అన్ని సముదాయాల్లో ఈ ధోరణి నడుస్తున్నది. భక్తుల నమ్మకమే పెట్టుబడిగా.. వ్యాపారమే పరమావధిగా.. ధనార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ దైవక్రీడ రహస్యాన్ని భక్తజనం పసిగట్టేది ఎప్పుడు? రెండు దశాబ్దాల క్రితం.. చిత్తూరు జిల్లా బత్తలవల్లం గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ ఎల్‌ఐసీలో క్లర్కు. జీవితం సాఫీగానే సాగుతున్నా ఎందుకోగానీ ఉద్యోగం మానేశాడు. తనకొచ్చిన ఆలోచనతో జీవాశ్రమం పాఠశాల ప్రారంభించి తర్వాత దానిని వన్‌నెస్ యూనివర్సిటీగా మార్చాడు. అది సరిగా నడవలేదు. ఏం చేయాలో అర్థంకాక విజయ్‌కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత..

తాను దైవాంశ సంభూతుడిననీ.. తనది విష్ణుమూర్తి ఆఖరి అవతారమనీ.. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. తర్వాత చిత్తూరుజిల్లా వరదాయపాలెంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. 1990 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాలో దేవుడిగా చలామణి అయ్యాడు. దేశ నలుమూలల నుంచే కాదు.. విదేశాల నుంచి కూడా లక్షలాది మంది అతడి భక్తులుగా మారారు. విరాళాలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. రోజురోజుకూ భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. లక్షలాది మంది ప్రజలకు ఒకేసారి దర్శనం ఇవ్వలేనని.. భక్తుల అభీష్టానికి అనుగుణంగా సాధారణ దర్శనానికి ఐదువేల రూపాయలు, ప్రత్యేక దర్శనానికి రూ.25000 రుసుము వసూలు చేశాడు. అతని పాదాలు తాకితే చాలు సమస్యలు పరిష్కారమవుతాయని భక్తుల్లో బలమైన నమ్మకం ఏర్పడింది.
God2

అతడు నిజంగానే విష్ణుమూర్తి అవతారం అని నమ్మేస్థితికి వచ్చారు భక్తులు. భక్తుల దర్శనార్థం వరదాయపాలెంలో ప్రధానాలయం.. ఆంధ్రప్రదేశ్.. తమిళనాడు.. కర్నాటక రాష్ర్టాల్లో సుమారుగా 40 వరకు ఆశ్రమాలు ఏర్పాటు చేశాడు. వీటన్నింటికీ ప్రధాన కార్యాలయం చెన్నైలో. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ఆశ్రమాల్లో అక్రమాలు అంటూ వార్తలు రావడం ప్రారంభమయ్యాయి. విజయ్‌కుమార్ ఒక భక్తి మాఫియా ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ ఆశ్రమాలన్నింటిపై తాజాగా ఐటీ అధికారులు దాడులు చేయగా కోట్లాది రూపాయల డబ్బు దొరికింది. విదేశీ కరెన్సీ రూ.20 కోట్లకు పైగా దొరికింది. ఇంత సొమ్ము ఉండి.. రూ.500 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. భక్తి ముసుగులో అతని కుటుంబసభ్యులు అక్రమ సొమ్ముతో విదేశాల్లో కంపెనీలు స్థాపించారని వెలుగులోకి వచ్చింది. అమెరికా, చైనా, యూఏఈ, సింగపూర్‌తో పాటు పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారుల సోదాల్లో తెలిసింది. మనీ లాండరింగ్, హవాలా, పన్ను ఎగవేత తదితర అక్రమ మార్గాల్లో ఈ ఆస్తులు కూడబెట్టినట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఇతడు ఎవరో కాదు.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అవతారాన్ని అంటూ ప్రచారం చేసుకొని లక్షాలాది మంది భక్తులను ఏర్పరుచుకొని వారికి కొంగుబంగారమై.. కోర్కెలు నెరవేర్చేవాడై పూటపూటకూ పూజించబడుతున్న కల్కీ భగవానుడు.
God1

సాధారణ విజయ్‌కుమార్ కల్కీ భగవానుడిగా మారి దేవుడిని అంటూ నమ్మబలికి లక్షలాది మంది ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ఆశ్రమాలు నడిపించాడని తెలుసుకొని భక్తులు ఆశ్చర్యపోతున్నారు. అవును.. ఆశ్చర్యపోవాలి మరి. ఇంతకాలం దండాలయ్యా దేవుడికీ.. దండలు వేయరా సామికీ.. దండకాలు అని కీర్తించింది తమలాంటి ఒక సాధారణ మనిషినే అనీ.. తమ సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసుకొని తమ నమ్మకాన్ని అమ్మకానికి పెట్టాడని తెలుసుకుంటే ఆశ్చర్యంకాక ఇంకేం కలుగుతుంది? మనిషికంటే డబ్బుపై ప్రేమ ఉంటుంది. నగలపై కోరిక ఉంటుంది. మరి దేవుడి అవతారం అని చెప్పుకునే కల్కీకి డబ్బెందుకు? నగలెందుకు? అవి కూడా ఐటీ దాడులు చేసేంత స్థితి ఎందుకు? అసలు భగవానుడై ఉండి ఇన్ని బాధలు ఎందుకు? అనేది సగటు కల్కీ భక్తుడు ప్రశ్నించుకోవాల్సిన అవసరం వందకు వందశాతం ఉంది. మనిషి ఎంత బలవంతుడో.. అంతే బలహీనుడు కూడా. తనమీద తనకు గట్టి నమ్మకం ఉన్నా ఏదో ఒక మూలన భయానికి కూడా అవకాశం కల్పిస్తాడు. నడుస్తున్నది తానే అయినా నడిపించే శక్తి ఒకటి ఉందని అనుకుంటాడు. ఆ శక్తే ఇక్కడ కల్కీ దేవుడు అయ్యాడు. కథలెన్నో నడిపాడు. ఎన్ని రోజులు దాగుతుంది? ఐటీ శాఖ దెబ్బకు అడ్డంగా దొరికిపోయి అజ్ఞాతం నుంచి సందేశాలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐనా దేవుడెక్కడైనా మనిషికి భయపడి అజ్ఞాతంలోకి వెళ్తాడా? వెళ్లిండే అనుకుందాం.. ఎక్కడికీ పారిపోలేదు అని సందేశం చేరవేస్తాడా? దేవుడి అవతారం అని చెప్పుకునే వ్యక్తి తనకున్న అతీంద్రియ శక్తులతో ఈ ఐటీశాఖ వాళ్లను.. వారిని పంపినవాళ్లను మహిమతో పంపివేయలేడా? తనపై పెట్టిన కేసులను మంత్ర లేపనంతో మాయం చేయలేడా? అవేవీ చేయలేనప్పుడు అతడు దేవుడెలా అవుతాడు? ఆయనది విష్ణువు అవతారమెలా అవుతాడో భక్తులే తేల్చుకోవాలి.

2002వ సంవత్సరం. అతడు మా ధన, ప్రాణ, మానాల్ని దోచుకుంటున్నాడు. ఎందరో అమాయక భక్తుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నేను బాబా భక్తురాలిని అని చెప్పుకోవడానికి చాలా నామోషీగా ఉంది. ఇప్పుడు మీతో నా బాధను మొరపెట్టుకుంటున్నా.. అక్కడంతా అసాంఘికం రాజ్యమేలుతుందని చెప్పినా వినేవారు ఎవరూ ఉండరు. అక్కడి వాతావరణం అలా ఉంటుంది. వాళ్లంతా ఒక మైకంలో ఉంటారు. ఇలాంటివేవీ వారికి కనిపించవు.. వినిపించవు. బయట కూడా ఎవరూ నమ్మరు. బాబాపై ఆరోపణలు చేస్తావా అంటూ నన్నొక పిచ్చిదాని కింద జమకడుతారు. కానీ వారికేం తెలుసు ఇవి నిజాలు అని? దేవుడంటే దుష్టులను శిక్షించి.. శిష్టులను రక్షిస్తాడని అంటారు. కానీ మా దేవుడు మమ్ములను భక్షించే మూర్ఖత్వంలో ఉన్నాడు. అంతేకాదు.. అదొక నల్లధనం స్థావరం. న్యాయస్థానం సుమోటోగా స్వీకరించి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఓ సాధ్వి లేఖ రాసింది. ఆ లేఖా సారాంశాన్ని ఓ వార్త సంస్థ ప్రచురించింది. సాధ్వీ.. సాక్షాత్తు బాబా గురించి చెడుగా అలా ఎలా మాట్లాడుతుంది? అని నిరసనలూ జరిగాయి.
God3

15 ఏండ్ల తర్వాత..

సాధ్వీ లేఖను పంజాబ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆమె తెలిపిన విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కిందిస్థాయి కోర్టును ఆదేశించింది. ఆ బాబా ఆశ్రమంలో సీబీఐ దర్యాప్తుకు కూడా కోర్టు ఆదేశించింది. సాధ్వీలపై బాబా చేసిన అత్యాచారాలు.. హత్య.. భక్తిపేరుతో వంధ్యత్వానికి సాధ్వీలను ప్రోత్సహించడం.. కోట్ల రూపాయల నల్లధనం వంటివన్నీ నిజమే అని తేలింది. ఆధ్యాత్మిక కేంద్రంగా.. సిక్కుల చైతన్య వేదికగా.. భక్తులు అమితంగా ఇష్టపడే సంస్థగా ముద్రపడిన డేరా సచ్చా సౌధాలో వెలుగుచూసిన నిజాలివి. ఇవన్నీ చేసింది ఎవరో కాదు.. సిక్కుల మత గురువు గోవింద్‌సింగ్ వారసుడిగా ప్రకటించుకొని బాబా అవతారమెత్తిన గుర్మీత్ సింగ్ అలియాస్ డేరాబాబా. డేరాబాబుకు ఉన్న క్రేజ్.. పేరు మామూలుది కాదు. సినీ పరిశ్రమ అయితే డేరా బాబాను ఒక బ్రహ్మపదార్థంగా భావించేవారు. బాబాను నేనే.. భగవంతుడిని నేనే అని ప్రకటించుకున్న ఆ దేవుడు తన భక్తులను ఎలా చెరుస్తాడు? ట్రస్ట్ పేరు చెప్పి మోసాలకు ఎలా పాల్పడుతాడు? ఇలాంటి వాళ్లేనా దేవుళ్లు? ఇలాంటి వాళ్లనేనా భక్తులు నమ్మేది.. కొలిచేది?

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి.

కల్వరి చర్చి నుంచి అందే సందేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్క మంచిర్యాల జిల్లా నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కల్వరి చర్చికి ప్రార్థనల కోసం వస్తుంటారు. పాస్టర్ దీక్ష సందర్భంగా భక్తుల సంఖ్య పెరిగింది. సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామానికి చెందిన రాజేష్ మంచిర్యాలలోని కల్వరి చర్చ్‌కి వెళ్లాడు. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఇక్కడ స్వస్థత కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని చర్చిలో ప్రార్థనలు చేశాడు. జ్వరం తగ్గకపోగా క్షీణించడం వల్ల తాను వెళ్లిపోతానని రమేశ్ కోరాడు. అలా వెళ్ల కూడదనీ.. మధ్యలో వదిలేసి వెళితే కీడు జరుగుతుందని భయపెట్టడంతో అక్కడే ఉండిపోయాడు. తలపై చేతులు పెట్టుకొని దీక్షగా ప్రార్థన చేస్తే ఆరోగ్యం సెట్ అవుతుందని పాస్టర్ సూచిస్తాడు. ఆరోగ్యం బాగలేక అవస్థపడుతున్న రమేశ్‌ను డాక్టర్‌కు చూపించకుండా నిర్లక్ష్యం చేశాడు. చూమంతర్.. చామంతర్ అంటూ నాలుగు వ్యాఖ్యలు చెప్పి మోసం చేశాడు. రమేశ్ పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలాడు. ప్రార్థనల కోసం వస్తే ఇలా ప్రాణాలు పోవడానికి ప్రత్యక్ష కారణం ఆ చర్చి పాస్టర్. ఆయనెవరో కాదు.. నేరుగా క్రీస్తు మాట్లాడినట్లే సందేశాలు ఇస్తూ అభిమానుల్ని సంపాదించుకున్న ప్రవీణ్. బెల్లంపల్లి కల్వరి చర్చిలో ఇలాంటి చర్యలు నిత్యం జరుగుతాయనీ.. అనేక అక్రమాలకు అదొక అడ్డాగా మారిందనే విమర్శలూ వచ్చాయి. ఇలా సాధారణ ప్రజల ప్రాణాలను బలిగొంటూ వారిని నిలువునా మోసం చేస్తున్నవారు దేవుళ్లు ఎలా అవుతారు? వారిని ప్రజలు ఎలా నమ్ముతారు? ఒకసారి సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
God4

ఇలాంటి బురిడీ బాబాలు.. దేవుళ్లు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నారు. దేవుడిని అని చెప్పుకుంటూనే హత్యలు.. అఘాయిత్యాలు చేస్తున్నారు. అక్రమంగా సొమ్మును కూడబెట్టుకుంటున్నారు. దేవుడు అని ప్రజలు నమ్మిపోతున్నారు సరే.. అసలు దేవుడు భక్తుల దగ్గర ఫీజు తీసుకోవడం ఏంటి? తన పాదాలను తాకితే వ్యాధులు తొలగిపోతాయనీ.. వ్యాపారం లాభాల్లోకి వెళ్తుందని చెప్పే దేవుళ్లు తాము చేసే వ్యాపారం ఎవరి కోసం? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ఉన్న ఆశ్రమాల్లో రహస్య స్థావరాలెందుకు? ఆలోచించాలి. పాదాలు తాకితే జ్వరం నయమవుతుంది అంటారు కదా కొందరు దేవుడి అవతారాలు.. మరి వారికి జ్వరమొస్తే తన పాదాలు తాను తాకితే అయిపోతుంది కదా? మరి అలా ఎందుకు చేయడం లేదు? కార్పొరేట్ చికిత్స ఎందుకు తీసుకుంటున్నారు? అసలు దేవుళ్లకు జ్వరమొస్తుందా? వస్తే చికిత్స అవసరమా? దైవం అని చెప్పుకునేవారికి దైవభయం ఉందా అసలు? వెనకట సర్వసంగ పరిత్యాగులు ఎంతోమంది ఉండేవారు. వాళ్లు లౌకిక ప్రపంచానికి దూరంగా ఉండేవారు. తమకున్న పరిజ్ఞానంతో ఏదైనా విషయం చెప్పి ప్రజల మెప్పు పొందేవారు. కానీ ఇప్పటి దేవుళ్లు అన్ని రకాల సుఖాలు అనుభవిస్తూ అలౌకిక ప్రపంచం గురించి చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం. మోసం కాదా ఇది? మాకు మేమే దేవుళ్లం.. జగద్గురువులం అని చెప్పుకోవడం ఒక సంప్రదాయంగా మారుతున్నది. ఇదేనా దేవుడి తత్వం? అని ప్రశ్నించి నిజమేంటి.. అబద్ధమేంటి తెలుసుకోవాల్సిన ధోరణి ప్రజల్లో లేకపోవడం వల్లే ఇలాంటి వారు రోజురోజుకూ పుట్టుకొస్తున్నారు. మిరాకిల్స్ చేస్తూ.. స్వస్థత కుటుంబం పేరిట దెయ్యాలతో ఎగిరేయడం.. వంటి కార్యకలాపాలతో విజృంభిస్తున్నారు. భయం ఉన్నంతవరకూ.. మనిషి తార్కిక ధోరణి అవలంబించనంతవరకు ఇలాంటి వారు మనుగడలో ఉంటారు. దేవుడిగా చలామణి అవుతారు.
అందరి దేవుళ్ల కలబోతగా దర్శనమిస్తారు.
God5

హైదరాబాద్ పాతబస్తీ

రోగాలు.. నొప్పులను తక్కువచేసి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్న ఒక యునానీ డాక్టర్. యునానీ వైద్యంలో మంచి అనుభవం ఉంది అతనికి. ప్రజలకు అతనిపై సదాభిప్రాయం ఉంది. మంచి వైద్యుడే కాదు.. మంచి కళాకారుడిగా పరిచయం. చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉంటాడు. ప్రతిరోజూ జిగేల్‌మనిపించే దుస్తులు వేసుకొని డిస్కో డ్యాన్స్ చేస్తూ అందర్నీ కట్టిపడేయడం అతనికి ఉన్న మరో నైపుణ్యం. ముస్లీం ఆచారాలకు.. పద్ధతులకు నిలువెత్తు సాక్ష్యం అయిన నమాజ్ ప్రార్థనలు పాతబస్తీ ప్రతీ వీధిలోనూ వినిపిస్తుంటాయి. నిష్టతో అల్లాను స్మరించుకోవడం చిన్నప్పటి నుంచే దినచర్యగా మారుతుంది. ఇతరులకు హాని చేయకుండా బతకాలి అనే ఖురాన్ సందేశాన్ని మనసా వాచా కర్మనా పాటిస్తూ ఎవరికి వారు బిజీగా ఉంటారు. వీరినే లక్ష్యంగా చేసుకున్నాడు ఆ యునానీ డాక్టర్. అల్లా సంభూతుడిగా స్వయంగా ప్రకటించుకున్నాడు. ప్రజలకు మంచి చేయడానికే తాను పుట్టానని ప్రచారం చేసుకున్నాడు. అశాంతి ఉన్నవారికి శాంతి కలిగిస్తాననీ.. వ్యాపార సమస్యలను పరిష్కరిస్తాననీ.. క్షుద్రపూజలతో లంకె బిందెలు తీస్తానని.. శ్రీమంతులను చేస్తానని నమ్మించాడు. లక్షల రూపాయలు వసూలు చేసి.. మహిళలను శారీరకంగా వేధించి తన కోరికలు తీర్చుకునే రకం. ఎవరైనా ఎదురు తిరిగితే క్షుద్రపూజలు చేస్తానని బెదిరించడం అతని నైజం. ఇలా పాతబస్తీలో అందరికీ సుపరిచిత వ్యక్తి అయ్యాడు అతడు. తీవ్రత తెలిస్తేగానీ ప్రజలకు బాధ తెలియదు కదా? ఈ డాక్టర్ ఆగడాలు ఎక్కువయ్యే సరికి ధైర్యం చేసి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరు అన్వరుల్లా ఖాన్. పాతబస్తీలోని ప్రజలు అతడిని దేవుడిగా చెప్పుకునేవారు. అల్లా ఆదేశానుసారం అన్వరుల్లా సేవ చేయడానికి వచ్చిన దూత అని ప్రజలు నమ్మారు. దేవుడి రూపంగా వచ్చానని చెప్పగానే.. నమ్మి ఇలా మోసపోతుంటారు. క్షుద్రపూజలు చేసి లంకె బిందెలు తీస్తా అన్నప్పుడే.. దేవుడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తాడా అని ప్రశ్న వేసుకుని ఉంటే అన్వరుల్లా అసలు రంగంలోకే రాకపోయి ఉండేవాడు.
God6

636
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles