నిశ్చల విజ్ఞానఖని


Sun,November 10, 2019 04:03 AM

హాయ్ పిల్లలూ! బాలల దినోత్సవం వస్తున్నది కదా! అందుకే మీ కోసం ఒక వ్యక్తిని తీసుకొచ్చాం. మీరు దాటివచ్చిన చిన్నవయసులోనే అతడుఎంతో ప్రతిభను పెంచుకున్నాడు. మీలా బడికి వెళ్తూనే ఎన్నో అద్భుతాలు చేశాడు. నాలుగేండ్ల వయసులోఎన్నో నేర్చుకున్నాడు. 11 ఏండ్ల వయసులోనే దేశాన్నే ఆశ్చర్యపరిచాడు. ప్రపంచ వేదికల మీద మనదేశం తరఫున గెలిచాడు. అతనిలాగే మీరూ తయారవ్వాలని ఆ వయసులో ఓ సంస్థను స్థాపించాడు. తన జ్ఞానాన్ని అంతా మీకు పంచాలని పాటుపడుతున్నాడు. మీరు బాగా చదివి, జీనియస్ అవ్వాలని కోరుకుంటున్నాడు. మరి అలాంటి వ్యక్తి గురించి తెలుసుకుందామా? మీరే కాదు.. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ తెలుసుకోవాల్సిన ప్రయాణం ఆయనది. అందుకే నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా నిశ్చల విజ్ఞానఖని కథనం.

-వినోద్ మామిడాల, సెల్: 7660066469

ఎవరికైనా సక్సెస్ స్టోరీ ఎక్కడ ప్రారంభమవుతుంది? కచ్చితంగా కొంత వయసొచ్చాకే అంటారు మీరు. కానీ, ఇతని సక్సెస్ స్టోరీ మాత్రం నాలుగేండ్ల వయసులోనే ప్రారంభమైంది. ఇంకా చెప్పాలంటే తల్లికడుపులో ఉన్నప్పుడే ప్రారంభమైంది. మీకు ఆశ్చర్యం అనిపించొచ్చు.నాలెడ్జ్ ఈజ్ పవర్. అది ఏ వయసులో అయినా సరే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. కొంచెం పదును పెడితే ఎన్నో అద్భుతాలు, మరెన్నో ఆవిష్కరణలకు మూలం అవుతుంది. కానీ ఎన్నేండ్ల వయసులో ఇలాంటి నాలెడ్జ్ మనిషికి సొంతం అవుతుంది? చిన్నప్పుడా? యవ్వనంలోనా? ఇలాంటి జ్ఞానం వయసుతో సంబంధం లేకుండా వ్యక్తినీ, సమాజాన్ని ఎక్కడి వరకూ తీసుకెళ్తుంది? నిశ్చల్ నారాయణం గురించి తెలిస్తే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుస్తుంది.

Nischal-Personal

2006 -రాష్ట్రపతి భవన్

నువ్వు ఇప్పటి వరకూ సూర్యుని చుట్టూ ఎన్నిసార్లు తిరిగి వచ్చావు? అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నుంచి ప్రశ్న. ఎదురుగా నిశ్చల్ ఉన్నాడు. కలాం పర్సనల్ లైబ్రరీ అది. ఆయను కలిసేందుకు అపాయింట్‌మెంట్ పొందాడు నిశ్చల్. కలిశాడు. కలిసిన వెంటనే నిశ్చల్‌ను అడిగిన ప్రశ్న ఇది. కూడా ఉన్న తల్లిదండ్రులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏం అడుగుతున్నారో వారికి అర్థం కాలేదు కాసేపు. నిశ్చల్ మాత్రం చాలా సులభంగా జవాబు చెప్పేశాడు. కలాం అతని భుజం తట్టాడు. ఓ కాగితం తీసుకొని ఏదో రాసిచ్చాడు. దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలన్నాడు. తల్లిదండ్రులు మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. నేషనల్ చైల్డ్ అవార్డ్ గోల్డ్ మెడల్ ఎక్సెప్సెనల్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని నిశ్చల్ అందుకు న్నప్పుడు రాష్ట్రపతి నుంచి పిలుపు అందిన సందర్భం అది.
Nischal-Personal1

కొంచెం వెనక్కి..

నిశ్చల్‌కు అప్పుడు నాలుగేండ్లు. అందరిలాగే పాఠశాలకు వెళ్తున్నాడు. హైదరాబాద్‌లోని బేగంపేట గీతాంజలి స్కూల్‌లో చదువుతున్నాడు. తండ్రి నాగేశ్వర్‌రావు వ్యాపారి. తల్లి డాక్టర్ పద్మావతి ఓయూ నుంచి సంస్కృతంలో పీహెచ్‌డీ చేసింది. ఓ మధ్యాహ్నం తండ్రి ఆఫీస్ నుంచి ఏవో రికార్డులు, బ్యాలెన్స్‌షీట్లు తెచ్చాడు. ఒక బ్యాలెన్స్ షీట్లో సుమారు 30 కాలమ్స్ ఉన్నాయి. ఏవో లెక్కలు. అన్నీ కంప్యూటర్‌లో చేసినవే. నిశ్చల్ దాన్ని చేశాడు. నాన్నా! ఈ షీట్లో లెక్క తప్పుగా ఉంది అంటాడు ఆ మాటను తండ్రి పట్టించుకోలేదు. ఎందుకంటే అది కంప్యూటర్ చేసిన లెక్క. తప్పడానికి వీలుండదని అనుకున్నాడతను. అదే చెప్పాడు నిశ్చల్‌కు.

మరుసటి రోజు ఉదయం

నిజంగానే లెక్క తప్పింది. ఇంటికొచ్చిన తండ్రి నిశ్చల్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. నిశ్చల్‌దే సరైంది. బ్యాలెన్స్ షీట్‌ను చూసిన తల్లి కూడా ఆశ్చర్యపోక తప్పలేదు. తల్లిదండ్రులకు నిశ్చల్ ప్రతిభకు సంబంధించిన ఆయువుపట్టు దొరికిందప్పుడే. గణితంలోని అతని ఆసక్తిని గమనించారు. శిక్షణ ఇస్తే అద్భుతాలు చేయగలుగుతాడని అనుకున్నారు. గణితం యూనివర్సల్. కానీ చాలామంది పిల్లలకు అది ఫోబియా. గణితంలో అనేక దేశాల్లో అనేక పురాతన, సంప్రదాయ పద్ధతులున్నాయి. చైనాలో అబాకస్, మన దేశంలో వేద గణితం. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 42 మంది గురువుల దగ్గర గణిత పాఠాలు, మెళకువలు నేర్చుకున్నాడు నిశ్చల్. ఎంతటి మెళకువలు అంటే గణితంలో అవధానం చేసేంత.

Nischal-Personal2

అతనికి తొమ్మిదేండ్లు..

సాహిత్యంలో అవధానం ఒక విశిష్ట ప్రక్రియ. తెలుగు భాషలో తప్ప ఇతర భాషల్లో ఎక్కువగా కనిపించదు. క్లిష్టమైన సాహితీ సమస్యలకు జవాబులు అవలీలగా చెప్పేయాలి. సాధారణంగా ఇది పండితులు తెలుగులో చేస్తారు. కానీ నిశ్చల్ గణితంలోనే అష్టావధానం చేశాడు. రవీంద్రభారతిలో జరిగిందీ కార్యక్రమం. రోశయ్య ముఖ్యఅతిథిగా వచ్చారు. ఎనిమిది మంది పృచ్ఛకులు (ప్రశ్నలు అడిగేవారు) ఉన్నారు. వారు కూడా ఉద్ధ్దండులై ఉంటారు. ఈ అవధాన కార్యక్రమంలో వారు గణితం పట్ల చాలా క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతూ, మేథస్సుకు పరీక్ష పెడుతూ ఉంటారు. ఎలాంటి కలమూ, కాగితమూ లేకుండా జవాబు చెప్పాలి. మధ్య మధ్యలో ఆటంకాలు పెడతారు. ఏకాగ్రత కోల్పోకుండా ఫోకస్ చేసి జవాబులు చెప్పాలి. విజయవంతంగా దాన్ని నిశ్చల్ పూర్తి చేశాడు. అందరితో ఔరా అనిపించుకున్నాడు. రోశయ్య సన్మానించాడు. పదేండ్ల వయసులో మళ్లీ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో చేశాడు. ఇది శతావధానం. 108 మంది పృచ్ఛకులుంటారు. సుమారు 9 నుంచి 10 గంటలు ఏకధాటిగా నిశ్చల్ గణిత అవధానంలో పాల్గొన్నాడు.
Nischal-Personal3

పదేండ్ల వయసులోకి..

Power is gained by sharing knowledge, not hoarding it. ఇంగ్లిష్‌లో ఒక సామెత. విజ్ఞానం పంచుకుంటే పెరుగుతుంది దాచుకుంటే కాదు. నిశ్చల్‌కు ఆ వయస్సులోనే అర్థమైంది. తన దగ్గర ఉన్న గణిత విజ్ఞానాన్ని అందరికీ పంచాలని. తనలాంటి పిల్లలు గణితం పట్ల ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని అనుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా నేర్చుకున్న గణిత మెళకువలను, అతని పరిశోధనలన్నిటికీ పుస్తక రూపమిచ్చాడు. దాదాపు 7 పుస్తకాలు రాశాడు. గణిత పద్ధతులు, అంతర్జాతీయ ప్రమాణాలు, మెళకువలు అన్నిటినీ పొందుపరిచాడు. ఇండియన్, చైనీస్, జర్మన్ సూత్రాలతో ఈ పుస్తకాలను ఎందరికో అందించాడు. అతను చదువుతున్నది ఐదో తరగతే..

పదకొండేండ్లలోకి..

నిశ్చల్‌ది ఐదో తరగతి అయిపోయింది. అందరిలాగే పై తరగతికి వెళ్లాడు. ఈ తరగతిలో సాధారణంగానే గణితశాస్త్రంలో మార్పులు వస్తాయి. అప్పటి వరకూ చదివిన గణితశాస్త్రం కొంచెం కఠినమయ్యేది ఈ తరగతిలోనే. పిల్లలకు గణితం అంటే భయం ఏర్పడేదీ ఇక్కడే. నిశ్చల్ ఆరో తరగతిలో ఉన్నాడు. మెన్సురేషన్ క్లాస్ నడుస్తున్నది. ముఖ్యంగా ఈ క్లాస్‌లో బోర్డు మీద టీచర్ త్రీ డైమెన్షనల్ బొమ్మలు గీయడం చూశాడు. నిజానికి వాటిని గీయడం చాలా కష్టం. వాటిని అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. నిశ్చల్‌కు ఏదో ఆలోచన తట్టింది. అసలు ఇలాంటి త్రిడీ బొమ్మలు బోర్డుమీద ఎందుకు గీయాలి. భౌతికరూపంలో అందుబాటులో ఉండవా? మార్కెట్‌లో దొరకవా? అని ఇంటికి వచ్చి తల్లిని అడిగాడు. ఇద్దరూ కలిసి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్నో షాపులు తిరిగారు. చాలా ప్రయత్నాల తర్వాత నిశ్చల్‌కు, తల్లికి అర్థమైంది ఒక్కటే.మాథ్య్స్‌కు సంబంధించిన ఎలాంటి పరికరాలూ లేవు. ఒక జామెట్రీ బాక్స్ తప్ప.
Nischal-Personal4

నిశ్చల్ ఈ వెలితిని పూడ్చాలనుకున్నాడు. గణితశాస్త్రానికి సంబంధించిన అన్ని పరికరాలు, అందరు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని కోరుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి అనేక ప్రయత్నాలు చేశాడు. పరిశోధించాడు. కొద్ది రోజుల్లోనే ఈ ఆవిష్కరణ చేశాడు. అది మాథ్స్ లాబొరేటరీ (గణిత ప్రయోగశాల). జామెట్రీ బాక్స్ నుంచి లాబొరేటరీ కి వచ్చిన ఆవిష్కరణ అది. అన్ని రకాల పరికరాలు, పుస్తకాలు, మోడళ్లు అందులో ఉంటాయి. చాక్ అండ్ టాక్ పద్ధ్దతి ద్వారానే కాదు ప్రాక్టికల్ ద్వారా నూ ఎలా చెప్పవచ్చో ఈ ప్రయోగశాల ద్వారా అర్థం అవుతుంది. పిల్లలు ఎందుకు మ్యాథ్ నేర్చుకోవాలో వాళ్లకు క్షుణ్ణంగా తెలుస్తుంది. దీని కోసం ప్రత్యేక పరికరాలు సృష్టించారు. ఫలితంగా నేషనల్ చైల్డ్ అవార్డ్ గోల్డ్ మెడల్ ఎక్సెప్షనల్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని నిశ్చల్ అందుకున్నాడు. 2006లో దేశం నుంచి బెస్ట్ చైల్డ్ అవార్డు నిశ్చల్‌కు దక్కింది. తర్వాత అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి పిలుపు వచ్చింది.

కలాంతో 45 నిమిషాలు..

నేషనల్ చైల్డ్ అవార్డు అందుకున్న నిశ్చల్ కలాంను కలుసుకున్నాడు. నిశ్చల్ నువ్వు ఇప్పటి వరకూ సూర్చుని చుట్టూ ఎన్ని సార్లు తిరిగి వచ్చావు? నిశ్చల్‌ను చూడగానే ఆయన ఈ ప్రశ్న అడిగారు. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నుంచి ప్రశ్న. ఎదురుగా నిశ్చల్ ఉన్నాడు. కలాం పర్సనల్ లైబ్రరీ అది. ఆయనను కలిసేందుకు అపాయింట్‌మెంట్ పొందాడు నిశ్చల్. కలిశాడు. కలిసిన వెంటనే నిశ్చల్‌ను అడిగిన ప్రశ్న ఇది. కూడా ఉన్న తల్లిదండ్రులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏం అడుగుతున్నాడో వారికి అర్థం కాలేదు కాసేపు. నిశ్చల్ మాత్రం చాలా సులభంగా జవాబు చెప్పేశాడు. కలాం అతని భుజం తట్టాడు. ఓ కాగితం తీసుకొని ఏదో రాసిచ్చాడు. దాన్ని జీవితాంతం గుర్తుపెట్ట్టుకోవాలన్నాడు. తల్లిదండ్రులు మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. నేషనల్ చైల్డ్ అవార్డ్ గోల్డ్ మెడల్ ఎక్సెప్షనల్ అచీవ్‌మెంట్ పురస్కారం నిశ్చల్ పొందినప్పుడు రాష్ట్రపతి నుంచి పిలుపు అందుకున్న సందర్భం అది. కలామ్, నిశ్చల్‌తో సుమారు 45 నిమిషాలు మాట్లాడారు. ఈ ల్యాబొరేటరీలు దేశానికి అవసరమని కొనియాడారు. విద్యావ్యవస్థలో మార్పులకు దీని ద్వారా స్వీకారం చుట్టొచ్చని చెప్పారు. ల్యాబొరేటరీలను విస్తృత పరచాలని కాంక్షించారు. అని నిశ్చల్ చెప్పాడు.

పదకొండేండ్లలో మరో మైలురాయి, తాజ్ కృష్ణ, హైదరాబాద్ , 2006

ఓ కార్యక్రమం జరుగుతున్నది. మెమొరీ పవర్‌కు సంబంధించి పిల్లలకు నిర్వహిస్తున్న పోటీ అది. చీఫ్ గెస్ట్‌గా అప్పటి ఆర్థిక శాఖమంత్రి రోశయ్య వచ్చారు. ఒక చోట 225 వస్తువులు పెట్టి ఉన్నారు. ఒక పిల్లాడు వాటిని చూస్తూ వెళ్తున్నాడు. అతను నిశ్చల్. చూడడం అయిపోయింది. అన్నిటినీ గుర్తుంచుకున్నాడు. నిశ్చల్ కండ్లకు గంతలు కట్టారు. చూసిన వస్తువులను చూసినట్టుగా చెప్తున్నాడు నిశ్చల్. కొన్ని ర్యాండమ్‌గా, కొన్ని వరుసగా, ఫలాన వస్తువు నంబర్ ఏంటి? ఫలానా నంబర్‌లో ఏ వస్తువు ఉంది? ఇలాంటి ప్రశ్నలకు అలవోకగా సమాధానాలు చెప్పేసాడు. అది రికార్డ్. గిన్నీస్ వరల్డ్ రికారు. మోస్ట్ రాండమ్ ఆబ్జక్ట్స్ మెమరైజ్‌డ్ కేటగిరీలో మొదటిసారి నిశ్చల్ గిన్నీస్ బుక్‌లోకి ఎక్కాడు. మైండ్ స్పోర్ట్స్ (మేధా క్రీడా) మన దేశంలో చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన చెస్‌ను మాత్రమే మైండ్ స్పోర్ట్స్‌గా భావిస్తారు. ఈ మేధా క్రీడలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ఈ క్రీడలో మెమొరీ పవర్.. (జ్ఞాపక శక్తితో పోటీలు) మీద దృష్టి సారించాడు నిశ్చల్.

2007, 12 ఏండ్లు

వరల్డ్ మెమొరీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వరల్డ్ మెమరీ చాంపియన్ షిప్ ఏటా జరుగుతుంటుంది. అనేక క్యాటగిరీల్లో పోటీలుంటాయి. 2007లో ఆ పోటీ బెహరిన్‌లో జరిగింది. ఇండియా నుంచి నిశ్చల్ పాల్గొన్నాడు. వంద దేశాల నుంచి పోటీదారులు. నిశ్చల్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇలాంటి చాంపియన్‌షిప్‌లో ఇండియా తరఫుర గోల్డ్ మెడల్ సాధించడం ఇదే మొదటిసారి. అరబ్ షేక్‌లు అశ్చర్యపోయారు. ఇండియా నుంచి పాల్గొనడే తక్కువ. అందులో ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించడం అంటే సాధారణ విషయం కాదు. అరబ్‌షేక్ ఇంటికి పిలుచుకున్నాడు. ప్రత్యేకంగా నిశ్చల్‌ను అభినందించాడు.

2009, 13 ఏండ్లు. తాజ్‌కృష్ణ, హైదరాబాద్

ఆడిటోరియం. పెద్ద తెర. ముందు నిశ్చల్. తెరమీద అనన్నీ బైనరీ అంకెలు. 139 డిజిట్లు ఉన్నాయి. నిశ్చల్ వాటిని ఏకాగ్రతతో చూస్తున్నాడు. పక్కనే వన్ మినిట్ టైమర్. 60 సెకన్లకు దగ్గరవుతున్నది. నిశ్చల్ అలాగే చూస్తున్నాడు. నిమిషం అయింది. అంకెలన్నీ ఫేడ్ ఔట్ అయ్యాయి. స్క్రీన్ ఆఫ్ అయింది.
-నిశ్చల్ ఆ డిజిట్లను వరుసగా చెప్పడం ప్రారంభించాడు. 1 నుంచి 139 డిజిట్లు వరుస క్రమంలో తప్పులు లేకుండా చెప్పేశాడు. ఆ డిజిట్లను అన్నిటినీ గుర్తుంచుకొని చెప్పడం అది మళ్లీ ఓ రికార్డు. గిన్నీస్ వరల్డ్ రికార్డు. నిశ్చల్‌కు అది రెండో గిన్నీస్ అవార్డు. లాంగెస్ట్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ మెమరైజ్డ్ ఇన్ వన్ మినిట్ కేటగిరీలో అతను సాధించిన ఘనత. దీంతో నిశ్చల్ రికార్డులను గమనించిన నేషనల్ జాగ్రఫీ చానెల్ ఓ డాక్యుమెంటరీ కోసం నిశ్చల్‌ను ఆహ్వానించింది. ప్రపంచంలోని ఏడుగురు జీనియస్‌లతో చేసిన ఈ డాక్యుమెంటరీ కోసం భారత దేశం నుంచి నిశ్చల్‌ను ఎంపిక చేశారు. తర్వాత బీబీసీ కూడా నిశ్చల్‌తో డ్యాకుమెంటరీ తీసింది. వాటితో పాటు నిశ్చల్ ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద, పెద్ద యూనివర్సిటీల్లో ఉపన్యాసాలిచ్చాడు.

13 ఏండ్లకే ఇంటర్ ..

నిశ్చల్ తన 13 ఏండ్ల వయస్సులోనే ఇంటర్ పాసయ్యాడంటే నమ్మలేకపోవచ్చు. కానీ నిజం. అతను 13 ఏండ్లకే లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చేరాడు. అక్కడే ఎనిమిది నుంచి 12వ తరగతి వరకూ చదువుకున్నాడు. అదీ ఒక్క ఏడాదిలోనే పూర్తి చేశాడు. డిగ్రీ కూడా లండన్‌లోనే చేయాలనుకున్నాడు. కానీ అప్పటికీ నిశ్చల్ మైనర్. దీంతో తల్లిదండ్రుల్లో ఒక్కరైనా ఆయనతో అక్కడ ఉండాలని యూనివర్సిటీ నిబంధనలున్నాయి. చాలా అంతర్జాతీయ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందినప్పటికి మైనర్ నిబంధన అతన్ని ఆపేసింది. తల్లిదండ్రులు వృత్తిరీత్యా విదేశాలకు వెళ్లడం వీలుపడలేదు. దీంతో నిశ్చల్ ఇండియాలోనే ఉన్నత చదువులు అభ్యసించాల్సి వచ్చింది. 13 ఏండ్ల నిశ్చల్ సీఏలో చేరాడు.

15 ఏండ్ల వయసు..

నిశ్చల్‌కు 15 ఏండ్లు. సీఏలో ప్రోగ్రామ్‌లో ఉన్నాడు. అప్పటికే రెండేండ్లు గడిచింది. ఆర్టికల్‌షిప్‌లో భాగంగా డెలాయిట్ కంపెనీలో చేరాడు. 2లక్షల మంది ఉద్యోగులున్న ఎంఎన్‌సీ అది. అంతమందిలో నిశ్చల్ యంగెస్ట్ ఎంప్లాయి. 19 ఏండ్లు వచ్చాయి. సీఏ పూర్తయింది. భారతదేశపు యంగెస్ట్ సీఏగా నిశ్చల్ రికార్డు సృష్టించాడు. తర్వాత ఓయూ నుంచి మాథ్య్స్, కామర్స్ మాస్టర్స్ చేశాడు. దీని తర్వాతే అతని అసలు లక్ష్యం మొదలైంది. Power is gained by sharing knowledge, not hoarding it. అతను పూర్తిగా తన ప్రతిభను అందరికీ అందించాలనుకున్నాడు..

ఇప్పుడు నిశ్చల్‌కు 24 ఏండ్లు..

గణిత ప్రయోగశాల మీద కృషి, అతని పరిశోధనలు గణితానికే పరిమితం కావొద్దని అన్ని సబ్జెక్ట్‌ల కోసం ల్యాబొరేటరీలను తయారు చేశాడు. వాటి ద్వారా విద్యార్థులో భయాన్ని పోగొట్టాలి. నిశ్చల్స్ స్మార్ట్ లర్నింగ్ సొల్యుషన్‌ను దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయాలి. పిల్లలు ప్రయోగశాలల్లోకి వెళ్లడం కాదు. ప్రయోగశాలలే పిల్లల దగ్గరకు రావాలి. అందుకే పోర్టబుల్ మైక్రోస్కిల్ ల్యాబ్ తయారు చేశారు. ఫిజిక్స్, మాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

భూమిమీద ఉన్న ఎన్నో జీవరాశులున్నాయి. కానీ మనిషి మాత్రమే ఆలోచించగలడు. కొత్త విషయాలను నేర్చుకోవడం, పంచుకోవడం, సమాజానికి అందించడం చాలా అవసరం. నాలెడ్జ్ ఎకానమీ, నాలెడ్జ్ ఇండియా, గ్లోబల్ విజన్‌తో పని చేయాలనుకుంటున్నా. ఇండియా విద్యావిధానంలో, దేశాభివృద్ధిలో నా పాత్ర ఉండాలి. విజ్ఞాన భారతం నా కల. అందుకోసం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాను. పట్టణం, గ్రామం, పేద మధ్య తరగతి అని తేడా లేకుండా ప్రతి విద్యార్థికీ నాజ్ఞానాన్ని అందిస్తాను. అందుకు కావాల్సిన కృషి చేస్తాను.
-నిశ్చల్ నారాయణం

ఎలా?

నిశ్చల్ రూపొందించిన ఈ ల్యాబ్స్ నిర్వహణ కోసం కరంటు అవసరం లేదు. ఈ ల్యాబ్స్ స్వయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోగలవు. కాంతిని, వేడిని గ్రహించుకోగలవు. తరగతి గదిలో, ఆరుబయట ఎక్కడైనా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఫిజిక్స్ ల్యాబ్‌లో జనరేటర్ ఉంది. కెమెస్ట్రీలో ప్రత్యేకమైన హీట్ సోర్స్ ఉంది. ఎక్కోల్యాబ్ ద్వారా 2500 ప్రయోగాలు చేయవచ్చు. 1 నుంచి 10వ తరగతి వరకూ ఉండే సైన్స్ ప్రయోగాలు చేయవచ్చు. వీటి నిర్వహణ కోసం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. వీటి మానీటరింగ్, రివ్యూ సిస్టమ్ తయారు చేయవచ్చు. ఇంకా నిశ్చల్ ల్యాబ్స్‌ను ఎన్‌సీఈఆర్టీ ధృవీకరించింది. తెలంగాణ, ఏపీ బోర్డులు కూడా ధృవీకరించాయి. రెండు రాష్ర్టాల్లోని గురుకులాలు, కస్తుర్తా, జిల్లా పరిషత్, మోడల్ పాఠశాలల్లో నిశ్చల్స్ ల్యాబ్స్‌కు మంచి ఆదరణ ఉంది. ఏపీ తెలంగాణలో వెయ్యి పాఠశాలల్లో, హైదరాబాద్‌లో 250 పాఠశాలల్లో నిశ్చల్ ల్యాబ్స్ ఉన్నాయి. 14 రాష్ర్టాల్లోని 50వేల పాఠశాలల్లో నిశ్చల్ ల్యాబ్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. దేశవ్యాప్తంగా 85శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్స్ అమలు చేస్తున్నారు. 50 శాతం వినడం ద్వారా, 80 చూడడం ద్వారా, వందశాతం చేయడం ద్వారా, జ్ఞానాన్ని పొందుతారు. ఇది సైంటిఫిక్‌గా నిరూపితమైంది. లర్నింగ్ బై డూయింగ్ అంటే ఇదే.. నిశ్చల్ దీన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్నాడు.
Nischal-Personal6

త్రిడీ ఈ బుక్స్..

మామూలుగా మనం పుస్తకాలను చదువుతాం. ఈ బుక్స్‌ను కూడా అంతే. కానీ నిశ్చల్ రూపొందించిన త్రిడీ బుక్స్‌ను అనుభూతి చెందుతాం. సాధారణంగానే కనిపించే ఈ నిశ్చల్ పుస్తకాల్లో అక్షరాలు, బొమ్మలుంటాయి. ఈ ప్రతి బొమ్మదగ్గర ఓ స్కానర్ ఉంటుంది. దీన్ని మొబైల్ ద్వారా స్కాన్ చేసి చేస్తే ఆ బొమ్మలు కదులుతాయి.వివరాలు డిజిటల్ రూపంలో కనిపిస్తాయి.

పరిశోధనలో తేలింది?

దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ల్యాబ్‌పై నిశ్చల్ సర్వే చేశాడు. సైకాలజిస్టుల, మేదావుల, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ అధ్యయనం చేశారు. ఈ ల్యాబ్ ఎలాంటి మార్పులు తెచ్చిందనే అంశం మీద వారి అధ్యయనం సాగింది. అందులో తేలిందేంటంటే.. ఏడాదిలో పూర్తవ్వాల్సిన పాఠాలు 75 రోజుల్లో ఉపాధ్యాయులు పూర్తి చేయగలిగారు. దీంతో ఇంకా రెండుసార్లు రివిజన్ చేసుకొనే అవకాశం దొరికింది. పిల్లలో విషయగ్రహణశక్తి, అకాడమిక్ నాలెడ్జ్ పెరిగాయి. ఒత్తిడి తగ్గి, పిల్లలో ఉత్సాహం, తెలుసుకోవాలనే అసక్తి పెరిగాయని అధ్యయనం తేల్చింది. నిశ్చల్స్ కంపెనీ ఉద్దేశ్యం అదే.. జాయ్ ఆఫ్ నోయింగ్

చేయూత..

నిశ్చల్ తన కంపెనీ ఆదాయాన్ని పేద విద్యార్థులకు ఉపయోగిస్తున్నాడు.నిశ్చల్స్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఏటా కొందరి విద్యార్థుకు ఉచిత స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారు. గణితంలో ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించి వారికి శిక్షణ ఇస్తున్నారు. వేసవి కాలంలో ఉచిత క్యాంపుల ద్వారా విద్యార్థులకు చదువు మీద ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు.

Nischal-Personal5

నిశ్చల్ అందరిలా రెగ్యులర్ విద్యార్థే. కానీ చిన్నతనంలోనే గణితంలో ఆయన చేసిన అధ్యయనం అతన్ని ఆవిష్కరణల బాట పట్టించింది. అందుకే ఆ రోజు అబ్దుల్ కలాం అడిగిన సూర్యుని చుట్టూ ఎన్నిసార్లు తిరిగి వచ్చావ్? అన్న ప్రశ్నకు 11 సార్లు అని సులభంగా చెప్పగలిగాడు. వయస్సెంతా అని అడగడానికి ఇది సైంటిఫిక్, తార్కిక కోణం. భూమి సూర్యూని చుట్టూ తిరిగి రావడానికి ఏడాది పడుతుంది. అంటే అప్పుడు నిశ్చల్‌కు 11 ఏండ్లు. పదకొండు సార్లు తిరిగొచ్చానని చెప్పాడు కలామ్‌తో. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.
లర్నింగ్ ఈజ్ క్రియేటివిటీ క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్ థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్ నాలెడ్జ్ మేక్స్ యూ గ్రేట్ అని ఓ కాగితం మీద రాసి నిశ్చల్‌కు ఇచ్చాడు. నేర్చుకోవడం అంటే సృజనాత్మకతను పెంచుకోవడం. అది ఆలోచనకు దారి తీస్తుంది. ఆ ఆలోచన జ్ఞానాన్ని పెంచుతుంది. జ్ఞానం మనిషిని గొప్పవాళ్లను చేస్తుంది దాని అర్థమిది. దాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని కలామ్ చెప్పినట్టు గుర్తుచేసుకున్నాడు నిశ్చల్. ఆ జ్ఞానమే నిశ్చల్‌ను ప్రతిభకు కేరాఫ్‌గా మార్చింది.

నిశ్చల్ ల్యాబ్స్

Promiseనిశ్చల్స్ ప్రొడక్ట్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, టీచర్లకు ఉపయోగకరం. ఆసక్తికరమైన బోధనామార్గం. విద్యార్థులకు మనోహరమైన విద్యను అందించేందుకు వీలుంటుందని నిశ్చల్ హామీ ఇస్తున్నారు.

Values

వినూత్నం, ఆకర్షణీయం, బాధ్యతాయుతం, సురక్షితం. వీటికోసం నిశ్చల్స్ కంపెనీ కట్టుబడి ఉంది. విద్యార్థుల అభ్యున్నతికి ఇవి అవసరం.నిశ్చల్ అన్నారు.

Belief

ప్రయోగాత్మక పద్ధతులు, అనుభవపూర్వక అభ్యాసం. చదువుకునే ప్రతీ సబ్జెక్ట్ నిజజీవితంతో ముడిపడి ఉంటుంది. లేచినప్పటి నుంచి పడుకొనే వరకూ మన చుట్టూ సైన్స్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ప్రయోగాత్మక పద్ధ్దతులను అనుసరిస్తాం.. నిశ్చల్ చెప్పాడు

vision

నిశ్చర్ ఆవిష్కరించిన ఈ ల్యాబొరేటరీలు తరగతి గదిలోకి నడిసొస్తాయి. వీటి ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలి. ప్రపంచ విద్యా స్థానంలో మన దేశం ఉన్నతంగా ఉండాలి.నిశ్చల్ ముందున్న లక్ష్యం. దానికి నిశ్చల్స్ కంపెనీని ఆయుధంగా వాడుతున్నాడు.

Mission

పిల్లలకు బుకిస్ నాలెడ్జి కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జీ ఇవ్వాలి. కొత్త కొత్త పద్దతుల ద్వారా విద్యను అందించాలి. ప్రాక్టికల్ విద్య కోసం పరికరాలు సృష్టించి విద్యార్థులకు సాయం చేయాలి. చదువు చెప్పడం కాదు. చదుకోవాలన్న ఆసక్తిని పెంచాలి. నిశ్చల్ వివరించారు.

నేను పీహెచ్‌డీ చేసి థీసిస్‌ను అంతా యూనివర్సిటీకి అందించాను. తర్వాత కొద్ది రోజులకే నిశ్చల్ పుట్టాడు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు సంస్కృతం, వేద గణితం పుస్తకాలు బాగా చదివాను. వాటిని ఆకలింపు చేసుకున్నాను. దాని ప్రభావమో ఏమో తెలియదు కానీ నిశ్చల్‌కు గణితం మీద దృష్టి మొదలైంది. దాన్ని నాలుగేండ్ల వయస్సులోనే గుర్తించాం. గణిత గురువులు ఎక్కడున్నా వెళ్లి శిక్షణ ఇప్పించాం. అప్పుడు నిర్లక్ష్యం చేసి ఉంటే ఇలా ఉండేది కాదేమో.
-డాక్టర్ పద్మావతి, నిశ్చల్ తల్లి

1228
Tags

More News

VIRAL NEWS