వాస్తు


Sun,November 17, 2019 12:41 AM

ఇంటికి పిరమిడ్లు ఎన్ని పెట్టుకోవచ్చు. అసలు పెట్టొచ్చా?ఎమ్.డి.ఖాదిర్, కోరుట్ల

పిరమిడ్ నిర్మాణం ఎంతో గొప్పది. నిర్మాణ రంగంలో ఒక అత్యద్భుత శక్తియుక్తులు మానవమేధకు అందించే సృష్టి రహస్య విజ్ఞానం పిరమిడ్‌లో ఉంటుంది. ఏ ఇంధనం లేకుండా ఏ ఇంజిన్ లేకుండా మన ప్రాచీన నిర్మాణ కళ అలా ఎన్నో అద్భుతాలు చేసింది. శిలలపైన రాగాలు పరికించే శబ్ద సాంకేతిక విద్య. ఇనుస స్తంభాలను వందల సంవత్సరాలుగా తుప్పు పట్టకుండా తయారు చేసిన లోహ రసాయన విద్య, ఏళ్లుగా అజంతా గుహల్లో రంగు రాలిపోని అద్దకపు మహిమ మన భారతీయ మేధావులదే కదా. ఆ కోణంలో దిశకు ఉన్న స్థలంలో సమకొలతల విధానంలో నిర్మించే పిరమిడ్ ఆరోగ్య ప్రధాత అవుతుంది. దానిని గృహం పైన ప్రత్యేక విధానంలో నిర్మించుకోవడం దోషం ఎంత మాత్రం కాదు. అయితే దానిని సశాస్త్రీయంగా ఇంటిపైన నిర్మించవచ్చు. అవి ఎన్ని అనేది లేదు. ప్రతి నడక గదిమీద కూడా ఏర్పాటు చేయవచ్చు అవసరాన్ని బట్టి. పిరమిడ్ మానవ శక్తిని ఇనుమడింపజేస్తుంది. ప్రకృతిలోని నెగిటివ్‌ఫోర్స్‌ని రద్దుచేసి స్వశక్తికి మరింత ఊతమిస్తుంది. మన ప్రతి గుడిగోపురం ఒక పిరమిడే కదా.
Vasthu

మా బెడ్‌రూమ్‌కి దక్షిణంలో డక్ట్ (హోల్) ఉంది. అలా ఉంటే సమస్యలొస్తాయా?-చిలువేరు వరదరాజు, కీసర

నేడు కట్టే కొత్త అపార్ట్‌మెంట్లకు ఎలాంటి డక్టులు అవసరం రావడం లేదు. కారణం ప్రతి ఫ్లాటుకు చుట్టూ ఓపెన్ ఫ్లేస్ వదిలి కడుతున్నారు. తద్వారా వెంటిలేషన్ డ్రైనేజీ లైన్ల డక్టుకు ఆటోమేటిక్‌గా స్థలం దొరుకుతుంది. కాబట్టి ఇబ్బందులు రావు. ఒక ఇంటికి మరొక ఇల్లు అంటుకొని కామన్ వాల్‌తో మీ ఇల్లుకట్టారు కాబట్టి మీకు డక్టు వచ్చింది. దక్షిణంలో నైరుతిలో డక్టులు రావడం మంచిది కాదు. అలా ఇవ్వాల్సి వస్తే వాటిని చాలా పెద్దగా సూర్యరశ్మి పడేలా వదలాలి. కేవలం పైపులు పొయ్యే చీకటి బావులుగా నిర్మించవద్దు. తద్వారా ఇంటికి నీచస్థానంలో కూపాలు తయారవుతాయి. అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి. ఇంట్లోకి ప్రధానంగా టాయిలెట్లలోకి ఆక్సీజన్ అందదు. స్త్రీలు, పిల్లలు తరచూ అనారోగ్యాలతో అవస్థలు పడుతూ ఉంటారు. ఇల్లు మారితే మంచిది.

మాది దక్షిణం షాపు. స్టోరు షాపు అందులో ఎలా పెట్టాలి?-అన్నవరం కృష్ణ, షాద్‌నగర్

చాలా వ్యాపార అంగళ్లలో స్టోరు అవసరం అవుతూ ఉంటుంది. అందుకు అనేక మార్గాలు వెతుకుతూ ఉంటారు. షాపు పెద్దగా ఉండి అనుకూలంగా రోడ్డు ఉన్నప్పుడు ఏ షాపునకైనా దక్షిణ నైరుతిలో స్టోర్ చేసుకోవచ్చు. వీధి ఎటు ఉంటే అటు ఓపెన్ పెద్దగా వస్తేనే షాపు ఎలివేట్ అవుతుంది. మీది దక్షిణం షాపు అన్నప్పుడు అటు ఎంత ఫేసింగ్ ఉందో మీరు తెలుపలేదు. స్టోర్ పెట్టాలి అంటే మీ షాపు తూర్పు పడమర ఎక్కువ కొలత కలిగి ఉంటే పడమరలో గదివేసి అందులో స్టోర్ చేయవచ్చు లేదా దక్షిణం ఫేసింగ్ కాబట్టి దక్షిణంలో మెజనైన్ ఫ్లోర్ వేసి దానిమీదకు ఉత్తర వాయవ్యం నుండి మెట్లు పెట్టుకొని అక్కడ స్టోర్ పెద్దగా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే షాపు దక్షిణం ఉత్తరం పొడవు ఉంటే ఉత్తర వాయవ్యంలో స్టోర్ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. దక్షిణం ఫేసింగ్ షెట్టర్‌తో తూర్పు ముఖంగా కూర్చొని వ్యాపారం చేయవచ్చు.

దక్షిణం బాల్కనీకి గ్రిల్ పెట్టుకోవచ్చా? ఎస్.వి. ఆనంది, నాగర్‌కర్నూలు

మీరు ఇల్లు ఎలా కట్టారో వివరంగా తెలుపలేదు. మీ ఇంటికి దక్షిణం బాల్కనీ ఉన్నప్పుడు దానిని మూయాల్సిన అవసరం ఏముందనేది ముందు ఆలోచించాలి. ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చే మార్గాలను అనవసరంగా మూయకూడదు. గ్రిల్ వేసుకోవచ్చు. దానివల్ల ఇంట్లోకి వెలుగు వస్తుంది, మీకు రక్షణగా ఉంటుంది. దక్షిణం అంతా మూయాలనుకుంటే గ్రిల్ మాత్రమే వేయండి. గోడతో మూయకండి. మీరు ఇల్లు పెరగడం కోసం దక్షిణం మూయడం చేయకండి. కేవలం కోతులు రాకుండా లేదా సెక్యురిటీ కొరకు అయితే గ్రిల్ వేయడం తప్పుకాదు. దక్షిణం గ్రిల్ వేస్తే పడమర కూడా గ్రిల్ వేయాల్సి వస్తుంది. దక్షిణం ఓపెన్ మీకు సమస్య అయినప్పుడు పడమర కూడా అంతే కదా. ఏది ఏమైనా ఇంటి ఆరోగ్యం దెబ్బతినకుండా మార్పులు చేర్చులు తెలుసుకొని జాగ్రత్తగా చేసుకోండి.

సుద్దాల సుధాకర్ తేజ
[email protected]
Cell: 7993467678

284
Tags

More News

VIRAL NEWS